What You Wish For (2023) Plot Summary Explained in Telugu
డబ్బులు ఎక్కువైతే వింత వింత కోరికలు కలుగుతాయని అంటుంటారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు అదే నిజమని అనిపించింది. నాకే కాదు, ఈ సినిమాని చూస్తే మీకు కూడా అలాగే అనిపించొచ్చు. ఇంతకీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు “What You Wish For”. ఇది 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మనుషుల్ని మనుషులు చంపుకుని తినడాన్ని మనం చాలా సినిమాల్లో చూశాం. కానీ ఈ సినిమాలో మాత్రం బాగా డబ్బులున్న కొంత మంది ధనవంతులు, ఆరోగ్యకరమైన వ్యక్తుల్ని ఎంచుకుని, వాళ్లని శుభ్రంగా, రుచికరంగా వండుకుని మరీ తింటారు. వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా! డబ్బులు ఎక్కువైతే వింత వింత కోరికలు కలగడమంటే ఇదే మరి. అసలు ఈ ధనవంతులు తినేందుకు మనుషుల్ని వంట చేస్తుంది ఎవరు? ఇలా ధనవంతులు మనుషుల్ని వండుకుని తింటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలా ప్రతి దానికి సమాధానం తెలుసుకుందాం నాతో రండి!
స్నేహితుని వద్దకి ప్రయాణం
దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ‘ర్యాన్’ తన స్నేహితుడిని కలిసేందుకు అతను నివసించే ఊరికి వెళ్తాడు. ర్యాన్ స్నేహితుడి పేరు ‘జాక్’. జాక్ డ్రైవర్ ర్యాన్ కి ఒక ఉత్తరం ఇస్తాడు. జాక్ ఆ ఉత్తరంలో, “నాకు కొంచెం పని ఉంది. నేను బయటకి వెళ్తున్నా. నేను వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు” అని రాస్తాడు. జాక్, ర్యాన్ చెఫ్స్ అనమాట. కానీ ర్యాన్ జీవితమంతా కష్టాలతో, అప్పులతో నిండి ఉంటది. జాక్ మాత్రం చాలా లగ్జరీగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే జాక్ ఇంటికొస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకుని సరదాగా మాట్లాడుకుంటూ గడిపేస్తారు.
ర్యాన్ జాక్ తో, “అసలు నువ్వు ఇంత లగ్జరీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావ్?” అని అడుగుతాడు. దానికి జాక్, “నేను కొంతమంది ధనవంతులకు వంట చేస్తుంటాను. అందుకు వాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులిస్తుంటారు” అని చెప్తాడు. అలా అయితే నేను నీ దగ్గర అసిస్టెంట్ చెఫ్ గా పనిచేస్తా అని ర్యాన్ అంటాడు. కానీ జాక్ మాత్రం ఇప్పుడు అసిస్టెంట్ అంత అవసరం లేదు అని టాపిక్ మార్చేస్తాడు. మరుసటి రోజు ఉదయం వాళ్లిద్దరు భోజనం చేసేందుకు బయటికెళ్తారు. అప్పుడు వాళ్ళకి ‘ఆలిస్’ అనే అమ్మాయి పరిచయం అవుద్ది. ఆలిస్ వీరిద్దరిని, “అసలు మీరేం చేస్తుంటారు?” అని అడగ్గా “మేమిద్దరం చెఫ్స్” అని చెప్తారు.
Lethal Seduction (2015) Plot Summary Explained in Telugu
ఇద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారో తెలుసుకునేందుకు ఒక పోటీపడాలనుకుంటారు. ఇక వెంటనే వాళ్ళు ఇంటికెళ్లి ఇద్దరూ ఒకే వంట రకమైన వంటని సిద్ధం చేస్తారు. ఆలిస్ వాళ్ళు సిద్ధం చేసిన ఆహారం రుచి చూసి ర్యాన్ చేసిన వంట కొంచెం బాగుంది అని చెప్తది. అలా ముగ్గురు కాసేపు సరదాగా సమయం గడుపుతారు. మరుసటి రోజు ఉదయం ఆలిస్ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోద్ది. జాక్ కూడా తన పనికి తాను వెళ్ళిపోతాడు. దాంతో ర్యాన్ ఒక్కడే ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుండగా తనకి ఒకచోట జాక్ యొక్క లాప్టాప్ కనిపిస్తది. అది అప్పటికే జాక్ బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అయి ఉండడంతో ర్యాన్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాడు. తీరాచూస్తే అందులో దాదాపు 18 కోట్ల 88 లక్షల రూపాయలు ఉంటాయి.
మృతదేహం మాయం
చీకటి పడిన తర్వాత జాక్ ఇంటికొస్తాడు. వాళ్లిద్దరు మళ్ళీ సిట్టింగ్ వేసి మద్యం సేవిస్తూ కాసేపు సరదాగా మాట్లాడుకుని నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ప్రశాంతమైన ప్రకృతిని చూస్తు ర్యాన్ ఇంట్లోకి వస్తుండగా, హఠాత్తుగా తనకి జాక్ మృతదేహం కనిపిస్తది. అంటే జాక్ ఉరి వేసుకుని చనిపోతాడనమాట. జాక్ చనిపోవడంతో ర్యాన్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతది. అసలు వీడేంటి ఇలా చేశాడని ర్యాన్ బాగా కంగారు పడుతుంటాడు. అసలిప్పుడు ఏం చేయాలో అర్ధంకాక ర్యాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. ప్రస్తుతం ర్యాన్ కి డబ్బులు చాలా అవసరం. తను ‘రాబిట్’ అనే వ్యక్తికి డబ్బులివ్వాలి.

వాడు ప్రతి రోజూ ర్యాన్ కి ఫోన్ చేసి డబ్బులివ్వమని బెదిరిస్తుంటాడు. ప్రస్తుతం వాడి నుండి తప్పించుకునేందుకే ర్యాన్ జాక్ ఇంటికి వస్తాడు. కట్ చేస్తే, ర్యాన్ కి ఒక ఆలోచన వస్తది. ఎలాగు జాక్ అకౌంట్లో చాలా డబ్బులున్నాయి కదా! ఎలాగు జాక్ కూడా చనిపోయాడు. కాబట్టి జాక్ డబ్బుల్ని ఎలాగైనా తన సొంతం చేసుకుంటే తన సమస్యలన్నీ తీరిపోతాయని ర్యాన్ అనుకుంటాడు. కానీ ర్యాన్ కి జాక్ యెుక్క ATM పిన్ నంబర్ తెలియదు. ర్యాన్ సరాసరి బ్యాంక్ వాళ్లకి కాల్ చేసి జాక్ లాగా మాట్లాడుతూ, “నాకు యాక్సిడెంట్ అయి కొంచెం మెమరీ లాస్ అయింది. నా పిన్ కూడా నేను మర్చిపోయాను. ప్రస్తుతం నాకు డబ్బులు చాలా అవసరం. ఈ విషయంలో నాకేమైనా సహాయం చేయండి” అని అడుగుతాడు.
అప్పుడు బ్యాంక్ వాళ్ళు, “సరే, అదేం పెద్ద సమస్య కాదు. మీరు మీ ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకుని బ్యాంక్ కి రండి” అని అంటారు. ఇక ర్యాన్ ఆన్లైన్లో ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి, అందులో పూర్తిగా జాక్ వివరాలు పెట్టేసి ఫోటో మాత్రం తనది పెట్టుకుంటాడు. ఆ సమయంలో రాబిట్ ర్యాన్ అమ్మ ఫోటోని ర్యాన్ కి పంపించి, “రెండు రోజుల్లో నువ్వు గనక డబ్బులివ్వకపోతే మీ అమ్మ నీకు దక్కదు” అని బెదిరిస్తాడు. అప్పుడు ర్యాన్, “అంత పని చేయొద్దు. ఒక వారం సమయమివ్వు, కావాలంటే నేను నీకు ఇంకా ఎక్కువ డబ్బులిస్తా” అని అంటాడు. “అలాగైతే నాకు యాభై వేలు ఎక్కువగా ఇవ్వు అని చెప్పి రాబిట్ ఒక వారం రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత ర్యాన్ జాక్ మృతదేహాన్ని ఒక చెరువులో పడేస్తాడు.
మనుషుల కోసం వెతుకులాట
ఇంకేముందిలే తన చావు గురించి ఎవరికి తెలియదు అని ర్యాన్ ప్రశాంతంగా ఉంటాడు. మరుసటి రోజూ జాక్ ఇంటికి ‘జెన్’, ‘మోరిస్’ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. జాక్ ఒక ఏజెన్సీకి వంట చేస్తుంటాడు కదా! ఈ ఇద్దరు వ్యక్తులు ఆ ఏజెన్సీకి సంబంధించిన ఏజెంట్స్ అనమాట. వాళ్ళు ర్యాన్ ని చూసి జాక్ అనుకుంటారు. ర్యాన్ కూడా తనే జాక్ అన్నట్టు నటిస్తాడు. ఒక వంట చేస్తే మూడు లక్షలు ఇస్తామని వాళ్ళు చెప్తారు. అందుకని ర్యాన్ వాళ్ల నుంచి ముందుగా యాభై వేలు అడ్వాన్స్ తీసుకుంటాడు. ర్యాన్ ఆ డబ్బుల్ని రాబిట్ కి పంపించేస్తాడు. విందు ఇంకో రెండు రోజుల్లో మొదలవుతది.
కాబట్టి త్వరగా పని మొదలుపెడదామని అనుకుంటారు. జెన్, మోరిస్ తనని ఒక చర్చి దగ్గరికి తీసుకెళ్లి, “ఇక్కడికి వచ్చి వెళ్ళే మనుషులైతే కాస్త ఆరోగ్యంగా ఉంటారు. మన విందుకి ఇద్దరు కావాలి” అని మాట్లాడతారు. అప్పుడు అర్థమవుద్ది ర్యాన్ కి, అంటే నేను వండబోయేది మనిషినా. అసలు మనిషిని వంట చేయడమేంటని ర్యాన్ చాలా భయపడిపోతాడు. “అసలు మనిషిని ఎలా వండగలను? నేను వండలేనేమో?” అని ర్యాన్ అంటాడు. దానికి జెన్, “నువ్వు ఒక్క వంట సరిగా చేయకపోయినా సరే వాళ్ళు నిన్ను చంపేస్తారు” అని చెప్తది. ఆ మాటకి ర్యాన్ కి భయం వేసి, అరేయ్ ఏంట్రా బాబు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్న అని అనుకుంటాడు.
సరే రేపు వచ్చి వంటకి కావాల్సిన మనుషుల్ని తీసుకెళ్దామని వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. జాక్ ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో ఇప్పుడు ర్యాన్ కి అర్థమై చాలా బాధపడతాడు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో ర్యాన్ అక్కడ్నుంచి పారిపోవాలని అనుకుంటాడు. కానీ జెన్, మోరిస్ ఇంకా మేల్కొనే ఉండడంతో తను పారిపోవడం కుదరదు. మరుసటి రోజు ఉదయం మోరిస్, ర్యాన్ చర్చ్ దగ్గరికెళ్తారు. అక్కడ వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళని ఎంచుకుని అనుసరించడం మొదలుపెడతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆడవాళ్ళు కనిపించకుండా పోతారు. వాళ్లని వెతుక్కుంటూ వెళ్లిన ర్యాన్, మోరిస్ లకి ఒక మెకానిక్ షెడ్ దగ్గర ‘జోస్’ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ జోస్ అయితే వంటకి బాగా సరిపోతాడని ఆ ఆడవాళ్ళకి బదులు అతన్ని ఎంచుకుంటారు.

మొదలైన మనుషుల వంట
వారిద్దరూ జోస్ దగ్గరికెళ్లి, “మా కారు కొంచెం పాడయింది. రిపేర్ చేస్తావా?” అని అతన్ని తమ కార్ దగ్గరికి తీసుకొస్తారు. జోస్ కార్ కిందకి వెళ్ళి రిపేర్ చేస్తుండగా మోరిస్ అతనితో, “నువ్వు ఎటువంటి ఆహారం తింటావు” అని అడుగుతాడు. దానికి జోస్, “నేను బయటి ఆహారం అసలు తినను. నేనెప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తింటాను” అని అంటాడు. ఇక మోరిస్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. విందుకి రాబోయే వ్యక్తులందరు చాలా ధనవంతులు. వాళ్లు ఒక్క విందుకి 1.5 మిలియన్స్ ఖర్చు పెడతారు. కాబట్టి మంచి రుచికరమైన ఆహారాన్ని వాళ్ళకి సిద్ధం చేయాలి.
ఇక వారిద్దరు జోస్ మృతదేహాన్ని కారులోకి ఎక్కించబోతుండగా ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక పోలీసుని తీసుకొస్తారు. పోలీస్ రావడంతో ర్యాన్, మోరిస్ కాస్త కంగారుపడతారు. “ఏంటి మీరు వీళ్ళని ఫాలో అవుతున్నారంట?” అని పోలీస్ అడుగుతాడు. దానికి మోరిస్, “లేదు మేము ఎవర్నీ కూడా అనుసరించడం లేదు. మేము హోటల్ పెట్టేందుకు మంచి ప్రదేశం కోసం వెతుక్కుంటున్నాము. ఈ ఆడవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, మేమెందుకు వీళ్ళని ఫాలో అవుతాము. ఇతనే మా ఆర్కిటెక్ట్” అని ర్యాన్ ని చూపిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తారు.
“ఏంటి ఒక్క మనిషినే తెచ్చారు?” అని జెన్ అడగడంతో, “ఈసారి పోలీసులు బాగా పకడ్బందీగా ఉన్నారు. కాబట్టి మనం ఒక్కడితోనే సరిపెట్టుకోవాలి, తప్పదు” అని మోరిస్ అంటాడు. ఇక జోస్ ని అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్తారు. ఇక ర్యాన్ వంట చేసేందుకు అతని శరీరాన్ని కట్ చేయడం మొదలుపెడతాడు. కొంచెంసేపటి తర్వాత తను అండర్ గ్రౌండ్ నుంచి బయటకురాగా, “నీకేదో పార్సిల్ వచ్చింది” అని మోరిస్ చెప్తాడు. ర్యాన్ తన గదికి వెళ్లి చూడగా, ఆ పార్సెల్లో తను అప్లై చేసిన ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది. ఇక వెంటనే ఇక్కడ్నుంచి పారిపోయి జాక్ అకౌంట్లో ఉన్న డబ్బులతో సంతోషంగా బతికేయొచ్చని ర్యాన్ అనుకుంటాడు.
పోలీసుల వెతుకులాట
అనుకున్నట్టుగానే ఎవరికి కనిపించకుండా తను కార్లోకెక్కి వేగంగా వెళ్తుంటాడు. కానీ ఆ ఇంట్లో పని చేసే ఒక వ్యక్తి పొరపాటున అడ్డం రావడంతో కారుకి చిన్న ప్రమాదం జరుగుద్ది. మోరిస్ వెంటనే ర్యాన్ దగ్గరికి వస్తాడు. తను తప్పించుకునేందుకు ప్రయత్నించాడని మోరిస్ కి అర్థమై, “నువ్వు ఏజెన్సీ నుంచి తప్పించుకోవాలని చూస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు” అని అంటాడు. అప్పుడు ర్యాన్, “మరి ఇక్కడ్నుంచి బయటపడే మార్గమే లేదా?” అని అడగడంతో, ఒకే ఒక్క దారి ఉందని మోరిస్ చెప్తాడు. అదేంటంటే, “ఇంతకుముందు ఇక్కడ నీలాగే ఒక అమ్మాయి వంట చేసేది. ఆ అమ్మాయి మొదట్లో వంట చేసేందుకు బాగా భయపడేది. కానీ తర్వాత చాలా బాగా వంట చేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల తరవాత ఆ అమ్మాయి ఇక్కడ్నుంచి వెళ్ళిపోయేందుకు విన్నపం పెట్టుకుంది.
అందుకని తనని ఏజెన్సీ వాళ్ళు పంపించేశారు. ప్రస్తుతం తనొక ధనవంతుల ఇంట్లో వంట మనిషిగా పని చేస్తుంది” అని చెప్తాడు. అయితే ఎలాగైనా సరే ఈ వంటని చాలా రుచిగా వండి, తనని ఇక్కడ్నుంచి వదిలిపెట్టమని ఏజెన్సీకి విన్నపం చేయాలని ర్యాన్ నిర్ణయించుకుంటాడు. ఇక తను చాలా రుచిగా ఆహారాన్ని వండడం మొదలుపెడతాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఒక డిటెక్టివ్ ని తీసుకుని అక్కడికొస్తాడు. డిటెక్టివ్ జెన్ తో, “మోరిస్ ఎక్కడున్నాడు!? మేము తనని కలవాలి” అని అంటాడు. దానికి జెన్, “తను ఇక్కడ లేడు, ఏంటి విషయం?” అని అడిగిద్ది. డిటెక్టివ్ జెన్ కి జోస్ ఫోటోని చూపించి, “ఇతనితో ఉదయం మీ వాళ్ళు మాట్లాడారంట. అప్పటినుంచి ఇతను కనిపించడం లేదు.

ఒకసారి ఈ విషయం గురించి మీ వాళ్లతో మాట్లాడాలి” అని అంటాడు. ఈ జోస్ డిటెక్టివ్ కి మేనల్లుడు అనమాట. అందుకని డిటెక్టివ్ ఈ మిస్సింగ్ కేసుని పర్సనల్ గా తీసుకుంటాడు. అప్పుడు జెన్, “మోరిస్ ఇక్కడ లేడు. ప్రస్తుతం ఇక్కడొక విందు జరగబోతుంది. అందుకని తను అతిథుల్ని తీసుకురాడానికి వెళ్ళాడు. తను రావడానికి చాలా సమయం పట్టిద్ది” అని చెప్తది. దానికి డిటెక్టివ్, “ఏం పర్లేదు! ఎంతసేపైనా తన కోసం ఎదురు చూస్తాం” అని అంటాడు. తర్వాత వాళ్ళు ర్యాన్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో ర్యాన్ వంట చేస్తుంటాడు. “నువ్వు ఆర్కిటెక్ట్ కదా! వంట వందుతున్నావ్ ఏంటి?” డిటెక్టివ్ అడుగుతాడు. దానికి ర్యాన్, “నా వృత్తి ఆర్కిటెక్చర్. కానీ నాకు వంట చేయడమంటే చాలా ఇష్టం. అందుకని ఈ రోజు నేను వంట చేస్తున్నా” అని అంటాడు.
మొదలైన అనుమానం
వాళ్ళు తనకి జోస్ ఫోటోని చూపించి, “ఇతన్ని నువ్వు ఎప్పుడైనా చూశావా?” అని అడుగుతారు. అప్పుడు ర్యాన్, “లేదు, నేను ఇతన్ని చూడలేదు” అని చెప్తాడు. సరే మోరిస్ వచ్చిన తర్వాత అతనితో కూడా మాట్లాడి ఇక్కడ్నుంచి వెళ్తామని డిటెక్టివ్ అంటాడు. వాళ్ళు ఉదయం నుండి ఏం తినలేదని జెన్ తో అనడంతో, ర్యాన్ వండిన సూప్ ని తను వాళ్ళిద్దరికీ వడ్డిస్తది. ఆ తర్వాత ముందుగా విందుకి వచ్చిన అతిథుల దగ్గరికి వెళ్లి, “మన ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళకి అనుమానం రాకుండా ఉండేందుకు, మీరు మా ఇన్వెస్టర్స్ లా మాట్లాడాలి” అని చెప్తది. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. డిటెక్టివ్ సూప్ తాగుతూ, “నువ్వు అనవసరంగా ఆర్కిటెక్చర్ అయ్యావు. నువ్వు సూప్ చాలా రుచిగా చేశావ్. నాకు నీ వంట చాలా చాలా నచ్చింది” అని అంటాడు.
కొంచెంసేపటి తర్వాత మోరిస్ మిగతా అతిథుల్ని తీసుకుని ఇంటికొస్తాడు. డిటెక్టివ్ తనికి జోస్ ఫోటోని చూపించి, “నువ్వు ఇతన్ని ఎప్పుడైనా చూశావా?” అని అడగడంతో, “లేదు నేనెప్పుడు ఇతన్ని చూడలేదు, మాట్లాడలేదు” అని మోరిస్ చెప్తాడు. డిటెక్టివ్ మాట్లాడుతూ, “ఈ పోలీస్ ఆఫీసర్ ఉదయం నాకొక విషయం చెప్పాడు. ఈ ఊర్లో ప్రతీ తొమ్మిది నెలలకి ఒకసారి చెప్పాపెట్టకుండా ఇద్దరు ముగ్గురు యువకులు కనిపించకుండా పోతున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన కొన్ని రోజులకి తమ కుటుంబ సభ్యులకు ఒక ఉత్తరంగానీ, మెయిల్ గానీ వస్తుంది. తాము మంచి జీవితాన్ని గడిపేందుకు సిటీకి వెళ్తున్నామని అందులో రాసి ఉంటుంది. ఇలా ప్రతీ సంవత్సరం జరగడం నాకు చాలా అనుమానంగా ఉంది” అని జెన్ తో అంటాడు.
Don’t Move (2024) Plot Summary Explained in Telugu
తర్వాత తను విందు ఆరగిస్తున్న అతిథులకు జోస్ ఫోటోని చూపించి, “ఇతన్ని మీరెక్కడైనా చూశారా?” అని అడుగుతాడు. “లేదు, మేము చూడలేదు” అని అతిథులు అంటారు. డిటెక్టివ్ కి ఎందుకో వాళ్ళందరి మీద కొంచెం అనుమానం వస్తది. తమ మీద డిటెక్టివ్ కి అనుమానం కలిగిందని అక్కడున్న ఒక ముసలోడికి అర్థమయిద్ది. అందుకని తను తెలివిగా డిటెక్టివ్ ని కూడా విందులో పాల్గొనేందుకు ఆహ్వానిస్తాడు. అప్పుడు జెన్ ఆ పెద్దాయన్ని పక్కకు పిలిచి, “ఎందుకు అతన్ని విందు తినేందుకు ఆహ్వానించావ్?” అని అడిగిద్ది. “డిటెక్టివ్ కి మన మీద కొంచెం అనుమానం వచ్చింది. ఇప్పుడు మనం వాన్ని వదిలేస్తే వాడు తన అనుమానంతో మళ్ళీ ఇక్కడికొస్తాడు. అదే మనం అతన్ని కొంచెం స్పెషల్ గా చూసుకుంటే మన మీద మంచి అభిప్రాయం ఏర్పడిద్ది. ఇది మన మంచికే” అని పెద్దాయన చెప్తాడు.
ముగింపు
ఈ విధంగా కథ ముందుకు సాగుతుంది. అసలు చివరికి డిటెక్టివ్ వాళ్లని పట్టుకున్నాడా!? లేదా వాళ్ళు డిటెక్టివ్ ని కూడా వండుకుని తినేశారా? ర్యాన్ వాళ్ళ దగ్గర్నుంచి తప్పించుని పారిపోయాడా, లేదా? ఇలాంటి మరికొన్ని ట్విస్టులు సినిమాలో దాగున్నాయి. మొత్తానికి ఇదొక సీరియస్ మరియు డార్క్ థ్రిల్లర్ మూవీ.
- సినిమా చూస్తున్నప్పుడు నాకైతే మొదట కాస్త విసుగు పుట్టినప్పటికీ, కథ సాగుతున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా మారింది. మొదట్లో కథని కాస్త సాగదీయకుండా ఉండుంటే బాగుండేది.
- సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా థ్రిల్లర్ ఫీల్‌ను పెంచుతాయి. ఈ సినిమాలో ప్రధానంగా లోభం, ఆశ, మరియు నైతిక విలువల గురించి చూపించారు.
ఒక మనిషి పరిస్థితుల వల్ల ఎంత దూరం వెళ్లగలడు? అతను తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చు? అనే విషయాలను చాలా బాగా చూపించారు. నటీనటులు ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. డార్క్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రేక్షకులని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటది. మీరు కూడా ఈ చిత్రాన్ని వీక్షించాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.

3 thoughts on “What You Wish For (2023) Plot Summary Explained in Telugu”