The Monkey Movie Explained in Telugu – Summary & Ending Explained

The Monkey Movie Explained in Telugu – Summary & Ending Explained

ఈ సినిమాలో ఒక కోతి బొమ్మ ఉంటది. అది అలాంటిలాంటి బొమ్మ కాదు, ఎవరైనా దాని తాళం తిప్పితే దానికి నచ్చినోన్ని వేసేస్తది. ఈ బొమ్మ వల్ల అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారో తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్ళాల్సిందే. Neon డిస్ట్రిబ్యూట్ చేసిన ‘The Monkey’ హార్రర్ మూవీ మంచిగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా 2025, ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘Osgood Perkins’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందరికీ సుపరిచితమైన ‘Theo James’ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అసలీ కోతి బొమ్మ యొక్క సంగతేంటో ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం!

అసలు కథ ఏంటంటే!
1) ఆట మొదలెట్టిన కోతి

ఓపెన్ చేస్తే 1999వ సంవత్సరంలో ‘పీటీ షెల్‌బోర్న్’ అనే వ్యక్తి ఒక యాంటీక్ షాప్ లోకి వెళ్లి, “నాకు ఈ బొమ్మ అవసరం లేదు. దయచేసి దీన్ని వెనక్కితీసుకోండి” అని అంటాడు. అప్పుడు ఆ షాప్ యజమాని, “పిల్లల బొమ్మల్ని మేము వెనక్కితీసుకోము. అయినా ఇది సాధారణమైన బొమ్మే కదా! దీన్ని ఎందుకు తిరిగిస్తున్నావు? ఈ బొమ్మ కూడా కొంచెం పాడయినట్టుందిగా” అంటాడు. అప్పుడు పీటీ షెల్‌బోర్న్ కొంచెం భయపడుతూ, “అరే బాబు ఇది క్యూట్ బొమ్మ కాదు, కాటేసే బొమ్మ. ఇది డ్రమ్స్ వాయించడం మొదలుపెడితే మన దూల తీరిపోద్ది” అని అంటాడు. అలా మాట్లాడుతుండగానే కోతి డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టిద్ది. పీటీ షెల్‌బోర్న్ కి భయం వేసి పక్కకెళ్లి నిలబడతాడు

అప్పుడా షాప్ యజమాని, “ఈ కోతి డ్రమ్స్ వాయిస్తే ఏదో అయిపోద్దని అన్నావుగా! మరి ఇప్పుడేం అవ్వలేదే” అని అంటాడు. ఆ సమయంలో ఒక ఎలుక తాడుని కొరకడంతో ఒక పదునైన బాణం వచ్చి షాప్ యజమాని ఒంట్లోకి దూసుకుపోద్ది. అలా తను చనిపోతాడు. పీటీ షెల్‌బోర్న్ భయపడుతూ, ఈ కోతి బొమ్మని ఇలానే వదిలేస్తే ఇంకెంత మందిని లేపేస్తదో అని ఆ షాప్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఆ మంటల్లోనే కోతి బొమ్మ కూడా కాలిపోద్ది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు కథ బిల్ మరియు హాల్ అనే ఇద్దరు కవలల వద్ద మొదలవుతుంది. వీళ్లిద్దరు పీటీ షెల్‌బోర్న్ యెుక్క కొడుకులు. వీళ్ళ అమ్మ పేరు ‘లూయిస్’. కొన్ని సంవత్సరాల క్రితం పీటీ షెల్‌బోర్న్ తన కుటుంబం నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు.

వీళ్లలో బిల్ పెద్దవాడు. వాడెప్పుడు హాల్ ని కొడుతూ ఏడిపిస్తుంటాడు. అలా చేయడం వల్ల హాల్ చాలా బాధపడుతుంటాడు. ఒకరోజు వాళ్లిద్దరు తమ నాన్నగారి వస్తువులను చూస్తుండగా వాళ్ళకొక బాక్స్ కనిపిస్తుంది. దాన్ని తెరిచిచూడగా అందులో ఒక కోతి బొమ్మ ఉంటది. ఈ కోతి బొమ్మనే మనం కథ ప్రారంభంలో చూసింది. “ఈ బొమ్మకున్న తాళాన్ని ఒకసారి తిప్పి చూడండి ఏం జరుగుతుందో!” అని ఒక చోట రాయబడి ఉంటది. వీళ్ళకి ఆ బొమ్మ గురించి పూర్తిగా తెలియదు కదా! అందుకని బిల్ తాళాన్ని తిప్పుతాడు. ఇక కోతి బొమ్మ తన చేతుల్ని కదిలించడం మొదలుపెట్టిద్ది, కానీ డ్రమ్స్ ని మోగించదు. ఈ బొమ్మ పాడైపోయిందేమోలే అనుకుని దాన్ని పక్కనపెట్టేస్తారు.

2) వెంటవెంటనే ఇద్దరు

కట్ చేస్తే, వాళ్లిద్దరు ‘యానీ’ అనే బేబీసిట్టర్ తో బయటికెళ్లేందుకు సిద్ధమవుతారు. ఆ కోతి బొమ్మ వీళ్ళకన్నా ముందే కార్లోకి వచ్చి కూర్చుంటది. మరి దాన్నెవరైనా అక్కడ పెట్టారా లేదా అదే అక్కడికొచ్చి కూర్చుందా అనే విషయం ఎవరికీ తెలియదు. పిల్లలిద్దరూ యానీతో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. చెఫ్ చాలా చాకచక్యంగా కత్తుల్ని తిప్పుతూ ఫుడ్ ని తయారుచేస్తుంటాడు. ఆ సమయంలో కార్లో ఉన్న కోతి బొమ్మ డ్రమ్స్ మోగిస్తుంది. ఇంకేముంది చెఫ్ చేతిలోని కత్తి పొరపాటున యానీకి తగలడంతో, ఆమె తలా మొండెం వేరైపోతాయి. అందరూ ఆ ఘటనని ఒక ప్రమాదంలాగే చూస్తారు తప్పా, కోతి బొమ్మ వల్లే యానీ చనిపోయిందని ఎవ్వరికీ తెలియదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.

ఒకరోజు బిల్ తన స్నేహితులతో కలిసి హాల్ మీద అరటిపళ్ళు వేసి బాగా ఏడిపిస్తాడు. హాల్ కి చాలా బాధేసి ఏడ్చుకుంటూ ఇంటికొస్తాడు. హాల్ కోపంతో కోతి బొమ్మ దగ్గరికెళ్లి, “నా బ్రదర్ బిల్ చనిపోతే బాగుండు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు” అని తాళాన్ని తిప్పుతాడు. కొంచెంసేపటి తర్వాత బిల్ ఇంటికొస్తాడు. అప్పుడు కోతి తన డ్రమ్స్ మోగించడంతో లూయిస్ చనిపోతుంది. లూయిస్ ప్రమాదవశాత్తు చనిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ కోతి బొమ్మకున్న తాళం తిప్పడం వల్లే ఇలా జరిగిందేమో అని హాల్ కి అనుమానం కలిగిద్ది. ఈ బొమ్మ గురించి చెప్పాలంటే ఇదొక శాపగ్రస్తమైన దెయ్యం బొమ్మ. ఇది ఎవరి యెుక్క ఆజ్ఞల్ని తీసుకోదు, ఎవరికీ బానిసలాగా కూడా ఉండదు.

The Monkey Movie Explained in Telugu - Summary & Ending Explained
The Monkey Movie Explained in Telugu – Summary & Ending Explained

ఎవరైనా దాని తాళం తిప్పితే మాత్రం దానికి ఇష్టం వచ్చినోళ్ళని చంపేస్తది. కానీ తాళం తిప్పిన వ్యక్తులకి మాత్రం అది ఎటువంటి హాని చేయదు. లూయిస్ చనిపోవడంతో ‘ఐడా’ మరియు ‘చిప్’, పిల్లలిద్దర్ని తమ ఇంటికి తీసుకెళ్ళాలని అనుకుంటారు. హాల్ ఆ కోతి బొమ్మని నాశనంచేయాలని నిర్ణయించుకుని, రాత్రి సమయంలో దాన్ని గ్యారేజ్ లోకి తీసుకెళ్లి ఒక కత్తితో బొమ్మ చేతిని నరుకుతాడు. అప్పుడు దాని శరీరం నుంచి రక్తంలాగా ఏదో ఒక ఎర్రని ద్రవం బయటికొస్తది. ఇది నిజంగా మామూలు బొమ్మేనా లేక ఇంకేదైనా దెయ్యం బొమ్మా!? అని హాల్ కి భయమేసి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేస్తాడు. చెత్త తీసుకెళ్ళే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోవడంతో, ఇక ఈ బొమ్మ గోల పూర్తయిందిలే అని హాల్ ప్రశాంతంగా నిద్రపోతాడు.

3) నిజం తెలుసుకున్న సోదరులు

మరుసటి రోజు ఐడా, చిప్ పిల్లలిద్దర్ని తమ ఊరికి తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి కోతి బొమ్మ కూడా తిరిగొస్తుంది. అది ఇక్కడికెలా వచ్చిందో అర్థంకాక, ఈ బొమ్మని ఇక్కడికెందుకు తెచ్చావని హాల్ ని అరుస్తాడు. దానికి హాల్, “నేను దీన్ని ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశాను. అసలిది ఇక్కడికెలా వచ్చిందో నాకు తెలియదు. నాకెందుకో ఇది దెయ్యం బొమ్మలాగా అనిపిస్తుంది. దీని తాళం తిప్పిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఈ బొమ్మ వల్లనే ‘యానీ’, ‘అమ్మ’ చనిపోయారేమో” అని అంటాడు. అసలిది నిజంగా దెయ్యం బొమ్మనా అని తెలుసుకునేందుకు వాళ్ళు మళ్ళీ తాళం తిప్పుతారు. ఈసారి ఆ బొమ్మ వల్ల అంకుల్ చిప్ చనిపోతాడు.

తను వేటకోసం అడవిలోకెళ్లి స్లీపింగ్ బ్యాగ్ లో నిద్రపోతుండగా, ఒక గుర్రం మంద అటుగా వచ్చి అతన్ని తొక్కి నుజ్జు నుజ్జుగా చేసేస్తాయి. చిప్ చనిపోవడంతో ఈ బొమ్మ నిజంగానే శాపగ్రస్తమైన దెయ్యం బొమ్మ అని బిల్, హాల్ కి అర్థమవుతుంది. చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తులకి ఇది దొరికితే, దీని ద్వారా జనాల్ని చంపేయొచ్చు కదా! కాబట్టి కోతి బొమ్మని ఎలాగైనా దాచేయాలని బిల్, హాల్ అనుకుంటారు. పీటీ షెల్‌బోర్న్ దాన్ని మంటల్లో కాల్చేసినా సరే అది బతికింది. హాల్ దాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా సరే అది మళ్ళీ బతికింది. అందువల్ల బిల్, హాల్ ఒక పతకం వేసి దాన్నొక పెట్టెలో పెట్టి లోతైన గోతిలో పడేస్తారు.

కట్ చేస్తే 25 సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం బిల్, హాల్ మధ్య మాటలుండవు. అసలు బిల్ ఎక్కడున్నాడో కూడా హాల్ కి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం హాల్ పెళ్ళి చేసుకుంటాడు. తన కొడుకు పేరు ‘పీటీ’. తన వల్ల పీటీకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని హాల్ తన కుటుంబానికి దూరంగా ఉంటుంటాడు. ఒకరోజు ఐడా ప్రశాంతంగా నిద్రపోతుండగా బయటనుంచి ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఆమె తుపాకి తీసుకుని ఇంటి నుంచి బయటకొస్తది. కానీ ఇంటి బయట ఎవరూ ఉండరు. దాంతో తను ఇంట్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా పొరపాటున ఒక మెట్టు విరగడంతో తను అనుకోకుండా కిందపడిపోద్ది. అప్పుడు తన ముఖానికి చాలా హుక్స్ గుచ్చుకుంటాయి.

4) కోతి బొమ్మ పురాగమనం

ఐడా వెంటనే ఇంట్లోకొచ్చి తన ముఖానికున్న హుక్స్ అన్నిటినీ తీసేసి ఆల్కహాల్ తో ముఖం కడుగుతుంటది. అదే సమయంలో వంట గదిలోంచి గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావడంతో తను గ్యాస్ దగ్గరికెళ్తది. తన ముఖానికున్న ఆల్కహాల్ వల్ల వెంటనే మంటలు చెలరేగుతాయి. ఐడా భయంతో గట్టిగా అరుస్తూ, పరిగెత్తుకుంటూ బయటకొచ్చి పొరపాటున ఒక పదునైన చెక్కకు గుచ్చుకుంటది. అలా ఐడా కూడా చనిపోతుంది. హాల్ భార్య ‘టెడ్’ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటది. టెడ్ పీటీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ పీటీకి హాల్ తో ఉండడమంటేనే ఇష్టం.

కాబట్టి వాళ్ళు హాల్ ని పిలిచి, “కొన్ని రోజులు పీటీని నీతోపాటు ఉంచుకుని సరదాగా ఉండు. ఆ తర్వాత నుంచి నువ్వు వాణ్ణి కలవాల్సిన అవసరం లేదు” అని చెప్తారు. కట్ చేస్తే హాల్ పీటీని తీసుకుని ఒక చిన్న ట్రిప్ కి బయల్దేరతాడు. మరోవైపు ఐడా ఇంటి వద్ద గ్యారేజ్ సేల్ జరుగుతుండగా ‘రిక్కీ’ అనే వ్యక్తి సేల్ దగ్గరికొస్తాడు. తనకక్కడ కోతి బొమ్మ కనిపిస్తది. రిక్కీ దాన్ని పట్టుకోగానే తనకి తన నాన్న యెుక్క జ్ఞాపకాలు గుర్తుకురావడంతో, తను వెంటనే ఆ బొమ్మని కొనేస్తాడు. రాత్రిపూట బసచేసేందుకు హాల్, పీటీ ఒక హోటల్ రూంకి వెళ్తారు. అప్పుడు పీటీ హాల్ తో మాట్లాడుతూ, “నీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా?” అని అడుగుతాడు.

The Monkey Movie Explained in Telugu - Summary & Ending Explained
The Monkey Movie Explained in Telugu – Summary & Ending Explained

అప్పుడు హాల్, “నాకు ఎవరూ లేరు” అని అబద్ధం చెప్తాడు. కొంచెంసేపటి తర్వాత ఇద్దరూ నిద్రపోతుండగా బిల్ దగ్గర్నుంచి హాల్ కి కాల్ వస్తది. గత 25 సంవత్సరాలుగా వాళ్ళ మధ్య మాటల్లేవుగా. అలాంటిది అసలు నా ఫోన్ నంబర్ వీడికెలా తెలుసు అని హాల్ కాస్త షాక్ అవుతాడు. బిల్, హాల్ తో మాట్లాడుతూ, “మన ఐడా ఆంటీ చనిపోయింది. తన మరణం మీద నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ ఆంటీ ఇంట్లో కోతి బొమ్మ ఉందేమో ఒకసారి చెక్ చేయి” అని చెప్తాడు. ఐడా ఇంటికెళ్తే తన కొడుకుతో గడిపేందుకు సమయం సరిపోదని హాల్ అందుకు ఒప్పుకోడు. ఆ సందర్భంలో ఒక అమ్మాయి స్విమ్మింగ్ పూల్లోకి దిగేందుకు సిద్దమవుతుంటది.

5) నీళ్ళలో కరెంట్

అప్పుడొక కరెంట్ వైర్ వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడడంతో నీళ్లు మొత్తం ప్రమాదకరంగా మారతాయి. ఈ విషయం తెలియక ఆ అమ్మాయి పూల్లోకి దూకగానే ఒక పెద్ద బ్లాస్టింగ్ జరిగి తను అక్కడికక్కడే చనిపోతుంది. ఆ ప్రమాదాన్ని చూసిన హాల్ కి చాలా భయమేస్తది. అంటే నిజంగానే కోతి బొమ్మ తిరిగొచ్చినట్టుందని హాల్ వెంటనే పీటీని తీసుకొని హోటల్ నుంచి బయటికొచ్చేస్తాడు. కోతి బొమ్మ వల్ల పీటీకి ఏ ప్రమాదం జరగకూడదని వాన్ని తన భార్య దగ్గర వదిలిపెట్టాలనుకుంటాడు. కానీ పీటీ అందుకు ఒప్పుకోకపోవడంతో తనతో పాటు ఐడా ఇంటికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ‘బార్బరా’ అనే రియల్టర్ హాల్ ని పలకరించి, “నీ బ్రదర్ నువ్వు వస్తావని ముందే చెప్పాడు” అని అంటది.

తన మాటల్ని విన్న పీటీకి, “అంటే మా నాన్నకి బ్రదర్ ఉన్నాడా!” అని అర్థమయిద్ది. బార్బరా హాల్ తో మాట్లాడుతూ, “మీ ఆంటీ చనిపోయినప్పటినుంచి ఇక్కడంతా చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఊర్లో చాలా మంది రకరకాలుగా చనిపోయారు” అని చెప్తూ ఒక తలుపుని తెరుస్తది. అప్పుడు పొరపాటున ఒక తుపాకి దానంతట అదే పేలడంతో బార్బరా క్షణాల్లోనే చనిపోతుంది. కట్ చేస్తే పోలీసులు సంఘటన స్థలంకి చేరుకుని, కేస్ ముగిసే వరకు ఊర్లోనే ఉండమని హాల్ తో అంటారు. ఖచ్చితంగా ఆ బొమ్మే ఈ మరణాలన్నింటికి కారణమని, దాన్ని ఎలాగైనా నాశనంచేయాలని హాల్ దాని కోసం ఇళ్లంతా వెతుకుతుంటాడు.

అప్పుడు బిల్ కాల్ చేసి, “మన ఆంటీ చనిపోయిన తర్వాత సేల్ జరిగింది. ఆ సేల్ లో కోతి బొమ్మని ఎవరైనా కొనేసుంటారు. ప్రస్తుతం అది ఇంట్లో లేదు. దానివల్లే ఊర్లోని జనాలు దారుణంగా చనిపోతున్నారు. నేను చెప్పేవరకు నువ్వు ఏ పని చేయకు” అని బిల్ కాల్ పెట్టేస్తాడు. తన మాటల్ని విన్న హాల్ కి బిల్ పై అనుమానంకలిగి, “ఒకవేళ వీడే ఈ బొమ్మ ద్వారా అందర్నీ చంపేస్తున్నాడా!?” అని అనుకుంటాడు. హాల్ వెంటనే టెలిఫోన్ డైరెక్టరీ తెరవగా అందులో ‘మిసెస్ మంకీ’ అనే పేరుతో ఒక ఫోన్ నంబర్ ఉంటది. హాల్ ఆ నంబర్ కి కాల్ చేస్తే, బిల్ వాయిస్ తో ఒక వాయిస్ మెసేజ్ వినిపిస్తది. ఇక హాల్ కి తన అనుమానం నిజమే అని అర్థమయిద్ది. అవును, బిల్ అదే ఊర్లో ఉంటూ ఆ కోతి బొమ్మ ద్వారా మనుషుల్ని దారుణంగా చంపుతుంటాడు.

6) కందిరీగల దాడి

ఇప్పుడు కథ 25 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. హాల్ తాళం తిప్పడం వల్లే తమ అమ్మ చనిపోయిందని బిల్ కి అర్థమయిద్ది. బిల్ వెంటనే బొమ్మను పడేసిన ప్రదేశానికెళ్లి గోతిలోకి దిగుతాడు. తను దానికోసం చాలాసేపు వెతుకుతాడు, కానీ కోతి బొమ్మ ఎక్కడా కనిపించదు. కేవలం దాని తాళం మాత్రమే దొరికిద్ది. ఏదో ఒక రోజు బొమ్మ కూడా దొరికిద్దని, బిల్ ఆ తాళాన్ని తీసుకొని గోతిలోంచి బయటికొస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రిక్కీ అనే వ్యక్తి సేల్ లో బొమ్మని కొని, ఇంకాస్త ఎక్కువ డబ్బుల కోసం దాన్ని బిల్ కి అమ్మేస్తాడు. అప్పటినుంచి తమ అమ్మని చంపిన హాల్ ని ఎలాగైనా చంపేయాలని బిల్ తాళాన్ని తిప్పుతుంటాడు. కానీ ఆ బొమ్మ ఎవరి మాట వినదు కదా! అందుకే హాల్ కి బదులు ఊర్లో ఉన్న జనాల్ని చంపేస్తుంటది. ఆ విధంగా ఇప్పటికే చాలా మంది చనిపోయారు.

అంతమంది చనిపోతున్నా సరే బిల్ మాత్రం తాళం తిప్పడం ఆపకుండా ఎలాగైనా హాల్ ని చంపాలని సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. ఇక కథ ప్రస్తుతానికి వస్తది. రిక్కీ బిల్ దగ్గరికెళ్లి, “నా బొమ్మ నాకు తిరిగివ్వు” అని అరుస్తాడు. కానీ బిల్ మాత్రం బొమ్మ ఇవ్వడు. ఏదో ఒకటి చేసి బొమ్మని దక్కించుకోవాలని రిక్కీ నిర్ణయించుకుంటాడు. హాల్ బిల్ కి ఫోన్ చేసి, “నువ్వే కదా అందర్ని చంపుతున్నది. ఎందుకిలా చేస్తున్నావ్, ఇదంతా ఆపేసెయ్” అని అంటాడు. దానికి బిల్, “సరే ఇదంతా ఆపేస్తా. కానీ నీ కొడుకుని నా దగ్గరికి పంపు, వాడే ఈ బొమ్మ తాళాన్ని తిప్పుతుండాలి. నీకు తెలుసుగా! ఈ బొమ్మ తన తాళాన్ని తిప్పిన వ్యక్తులకి ఏ హానీ కలిగించదు. నువ్వుగాని వాన్ని పంపకపోతే నేనే ఈ తాళాన్ని తిప్పుతుంటాను. దానివల్ల ఎప్పుడైనా సరే నీ కొడుకు కూడా ఈ బొమ్మకి బలి అవ్వొచ్చు” అని బెదిరిస్తాడు.

The Monkey Movie Explained in Telugu - Summary & Ending Explained
The Monkey Movie Explained in Telugu – Summary & Ending Explained

అదే సమయంలో రిక్కీ పోలీస్ గెటప్ లో వచ్చి హాల్ మరియు పీటీని బెదిరిస్తాడు. తను వాళ్ళిద్దర్నీ కార్లోకి ఎక్కించి బిల్ ఉండే ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. బిల్ తన ఇంటి మొత్తన్ని లాక్ చేసుకునుంటాడు. కానీ తలుపు కింద ఒక చిన్న ఎంట్రన్స్ మాత్రం ఉంటది. అందులోంచి పీటీలాంటి చిన్న పిల్లలు మాత్రమే లోపలికెళ్లగలరు. రిక్కీ పీటీతో, “నువ్వు లోపలికెళ్లి ఆ కోతి బొమ్మని దొంగతనం చేసి తీసుకురా. లేకపోతే మీ నాన్నని చంపేస్తా” అని బెదిరిస్తాడు. అప్పుడు హాల్ పీటీతో, “ఏం జరిగినా సరే నువ్వు మాత్రం బొమ్మకున్న తాళాన్ని తిప్పకు” అని అంటాడు. ఇక పీటీ ఆ చిన్న ఎంట్రన్స్ గుండా లోపలికెళ్లి బిల్ దగ్గరికి చేరుకుంటాడు.

7) ముగింపు

బిల్ పీటీతో మాట్లాడుతూ, “ఇది నా ఫేవరెట్ బొమ్మ. కానీ ఇది సరిగా పని చేయడం లేదు. నువ్వొకసారి దీని తాళాన్ని తిప్పు” అని పీటీకి బొమ్మని అందిస్తాడు. హాల్ చెప్పిన మాట గుర్తున్నా సరే, పీటీ బొమ్మ తాళాన్ని తిప్పుతాడు. ఇక వెంటనే కోతి తన డ్రమ్స్ మోగిస్తది. అప్పుడు రిక్కీ చేతిలోని తుపాకి పొరపాటున పేలడంతో ఒక బుల్లెట్ వెళ్లి కందిరీగల గూడికి తగులుతుంది. ఇంకేముంది అందులో ఉన్న కందిరీగలన్నీ రిక్కీపై దాడి చేయగా తను అక్కడికక్కడే చనిపోతాడు. బిల్ తన కొడుకుని ఏమైనా చేస్తాడేమో అని హాల్ కంగారుగా పీటీని పిలుస్తుంటాడు. బిల్ కోపంతో, “వీడింకా చావలేదా!?” అని హాల్ మీద విసుక్కుంటాడు.

బిల్ కోతి బొమ్మని పట్టుకొని హాల్ ని చంపేసెయ్ అని బలవంతంగా డ్రమ్స్ మోగించబోతాడు. కానీ అది బిల్ ని దూరంగా విసిరేస్తది. ఈసారి ఎప్పటిలాగా కాకుండా చాలా వేగంగా డ్రమ్స్ మోగుతాయి. అదే సమయంలో హాల్ ఇంట్లోకొచ్చి పీటీని చేరుకుంటాడు. ఈసారి ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా ఒక విమానమే ప్రమాదానికి గురై అందులోని ప్రయాణికులందరూ చనిపోతారు. హాల్ మాట్లాడుతూ, “ఎందుకురా ఇలా చేస్తున్నావ్” అని అంటాడు. దానికి బిల్, “నీ వల్లే కదా అమ్మ చనిపోయింది. అందుకే నిన్ను చంపి నా పగ తీర్చుకునేందుకే ఇదంతా చేశాను” అని అంటాడు.

“తను నీకే కాదు నాకు కూడా అమ్మే. నేనెందుకు కావాలని అమ్మని చంపేస్తాను. అదేదో పొరపాటున జరిగింది. అలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. అమ్మ విషయంలో నన్ను క్షమించు. ఇకపై మనిద్దరం కలిసే ఉందాం. మాతోపాటు నువ్వు కూడా ట్రిప్ కి రా” అని హాల్ అంటాడు. బిల్ కాస్త ఆలోచించి తన మనసు మార్చుకుని హాల్ తో కలిసిపోతాడు. ఆ సమయంలో కోతి బొమ్మ మళ్ళీ డ్రమ్స్ వాయిస్తది. ఇంకేముంది ఒక బౌలింగ్ బాల్ వేగంగా వచ్చి బిల్ తలకి తగలడంతో తను అక్కడికక్కడే చనిపోతాడు. ఈ బొమ్మ ఎవరి దగ్గరున్నా సరే ఏదో ఒక వినాశనానికి దారి తీస్తదని హాల్ దాన్ని తనతో పాటే జగ్రత్తగా తీసుకెళ్తాడు.

ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. కాకపోతే అసలా బొమ్మని ఎన్నిసార్లు నాశనం చేస్తున్నా సరే, అది మళ్ళీ ఏ విధంగా తిరిగొస్తుందో ఇంకాస్త స్పష్టంగా చూపించుంటే బాగుండేది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాని చూడాలనుకుంటే తప్పకుండా ఒకసారి వీక్షించండి.

Leave a Comment