The Surrender Movie Explained in Telugu – Summary & Ending Explained
ఈ సినిమాలో ‘బార్బరా’ అనే 60 ఏళ్ల ముసలావిడ ఉంటది. చనిపోయిన తన భర్తని బ్రతికించుకునేందుకు బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి ఆమె ఏమేం పనులు చేసిందో మీరే చూడండి. ‘Shudder’ డిస్ట్రిబ్యూట్ చేసిన ‘ది సరెండర్’ అనే హార్రర్ సినియా గురించి మనం తెలుసుకోబోతున్నం. ఈ చిత్రం మార్చ్ 9, 2025లో విడుదలై చాలా వేగంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘Julia Max’ ఈ సినిమాకి రచయితగా మరియు దర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా మంచి మంచి ట్విస్టులతో చాలా ఆసక్తిగా ఉంటుంది. మరి ఈ సినిమా సంగతులేంటో ఇక చూసెద్దాం పదండి.
ఇక మొదలెడదామా!
1) ఇంటికొచ్చిన మేగన్
ఓపెన్ చేస్తే ‘మేగన్’ అనే అమ్మాయి దగ్గర కథ మొదలవుతుంది. మేగన్ నాన్న పేరు ‘రాబర్ట్’. తనకి క్యాన్సర్ ఉంటది. అందువల్ల తను ఎన్నో రోజులుగా మంచానికే పరిమితమై ఉంటాడు. మేగన్ సిటీలో నివసిస్తుంటది. ప్రస్తుతం తనకి కాస్త డబ్బులు అవసరమవడంతో సిటీ నుంచి ఇంటికొస్తది. మేగన్ అమ్మ పేరు బార్బర. ఆమెకి మూఢనమ్మకాలు ఎక్కువ. రాబర్ట్ యొక్క వ్యాధి నయమవ్వడం కోసం తను బ్లాక్ మ్యాజిక్ ని కూడా ఉపయోగిస్తుంటది. రాబర్ట్ కి నొప్పి వచ్చి బార్బరాని పిలుస్తుండడంతో మేగన్ వెళ్లి బార్బరాకి చెప్తది. బార్బర వెంటనే వచ్చి అతనికి మందులు ఇస్తది. నిజం చెప్పాలంటే, డాక్టర్ చెప్పిన మోతాదు కంటే చాలా తక్కువ మొత్తంలో మందులు ఇస్తుంటది.
అందువల్ల రాబర్ట్ చాలా ఇబ్బందికి గురవుతుంటాడు. కాసేపయిన తర్వాత డాక్టర్ వచ్చి రాబర్ట్ ని చెక్ చేస్తుంది. ఆమె మేగన్ తో మాట్లాడుతూ, “మీ అమ్మ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నా మాట వినకుండా తను చాలా తక్కువ మొత్తంలో మీ నాన్నకి మందుల్ని ఇస్తుంది” అని అంటది. కట్ చేస్తే మేగన్, బార్బరాతో, “నా పరిస్తితి అంతేం బాగోలేదు. నాకు కొంత డబ్బు కావాలి” అని అడుగుతది. కానీ బార్బర మాత్రం, “నా దగ్గర డబ్బులేం లేవు. నువ్వింకా మా మీదే ఆధారపడితే ఎలా” అని అరుస్తది. కొంచెంసేపటి తర్వాత బార్బర తలలో ఒక పెద్ద గాయం ఉండడాన్ని మేగన్ గమనిస్తుంది.
అసలా గాయం ఎలా ఏర్పడిద్దంటే, బార్బర తన జుట్టుని తనే బలంవంతంగా పీకేసుకుంటుంటది. అందువల్ల తనకి తలలో గాయం ఏర్పడుతుంది. తను అలా జుట్టును పీకడానికి ఒక పెద్ద కారణమే ఉంటది లేండి! అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. తన అమ్మ ఒత్తిడికి గురవుతుందేమో అని మేగన్ గ్రహించి, ఆమెని సరదాగా స్నేహితులతో కలిసి డిన్నర్ కి వెళ్ళమంటుంది. బార్బర మాత్రం డిన్నర్ కి వెళ్తున్నట్టుగా ఇంటినుంచి బయల్దేరి, ఒకచోట కార్ ఆపి తన జుట్టుని దండలాగా అల్లుకుంటూ కూర్చుంటది. రాబర్ట్ నొప్పితో అరుస్తుండడంతో మేగన్ తనకి మందులిస్తది. కొంచెంసేపటి తర్వాత బార్బర ఇంటికొచ్చి రాబర్ట్ కి మళ్ళీ మందులిస్తది.
2) ప్రాణం పోసేందుకు ఏర్పాట్లు
అప్పుడు మేగన్, “నేను ఇందాకే మందులిచ్చానుగా… మళ్ళీ నువ్వెందుకు ఇచ్చావు” అని అంటది. అలా ఒకరికి తెలియకుండా ఒకరు వెంటవెంటనే మందులిస్తారు. కాబట్టి రాబర్ట్ కి ఏమైనా అవుతదేమో అని ఇద్దరూ తన దగ్గరే పడుకుంటారు. తీరాచూస్తే తెల్లవారే సమయానికి రాబర్ట్ చనిపోతాడు. తను చనిపోవడంతో వాళ్లిద్దరు చాలా బాధపడతారు. కట్ చేస్తే బార్బర ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటది. మేగన్ ఎంత పిలుస్తున్నా కూడా తనని అసలు పట్టించుకోకుండా, బార్బర తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని మరీ ఫోన్ మాట్లాడతది. కాసేపయిన తర్వాత తను బయటికొచ్చి మేగన్ దగ్గరికెళ్తది.

అసలు విషయమేంటంటే బార్బర బ్లాక్ మ్యాజిక్ ని బాగా నమ్ముద్ది కదా! అందువల్ల చనిపోయిన తన భర్తని బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి మళ్ళీ బతికించుకోవాలనే ఆలోచనలో ఉంటది. మేగన్ కి ఆ విషయం తెలిసి “అసలెందుకు ఇలా పిచ్చిదానిలా చేస్తున్నావ్?! చనిపోయిన మనిషిని తిరిగి బతికించడమేంటి? చదువుకున్నా దానివేగా, మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ ని ఎందుకు నమ్ముతున్నావ్” అని అరుస్తది. బార్బర మాత్రం ఖచ్చితంగా నేను ఈ పని చేసి తీరుతానని అంటది. మేగన్ కి కోపమొచ్చి ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతుంది. “ఒకవేళ బార్బర చేసే పనికి అడ్డు చెప్తే తన దృష్టిలో పూర్తిగా చెడ్డదాన్ని అయిపోతాను. తను చేసే పనికి సహకరిస్తా. తన ప్రయత్నం ఎలాగూ సక్సెస్ అవదు. అప్పుడు తనకే జ్ఞానోదయం కలిగిద్ది” అని మేగన్ తనలో తాను అనుకుంటది.
తను వెంటనే బార్బర దగ్గరికెళ్లి, “సరే నువ్వు చేయాలనుకునే పనిని మొదలుపెడదాం” అని చెప్తది. బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఒక పెద్ద గదిని పూర్తిగా ఖాళీ చేసి ఆ గదినిండా కొవ్వుత్తులు వెలిగిస్తారు. మేగన్ ఇంటి కిటికీలన్నింటిని మూసేసి ప్రతీ అద్దానికి బెడ్ షీట్ కప్పుతుంటది. అలా ఒక అద్దానికి బెడ్ షీట్ కప్పబోతుండగా తనకి ఆ అద్దంలో ఏదో రాక్షసి కళ్ళు వెలుగుతూ కనిపిస్తాయి. మేగన్ కి బాగా భయమేసి వెనక్కి చూస్తే తన వెనక ఎవరూ ఉండరు. అది తన భ్రమేమో అనుకొని మేగన్ మళ్ళీ అద్దం వైపు తిరుగుతది. ఈసారి అక్కడ నలుగురు రాక్షసులు నిలబడి తన వైపే చూస్తున్నట్టు కనిపించడంతో తనకి గుండెల్లో దడ పుట్టి వెంటనే లైట్ ఆన్ చేస్తది. కానీ అక్కడ ఎవరూ ఉండరు.
3) డబ్బుల గురించి వాదన
ఇంకాసేపు ఇక్కడే ఉంటే తన పని అయిపోతదని, అద్దానికి బెడ్ షీట్ కప్పేసి వెంటనే బార్బర దగ్గరికెళ్తది. ఈ బ్లాక్ మ్యాజిక్ ని విజయవంతంగా పూర్తి చేయాలంటే రాబర్ట్ కి సంబంధించిన వస్తువులు, అతనికి ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఒక్కటి కూడా ఉండకూడదు. అందువల్ల బార్బర వాటన్నిటిని మంటల్లో కాల్చేస్తుంటది. మేగన్ తన నాన్నతోటి చిన్నప్పుడు ఒక ఫోటో దిగుతుంది. అదంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఒక్క ఫోటోని మాత్రం నేను దాచుకుంటానని బార్బరాని అడిగిద్ది. కానీ బార్బరా మాత్రం ఒప్పుకోదు. కనీసం సెల్ ఫోన్ లో ఫోటో తీసుకుంటా అని అన్నా కూడా బార్బరా దానికి ఒప్పుకోకుండా ఆ ఫోటోని మేగన్ చేత్తోనే మంటల్లో వేపిస్తది.
చీకటి పడిన తర్వాత బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి బార్బరా ఇంటికి వస్తాడు. సినిమాలో ఇతనికి పేరేం పెట్టలేదు. కాబట్టి ఈ వ్యక్తిని ‘విలియమ్’ అనే పేరుతో పిలుద్దాం. విలియమ్ ఇంట్లోకొచ్చి ముందుగా మేగనాని బాగా పరీక్షించి ఆమె చెవులకున్న కమ్మల్ని తీసేయమని చెప్తాడు. ఆ తర్వాత వాళ్లు రాబర్ట్ చనిపోయిన గదిలోకి వెళ్తారు. విలియమ్ ఏం మాట్లాడకుండా ఒక సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు బార్బర ఒక బ్యాగ్ ని తెచ్చి అతని దగ్గర పెడుతుంది. బ్లాక్ మ్యాజిక్ మొదలుపెట్టబోయేముందు రాబర్ట్ శరీరాన్ని శుభ్రం చేయాలి. అందుకని బార్బర, మేగన రాబర్ట్ యొక్క బట్టలన్నీ తీసేసి అతన్ని శుభ్రంగా తడి గుడ్డతో తుడుస్తారు.
అప్పుడు బార్బరా తన జుట్టుతో తయారు చేసిన ఒక దండని రాబర్ట్ మెడలో వేస్తుంది. కట్ చేస్తే, విలియమ్ బూడిద కావాలని చెప్పడంతో వాళ్ళిద్దరూ బూడిద తీసుకొస్తారు. వాళ్ళు వచ్చేలోగా కొవ్వొత్తులు వెలిగించున్న గదిని విలియమ్ బ్లాక్ మ్యాజిక్ కోసం సిద్ధం చేసిపెడతాడు. విలియమ్ మంత్రాలని చదువుతూ ఒక సర్కిల్ గీసి రాబర్ట్ మృతదేహాన్ని దాని మధ్యలో పడుకోబెట్టిస్తాడు. అప్పుడు విలియమ్ ఇంతకుముందు బార్బర తనకిచ్చిన బ్యాగ్ ని తెరవగా దాని నిండా చాలా డబ్బులుంటాయి. మేగన్ కి బాగా కోపమొచ్చి బార్బరాని బయటికి పిలుస్తుంది. ఆమె బార్బరాతో, “నేను అవసరం కోసం డబ్బులడిగితే నీ దగ్గర డబ్బే లేదని చెప్పావ్. ఇప్పుడు ఈ పని కోసం అతనికి ఎన్ని డబ్బులిచ్చావు” అని అరుస్తది.
4) చేతి వేళ్ళు – బలి
దానికి బార్బరా, “నా దగ్గరున్న డబ్బులు మొత్తం అతనికే ఇచ్చా” అని అంటది. “అసలు డబ్బులన్నీ ఎందుకిచ్చేశావ్. అవి నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు, దాంట్లో నాకు కూడా హక్కు ఉంది. సరే, నా సంగతి తీసేయ్. ఒకవేళ ఈ ప్రయోగం కుదిరి నాన్న బ్రతికొస్తే అప్పుడు మనకి జీవించడానికైనా డబ్బులుండాలి కదా. మరి అలా ఎలా మొత్తం ఇచ్చేశావ్” అని మేగన్ కోప్పడిద్ది. బార్బర మాత్రం నాకు రాబర్ట్ బ్రతకడమే ముఖ్యం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. బార్బర ప్రవర్తన నచ్చక మేగన్ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటది. కానీ విలియమ్ దగ్గర తనని ఒంటరిగా వదిలేయలేక మేగన్ కూడా గదిలోకెళ్తుంది.

రాబర్ట్ శవం వద్ద బార్బర ఒకవైపు కూర్చొగా మేగన్ మరోవైపు కూర్చుంటది. విలియమ్ వాళ్ళ చుట్టూ బూడిదని పోస్తుంటాడు. అప్పుడు మేగన్ ఎందుకిలా బూడిద పోస్తున్నావని అడిగిద్ది. దానికి కాష్మోరా, “ఇది మనకి రక్షణగా ఉంటది” అని చెప్తాడు. “మన చుట్టూ బూడిద పోయడం పూర్తవగానే పూజ మొదలయ్యిద్ది. పూజ పూర్తయిన తర్వాతనే మనం బయటికి వెళ్లగలం. పూజ మొదలైన తర్వాత మనం ఆత్మల ప్రపంచంలోకి వెళ్తాం. అక్కడున్న ఆత్మలు మన మీద దాడి చేయకుండా ఈ సర్కిల్ మనల్ని కాపాడుతుంది. ఆత్మల ప్రపంచంలోకి వెళ్లేందుకు మనం ఏదో ఒక అవయవాన్ని బలిగా అర్పించాలి. అక్కడి నుంచి పని ముగించుకొని తిరిగొచ్చేటప్పుడు కూడా మనం బలి అర్పించాలి” అని బార్బర మేగన్ కి చెప్తది.
విలియమ్ ఒక కత్తితో బార్బరా మరియు మేగన్ యొక్క కన్నీళ్ళను తీసుకొని వాటిని ఒక గుడ్డకి తుడిచి, ఆ గుడ్డని రాబర్ట్ ముఖం మీద కప్పుతాడు. ఆ తర్వాత వాళ్ళద్దరికీ ఒక పదార్థాన్ని ఇచ్చి తినమని చెప్తాడు. వాళ్ళద్దరూ దాన్ని తిన్న తర్వాత ఎటూ కదల్లేకపోతారు. ఆత్మల ప్రపంచంలోకి వెళ్లేందుకు విలియమ్ ఒక కత్తిని తీసుకుని బార్బర యొక్క చేతి వేలిని కట్ చేస్తాడు. అది చూసి మేగన్ చాలా భయపడిపోద్ది. ఆ తర్వాత తను మేఘన్ వేలిని కూడా కట్ చేస్తాడు. అలా బలి ప్రక్రియ పూర్తవుతుంది. మేగన్ నొప్పిని భరించలేక స్పృహకోల్పోద్ది. కొంచెంసేపటి తర్వాత తను మెలకువలోకొస్తది.
5) ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశం
ఆ సమయంలో విలియమ్ రాబర్ట్ శరీరం మీద రక్తంతో ఏవో మంత్రాలు రాస్తుంటాడు. తను వాళ్ళద్దరితో ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకోమని చెప్తాడు. కానీ మేగన్ భయంతో ఏడుస్తూ, “ఇది నా వల్ల కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా” అని అంటది. “ఇక్కడిదాకా చేశాం కదా! ఇంకొంచెంసేపు ఓర్చుకుంటే మీ నాన్నని బ్రతికించొచ్చు” అని బార్బర చెప్పడంతో మేగన్ ఒప్పుకుంటది. ఇక ఇద్దరూ ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని విలియమ్ చెప్పే మంత్రాల్ని చెప్తుంటారు. అప్పుడు హఠాత్తుగా పెద్ద గాలి రావడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఊగిపోతుంటాయి. ఒక్కసారిగా కొవ్వొత్తులన్నీ ఆరిపోయి గది మొత్తం చీకటిగా మారిపోద్ది.
ఇక వెంటనే వీళ్ళు ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. మేగన్ కి భయమేసి ఒక కొవ్వొత్తిని వెలిగిస్తది. తీరాచూస్తే సర్కిల్ లో ఉండాల్సిన రాబర్ట్ మృతదేహం ఎక్కడా కనిపించదు. దాంతో వాళ్లు భయంతో వణికిపోతుంటారు. వాళ్ళకి తెలియని విషయమేంటంటే, రాబర్ట్ రాక్షుషుడిగా మారిపోయి విలియమ్ యెుక్క ముఖం మొత్తాన్ని కొరికేస్తాడు. వాళ్ళు విలియంని అలా చూసి భయపడుతుండగా రాబర్ట్ తనని చీకట్లోకి లాకెళ్ళి చంపేస్తాడు. అప్పుడు సర్కిల్ కొంచెం పాడవుతుంది. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక వాళ్లిద్దరు కంగారుపడిపోతుంటారు. “అసలు ఇలా జరగకూడదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది” అని బార్బర అంటుండగా మేగన్ తన దగ్గరున్న రాబర్ట్ తో దిగిన ఫోటోని బయటకితీస్తది.
రాబర్ట్ కి సంభందించిన వస్తువు మేగన్ దగ్గర ఉండటం వల్లే తమ ప్రయోగం ఇలా తేడాకొడుతుంది. రాక్షషుడిగా మారిపోయిన రాబర్ట్, చీకట్లో అటు ఇటు పరిగెడుతూ వాళ్లిద్దరి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు బార్బర వెంటనే ఫోటోని కాల్చేయమని చెప్పి పాడైపోయిన సర్కిల్ ని సరిచేస్తుంటది. ఈలోగా మేగన్ ఆ ఫోటోని కాల్చేయడంతో కొవ్వొత్తులన్నీ ఒక్కసారిగా వెలుగుతాయి. ఇక రాబర్ట్ వాళ్లని ముట్టుకోలేక దూరంగా పారిపోతాడు. కట్ చేస్తే తను పూర్తిగా రాక్షషుడిలా మారిపోయి విలియమ్ శవాన్ని తింటుంటాడు. అప్పుడు మేగన్, “నాన్న పూర్తిగా రాక్షషుడిలా మారిపోయాడు. ఇక మనం చేసేదేం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా” అని గోల చేస్తది.

6) పథకం అంతా తారుమారు
దానికి బార్బర, “ఈ ఆత్మల ప్రపంచం నుంచి మానవ ప్రపంచానికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. ఇక్కడి వరకు వచ్చాం కదా. ఎలాగోలా రాబర్ట్ ని మళ్ళీ సర్కిల్ లోకి వచ్చేలా చేసి విలియమ్ చెప్పిన మంత్రాల్ని చెప్దాం. అప్పుడు రాబర్ట్ ఆత్మ అతని బాడీలోకి ప్రవేశించి తిరిగి మామూలు మనిషిగా మారతాడు. ఆ తర్వాత మనం ముగ్గురం ఇక్కడ్నుంచి బయటపడేందుకు ఏదో ఒక మార్గం వెతుకుదాం” అని అంటది. ఆమె రాబర్ట్ ని సర్కిల్ లోకి వచ్చేలా చేయాలని, “నీకు మాంసం కావాలా లేక రక్తం కావాలా!?” అని తన చేతిని కోసుకుంటది. రాబర్ట్ సర్కిల్ వరకు వస్తాడు. కానీ ఆ సర్కిల్ యెుక్క శక్తి వల్ల తను లోపలికి వెళ్తే ప్రమాదమని అర్థం చేసుకుని తిరిగి చీకట్లోకెళ్ళిపోతాడు.
బార్బర తన చెయ్యిని బయటికి చాపి, “రాబర్ట్ ఇక్కడికి రా” అని పిలుస్తది. ఇక రాబర్ట్ వెంటనే సర్కిల్ దగ్గరికొచ్చి బార్బరాని చీకట్లోకి లాకెళ్లి చంపేస్తాడు. అలా మేగన్ తన అమ్మని తన నాన్నని ఒకే రోజు కోల్పోతుంది. ఆ ఆత్మల ప్రపంచం నుంచి ఎలా బయటపడాలో తెలియక, మేగన్ సర్కిల్ లో పడుకొని, “దేవుడా ఇక్కడ్నుంచి నన్ను బయటపడేలా చేయి” అని ఏడుస్తూ వేడుకుంటది. ఆత్మల ప్రపంచంలో ఉన్న ఆత్మలన్నీ అరుస్తుండడంతో, వాటి అరుపుల్ని తట్టుకోలేక మేగన్ తన చెవుల్ని మూసుకుంటది. కట్ చేస్తే తను కొవ్వొత్తుల్ని వెలిగిస్తుండగా చాలా ఆత్మలు తన వైపే వస్తుంటాయి. వాటిని చూసి మేగన్ చాలా భయపడిపోద్ది.
కానీ ఆ ఆత్మలేవి సర్కిల్ లోపలికి రావు, అవి కేవలం పక్కనుండి వెళ్ళిపోతాయి. మేగన్ ఆ ఆత్మల్ని సహాయంచేయమని బ్రతిమిలాడుతుంది. కానీ అవి తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాయి. కాసేపటి తర్వాత మేగన్ కి తన అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒకవేళ ఇక్కడ్నుంచి బయటపడాలంటే మళ్ళీ బలి అర్పించాలేమో అని తను తన చేతులకున్న రెండు వేళ్ళని కట్ చేసుకుంటది. అయినా సరే తను మానవ ప్రపంచంలోకి రాలేక ఆత్మల ప్రపంచలోనే ఉండిపోద్ది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని తను బాధతో ఆలోచిస్తుండగా ఒక ఉపాయం వస్తది.
7) ముగింపు
ఎలాగూ ఫ్లోర్ మొత్తం చెక్కే కదా అని తనొక చెక్క ముక్కను ఊడతీస్తది. అప్పుడు తనకి గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తది. “అంటే నేను మా ఇంట్లోనే ఉన్నాను. నేనేం ఆత్మల ప్రపంచంలో లేను” అని మేగన్ సంతోషంతో ఇంకొన్ని చెక్క ముక్కల్ని తీసేసి ఇంట్లోకెళ్ళిపోద్ది. తను పోలీసులకి ఫోన్ చేయాలని చూస్తది, కానీ టెలిఫోన్ పనిచేయదు. ఇంటి బయట ఎవరో తిరుగుతున్నట్టుగా ఉండటంతో మేగన్ వెంటనే బయటికొస్తది. అప్పుడు తనకి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి.
అక్కడే రాబర్ట్ కూడా ఉంటాడు. మేగన్ తన దగ్గరికెళ్లి తనతో మాట్లాడాలనుకుంటది. కానీ రాబర్ట్ కి మేగన్ మాటలు వినిపించవు అలాగే మేగన్ తనకి కనిపించదు. “అంటే ఇంకా నేను ఆత్మల ప్రపంచంలోనే ఉన్నానా!?” అని మేగన్ బాధపడి, ఏం చేయాలో తెలీక మళ్ళీ అదే సర్కిల్ లోకి వెళ్ళిపోద్ది. కొంతసేపటికి రాక్షషిగా మారిన బార్బర అక్కడికొస్తది. ఇక ఎలాగు తను అక్కడ్నుంచి బయటపడలేనని మేగన్ కి అర్థమై సర్కిల్ ని కొంచెం తుడిపేయడంతో కథ ముగుస్తుంది. దీని అర్థమేంటంటే…. ఇక మేగన్ కూడా రాక్షషిగా మారిపోయిందని.
ఈ విధంగా, The Surrender సినిమా కథ సాగుతుంది. నాకైతే సినిమా చాలా ఆసక్తిగా అనిపించింది. మధ్య మధ్యలో వచ్చే సస్పెన్స్ తో కూడుకున్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటది. నటుల యెుక్క భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా మంచి సినిమా చూశామన్న తృప్తిని కలిగిస్తాయి. మీరీ సినిమాని వీక్షించాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. తప్పకుండా ఒకసారి చూసేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
