Year 10 (2024) Plot Summary Explained in Telugu
సినిమా అంటే ఖచ్చితంగా డైలాగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. సినిమా అంటే కథలోని పాత్రలు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలతోటి సినిమా అంతా నడిపించేయొచ్చు. 2024లో విడుదలైన “ఇయర్ 10” (Year 10) అనే సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఇలాంటి కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక భయంకరమైన విపత్తు జరగడం వల్ల భూమి మీదున్న మనుషులు చాలా వరకు చనిపోతారు. కేవలం కొద్ది మంది మాత్రమే విపత్తు నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంటారు. విపత్తు జరిగి భూమి మీద మనుషులు చనిపోయిన రోజు నుంచి సంవత్సరాలనేవి మొదటి నుంచి మొదలవుతాయి.
అలా ప్రస్తుతం పదవ సంవత్సరం జరుగుతుంటది. విపత్తు జరిగిన మొదటి రోజుల్లో మనుషులు తమ ఆకలిని తీర్చుకునేందుకు జంతువుల్ని వేటాడేవారు. కానీ Year 10 లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మనుషులు మృగాళ్ళాగా మారి తమ తోటి మనుషులనే చంపుకుని తినడం మొదలుపెడతారు. ఈ మూవీలోని పాత్రలకి పేర్లు ఏమీ లేవు. కాబట్టి కథ మంచిగా అర్థమయ్యేందుకు మనమే వీళ్ళందరికి పేర్లు పెట్టేద్దాం. ఈ మూవీలో ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి ఒకరితో నొకరు అస్సలు మాట్లాడుకోరు. కేవలం సైగలద్వారా, భావోద్వేగాల ద్వారానే సినిమా అంతా సాగుతుంటది. మరి వీళ్ళసలు ఎందుకు మాట్లాడుకోరో, దీని వెనకున్న రహస్యమేంటో మనం కొన్ని క్షణాల్లోనే తెలుసుకుందాం.
విపత్తు తర్వాతి జీవితం
‘జేసన్’ తన నాన్నతో కలిసి వేటకు వెళ్తాడు. జేసన్ నాన్న పేరు ‘సైమన్’. సైమన్ ఒక అడవి పందికి బాణాన్ని వేస్తాడు. కొణప్రాణంతో ఉన్న ఆ అడవి పంది వారిద్దరి నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోద్ది. కానీ అది ఏ క్షణమైనా సరే తన ప్రాణాన్ని కోల్పోద్ది. కాబట్టి పంది నుంచి కారుతున్న రక్తపు జాడల్ని అనుసరిస్తూ జేసన్, సైమన్ ఒక చిన్న కొలను వద్దకి చేరుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో పంది ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరు నిరాశగా వెనక్కి తిరుగుతారు. అలా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యంలో రెండు కార్లు కనిపిస్తాయి.
ఏదైనా ఆహారంగాని లేదా ఏమైనా ఉపయోగపడే వస్తువులుగాని దొరకొచ్చేమో అన్న ఉద్దేశంతో వీరిద్దరు చెరో కార్ దగ్గరికెళ్లి లోపలంతా పరిశీలిస్తారు. అప్పుడు సైమన్ కి కాల్చిపడేసిన కొన్ని సిగరెట్లు, ఒక చిన్న క్యాండీ దొరికిద్ది. అలాగే జేసన్ కి కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికిద్ది. కానీ తను ఆ బిస్కెట్స్ సైమన్ తో పంచుకోకుండా చాటుగా మూడు, నాలుగు బిస్కెట్స్ తినేస్తాడు. ఆ సమయంలో పొరపాటున తన చెయ్యి తగిలి కార్ హార్న్ మోగుతుంది. దాంతో సైమన్ వెంటనే జేసన్ ఉన్న కార్లోకి వచ్చి డోర్స్ అన్నింటిని మూసేస్తాడు. కొన్ని క్షణాల్లోనే అక్కడికి కొన్ని అడవి కుక్కలు వస్తాయి.
Apocalypse Z: The Beginning of the End Plot Summary Explained in Telugu
కానీ వాటికి మనుషులెవరూ కనిపించకపోవడంతో అవి వెంటనే కార్స్ దగ్గర్నుంచి వెళ్ళిపోతాయి. అంటే వీరు ఒకరితోనొకరు మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఎటువంటి శబ్దం వినిపించినా సరే ఈ అడవి కుక్కలు శబ్దాన్ని అనుసరిస్తూ వెంటనే వచ్చేస్తాయి. వీటికి గాని మనుషులు కనిపించారంటే ఇక అంతే సంగతులు. ఇవి మనుషుల్ని దారుణంగా తినేస్తాయనమాట. అందుకనే వీళ్ళు నోరు తెరిచి అస్సలు మాట్లాడుకోరు. కొంచెం సేపటి తర్వాత సైమన్, జేసన్ కార్లోంచి బయటికొచ్చి ఇంటికి బయల్దేరతారు. మార్గమధ్యంలో జేసన్ తన దగ్గరున్న బిస్కెట్స్ అన్నింటినీ తినేసి, కవర్ని దారిలోనే పడేస్తాడు.

మనుషుల్ని తినే మనుషులు
జేసన్ లవర్ పేరు ‘ఎమిలీ’. ఎమిలీ అనారోగ్యంతో బాధపడుతుంటది. తన అనారోగ్యం తగ్గేందుకు సైమన్ తనకి ప్రతిరోజు టాబ్లెట్స్ ఇస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురు జంతువుల్ని వేటాడుతూ, దొరికిన ఆహారాన్ని తింటూ ఇతరుల కంటపడకుండా చాలా భద్రంగా జీవితాన్ని గడుపుతుంటారు. కట్ చేస్తే, మరుసటి రోజు ఉదయం తెల్లవారిన తర్వాత జేసన్ ఇంటినుంచి బయటికొస్తాడు. అప్పుడు తనకి కొంతమంది మనుషులు కనిపిస్తారు. జేసన్ ఒక్కసారిగా భయపడిపోయి, వెంటనే ఇంట్లోకి పరుగుతీసి తలుపుని బలంగా వేసేస్తాడు.
తీరాచూస్తే ఆ మనుషులందరూ తమ ఇంటి వైపే వస్తుండడంతో, వీరు ముగ్గురు తమకు కావాల్సిన వస్తువుల్ని అలాగే టాబ్లెట్స్ ని ఒక బ్యాగ్ లో సర్దుకుని వెనక తలుపు గుండా ఇంటి నుంచి బయటకొస్తారు. మనుషుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా పరుగుతీసి, బంకర్ లాంటి ప్రదేశం వద్దకు చేరుకుంటారు. ఆ ప్రయత్నంలో తమ బ్యాగ్ పొరపాటున దారిలోనే పడిపోద్ది. కానీ వెనక్కి వెళ్లి దాన్ని తెచ్చుకునేంత సమయం లేదు. అందుకని ఎమిలీ, జేసన్ వెంటనే బంకర్లోకి దిగుతారు. సైమన్ మాత్రం బంకర్లోకి దిగకుండా, వారిద్దరిని రక్షించేందుకు మనుషులకి ఎదురెళ్లి పోరాడతాడు. కానీ చివరికి సైమన్ ఆ మనుషుల చేతిలో చనిపోతాడు.
టాబ్లెట్స్ కోసం ప్రయాణం
ఈ మనుషులందరూ ఒక బృందం అనమాట. ఈ బృందానికి కెవిన్ అనే వ్యక్తి నాయకుడు. సైమన్ చనిపోయిన ప్రదేశంలోనే వాళ్ళ బ్యాగ్ ఉంటది. కెవిన్ దాని దగ్గరికెళ్లి అందులో ఏమున్నాయని పరిశీలిస్తాడు. అందులో కొన్ని ఉపయోగపడే వస్తువులతో పాటు టాబ్లెట్స్ కూడా ఉండడంతో కెవిన్ ఆ బ్యాగ్ ని భుజానికి తగిలించుకుంటాడు. అలాగే సైమన్ మృతదేహాన్ని ఒక కర్రకి కట్టి తమ ప్రదేశానికి తీసుకెళ్ళిపోతారు. ఈ విషయాలన్నింటినీ బంకర్ కి ఉన్న చిన్నపాటి గ్యాప్ గుండా జేసన్, ఎమిలీ చూస్తూనే ఉంటారు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో, భాదతో నిశ్శబ్ధంగా ఉండిపోతారు. కొంచెం సేపటి తర్వాత వారిద్దరూ బంకర్లోంచి ఇంటికొచ్చేస్తారు. బ్యాగ్ తో సహా టాబ్లెట్స్ కూడా కెవిన్ తీసుకెళ్లిపోయాడు కదా.
ఆ టాబ్లెట్స్ లేకపోతే ఎమిలీ కోలుకోవడం చాలా అసాధ్యం. కాబట్టి తను కొద్ది కొద్దిగా ప్రాణం కోల్పోతూ నరక మనుభవిస్తూ చనిపోవడం చూడలేక జేసన్ తనని చంపేయాలనుకుంటాడు. కానీ తన మీద ఉన్న ప్రేమ వల్ల జేసన్ ఎమిలీని చంపలేకపోతాడు. కాబట్టి ఎలాగైనా సరే ఆ మనుషుల దగ్గర్నుంచి టాబ్లెట్స్ తీసుకురావాలని జేసన్ నిర్ణయించుకుంటాడు. ఇక తను ఎమిలీని ఇంట్లోనే వదిలిపెట్టి, టాబ్లెట్స్ తీసుకొచ్చేందుకు ఒంటరిగా ప్రయాణాన్ని మొదలుపెడతాడు. సైమన్ శరీరంలోంచి కారిన రక్తపు జాడల్ని అనుసరిస్తూ జేసన్ అడుగులు వేస్తుంటాడు. అలా తను చాలా దూరం ప్రయాణిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడంతో, జేసన్ చలికి తట్టుకోలేక వణికిపోతుంటాడు.
సరిగ్గా అదే సమయంలో తనకొక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి పేరు ‘విలియం’. వీడు నన్నెక్కడ చంపి తింటాడో అని భయపడి విలియం వెంటనే ఇంటికి పరిగెడతాడు. తనని అనుసరిస్తూ జేసన్ కూడా విలియం ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పిల్లాడితో పాటు ఒక ముసలాయన కూడా నివసిస్తుంటాడు. వీడు మమ్మల్ని చంపి తింటాడేమో అని అనుకుని వారిద్దరూ బాగా భయపడిపోతారు. కానీ జేసన్ మాత్రం వాళ్ళకి ఎటువంటి హానీ కలిగించకుండా వాళ్ళ దగ్గర్నుంచి ఒక ప్యాంట్, స్వెటర్ తీసుకుని బయటికొచ్చేస్తాడు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన జేసన్ కి మార్గమధ్యంలో మంటల్లో కాల్చిన ఒక పుర్రె కనిపిస్తది. ఆ పుర్రె ఎవరిదో కాదు, సైమన్ దే. జేసన్ తన పుర్రెని మట్టిలో పూడ్చేసి బాధతో తనకి నివాళి అర్పిస్తాడు.

మరొకర్ని వేటాడిన మనుషులు
పుర్రెని కాల్చిన మంట ఇంకా వెలుగుతూనే ఉండడంతో, తన నాన్నని చంపిన మనుషులు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు, వాళ్ళు దగ్గర్లోనే ఉండి ఉండొచ్చని జేసన్ కి అనుమానమోస్తది. అలా తనొక చెట్టు పైకెక్కి చుట్టుపక్కలంతా పరిశీలించగా తనకి కొంత దూరంలోనే పొగ కనిపించడం జరిగిద్ది. సరిగ్గా అదే సమయంలో తను పొరపాటున చెట్టు నుంచి జారి కింద పడతాడు. అంత ఎత్తు నుంచి పడడంతో నొప్పిని తట్టుకోలేక జేసన్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు అడవి కుక్కలకి కూడా వినిపిస్తాయి. అవి శబ్దాన్ని అనుసరిస్తూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు జేసన్ వెంటనే మంటని పెద్దదిగా చేస్తాడు. కొన్ని క్షణాల్లోనే అడవి కుక్కలు తన దగ్గరికి వచ్చేస్తాయి.
తను వాటికి నిప్పుని చూపిస్తూ బెదిరించడంతో అవి తన దగ్గర్నుంచి పారిపోతాయి. మరుసటి రోజు ఉదయం జేసన్ కి ఒక టెంట్ కనిపిస్తది. లోపలికెళ్ళి చూస్తే అందులో ఒక అస్థిపంజరం ఉంటది. అక్కడే ఒక అగ్గి పెట్టె, కత్తి అలాగే ఒక విజిల్ కూడా తనకి దొరుకుతాయి. వాటిని తీసుకుని జేసన్ మళ్ళీ ప్రయాణం మొదలుపెడతాడు. కెవిన్ బృందంలోని ‘డార్సీ’ అనే అమ్మాయి, ఒక కాలువ దగ్గర బాటిల్ కి నీళ్ళు నింపుకుంటుండడాన్ని జేసన్ చూస్తాడు. కానీ డార్సీ మాత్రం తనని గమనించకుండా నీళ్ళు తీసుకుని షెల్టర్ కి వెళ్లిపోద్ది. డార్సీని అనుసరిస్తూ జేసన్ కూడా వాళ్ళ షెల్టర్ వద్దకి చేరుకుంటాడు.
10 Cloverfield Lane (2016) Plot Summary Explained in Telugu
మూత్ర విసర్జన చేసేందుకు డార్సీ తమ షెల్టర్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిద్ది. ఇక ఇదే సరైన సమయమని భావించి టాబ్లెట్స్ తీసుకునేందుకు జేసన్ అక్కడంతా వెతుకుతుంటాడు. అప్పటికే డార్సీ షెల్టర్ వద్దకి చేరుకుని తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తది. అలా వాళ్ల మధ్య జరిగిన దాడిలో జేసన్ డార్సీని చంపేస్తాడు. ఆ సమయంలోనే కెవిన్ బృందం కూడా తమ వేటని ముగించుకుని షెల్టర్ వైపుగా వస్తుంటారు. వాళ్లని గమనించిన జేసన్, డార్సీ మృతదేహాన్ని లాక్కుంటూ వేగంగా ఒక చెట్టు వెనక్కెళ్లి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటాడు. ఈసారి కెవిన్ బృందం వేటాడింది ఎవరినో కాదు. మనం ఇంతకుముందు విలియం అనే పిల్లాడిని చూశాం కదా! ఆ పిల్లాడినే వీళ్ళు వేటాడతారు.
ముగింపు
ఈ విధంగా సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడివరకు మనం మూవీలో అర్థంకానీ ప్రతి విషయం గురించి మాట్లాడుకున్నాం. నాకైతే ఈ సినిమా ఒక మంచి అనుభూతిని కలిగించింది.
- కథలోని పాత్రలు నోరు తెరిచి మాట్లాడకపోయినప్పటికీ, ఈ సినిమా గురించి ప్రేక్షకులందరు ఆసక్తిగా మాట్లాడుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కింది.
- నటీనటులు ప్రతి ఒక్కరు తమ కళ్ళతోటి, హావభావాల తోటి సినిమాని చాలా ఆసక్తిగా నడిపించారు. తమ నటన చూసేందుకు చాలా సహజంగా ఉంది.
- తినడానికి ఆహారం దొరకని పరిస్థితుల్లో మనిషి ఎంతకైన తెగించి తమ తోటి మనుషుల్నే చంపుకుని తినేందుకు కూడా వెనకాడరని చాలా బాగా చూపించారు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరాయి. ఒక మనిషి తనకి నచ్చిన వాళ్లని కాపాడుకునేందుకు ఎంతడి సాహసమైన చేస్తాడని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. సర్వైవల్ డ్రామాలు మరియు పోస్ట్-అపోకలిప్టిక్ కథలు ఇష్టపడే సినీ ప్రేక్షకులకి ఈ సినిమా మంచి అనుభవం ఇస్తుంది. మీరు కూడా ఈ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది!
