Sweetheart Movie Explained in Telugu – Summary & Ending Explained
యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన “Sweetheart” అనే హార్రర్ అడ్వెంచర్ సర్వైవల్ మూవీ 5.8/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ అక్టోబర్ 22, 2019 లో విడుదలైంది. ఈ సినిమాకి J.D. Dillard దర్శకత్వం వహించారు. J. D. Dillard, Alex Hyner మరియు Alex Theurer కథని రచించడం జరిగింది. ఇక నటీనటుల విషయానికొస్తే ‘జెన్నిఫర్’ అనే ముఖ్య పాత్రలో Kiersey Clemons చాలా బాగా నటించింది. హార్రర్ అడ్వేంచర్ ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు.
ఇప్పుడు కథ చూద్దాం!
1) ప్రారంభం
ఓపెన్ చేస్తే ‘జెన్’ అనే అమ్మాయి సముద్రంలో కొట్టుకుంటూ ఒక నిర్మానుష్యమైన ద్వీపం వద్దకి చేరుకుంటది. తనతో పాటు తన స్నేహితుడు ‘బ్రాడ్’ కూడా సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి ద్వీపానికి చేరుకుంటాడు. ఒక ప్రమాదంలో తమ పడవ నాశనమవడం వల్ల వీరిద్దరు ఎలాగోలా సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకుంటారు. బ్రాడ్ శరీరంలోంచి రక్తం కారుతుండడంతో జెన్ వెంటనే బ్రాడ్ దగ్గరికెళ్తది. తీరాచూస్తే ఒక పదునైన కోరల్ బ్రాడ్ కడుపుకి బలంగా గుచ్చుకొనుంటది. జెన్ బాగా కంగారుపడిపోతూ సహాయం కోసం కేకలు వేస్తది. కానీ ఆ దీవిలో వీళ్ళు తప్పా మరెవరుండరు.
కాబట్టి జెన్ కాస్త ధైర్యం తెచ్చుకొని బ్రాడ్ కడుపులోంచి కోరల్ ని బయటకిలాగేస్తది. అప్పుడు బ్రాడ్ జెన్ తో, “నువ్వు దాన్ని చూశావా!?” అని అడుగుతాడు. కానీ జెన్ కి బ్రాడ్ దేని గురించి మాట్లాడుతున్నాడో ఏం అర్థంకాదు. బ్రాడ్ శరీరం నుంచి రక్తం ఎక్కువగా బయటికొస్తుండడంతో జెన్ ఒక గుడ్డని తన గాయం మీద గట్టిగా ఆనిస్తది. తర్వాత తను బ్రాడ్ కి నీళ్లు తెచ్చేందుకు ఒడ్డు నుంచి లోపలికెళ్తది. లక్కీగా జెన్ కి అక్కడొక కొబ్బరిబోండం కనిపిస్తది. జెన్ ఒక పదునైన రాయిని తీసుకొని కొబ్బరిబోండంని బలంగా కొట్టిద్ది. అలా చాలాసార్లు కొట్టిన తర్వాత కొబ్బరిబోండంకి చిన్న రంధ్రం పడుతుంది.
ఇక జెన్ వెంటనే బ్రాడ్ దగ్గరికొస్తది. కానీ దురదృష్టవశాత్తు తను అప్పటికే చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే, జెన్ ఆ ద్వీపాన్నంతటిని పరిశీలిస్తుండగా తనకొక ప్రదేశంలో చాలా రకాల వస్తువులు కనిపిస్తాయి. ఒక పెట్టె నిండా శీతల పానీయాలు, అగ్గి పెట్టె, పాత పుస్తకం, ఒక రకమైన మెడిసిన్… ఇలా కొన్ని ఉపయోగపడే వస్తువులు జెన్ కి కనిపిస్తాయి. వాటిని చూసిన జెన్ కి, అంటే కొన్ని నెలల క్రితం ఇక్కడికెవరో వెకేషన్ కి వచ్చినట్టుందని అర్థమవుతుంది. అలా తను ఆ వస్తువులని పరిశీలిస్తుండగా కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలేంటో, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు జెన్ ఆ శబ్దాల్ని అనుసరిస్తూ ఒక చెట్టు తొర్ర దగ్గరికి చేరుకుంటది.
2) సొరచేప – విచిత్రమైన శబ్ధాలు
ఆ తొర్రలోంచే విచిత్రంగా శబ్దాలొస్తుంటాయి. కాబట్టి దాని లోపల ఏముందో తెలుసుకునేందుకు జెన్ తొర్రలోకి చూడగా, వెంటనే ఒక పక్షి తొర్రలోంచి బయటికొస్తది. తర్వాత తను, బ్రాడ్ దగ్గరికొచ్చి తన మృతదేహాన్ని కొబ్బరిమట్టలతో కప్పేస్తుంది. ఇక చీకటి పడేందుకు కొన్ని నిమిషాలే ఉండడంతో తనొక చిన్న గుడారాన్ని ఏర్పాటుచేసుకుని ఆ రాత్రికి అక్కడే నిద్రపోద్ది. మరుసటి రోజు ఉదయం తను ప్రశాంతంగా సముద్రతీరాన నడుస్తుండగా, చాలా రకాల చేపలు ఒడ్డుపై పడుండడం కనిపిస్తది. జెన్ వెంటనే వాటి దగ్గరికెళ్లి ఆ చేపలన్నింటిని తీసుకుంటది. అయితే అక్కడే ఒక సొరచేప కూడా గాయాలతో చనిపోయి ఉండడంతో జెన్ కి కాస్త అనుమానం కలిగిద్ది.
ఏదైతేనేం తను ఆ చేపలన్నింటిని తీసుకెళ్లి ఒక పదునైన రాయితో వాటిని ముక్కలుగా చేస్తది. కొంచెంసేపటి తర్వాత తను ద్వీపాన్నంతటిని అన్వేషిస్తుండగా ఒక ప్రదేశంలో జెన్ కి కొన్ని సమాధులు కనిపిస్తాయి. దాంతో తను భయపడి, వెంటనే తన గుడారం దగ్గరికొస్తది. జెన్ ఒక సమాధిని తవ్వి అందులో బ్రాడ్ మృతదేహాన్ని పూడ్చివేస్తది. ఇక తను నిప్పును వెలిగించి తన దగ్గరున్న చేపల్ని కాల్చుకొని, ఆ పూటకి కడుపు నింపుకుంటది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జెన్ ప్రశాంతంగా నిద్రలేస్తది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే, మట్టిలో ఉండాల్సిన బ్రాడ్ మృతదేహాన్ని ఏదో భయంకరమైన మాన్స్టర్ దారుణంగా తినేసుంటది.

బ్రాడ్ సమాధి మొత్తం రక్తంతో నిండుండడంతో జెన్ ఒక్కసారిగా భయపడిపోద్ది. ఇంతకుముందు సొరచేప గాయాలతో చనిపోయి ఉండడం, ఇప్పుడు సమాధిలోని బ్రాడ్ మృతదేహాన్ని ఏదో తినేసి ఉండడంతో, ఇక్కడేదో విచిత్రంగా తిరుగుతుందని జెన్ అర్థంచేసుకుంటది. ఇక తను వెంటనే తన రక్షణ కోసం ఒక ఈటని సిద్ధం చేసుకుంటది. రాత్రి సమయంలో జెన్ నిద్రపోతుండగా, తనకి మళ్ళీ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. కానీ చుట్టుపక్కల ఎటువంటి జంతువులుగాని, దెయ్యాలుగాని కనిపించవు. మరుసటి రోజు ఉదయం, సముద్రంలో తన వస్తువులు తెలియాడుతూ కనిపించడంతో, జెన్ ఈదుకుంటూ వెళ్లి తన వస్తువుల్ని చేరుకుంటది.
3) మనుషుల్ని వేటాడే మాన్స్టర్
అప్పుడు తనకి సముద్రపు అడుగుభాగాన ఒక పెద్ద బ్లాక్ హోల్ కనిపిస్తది. జెన్ ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటది. కానీ ఎక్కువసేపు నీళ్లలో ఊపిరిబిగపట్టలేక తను వెంటనే తన వస్తువుల్ని తీసుకుని ఒడ్డుకు చేరుకుంటది. కట్ చేస్తే, రాత్రి సమయంలో ఒక విమానం ద్వీపం మీదుగా వెళ్తుండడాన్ని జెన్ గమనిస్తుంది. తను వెంటనే ఒక ఫ్లేర్ గన్ని తీసుకుని ఆకాశంలోకి షూట్ చేస్తది. కానీ విమానంలోని వ్యక్తులు తనని గమనించకుండానే వెళ్ళిపోతారు. అయితే జెన్ షూట్ చేసిన ఫ్లేర్ ఏదైతే ఉందో అది సరాసరి మాన్స్టర్ ఉండే ప్రదేశంలో కిందపడిద్ది. ఫ్లేర్ యొక్క వెలుతురు వల్ల, మాన్స్టర్ యొక్క రూపం జెన్ కి స్పష్టంగా కనిపిస్తది.
అలాంటి విచిత్రమైన జంతువుని జెన్ ఎప్పుడూ చూసుండదు. అందుకే తను బాగా భయపడిపోయి, వెంటనే ఈటెని తీసుకొని చెట్లలోకెళ్లి దాక్కుంటుంది. మాన్స్టర్ సముద్రంలోంచి బయటికొచ్చి ఒడ్డు మీద అడుగుపెట్టిద్ది. అది జెన్ కోసం ద్వీపమంతా వెతికిద్ది. కానీ దానికి జెన్ ఎక్కడా కనిపించదు. దాంతో అది సముద్రంలోకెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదమని, ఎలాగైనా ఈ ద్వీపం నుంచి బయటపడాలని జెన్ నిర్ణయించుకుంటది. తను తన సూట్కేస్ ని పడవలాగా ఉపయోగిస్తూ సముద్రంలో కొంత దూరం వెళ్తది. కానీ ఆ సూట్కేస్ తన బరువుని తట్టుకోలేక నీళ్ళలో మునిగిపోతుంటది.
దాంతో తను కోపంతో సముద్రంనుంచి ఒడ్డుకొస్తది. కట్ చేస్తే సమయం రాత్రి అవుతుంది. సురక్షితంగా నిద్రపోయేందుకు జెన్ ఒక పతకం వేసి చెట్టు తొర్రలోకి ప్రవేశిస్తది. కానీ ఆ మాన్స్టర్ నీళ్ళలోంచి బయటికొచ్చి, సరాసరి జెన్ దాక్కున్న తొర్ర వద్దకే వెళ్తది. తినడానికి ఆహారమేమీ దొరకలేదేమో, మాన్స్టర్ కోపంతో జెన్ ఉన్న చెట్టు తొర్రపై బలంగా దాడిచేస్తది. ఒక పక్క పిచ్చ భయమేస్తున్నా సరే, జెన్ మాత్రం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా దాక్కొనుంటది. తను ఎక్కడా కనిపించకపోవడంతో మాన్స్టర్ మళ్ళీ నీళ్లలోకెళ్ళిపోద్ది. మరుసటి రోజు ఉదయం జెన్ ఒక పతకమేసి తెలివిగా ఒక చేపని పట్టుకుంటది. కానీ ఆ చేప తను తినేందుకు కాదు, మాన్స్టర్ కి ఎరగా వేసేందుకు.
4) జెన్ పై మాన్స్టర్ దాడి
జెన్ ఆ చేపని ఒక చెట్టుకి వేలాడదీసి, తనొక గుంతలో దాక్కుని మాన్స్టర్ కోసం ఎదురుచూస్తుంటది. కానీ కన్ను మూసి తెరిచేలోపే మాన్స్టర్ ఒడ్డుకొచ్చి చేపను తినేసి వెళ్ళిపోద్ది. అందువల్ల జెన్ ఆ మాన్స్టర్ ని చూడలేకపోద్ది. మరుసటి రోజు ఉదయం ‘జాక్’ మృతదేహం సముద్రంలో తేలియాడుతూ ద్వీపానికి చేరుకుంటది. ఈ జాక్ కూడా జెన్ యొక్క స్నేహితుడే. ఈసారి తను జాక్ మృతదేహాన్ని ఎరగా వేలాడదీసి గుంతలో దాక్కుంటది. నిన్నటిలాగానే ఈరోజు కూడా మాన్స్టర్ ఒడ్డుకొచ్చి జాక్ బాడీని తింటుంటది. సరిగ్గా అదే సమయంలో ఒక విమానం ద్వీపం మీదుగా వెళ్తుంటది.
గుంతలో నుంచి బయటికొచ్చి సహాయం కోరుదామనుకుంటే మాన్స్టరేమో గుంత దగ్గరే నిలబడుంటది. కాబట్టి ఏం చేయలేని నిస్సహాయస్థితిలో జెన్ సైలెంట్ గా ఉండిపోద్ది. మరుసటి రోజు ఉదయం మాన్స్టర్ నుంచి సురక్షితంగా ఉండేందుకు తనొక ఊయలలాంటి షెల్టర్ ని ఏర్పాటుచేసుకుంటది. అలా ఆ రోజు రాత్రికి తను ప్రశాంతంగా ఊయలలో పడుకుంటది. కానీ ఎప్పటిలాగే ఈరాత్రి కూడా మాన్స్టర్ సముద్రంలోంచి బయటికొస్తది. ఈసారి అది జెన్ని చూసేసి తన ఊయలపై దాడి చేస్తది. జెన్ భయంతో ఈటను అందుకని మాన్స్టర్ నుంచి దూరంగా పారిపోద్ది. కానీ అది మాత్రం తనని అస్సలు వదిలిపెట్టదు, పరిగెత్తుకుంటూ వచ్చి మరీ జెన్ పై దాడిచేస్తది. జెన్ తన ఈటతోటి మాన్స్టర్ ని బలంగాగుచ్చిద్ది.

అయినా సరే అది తనని తినడానికి ప్రయత్నిస్తుండగా, ఆకాశంలో గట్టిగా ఒక ఉరుము ఉరమడంతో మాన్స్టర్ తనని వదిలేసి సముద్రంలోకెళ్ళిపోద్ది. కట్ చేస్తే, మరుసటి రోజు ఉదయం జెన్ తన గాయాల్ని పరిశీలిస్తుండగా, దూరంగా సముద్రంలో ఒక రాఫ్ట్ తేలాడుతుంటది. జెన్ దాన్ని గమనించి వేగంగా ఈత ఈదుతూ రాప్ట్ వద్దకు చేరుకుంటది. తీరాచూస్తే అందులో ఇద్దరు మనుషులుంటారు. ఒకరు జెన్ బాయ్ ఫ్రెండ్ ‘లూకస్’ మరొకరు బ్రాడ్ గర్ల్ ఫ్రెండ్ ‘మియ’. తన స్నేహితులు కొంతమందైనా బ్రతికున్నందుకు జెన్ కాస్త సంతోషపడిద్ది. వీరంతా జాలీగా పార్టీ చేసుకునేందుకు సముద్రంలోకొస్తారు.
5) జెన్ స్నేహితులు
కానీ అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ ఏర్పడడంతో వీళ్ళ పడవలన్నీ నాశనమవుతాయి. అందుకనే వీళ్ళు రాఫ్ట్స్ ద్వారా ప్రాణాల్ని దక్కించుకుంటారు. మిగతా స్నేహితులేమో ప్రాణాలతో బయటపడలేకపోతారు. జెన్, లూకస్ మరియు మియకి మాన్స్టర్ గురించి చెప్పి, “మనమీ దీవిలో ఉండడం అసలు మంచిది కాదు. మనం వెంటనే రాఫ్ట్ లో ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి” అని అంటది. కానీ మాన్స్టర్ గురించి జెన్ చెప్పిన ఏ విషయాల్ని లూకస్, మియ అసలు నమ్మరు. ఇక్కడ మాన్స్టర్ ఉండడమేంటని కామెడీగా తీసుకుంటారు.
గత కొన్ని రోజులుగా సముద్రంలో నీళ్లపై తేలాడుతూ ఇప్పుడే మట్టిపై కాలు పెట్టారు కదా! కాబట్టి మళ్ళీ రాఫ్ట్ లోకెక్కి సముద్రంలోకెళ్లేందుకు వాళ్ళిద్దరు అసలు ఒప్పుకోరు. “ఇక్కడ నిజంగా మాన్స్టర్ ఉంది. అదే బ్రాడ్ మృతదేహాన్ని కూడా తినేసింది. మనమిక్కడే ఉంటే అది మనల్ని కూడా తినేస్తది” అని జెన్ అంటది. “అంటే బ్రాడ్ చనిపోయాడా!?” అని మియ చాలా బాధపడిద్ది. అయినాసరే మాన్స్టర్ ఉందన్న విషయాన్ని మాత్రం వారిద్దరు ఎంతకీ నమ్మరు. కట్ చేస్తే, లూకస్ దగ్గరున్న మల్టీ టూల్ కి రక్తపు మరకలు ఉండడాన్ని జెన్ గమనిస్తుంది. అందువల్ల తనకెందుకో లూకస్ పై కాస్త అనుమానం కలిగిద్ది.
కొంచెంసేపటి తర్వాత లూకస్ మరియు మియ ప్రశాంతంగా ఒడ్డున కూర్చుని సముద్రం వైపు చూస్తూ మాట్లాడుకుంటుంటారు. జెన్ ఎంత చెప్తున్నా వాళ్ళిద్దరు తన మాటల్ని పట్టించుకోరు కదా! అందువల్ల జెన్ రహస్యంగా కొంత ఆహారాన్ని రాఫ్ట్ లోకెక్కించి రాఫ్ట్ ని సముద్రంలోకి నెడుతుంటది. కానీ వారిద్దరు జెన్ చేస్తున్న పనిని చూసేస్తారు. జెన్ వేగంగా రాఫ్ట్ లోకెక్కి ద్వీపం నుంచి బయటపడాలని చూస్తది. అంతలోపే లూకస్, మియ పరిగెత్తుకొని వచ్చి తనని రాఫ్ట్ లో నుంచి దించేస్తారు. ఆ సమయంలో మియ ఒక తెడ్డు కర్రతో జెన్ తలపై బలంగా కొట్టడంతో తను స్పృహ కోల్పోతుంది.
6) ఒకరు బలి
కట్ చేస్తే, జెన్ మెలకువలోకొచ్చేసరికి తన చేతులు తాళ్లతో బంధించబడుంటాయి. ఏదైనా విమానంగాని లేదా పడవగాని అటువైపు వచ్చినప్పుడు మంట ద్వారా సిగ్నల్ చూపించి జాగ్రతగా ఇక్కడినుంచి బయటపడొచ్చు. అంతేగాని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడమెందుకు అనేది లూకస్, మియల ఆలోచన అనమాట. వీళ్ళకేం తెలుసు రాత్రయితే మాన్స్టర్ సముద్రంలోంచి బయటకొస్తదని. జెన్ తన చేతుల్ని తాళ్ళ నుంచి విడిపించమని అడిగిద్ది, కానీ వాళ్ళు మాత్రం తన చేతుల్ని విడిపించరు. కట్ చేస్తే, మియ సముద్రతీరాన ప్రశాంతంగా నడుస్తుంటది. అప్పుడు హఠాత్తుగా మాన్స్టర్ బయటికొచ్చి మియపై దాడి చేస్తది. తన అరుపులు విన్న లూకస్, వెంటనే జెన్ దగ్గర్నుంచి మియా వద్దకి పరుగుతీస్తాడు.
అంటే మాన్స్టర్ గురించి జెన్ చెప్పిన విషయాలన్నీ నిజమేనా! అని అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. లూకస్ మియని రక్షించేందుకు ఒక దివిటిని తీసుకుని మాన్స్టర్ పై దాడి చేస్తాడు. కానీ అది లూకస్ ని ఒక తోపు తోసి మియని తీసుకుని సముద్రంలోకెళ్ళిపోద్ది. దాని దెబ్బకి లూకస్ కి జ్ఞానోదయం కలిగిద్ది. జెన్ తన చేతుల్ని తాళ్ళ నుంచి విడిపించుకుని వచ్చేసరికి అంతా ముగిసిపోద్ది. మరుసటి రోజు ఉదయం రాఫ్ట్ ద్వారా ద్వీపం నుంచి బయటపడేందుకు లూకస్ ఒప్పుకుంటాడు. ఇక వారిద్దరు తమకు కావాల్సిన వస్తువుల్ని అలాగే కొన్ని చేపల్ని రాఫ్ట్ లోకి ఎక్కించి ద్వీపం నుంచి బయల్దేరతారు.

రాఫ్ట్ లోపల రక్తపు మరకలు ఉండడంతో జెన్ కి కాస్త అనుమానం కలిగిద్ది. లూకస్ దగ్గరున్న మల్టీ టూల్ కి రక్తపు మరకలుండడాన్ని ఇంతకుముందు జెన్ చూసింది కదా! “అంటే… బహుశా, జాక్ ని చంపింది లూకస్” అని జెన్ లూకస్ పై అనుమానపడిద్ది. పగటిపూట మాన్స్టర్ బయటికిరాదులే అని జెన్ అనుకుంటది. అలా వాళ్ళద్దరు రాఫ్ట్ లో వెళ్తుండగా మాన్స్టర్ వాళ్ళ రాఫ్ట్ కిందే తిరుగుతుంటది. దాన్ని చూసిన లూకస్ ఒక్కసారిగా భయపడిపోయి, “అది పగటిపూట బయటికిరాదని చెప్పావుగా” అని జెన్ తో అంటాడు. మాన్స్టర్ తమ రాఫ్ట్ కిందే తిరుగుతుందడంతో వాళ్ళిద్దరికీ భయంతో వణుకుపుడుతుంటది. మాన్స్టర్ హఠాత్తుగా రాఫ్ట్ ని చీల్చుకుని లోపలికొచ్చేస్తది.
7) ముగింపు
అది తమని తినబోతుండగా లూకస్ వెంటనే ఫ్లేర్ గన్ అందుకొని మాన్స్టర్ నోట్లోకి షూట్ చేస్తాడు. దాంతో అది వాళ్ళని వదిలేసి నీళ్ళలోకెళ్ళిపోద్ది. కొంచెంసేపు అంతా ప్రశాంతంగా ఉంటది. కానీ మాన్స్టర్ మళ్ళీ సడన్ ఎంట్రీ ఇచ్చి జెన్ని సముద్రంలోకి లాకెళ్ళిపోద్ది. తనని కాపాడేందుకు లూకస్ నీళ్లలోకి దూకుతాడు. జెన్ తన దగ్గరున్న చిన్నపాటి కత్తితో మాన్స్టర్ ని బలంగా పొడుస్తది. దాంతో అది జెన్ని వదిలేసి లూకస్ ని పట్టుకుంటది. కొన్ని క్షణాల్లోనే మాన్స్టర్ లూకస్ ని బ్లాక్ హోల్ లోకి లాకెళ్ళిపోద్ది. జెన్ బాధతో నీళ్లలో ఈదుకుంటూ మళ్ళీ ద్వీపానికి చేరుకుంటది.
కట్ చేస్తే జెన్ కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ మాన్స్టర్ ని ఎలాగైనా చంపేయాలని బలంగా నిర్ణయించుకుంటది. మాన్స్టర్ ని చంపే ప్రయత్నంలో, పొరపాటున మాన్స్టర్ చేతిలో జెన్ చనిపోవచ్చు. కాబట్టి ఎలాగైనా సరే, ఆ మాన్స్టర్ గురించి జనాలకు తెలియాలన్న ఉద్దేశంతో, ఇంతకుముందు తనకి దొరికిన పాత పుస్తకంలో జెన్ ఆ మాన్స్టర్ గురించిన విషయాలన్నింటిని రాస్తది. ఇక తన ప్లాన్ లో భాగంగా పెద్ద మొత్తంలో ఈటల్ని తయారుచేస్తది. అంతేకాదు తను ఇంతకుముందు చూసిన ఆ సమాధుల దగ్గరికెళ్లి, భూమిలో ఉన్న అస్తిపంజరాలని బయటకి తీసి ఆ ఎముకల్ని ఆయుధాలుగా మార్చుకుంటది. ఆ సమాధుల్లోని వ్యక్తుల్ని కూడా ఆ మాన్స్టరే చంపేసుండొచ్చు.
కట్ చేస్తే చీకటిపడిన తర్వాత ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మాన్స్టర్ సముద్రంలోంచి బయటికొస్తది. అది బయటికొచ్చిన వెంటనే జెన్ తను ఏర్పాటుచేసిన ట్రాప్స్ అన్నింటికీ మంట వెలిగిస్తది. అలా మాన్స్టర్ నిప్పుల మధ్య చిక్కుకునిపోద్ది. ఇదే సరైన సమయమని జెన్ ఈటల్ని, ఎముకల్ని చేత పట్టుకొని మాన్స్టర్ ని విపరీతంగా పొడిచేస్తది. ఆ మాన్స్టర్ యెుక్క రక్తం ఎర్రగా కాకుండా నలుపు రంగులో ఉంటది. జెన్ దాన్ని చంపేందుకు విపరీతంగా ప్రయత్నిస్తది. కానీ అది బలం పుంజుకొని జెన్ పైకి ఎదురుమల్లిద్ది. అయినా సరే జెన్ వెనకడుగు వేయదు. చేతికందిన ప్రతి ఈటని, ప్రతి ఎముకని అందుకొని మాన్స్టర్ పై పదే పదే దాడిచేస్తది. అలా చివరికి మాన్స్టర్ చనిపోతుంది.
ఈ సినిమాలోని పాత్రల భావోద్వేగాలు, కథలోని మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నాకైతే ఈ సినిమా ఒక మంచి అనుభవాన్ని కలిగించింది, కాకపోతే మాన్స్టర్ ని ఇంకాస్త స్పష్టంగా చూపించుంటే బాగుండేది. ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే, ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.
