Wolf Man (2025) Plot Summary Explained in Telugu
మనం చిన్నప్పటి నుంచి ఎన్నో తోడేలు కథలు వింటూ వస్తున్నాం. ఒకవేళ ఏదైనా తోడేలు వల్ల మనిషికి గాయమైతే, ఆ మనిషి నెమ్మదిగా తోడేలు రూపంలోకి మారిపోవడాన్ని మనం చాలా సినిమాల్లో చూశాం! అలాంటి కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని 2025లో “Wolf Man” అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటివరకు ఇలాంటి తోడేలు కథలతో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ దేని ప్రత్యేకత దానిదే! మనం ఈ రోజు మాట్లాడుకోబోయే సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటది.
ఒక వ్యక్తి తన భార్యని, కూతుర్ని తీసుకుని సిటీ నుంచి తన చిన్ననాటి ఇంటికి బయల్దేరతాడు. తన చిన్ననాటి ఇళ్లు అటవీ ప్రాంతంలో ఉంటది. తమ ఇంటిని చేరుకునే క్రమంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మరి వాళ్ళు పడిన ఇబ్బందులేంటి? ఒకవేళ వాళ్లపై తోడేలు ఏమైనా దాడి చేసిందా? అసలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు!? ఇలాంటి చాలా రకాల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. కథ మాత్రం ఆసక్తితో కూడుకుని ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
అసలు కథ ఏంటంటే!
1) అడవిలో వేట
1995లో ఒక వ్యక్తి ఒరెగాన్ లోని అడవిలో తప్పిపోతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అతనికి జంతువులకి వచ్చే ఒక విచిత్రమైన వ్యాధి వచ్చుంటదని అనుకుంటారు. వాళ్ళందరూ ఆ వ్యాధిని ‘ఫేస్ ఆఫ్ వోల్ఫ్’ అనే పేరుతో పిలుస్తారు. కట్ చేస్తే ‘గ్రేడి’ తన కొడుకుని వేటకి తీసుకెళ్తాడు. గ్రేడి కొడుకు పేరు ‘బ్లేక్’. అడవిలో వాళ్ళకొక జింక కనిపిస్తుంది. ఇద్దరూ దాన్ని వేటాడాలని చూస్తారు, కానీ అది వేగంగా అక్కడ్నుంచి పారిపోద్ది. దాన్ని ఎలాగైనా చంపాలని బ్లేక్ దాని వెనకాలే ఒంటరిగా పరుగుతీస్తాడు. కానీ తనకి జింక ఎక్కడా కనిపించదు. జింకను వెతికే ప్రయత్నంలో బ్లేక్ కి మనిషి రూపంలో ఉన్న ఒక విచిత్రమైన జంతువు కనిపిస్తది. దాన్ని చూడగానే బ్లేక్ కి చాలా భయమేస్తది.
ఆ జంతువు తన దగ్గరకి అడుగులు వేసుకుంటూ వస్తున్నట్టుగా శబ్ధాలు వినిపిస్తుండడంతో బ్లేక్ భయంతో వణికిపోతాడు. అప్పుడు గ్రేడి వెంటనే అక్కడికొచ్చి బ్లేక్ ని తీసుకుని పక్కనే ఉన్న హంటింగ్ బ్లైండ్ లోకి వెళ్ళి దాక్కుంటాడు. తీరాచూస్తే అది జంతువు కాదు, అక్కడున్నది తోడేలుగా మారిన మనిషి. అది వారిద్దరిపై దాడి చేసేందుకు నిచ్చెన ఎక్కుతుంటది. దాన్ని చంపేందుకు గ్రేడి తుపాకీని ఎక్కుపెడతాడు. ఈలోగా ఒక జింక అటు వైపుగా వెళ్లడంతో ఉల్ఫ్ మాన్ వాళ్ళిద్దర్ని వదిలేసి జింక వెంబడిపడతాడు. కొన్ని క్షణాల్లోనే ఉల్ఫ్ మాన్ జింకని చంపి తింటాడు.
గ్రేడి దాన్ని చంపేందుకు తుపాకితో షూట్ చేస్తాడు. కానీ ఉల్ఫ్ మాన్ ఆ దాడి నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతాడు. అసలది ఏంటని బ్లేక్ అడగడంతో, “అదొక ఎలుగుబంటి” అని గ్రేడి అబద్దం చెప్తాడు. ఆరోజు రాత్రి గ్రేడి తన ‘డాన్’ తో రేడియోలో మాట్లాడుతూ, “ఈరోజు నేను అడవిలో ఉల్ఫ్ మాన్ ని చూశాను. మనం దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి. లేదంటే దాని వల్ల మన పిల్లలకి ప్రమాదం రావచ్చు” అని అంటాడు. గ్రేడి ఇలా తన స్నేహితుడితో మాట్లడుతుండడాన్ని బ్లేక్ వింటాడు. అంటే ఆడవిలో మాకు కనిపించింది ఎలుగుబంటి కాదు, అది ఉల్ఫ్ మాన్ అని బ్లేక్ అర్థంచేసుకుంటాడు.

2) పాత ఇంటికి ప్రయాణం
కట్ చేస్తే, ముప్పై సంవత్సరాలు గడిచిపోతాయి. గ్రేడి తన మీద కఠినంగా ప్రవర్తిస్తుండటంతో బ్లేక్ తన నాన్నని వదిలేసి సిటీకి వచ్చేస్తాడు. ప్రస్తుతం బ్లేక్ ‘చార్లెట్’ అనే ఆమెని పెళ్లి చేసుకుని సిటీలో నివసిస్తుంటాడు. వీళ్ళకి ‘జింజర్’ అనే కూతురు కూడా ఉంటది. ఒక రోజు బ్లేక్ కి ఒక ఉత్తరం వస్తది. ఆ ఉత్తరంలో గ్రేడి ఇంటి యొక్క తాళం చెవి కూడా ఉంటది. గ్రేడి కొన్ని సంవత్సరాలుగా ఎక్కడా కనిపించకపోవడంతో, తను చనిపోయాడని నిర్ణయిస్తూ ‘స్టేట్ ఆఫ్ ఒరెగాన్’ ఆ ఉత్తరాన్ని పంపిస్తది. ఎంత లేదన్నా చనిపోయింది తన నాన్న కదా! కాబట్టి బ్లేక్ కి కొంచెం బాధపడతాడు.
తన నాన్నతో ఇంకొన్ని సంవత్సరాలు కలిసుండుంటే బాగుండేదని బ్లేక్ అనుకుంటాడు. బ్లేక్ చార్లెట్ తో, “మనం మా నాన్న నివసించిన ఊరికి వెళ్దాం. అక్కడే మనం వేసవి కాలమంతా గడిపి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొద్దాం. కొంతకాలం మనం సరదాగా గడిపినట్టు కూడా ఉంటది” అని అంటాడు. ఇక బ్లేక్ తన కుటుంబాన్ని తీసుకుని ఒరెగాన్ బయల్దేరతాడు. అడవిలో కొంత దూరం వచ్చిన తర్వాత రెండు రోడ్లు ఉంటాయి. ఈ మార్గంలో వెళ్తే తమ ఇంటికి చేరుకుంటారో బ్లేక్ కి గుర్తుండదు. ఆ సమయంలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికొస్తాడు.
బ్లేక్ ఆ వ్యక్తితో, “నేను గ్రేడి కొడుకుని. మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు గుర్తులేదు. మీరేమైనా సహాయం చేయగలరా!?” అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు. బ్లేక్ చిన్ననాటి స్నేహితుడైన ‘డెరిక్’. డెరిక్ బ్లేక్ ని గుర్తుపట్టి, “మీ ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇప్పుడు మూసేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ మంది కూడా నివసించట్లేదులే. నేనే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తా” అని కార్లోకి ఎక్కుతాడు. ఇక అందరూ వెళ్తుండగా హఠాత్తుగా ఎవరో రోడ్డు మీద నిలబడినట్టుగా కనిపిస్తది. అక్కడ నిలబడింది ఎవరో కాదు, అక్కడున్నది ఉల్ఫ్ మాన్. దాన్ని చూసి బ్లేక్ ఒక్కసారిగా భయపడిపోయి స్టీరింగ్ పక్కకు తిప్పుతాడు.
3) ఉల్ఫ్ మాన్ దాడి
దాంతో తమ వ్యాన్ అదుపుతప్పి ఒక చిన్న లోయలాంటి ప్రదేశంలో చెట్ల మధ్యన ఇరుక్కుపోద్ది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా గాయాలుగానీ, ప్రాణం పోవడంగానీ జరగదు. కొన్ని క్షణాల్లోనే ఉల్ఫ్ మాన్ అక్కడికొచ్చి డెరిక్ ని లాక్కెళ్లిపోతాడు. ఆ ప్రమాదంలో బ్లేక్ చేతికి గాయమయిద్ది. ఇదే సరైన సమయమని డెరిక్, తన కుటుంబాన్ని తీసుకుని అడవిలోంచి పరుగుతీస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకి గ్రేడి ఇళ్లు కనిపిస్తది. తమ ఇళ్లు కనిపించిందని సంతోషపడేలోపే వెంటనే అక్కడికి ఉల్ఫ్ మాన్ వస్తుంటాడు. ఇక వీళ్ళు భయంతో ఇంట్లోకి పరుగుతీస్తారు.
ఉల్ఫ్ మాన్ ఇంటి దగ్గరికొచ్చి తలుపుని బలంగా గుద్దుతుంటాడు. తలుపు తెరుచుకోకుండా ఉండేందుకు బ్లేక్ ఇంటిలోపలి నుంచి తలుపుని బలంగా పట్టుకుం టాడు. కాసేపటి తర్వాత ఉల్ఫ్ మాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బ్లేక్ బేస్మెంట్లో ఉన్న జనరేటర్ ఆన్ చేయడంతో ఇంట్లో లైట్స్ వెలుగుతాయి. జింజర్ బాగా భయపడిపోయి, “మనం సిటీలోని మన ఇంటికి వెళ్దాం” అని అడుగుతుంది. దానికి బ్లేక్, “మనమిప్పుడు ఇంటికెళ్ళడం చాలా ప్రమాదకరమైన పని. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం సిటీకి బయల్దేరుదాం” అని ధైర్యం చెప్తాడు.

“అసలు మన మీద దాడి చేసింది ఏంటి?” అని చార్లెట్ అడిగిద్ది. “అదేంటో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ అది రెండు కాళ్ళ మీద మనుషిలాగా నిలబడింది” అని బ్లేక్ అంటాడు. తలుపు తెరుచుకోకుండా దృఢంగా ఉండేందుకు బ్లేక్ కబోర్డ్ ని తలుపుకి అడ్డంగా పెడతాడు. ఆ తర్వాత బేస్మెంట్ లో ఉన్న రేడియో ద్వారా సహాయం కోసం ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో పక్క గదిలోంచి ఎదో వాసన వస్తుండడాన్ని బ్లేక్ గమనిస్తాడు. తీరాచూస్తే ఆ గదిలో మాంసం వేలాడాదీయబడి ఉంటది. బ్లేక్ అందులోంచి ఒక ముక్క తీసుకుని కొరుకుతాడు. దాని వల్ల తన దవడ దెబ్బతిని ఒక పన్ను ఊడిపోద్ది. అది చూసి చార్లెట్ కి కొంచెం భయమేసి వెంటనే కొంత దూది ఇస్తది.
4) బ్లేక్ చేతికి ఏం జరిగింది?
బ్లేక్ చేతికున్న గాయాన్ని చూసి చార్లెట్ బాగా కంగారుపడిద్ది. అప్పుడు బ్లేక్, “అద్దం ముక్క బాగా కోసుకొని పోయినట్టుంది” అని చెప్తాడు. అప్పుడు చార్లెట్, “ఇది అద్దం ముక్క కోసుకున్నట్టుగా లేదు” అని చేతికి కట్టు కట్టిద్ది. కట్ చేస్తే, బ్లేక్ తలుపు దగ్గర మరికొన్ని చెక్కల్ని బిగిస్తుంటాడు. ఆ సమయంలో బ్లేక్ సుత్తిని కూడా సరిగా పట్టుకోలేక పొరపాటున దాన్ని తన వేళ్ళకి కొట్టేసుకుంటాడు. ఒళ్లంతా బాగా చమట వస్తుండడంతో తను వెళ్లి ముఖం కడుగుకుంటాడు. అదే సమయంలో పై నుండి పెద్ద పెద్దగా శబ్ధాలు వస్తుండడంతో, ఒకవేళ ఉల్ఫ్ మాన్ వచ్చాడేమో అన్న అనుమానంతో బ్లేక్ పైకి వెళ్తాడు.
తీరాచూస్తే అక్కడున్నది కేవలం ఒక మామూలు స్పైడర్ మాత్రమే. అది చేస్తున్న శబ్దం బ్లేక్ కి పెద్దగా వినిపిస్తుంటది. నిజానికి అది చేస్తున్న శబ్ధం మామూలు మనుషులకి అసలు వినిపించదు. కానీ బ్లేక్ కి మాత్రం దాని శబ్ధం చాలా పెద్దగా వినిపిస్తుండడంతో తను బాగా కంగారుపడిపోతాడు. కొంచెంసేపటి తర్వాత ఇంటి బయట ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. బ్లేక్ గాల్లో వాసన పీలుస్తూ ఇంటి బయిట ఎవరున్నారో కనిపేట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు చార్లెట్ కి బ్లేక్ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తది. అప్పుడే ఉల్ఫ్ మాన్ ఒక కిటికీ దగ్గర్నుంచి వెళ్తాడు.
బ్లేక్ తలుపు దగ్గర్నుంచి బయటికి చూస్తుండగా, ఉల్ఫ్ మాన్ తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. తను బ్లేక్ కాలు పట్టుకుని బయటికి లాగేందుకు చూస్తాడు. అప్పుడు చార్లెట్ వెంటనే సుత్తి తీసుకుని ఉల్ఫ్ మాన్ ని బాగా కొట్టడంతో, తన బ్లేక్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. బ్లేక్ భయంతో సృహకోల్పోతాడు. కొంచెం సేపటి తర్వాత తనకి మెలుకువ వస్తది. కానీ ఆ చుట్టుపక్కల తన కూతురుగాని, భార్యగాని కనిపించదు. బేస్మెంట్ నుంచి ఏదో శబ్ధం వస్తుండడంతో బ్లేక్ అక్కడికెళ్తాడు. బేస్మెంట్లో జింజర్ నిద్రపోతుంటది. చార్లెట్ రేడియోలో తమ పరిస్థితిని వివరిస్తూ, “నా భర్త ఉల్ఫ్ మాన్ దాడిలో గాయపడ్డాడు.
5) శరీరంలో మొదలైన మార్పు
మేము ప్రమాదంలో ఉన్నాం. ఎవరైనా మాకు సహాయం చేయండి” అని అడుగుతుంటది. కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చార్లెట్ కోపంతో మైక్ ని విసిరికొట్టిద్ది. బ్లేక్ చార్లెట్ దగ్గరికి వచ్చి తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ తన నోటినుంచి మాటలు బయటికి రావు. అప్పటికే తన ముఖమంతా కూడా పూర్తిగా మారిపోయింటది. తన పరిస్థితిని చూసి చార్లెట్ తనని తీసుకెళ్ళి ప్రశాంతంగా పడుకోబెడుతుంది. ఆ సమయంలో బ్లేక్ యొక్క జుట్టు కూడా ఊడిపోవడం మొదలవుతది. బ్లేక్ ఏదో చెప్పాలని చూస్తున్నాడు కదా!

అందుకని చార్లెట్ తనకొక పెన్ను, పేపర్ ఇస్తది. కానీ బ్లేక్ ఆ పెన్నుని పట్టుకుని పేపర్ మీద రాసేందుకు బాగా కష్టపడతాడు. చివరికి తను పేపర్ మీద ‘Dying’ అని రాస్తాడు. అప్పుడు చార్లెట్, “నీకు కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. నీ ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. ఐ నువ్వు త్వరగానే కోలుకుంటావ్” అని బ్లేక్ తో ప్రేమగా మాట్లాడుతుంటది. కానీ బ్లేక్ కి చార్లెట్ మాటలు అసలేం అర్థం అవ్వవు. తన కంటి చూపు కూడా తోడేలు మాదిరిగా మారిపోతుంది. బ్లేక్ ఏదో మాట్లాడుతుంటాడు, కానీ తన మాటలు చార్లెట్ కి అర్థంకావు.
ఆ సమయంలో జింజర్ తన దగ్గరికొచ్చి కాసేపు ప్రేమగా మాట్లాడిద్ది. జింజర్ తన గదిలోకి వెళ్ళిన తర్వాత చార్లెట్ బ్లేక్ యొక్క కట్టుని విప్పిద్ది. తీరాచూస్తే తన చేతి గాయం ఇంకా ఎక్కువయిద్ది. బ్లేక్ హఠాత్తుగా ఒక జంతువులాగా తన చేతిని గీరుకుంటూ ఆ గాయాన్ని తినడం మొదలుపెడతాడు. అతను ఎంతలా ఆ గాయాన్ని తింటుంటాడో అంతలా తన పళ్ళు ఊడిపోతుంటాయి. బ్లేక్ ని అలా చూసిన చార్లెట్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోద్ది. చార్లెట్ కి అసలు ఏం చేయాలో అర్థంకాక మౌనంగా ఉండిపోద్ది.
6) ముగింపు
కొంచెంసేపటి తర్వాత చార్లెట్ కి కొంత దూరంలో గ్రేడీ కార్ కనిపిస్తది. ఆ కార్ ద్వారా ఇక్కడ్నుంచి తప్పించుకోవచ్చని చార్లెట్ కి ఆలోచన వస్తది. తను వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లి కార్ కీస్, బ్యాటరీ, అలాగే వంట గదిలోంచి ఒక కత్తి తీసుకుంటది. ఇక వాళ్ళు ముగ్గురు వేగంగా కార్ దగ్గరికి చేరుకుంటారు. చార్లెట్ బ్యాటరీని కార్ ఇంజన్ కి కనెక్ట్ చేస్తది. చివరికి కార్ ఇంజన్ స్టార్ట్ అవుతది. ఇక చార్లెట్ వెంటనే బ్యాటరీ తీసేసి కార్ నడపబోతుండగా ఉల్ఫ్ మాన్ దాడి చేస్తాడు. వాళ్ళు భయంతో కార్లోంచి బయటికొచ్చి గ్రీన్ హౌస్ మీదకి ఎక్కుతారు.
ఆ గ్రీన్ హౌస్ తెర చాలా పలుచగా ఉంటది. ఉల్ఫ్ మాన్ ఆ తెరని కత్తితో పొడుస్తుంటాడు. దాంతో జింజర్ గ్రీన్ హౌస్ పైనుంచి కిందపడబోద్ది. కానీ బ్లేక్, చార్లెట్ వెంటనే తనని కింద పడకుండా పట్టుకుంటారు. “మీరు ఇంట్లోకి వెళ్ళండి. నేను ఉల్ఫ్ మాన్ ని దారి మళ్ళిస్తా” అని బ్లేక్ చార్లెట్ కి సైగ చేసి అడవిలోకి పరిగెత్తుతాడు. వెంటనే ఉల్ఫ్ మాన్ బ్లేక్ వెంటపడతాడు. ఆ సమయంలో చార్లెట్ జింజర్ ని తీసుకుని ఇంట్లోకి పరుగుతీస్తది.
ఈ విధంగా కథ సాగుతుంది. చివరికి బ్లేక్ కుటుంబం తమ సమస్య నుంచి బయటపడగలిగిందా? లేదా దురదృష్టవశాత్తు వాళ్ళు ఉల్ఫ్ మాన్ చేతిలో మరణించారా? ఇలాంటి మరెన్నో ట్విస్టులతో కూడిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. నాకైతే ఈ సినిమా కాస్త పర్వాలేదు అని అనిపించింది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు ఇప్పటికి చాలానే చూశారు. కాబట్టి చాలా మందికి ఈ సినిమా అంత ఆసక్తిగా అనిపించకపోవచ్చు. 25 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర 34.9 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. తోడేలు కథలు ఇష్టపడే సినీ ప్రేమికులు ఒకసారి “ఉల్ఫ్ మాన్” (2025) తప్పకుండా చూసేయండి.
