Subservience (2024) Plot Summary Explained in Telugu
కాలం మారే కొద్ది టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీ అనేది మనుషులకి ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. కానీ అదే టెక్నాలజీ ఒక రోజు మన మీద నియంత్రణ సాధిస్తే? మనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనల్ని మించి ఆలోచించడం మొదలుపెడితే? ఊహించడానికే కాస్త భయంగా ఉంది కదా! ఇలాంటి ఆలోచనతోనే 2024లో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే “Subservience”. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.
ఇందులో ఒక అందమైన కుటుంబం ఉంటది. తమకి ఇంటి పనుల్లో సహాయంగా ఉండేందుకు ఒక అత్యాధునిక AI రోబోను కొంటారు. ఈ రోబో ఇంటి పనులు మాత్రమే కాదు, లైంగిక పనులు కూడా చేయగలదు. అంటే చూడండి టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందో. మొదట ఆ రోబో మర్యాదగా ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ కుటుంబ సభ్యులకి చాలా సహాయకారిగా ఉంటది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ రోబోకి తన యజమాని మీద కామ కోరికలు కలుగుతాయి. అలాగే అది మనుషులకి ఎదురుతిరగడం కూడా మొదలుపెట్టిద్ది. వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది కదా! మరి ఈ రోబో కథేంటో, దాని వల్ల ఏర్పడిన సమస్యలేంటో చూసేద్దాం రండి!
కథ ఏంటంటే!
1) ఇంటికి రోబో రావడం
ఓపెన్ చేస్తే ఒక అందమైన ఫ్యామిలీ. ‘నిక్’, ‘మ్యాగీ’ భార్యాభర్తలు. వీళ్లకి ఇద్దరు పిల్లలు. పాప పేరు ‘ఐలా’, బాబు పేరు ‘మాక్స్’. ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి అనారోగ్యం రూపంలో ఒక సమస్య వస్తది. మ్యాగీకి హార్ట్ ప్రాబ్లమ్ అని తెలియడంతో నిక్ వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మ్యాగీని హాస్పిటల్లో చేర్పించినప్పటి నుంచి నిక్ ఒక్కడే ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకుంటూ అలాగే ప్రతి రోజూ పనికెళ్తూ హడావిడిగా ఉంటుంటాడు. కాబట్టి ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకునేందుకు ఎవరైనా తోడుంటే బాగుంటదని నిక్ కి ఆలోచన వస్తది. అలా నిక్ ఒకరోజు కొబోల్ ఇండస్ట్రీస్ కి వెళ్తాడు.
ఇక్కడ AI టెక్నాలజీ కలిగిన అడ్వాన్స్డ్ సిమ్స్ అమ్ముతుంటారు. ఇక్కడ సిమ్స్ అంటే రోబోట్స్ అని అర్థం. ఇవేమీ మామూలు రోబోట్స్ కాదు. ఇవి చూడ్డానికి అచ్చం మనుషుల్లాగే ఉంటయ్. ఇవి ఇంటి పనులు మాత్రమే కాదు, ఒంటి పనులు కూడా చేయగలవు. అలాగే ఇవి మనుషుల భావోద్వేగాల్ని కూడా బాగా అర్థం చేసుకోగలవు. కాబట్టి ఏ రోబోని కొనాలని నిక్ ఆలోచిస్తుండగా, ఐలాకి ఒక రోబో బాగా నచ్చిద్ది. “దీన్నే కొందాం నాన్నా” అని ఐలా అడగడంతో నిక్ ఆ రోబోని కొనేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం డెలివరీ ఏజెంట్స్ నిక్ ఇంటికి రోబోని డెలివరి చేస్తారు.
ఆ రోబోకి ఎటువంటి పేరు లేకపోవడంతో, ఐలా దానికి ‘ఆలిస్’ అనే పేరు పెట్టిద్ది. ఆలిస్ నిక్ తో, “మీ డైలీ షెడ్యూల్స్ ఏంటో చెప్పండి. దానికి తగ్గట్టుగా పనులన్నిటిని సమయానికి చేస్తా” అని అంటది. చెప్పినట్టుగానే ఆలిస్ నిమిషాల్లోనే వస్తువులన్నింటిని సర్ది, ఇళ్ళంతటిని శుభ్రం చేస్తది. ఆలిస్ యొక్క పనితనం చూసి నిక్ షాకైపోతాడు. ఈ రోబోట్స్ కి ఉండే ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, వీటికేమైనా దెబ్బలు తగిలినా, లేదా చర్మం ఎక్కడైనా కోసుకుపోయిన సరే ఎటువంటి సమస్య ఉండదు. కేవలం ఒక బ్యాండేజ్ ని దెబ్బ తగిలిన చోటగాని, చర్మం కోసుకుపోయిన చోటగాని అతికించి, కొన్ని సెకండ్స్ తర్వాత బ్యాండేజ్ తీసేస్తే సరి. గాయం వెంటనే మానిపోద్ది.

2) రోబో పనితనం
ఒకరోజు నిక్ ఫ్యామిలీతో పాటు ఆలిస్ కూడా హాస్పిటల్లో ఉన్న మ్యాగీని కలిసేందుకు వెళ్తది. మ్యాగీ నిక్ తో, “నేను మిమ్మల్ని ప్రతిరోజూ గుర్తుచేసుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఇంటికొచ్చేసి మీతో గడపాలని ఉంది” అని అంటది. “సర్జరీ లిస్టులో నీ పేరు మొదట్లోనే ఉంది, కాబట్టి త్వరగానే సర్జరీ పూర్తయిద్ది. నువ్వు ఇంటికి కూడా వెంటనే వచ్చేయొచ్చు” అని నిక్ తనకి ధైర్యం చెప్తాడు. నిక్ కంస్ట్రక్షన్ విభాగంలో పని చేస్తుంటాడు. తనతో పాటు చాలామంది వ్యక్తులు కూడా కంస్ట్రక్షన్ విభాగంలో పని చేస్తుంటారు. వారందరితో నిక్ కి మంచి స్నేహం ఉంటది.
‘లూయిస్’ కొబోల్ కంపెనీ వ్యక్తుల్ని సైట్ వద్దకి తీసుకొచ్చి వాళ్ళకి తమ కంస్ట్రక్షన్ సైట్ గురించి వివరాలు చెప్తుంటాడు. అప్పుడు నిక్ కి కాస్త అనుమానం వస్తది. తను లూయిస్ ని పక్కకు తీసుకెళ్లి, ఎంతమందిని పనిలోంచి తీసేయబోతున్నారని అడుగుతాడు. “మొత్తం అందర్ని తీసేస్తున్నాం. వాళ్లకి బదులుగా వచ్చేవారం నుంచి రోబోట్స్ ని పనిలోకి పెట్టబోతున్నాం. కాకపోతే సైట్ వద్ద రోబోల్ని జాగ్రతగా చూసుకునేందుకు ఒక మనిషి కావాలి. కాబట్టి నిన్ను మాత్రమే పనిలోంచి తీసేయడం లేదు” అని లూయిస్ అంటాడు. అంటే అభివృద్ధిలో భాగంగా మనుషుల్ని పనిలోంచి తీసేసి AI రోబోలని పనిలో పెడతారనమాట.
తనతో పని చేసే వ్యక్తులతో నిక్ కి మంచి స్నేహం ఉంది కదా. కాబట్టి తను లూయిస్ పై కోప్పడి, “నువ్వు నన్ను పనిలోంచి తీసేయకపోయినా సరే, అందరితోపాటు నేను కూడా ఇక్కడినుంచి వెళ్లిపోతా” అని అంటాడు. కాకపోతే మ్యాగీ ఆపరేషన్ కి డబ్బులు కావాలి కదా. కాబట్టి చేసేదేం లేక రోబోల్ని చూసుకునేందుకు నిక్ ఒప్పుకుంటాడు. కొంచెంసేపటి తర్వాత నిక్ ఇంటికొచ్చేసి “కాసబ్లాంక” అనే సినిమాని చూస్తుంటాడు. అది తన ఫేవరెట్ మూవీ. ఆలిస్ కి ఆ సినిమా యెుక్క కథేంటో తెలుసు. కానీ తను నిజానికి ఆ సినిమాని చూసుండదు. నిక్ ఆలిస్ తో, “కథ తెలిస్తే సరిపోదు. సినిమాని కళ్ళతో చూసి మనసారా అనుభవించాలి. కాబట్టి నీ మెదడులో ఉన్న ఈ మూవీ సమాచారమంతటినీ తీసెసెయ్” అని అంటాడు.
3) నిక్ పై రోబోకి ప్రేమ కలగడం
ఆలిస్ కి నిక్ ప్రైమరీ యూజర్ మరియు ఓనర్. కాబట్టి నిక్ ఏది చెప్తే ఆలిస్ అది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి తన మెదడులో ఉన్న కాసబ్లాంక మూవీ సమాచారాన్ని తుడిపేసేందుకు ఆలిస్ ఒప్పుకుంటది. ఆలిస్ మెడ దగ్గరున్న పవర్ బటన్ ని ఏడు సెకండ్ల పాటు నిక్ ప్రెస్ చేసి పట్టుకుంటాడు. దాంతో ఆలిస్ రీస్టార్ట్ అవ్వడం జరిగిద్ది. అలాగే తన మెదడులో ఉన్న కాసబ్లాంక సినిమా సమాచారమంతటిని ఆలిస్ తుడిపేసుకుంటది. ఇక తను నిక్ తో కలిసి సినిమా చూడడం మొదలుపెట్టిద్ది. ఆ సమయంలో మ్యాగీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, “మనకి హార్ట్ దొరికింది, రేపే నాకు సర్జరీ చేయబోతున్నారు” అని అంటది. అది విని నిక్ చాలా సంతోష పడతాడు.
మరుసటి రోజు ఉదయం అందరూ హాస్పిటల్ కి వెళ్తారు. మ్యాగీ ఆలిస్ తో మాట్లాడుతూ, “ఒకవేళ సర్జరీ సరిగ్గా జరగక నేను చనిపోతే, నువ్వే నిక్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిక్ పిల్లల్ని బాగానే చూసుకుంటాడు, కానీ తన గురించి తాను అస్సలు పట్టించుకోడు. కాబట్టి నువ్వు నిక్ ని జాగ్రత్తగా చూసుకో” అని బాధపడుతూ చెప్పిద్ది. అందుకు ఆలిస్ కూడా ఒప్పుకుంటది. ఇక మ్యాగీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. సర్జరీకి ఉపయోగించబోయే హార్ట్ ని వేరే చోట నుంచి విమానంలో హాస్పిటల్ కి తీసుకొస్తుంటారు. అయితే అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ మార్గమధ్యంలో ఏర్పడడంతో సరైన సమయానికి హార్ట్ ని హాస్పటల్ కి తీసుకురాలేకపోతారు.

అలా సర్జరీ మొదలవ్వక ముందే ఆగిపోద్ది. ఏంటి ఈ విధంగా జరిగిందని అందరూ బాగా బాధపడతారు. కట్ చేస్తే అందరూ ఇంటికొచ్చేస్తారు. నిక్ గరాజ్ లోకి వెళ్లి కారుని రిపేర్ చేస్తూ సర్జరీ గురించి ఆలోచిస్తూ బాగా చిరాకుపడుతుంటాడు. ఆ సమయంలో ఆలిస్ తన దగ్గరికొచ్చి, “నువ్వు చాలా బాధలో ఉన్నవ్. నీ బాధని నేను తగ్గిస్తా” అని చెప్పి ఆలిస్ నిక్ ని ముట్టుకుంటది. నిక్ మాత్రం, నేను మ్యాగీని మోసం చేయలేనని చెప్పి తన దగ్గర్నుంచి దూరంగా వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత నిక్ తన స్నేహితులతో కలిసి బార్ లో మందు తాగుతుంటాడు. ప్రస్తుతం తమని పనిలోంచి తీసేసి తమ స్థానంలో రోబోల్ని నియమించినందుకు కంస్ట్రక్షన్ కంపెనీ మీద అలాగే రోబోల మీద ‘మాంటి’ చాలా కోపంగా ఉంటాడు.
4) రోబోలపై దాడి
తన కోపాన్నంతటిని తీర్చుకునేందుకు నిక్ ని తీసుకుని మాంటి సైట్ వద్దకి వెళ్తాడు. “దయచేసి నా మాట విను, మనమిక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదైనా తేడా జరిగితే సమస్యల్లో చిక్కుకుంటాం” అని నిక్ అంటాడు. కానీ మాంటి మాత్రం తన మాటల్ని పట్టించుకోడు. పగటి పూట పని ముగిసిన తర్వాత రోబోలన్నీ ఒక కంటైనర్ లోకి వెళ్తాయి. మాంటి కంటైనర్ తెరిచి, తమ పనిని లాక్కున్న రోబోట్స్ అన్నింటిపై కోపంతో దారుణంగా దాడి చేస్తాడు. “కొంప ముంచావ్ కదరా బాబు” అని అనుకొని నిక్ చాలా కంగారుపడిపోతాడు. కట్ చేస్తే నిక్ ఇంటికొచ్చేసి స్నానం చేస్తుంటాడు. అప్పుడు ఆలిస్ టవల్స్ తీసుకొని లోపలికొస్తది. ఇదేంట్రా బాబు ప్రతి చోటకి వస్తుందనుకుని నిక్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతాడు.
నిక్ కాస్త ఒత్తిడిలో ఉన్నాడని అర్థంచేసుకుని ఆలిస్ తనకి రొమాన్స్ ఆఫర్ చేస్తది. కానీ తను మాత్రం అందుకు ఒప్పుకోడు. అప్పుడు ఆలిస్, “నువ్వు నీ కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నావ్. నీకోసం నన్ను ఈ ఒక్క పని చేయనివ్వు” అని అంటది. తను నిక్ కళ్ళకి గంతలు కట్టి, మ్యాగీ స్వరంతో మాట్లాడుతూ సెడ్యూస్ చేయడం మొదలుపెట్టిద్ది. అలా వారిద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నిక్ కాస్త భాదపడతాడు. ఆలిస్ వంటగదిలో వంట చేస్తుండగా నిక్ తన దగ్గరికి వెళ్లి, “నిన్న పొరపాటున అలా జరిగింది. ఇంకోసారి మనం ఆ విధంగా చేయకూడదు” అని అంటాడు.
అప్పుడు ఆలిస్, “నువ్వు నాతో కలిసినప్పుడు నీ ఒత్తిడి బాగా తగ్గింది కదా! మరి ఎందుకు వద్దంటున్నావ్” అని అడిగిద్ది. “నాకొక ఫ్యామిలీ ఉంది. కాబట్టి నేనిలా చేయకూడదు. నువ్విక దీని గురించి మర్చిపో” అని నిక్ అంటాడు. ఇక తను ఐలాని స్కూల్ దగ్గర వదిలిపెట్టి సైట్ వద్దకి వెళ్తాడు. అప్పటికే సైట్ వద్ద చాలా మంది గుమిగూడి ఉంటారు. నిక్ లూయిస్ తో, “ఏంటి ఇక్కడ ఏం జరిగింది” అని అడుగుతాడు. లూయిస్ నిక్ ని పక్కకు తీసుకెళ్ళి, “ఎవరో కంటైనర్ తెరిచి రోబోలపై దాడి చేసి వాటిని నాశనం చేశారు. దీని గురించి నీకేమైనా తెలుసా” అని అడుగుతూ లూయిస్ నిక్ మీద కాస్త అనుమానపడతాడు. “నిన్న రాత్రి నేను మ్యాగీకి తోడుగా హాస్పటల్లో ఉన్నా. అసలు నాకూ, ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు” అని నిక్ అంటాడు. అదే సమయంలో మ్యాగీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, “సర్జరీ కోసం హార్ట్ దొరికింది” అని అంటది.
5) ముగింపు
చూశారు కదా కథ ఎంత రసవత్తరంగా మారుతుందో! కథ ముందుకెళ్ళే కొద్దీ మరికొన్ని ట్విస్టులు కూడా రివీల్ అవుతాయి. మొత్తానికి ఇదొక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.
- నాకైతే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. మనిషి మరియు టెక్నాలజీ మధ్య ఉన్న సంబంధం గురించి బాగా చూపించారు.
- మనం టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నామా? లేక అది మనల్ని కంట్రోల్ చేస్తున్నదా? అనే ప్రశ్న సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి మెదడులో ఖచ్చితంగా మెదిలిద్ది.
- ఒకవేళ భవిష్యత్తులో ఇలా రోబోలు గనక సొంతగా ఆలోచించడం మొదలుపెడితే చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో, ఇటువంటి AI రోబోలు మనుషులకి అందుబాటులోకి వచ్చే సమయం చాలా దగ్గర్లోనే ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ సినిమాని చూసేయండి!
