The Strangers: Chapter 1 Plot Summary Explained in Telugu
చుట్టూ దట్టమైన అడవి… అక్కడ ఒకే ఒక్క ఇళ్లు… మీరు మీ ప్రేయసితో కలిసి ఆ ఇంట్లో ఉండగా, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మీపై దాడి చేసేందుకు వస్తే!? ఊహించుకుంటేనే కాస్త భయంగా ఉంది కదా!? ఆ గుర్తుతెలియని వ్యక్తుల ముఖాలకి మాస్కులు కూడా ఉంటే మీ భయం ఇంకా ఎక్కువయిద్ది కదా!? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలో ఇలాంటి కథే ఉంటదనమాట. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే “The Strangers: Chapter 1”. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇదొక హార్రర్ స్లాషర్ మూవీ. ఈ సినిమాలో ఒక జంట తప్పనిసరి పరిస్థితిలో ఒక నిర్మానుష్యమైన ఇంటిలో నివసించాల్సి వస్తది. మొదట అంతా ప్రశాంతంగానే ఉంటది. కానీ చీకటి పడే కొద్దీ అసలైన భయం మొదలయిద్ది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తమ ముఖాలకి మాస్కులు ధరించి ఆ జంటని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అసలా మాస్కులు ధరించిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఎందుకని ఆ జంటని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు? ఆ జంట చేసిన తప్పేంటి? ఇలా చాలా చాలా అంశాలతో సినిమా చాలా రసవత్తరంగా ఉంటది. ఇక ఆలస్యమెందుకు… ఈ సినిమా విశేషాలేంటో చూసేద్దాం పదండి!
మొదలైన ప్రయాణం
‘జెఫ్ మొరెల్’ అనే వ్యక్తి ఎవరినుంచో తప్పించుకుంటూ ఒక నిర్మానుష్యమైన అడవిలో పరిగెడుతుంటాడు. అలా తను వేగంగా పరిగెడుతూ పొరపాటున తను కిందపడిపోతాడు. ఇక తనని తరుముతున్న కిల్లర్స్ అక్కడికి వచ్చి తనని చంపేస్తారు. అసలీ సైకో కిల్లర్స్ ఎవరు? వీరెందుకు జెఫ్ ని చంపారో తెలియాలంటే మనం సినిమాలోకి వెళ్ళాల్సిందే! ‘ర్యాన్’, ‘మాయ’ తమ రోడ్ ట్రిప్ లో భాగంగా పోర్ట్లాండ్ వెళ్తుంటారు. ప్రస్తుతం వాళ్లున ప్రదేశం నుంచి పోర్ట్లాండ్ ఇంకా మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటది. అక్కడికి చేరుకునేందుకు సుమారు ఐదున్నర గంటల సమయం పట్టిద్ది.
కాబట్టి ఈలోపు ఎక్కడైనా ఆగి, ఏమైనా తిందామని ర్యాన్ అంటాడు. మాయ గూగుల్ మ్యాప్స్ చెక్ చేసి, తమకి దగ్గర్లో ఉన్న ఒక కేఫ్ కనిపెట్టిద్ది. ఇక వారిద్దరు భోజనం చేసేందుకు ఆ కేఫ్ వద్దకి వెళ్తుంటారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్స్ కి సిగ్నల్ పోయిద్ది. దాంతో అసలు వారిద్దరు ఎక్కడున్నారన్న విషయం ఏమీ అర్థం కాదు. కొంచెం ముందుకు వెళ్తే సిగ్నల్ అందుకుంటదేమో అన్నట్టుగా, వాళ్ళు కారుని డ్రైవ్ చేసుకుంటూ ఇంకా కొంత దూరం ముందుకెళ్తారు. అప్పుడు వాళ్ళకి ‘వీనస్’ అనే ఒక చిన్న టౌన్ కనిపిస్తది. అక్కడ మనుషులు ఉండడంతో ర్యాన్, మాయ కాస్త ప్రశాంతంగా ఫీలవుతారు.
ఇంతకుముందు గూగుల్ మ్యాప్స్ లో చూసిన కేఫ్ కూడా అక్కడే ఉండడంతో, ఇక ర్యాన్, మాయ తమ కారుని పక్కన పార్క్ చేసి కేఫ్ లోకి వెళ్తారు. అయితే వాళ్లు కార్ పార్క్ చేసి, కేఫ్ లోకి వెళ్ళడాన్ని ‘రూడి’, ‘డగీ’ అనే ఇద్దరు వ్యక్తులు గమనిస్తారు. నిజానికి ర్యాన్, మాయ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటారు. ఈరోజు వాళ్ళ ఐదవ వార్షికోత్సవం కూడా. వాళ్ళ మాటల సందర్భంలో ఈ విషయం కేఫ్ లో ఉన్న మిగతా కస్టమర్స్ కి కూడా తెలుస్తది. అప్పుడు ‘నీల్’, ‘ఈడెన్’ తమని తాము పరిచయం చేసుకుని, “ఈ రోజు మాది కూడా వార్షికోత్సవమే. మేము పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది. మీకు పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది” అని ర్యాన్, మాయాలని అడుగుతారు.

కార్ పాడవడం
దానికి ర్యాన్, “మేమింకా పెళ్లి చేసుకోలేదు, మేము గత ఐదు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం” అని అంటాడు. “ఐదు సంవత్సరాల నుంచి కలిసుంటూ, ఇంకా నువ్వు తనని పెళ్లి చేసుకోకుండా దేనికోసం ఎదురుచూస్తున్నావు” అని ‘కారోల్’ కాస్త గట్టిగా అడిగిద్ది. కట్ చేస్తే, ర్యాన్, మాయ భోజనం చేసి బయతికొస్తారు. ఇక తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు కారుని స్టార్ట్ చేస్తారు. కానీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. “ఇందాకటి వరకు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడేమయింది, కార్ అసలు స్టార్ట్ అవడం లేదు” అని వాళ్ళిద్దరూ కాస్త కంగారుపడతారు.
అప్పుడు రూడి అక్కడికొచ్చి కార్ ఎందుకని స్టార్ట్ అవడం లేదో పరిశీలిస్తాడు. నిజానికి రూడి, డగీ ఒక గ్యారేజ్ ని నడుపుతుంటారు. అలా రూడి వాళ్ళ కారుని చెక్ చేసి, “ఆల్టర్నేటర్ షార్ట్ అయింది. అందుకే కార్ స్టార్ట్ అవడం లేదు” అని ర్యాన్, మాయలతో చెప్తాడు. కొత్త ఆల్టర్నేటర్ వేరే గరాజ్ లోంచి తెప్పించి, దాన్ని కారులో అమర్చేందుకు రేపటి మధ్యానం వరకు సమయంపట్టిద్ది. కాబట్టి ఈ రోజు రాత్రికి ర్యాన్, మాయ ఆ టౌన్ లోనే ఉండాల్సి వస్తది. మాయ రూడీతో, “మరి మేమిక్కడ ఈ రోజు రాత్రికి బస చేసేందుకు, మోటల్స్ ఏమైనా ఉన్నాయా?” అని అడిగిద్ది.
“ప్రస్తుతం మోటల్స్ అయితే ఏమీ లేవు. కానీ ‘జో’ అనే వ్యక్తి అప్పుడప్పుడు తన ఇంటిని రెంటుకి ఇస్తుంటాడు. జో ప్రతి ఏడాది కొన్ని నెలలు వేటకి వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా తను ఇళ్లు వదిలిపెట్టి వేటకి వెళ్ళాడు. కానీ పర్లేదు, మీరు జో ఇంట్లో ఈ రోజు రాత్రికి బస చేయొచ్చు” అని రూడి మరియు ‘షెల్లి’ అంటారు. మాయ కూడా జో ఇంట్లో బస చేసేందుకు ఒప్పుకుంటది. కాకపోతే ర్యాన్ కి మాత్రం ఇదంతా ఒక స్కామ్ లాగా అనిపిస్తది. తను మాయాతో, “మనం కార్ పార్క్ చేసి కేఫ్ లోకి వెళ్లిన తర్వాత, వీరిద్దరే మన కారుని పాడుచేసి, ఇప్పుడు ఇలా నాటకాలు ఆడుతున్నట్టుంది” అని రూడి, డగీలను ఉద్దేశించి అంటాడు.
గుర్తు తెలియని వ్యక్తి
మాయ మాత్రం ర్యాన్ మాటల్ని అంతగా పట్టించుకోదు. “మనం మూడు రోజులుగా కార్లో తిరుగుతునే ఉన్నాం కదా! కాబట్టి నిజంగానే మన కార్ పాడై ఉంటది” అని మాయ అంటది. ఇక ర్యాన్ కూడా జో ఇంట్లో బస చేసేందుకు ఒప్పుకుంటాడు. షెల్లీ వారిద్దర్ని తన కార్లో ఎక్కించుకుని జో ఇంటికి తీసుకెళ్తది. కట్ చేస్తే, వాళ్ళిద్దరూ తమ ఐదు సంవత్సరాల సహ జీవనంలో జరిగిన ఆనందకరమైన సంఘటనలన్నింటినీ ఒకసారి గుర్తుచేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటుంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రొమాన్స్ చేసుకోవడం మొదలుపెడతారు.
సరిగ్గా అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికొచ్చి తలుపు కొడతారు. “ఈ సమయంలో ఇక్కడికి ఎవరొచ్చారు?” అని అనుకుంటూ ర్యాన్ తలుపు తెరుస్తాడు. అప్పుడా వ్యక్తి, “ఇక్కడ టమారా ఉందా?” అని అడిగిద్ది. దానికి ర్యాన్, “మీరు దారి తప్పి ఇటు వచ్చినట్టుంది. ఇక్కడ టమారా అనే పేరుతో ఎవరూ లేరు” అని చెప్తాడు. దాంతో తను అక్కడ్నుంచి వెళ్ళిపోద్ది. ఈ వ్యక్తిని మనం ‘K1’ అనే పేరుతో పిలుద్దాం. జో ఇళ్లు ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా ఉంటది. కాబట్టి ర్యాన్, మాయ, “అసలీ అమ్మాయి ఒంటరిగా ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎలా వచ్చింది” అని అనుమానపడతారు.

ఇక వాళ్ళిద్దరూ K1 విషయాన్ని వదిలేసి మళ్లీ సరదాగా మాట్లాడుకుంటుంటారు. నిజానికి మాయకి పెళ్లి అంటే అంతగా ఇష్టముండదు. అందుకనే ర్యాన్ తనని ఇప్పటివరకు పెళ్ళి చేసుకోకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు మాయ తనని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలియడంతో ర్యాన్ చాలా సంతోషిస్తాడు. మాయ మాట్లాడుతూ, “నాకు పోర్ట్లాండ్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత, నువ్వు నేను అక్కడే జీవితాంతం కలిసి ఉండొచ్చు కదా” అని అడిగిద్ది. “అలాగే, ఖచ్చితంగా” అని ర్యాన్ అంటాడు. ర్యాన్ కి ఆస్తమా ఉంటది. అలా తనకిప్పుడు కాస్త ఊపిరాడనట్టుగా అనిపించడంతో ర్యాన్ తన ఇన్హేలర్ కోసం వెతుకుతాడు.
ర్యాన్ టౌన్ లోకి వెళ్ళడం
కాకపోతే ఇన్హేలర్ కార్లోనే ఉంటది. ఇప్పుడు వాళ్లకి ఆ విషయం గుర్తుకురావడంతో, ర్యాన్ మాయని ఇంట్లోనే ఉండమని చెప్పి, తను జో బైక్ తీసుకుని టౌన్ లోకి బయల్దేరతాడు. మాయ తన ఫ్రెండ్ ‘డెబ్బీ’ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా, మళ్లీ అక్కడికెవరో వచ్చి తలుపు కొడతారు. అది విన్న మాయ, ర్యాన్ వచ్చాడేమో అని అనుకుని, తలుపు తీసేందుకు వెళ్తది. తీరాచూస్తే అక్కడ K1 ఉంటది. K1 మాయాతో, “ఇక్కడ టమార ఉందా?” అని మళ్ళీ అడిగిద్ది. అసలీ అమ్మాయేంటి మళ్లీ వచ్చి, ఇలా అడుగుతుందని మాయ కాస్త కంగారుపడిద్ది.
“ఇక్కడ టమార లేదని మేము ఇంతకుముందే నీకు చెప్పాం కదా” అని మాయ అంటది. కానీ K1 మాత్రం మాయ మాటల్ని పట్టించుకోకుండా, “ఇక్కడ టమార ఉందా?” అని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటది. దాంతో మాయాకి ఏం చేయాలో ఏమీ అర్థంకాక, “ర్యాన్ త్వరగా వస్తే బాగుండు” అని అనుకుంటూ తలుపు దగ్గర్నుంచి వెనక్కి వచ్చేస్తది. కొంచెంసేపటి తర్వాత ఎవరో మెట్లు ఎక్కుతున్నట్టు, ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు మాయకి శబ్ధాలు వినిపిస్తాయి. అసలీ శబ్ధాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయని మాయ ఒక పక్క భయపడుతూనే ఇళ్ళంతా పరిశీలిస్తది. కానీ తనకి ఎవరూ కనిపించరు.
మాయ భయం పోగొట్టుకునేందుకు ఒక వీడ్ సిగరెట్ తాగుతూ పియానో ప్లే చేస్తుంటది. మాయ అలా పియానో ప్లే చేస్తుండడాన్ని ఒక వ్యక్తి అంతే చూస్తుంటాడు. కానీ ఈ విషయం మాయకి తెలియదు. ఈ వ్యక్తిని మనం ‘K2’ అనే పేరుతో పిలుద్దాం. టౌన్ లోకి చేరుకున్న ర్యాన్, గరాజ్ లోని తన కార్ దగ్గరికెళ్లి అందులో ఉన్న ఇన్హేలర్ తీసుకుంటాడు. తర్వాత తను కేఫ్ దగ్గరికెళ్లి, మాయ కోసం కొంత ఆహారం తీసుకుని, బైక్ పై ఇంటికి బయల్దేరతాడు. మాయ స్నానం చేస్తుండగా K2 అక్కడికి కూడా వచ్చి తనని చూస్తుంటాడు. అప్పుడు మాయాకి, తన పక్కన ఎవరో ఉన్నట్టుగా అనుమానం రావడంతో, తను వెంటనే తల పక్కకు తిప్పి చూస్తది.
మాయాపై దాడి
కానీ అప్పుడు మాత్రం K2 అక్కడ ఉండడు. తర్వత మాయ తన జుట్టుని తుడుచుకుంటుండగా ఇంట్లో కరెంట్ పోయిద్ది. ఫ్యూజ్ బాక్స్ ఎక్కడుందో కనిపెట్టి కరెంట్ వేద్దామని మాయ ఫ్యూజ్ బాక్స్ కోసం ఇళ్ళంతా వెతుకుతుంటది. తనకి ఆ సమయంలో, ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టుగా, నీళ్ళని కింద పారపోస్తున్నట్టుగా శబ్ధాలు వినిపిస్తాయి. దాంతో మాయ చాలా భయపడిపోద్ది. చివరికి తను ఫ్యూజ్ బాక్స్ కనిపెట్టి కరెంట్ వేయబోతుండగా తన దగ్గరికి హఠాత్తుగా K3 వస్తది. తనని చూసి మాయ ఒక్కసారిగా భయపడిపోయి, అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ ఒక గదిలోకి వెళ్లి దాక్కుంటది. కానీ K3 మాత్రం మాయని అస్సలు వదిలిపెట్టకుండా తనకోసం ఇళ్ళంతా వెతుకుతుంటది.

ఇక K3 మాయ ఎక్కడుందో కనిపెట్టి తనని చంపబోతుందని అనుకుంటుండగా వెంటనే అక్కడికి ర్యాన్ వస్తాడు. మాయ ఏడుస్తూ, “ఈ ఇంట్లో ఎవరో విచిత్రంగా మాస్క్ వేసుకుని నన్ను చంపేందుకు ప్రయత్నించారు” అని అంటది. సరే ముందు కరెంట్ వేసి ఆ వ్యక్తి ఎవరో కనిపెడదామని ర్యాన్ అంటాడు. ఇక మాయ తనని ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్లగా ర్యాన్ కరెంట్ వేస్తాడు. ర్యాన్ మాయని, “నువ్వు ఆ సిగరెట్ తాగావా?” అని అడుగుతాడు. “నేను ఇంతకుముందు కొంచెం మాత్రమే దాన్ని తాగాను. కానీ ఆ సిగరెట్ వల్ల నాకేమీ మైండ్ పాడవ్వలేదు.
ఇక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు” అని మాయ అంటది. సరిగ్గా అప్పుడే అక్కడికి K1 మళ్ళీ వచ్చి తలుపు తట్టిద్ది. ఇక ర్యాన్ కోపాన్ని ఆపుకోలేక, “అసలు నీ సమస్యేంటి” అని అంటూ K1 దగ్గరికెళ్తుంటాడు. దాంతో K1 అక్కడినుంచి పారిపోద్ది. ఇంకోసారి ఇక్కడికొస్తే పోలీసులకి కాల్ చేస్తా అని ర్యాన్ గట్టిగా అరుస్తాడు. అసలా అమ్మాయి ఎందుకని ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తుందని మాయ కంగారుపడిద్ది. కొంచెం సేపటి తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తుండగా పైనుంచి కొన్ని రక్తపు చుక్కలు టేబుల్ మీద పడతాయి. వారిద్దరు తలపైకెత్తి చూడగా అక్కడొక చనిపోయిన కోడి కిందకి వేలాడదీయబడి ఉంటది.
దాడి చేస్తున్నది ఎవరు?
అప్పుడు మాయ, “ఈ ఇంట్లో నిజంగానే ఎవరో ఉన్నారని నేను నీకు ముందే చెప్పినాగా” అని భయంతో అంటది. అదే సమయంలో తలుపులు పగలగొట్టుకుంటూ కిల్లర్స్ లోపలికి వస్తుండడంతో, ర్యాన్, మాయ వెంటనే ఒక గదిలోకెళ్లి దాక్కుంటారు. K2 వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కనిపెట్టి, వాళ్ళున్న గది తలుపుని గొడ్డలితో పగలగొడతాడు. కానీ K3 వాళ్ళని చంపకుండా, భయంతో వణికిపోతున్న వాళ్లిద్దరి వైపు అంతే కాసేపు చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అసలు వీళ్ళు ముగ్గురూ ఎవరో, వీళ్ళు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో ర్యాన్, మాయలకి ఏమీ అర్థంకాదు. కొంచెంసేపటి తర్వాత అంతా నిశ్శబ్దంగా ఉండడంతో కిల్లర్స్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారేమో అని వాళ్లిద్దరు అనుకుంటారు.
ర్యాన్ మాయతో, “వీళ్ళెవరో గానీ మనతో ఆడుకుంటున్నట్టుంది. కాబట్టి మనం వెంటనే బైక్ వేసుకుని వీళ్లనుంచి తప్పించుకుని టౌన్ లోకి వెళ్ళిపోదాం” అని అంటాడు. ఇక వాళ్ళిద్దరు వేగంగా ఇంట్లో నుంచి బయటికొచ్చేసి బైక్ దగ్గరికెళ్తుంటారు. కానీ ఇంతలోనే K2 అక్కడికొచ్చి బైక్ పేల్చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ, “వీడు మళ్ళీ వచ్చాడా” అని అనుకుంటూ ఇంట్లోకి పరుగుతీసి ఒక గదిలో దాక్కుంటారు. ర్యాన్, మాయ తమ రక్షణ కొరకు ఏదైనా ఒక ఆయుధం కోసం వెతుకుతుండగా, K1, K2 ఇంట్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడు మాయకి తమ పక్కనే ఒక క్రాల్ స్పేస్ కనిపిస్తది. ఆ మార్గంగుండా ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి బయటపడొచ్చు.
కాబట్టి కిల్లర్స్ కంటపడకుండా ఇంటి నుంచి బయటపడేందుకు ఇదే సరైన మార్గమని ర్యాన్, మాయ నిర్ణయించుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఆ క్రాల్ స్పేస్ గుండా పాక్కుంటూ ఇంటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు పొరపాటున ఒక పాత ఇనుప చీల మాయ అరచేతికి గుచ్చుకుంటది. మాయ ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరవబోద్ది. కానీ తన అరుపులు కిల్లర్స్ విన్నారంటే సమస్య వస్తదని మాయ అరవకుండా తన నొప్పిని భరిస్తది. ఇక ర్యాన్ వెంటనే మాయ అరచేతికి గుచ్చుకున్న చీలని బయటికి లాగేస్తాడు. చివరికి వాళ్ళిద్దరూ కిల్లర్స్ కంట పడకుండా ఇంటి నుంచి బయటికొచ్చేసి పక్కనే ఉన్న షెడ్ లోకి వెళ్తారు.
ముగింపు
ఆగండి, ఆగండి… ఇంతవరకు ఆ ముగ్గురు వ్యక్తులు ర్యాన్, మాయని ఎంతలా ఇబ్బందిపెట్టారో మాట్లాడుకున్నాం. మరి వాళ్లిద్దరు ఆ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బయటపడ్డారా, లేదా అనే విషయాలు ఇంకా మూవీలో దాగున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. మొత్తానికి ఒక సింపుల్ కాన్సెప్ట్‌తో భయాన్ని సృష్టించిన ఆసక్తికరమైన సినిమా ఇది. నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు “ఇప్పుడు ఏం జరుగుతుందో?” అనే ఉత్కంఠత ప్రతి సీన్‌లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ, లైటింగ్ మరియు సౌండ్ డిజైన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇది కేవలం చాప్టర్ 1 మాత్రమే. ఈ సిరీస్ లో ఇంకా రెండు సినిమాలు విడుదలయ్యాయి. “The Strangers: Chapter 2” 2025లో మరియు “The Strangers: Chapter 3” 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక ఆలస్యమెందుకు వీలు చూసుకుని ఈ మూడు సినిమాల్ని ఒకసారి వీక్షించండి.
