Sting (2024) Plot Summary Explained in Telugu
సాధారణంగా దయ్యాల కథలు, జాంబీల కథలు ప్రేక్షకుల్ని బాగా భయపెడుతుంటాయి. కానీ 2024లో విడుదలైన “స్టింగ్” అనే సినిమాలో మాత్రం ఒక సాలీడు ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమయింది. మామూలుగా… సాలీడు అంటే మనకు గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్పైడర్ మాన్. స్పైడర్ మాన్ అంటే అందరికీ ఇష్టమే. స్పైడర్ మాన్ చేసే సాహసాలు, సహాయాలంటే ఎంతో మందికి అభిమానం కూడా. కానీ ఈ సినిమాలో ఉండే సాలీడు అలాంటిలాంటి సాలీడు కాదు. దీనికి గనక మనుషులు కనిపించారంటే వాళ్లని ఆరగించేదాకా వదిలిపెట్టదు. అసలు ఇలాంటి భయంకరమైన సాలీడు ఎక్కడినుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తాయో మనం ఈరోజు తెలుసుకుందాం!
ఇక కథలోకి వెళ్దాం!
గోడల్లోంచి శబ్దాలు
‘హెల్గా’ అనే ముసలావిడ ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఒక స్వెటర్ కుడుతుంటది. ఆ సమయంలో ఇంటి గోడల్లోంచి కాస్త విచిత్రంగా శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాల్ని విన్న హెల్గా ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ‘ఫ్రాంక్’ అనే వ్యక్తికి ఫోన్ చేస్తది. “మా ఇంటి గోడల్లోంచి విచిత్రంగా శబ్ధాలు వస్తున్నాయి, మీరిక్కడికి త్వరగా వచ్చి అవేంటో ఒకసారి చూడండి” అని హెల్గా అంటది. “ఒకవేళ అవి ఎలుకలై ఉండొచ్చు. నేనొచ్చి వాటి సంగతి చూస్తా” అని ఫ్రాంక్ అంటాడు. చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లోనే తను అపార్ట్మెంట్ వద్దకి చేరుకుంటాడు. అక్కడ ‘బగ్ బ్రదర్స్’ యొక్క వ్యాన్ కూడా ఉండడంతో, “నా ఏరియాలో వీళ్లకేం పని” అని ఫ్రాంక్ కాస్త చిరాకు పడతాడు.
ఫ్రాంక్ బిల్డింగ్ లోకెళ్లి హెల్గాతో మాట్లాడుతూ, “మీరు బగ్ బ్రదర్స్ కంపెనీకి ఎందుకు ఫోన్ చేశారు. వాళ్ళు నిజంగా బ్రదర్స్ కాదు. నిజానికి వాళ్ళు జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్. ఒకసారి వాళ్ళు జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఇంకోసారి వాళ్లని పనికి పిలవకండి, వాళ్ళు మీ వస్తువులని కూడా దొంగతనం చేస్తారు” అని అంటాడు. అప్పుడు హెల్గా, “నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్? నేనెవరికీ ఫోన్ చేయలేదు, నువ్విక్కడికి ఎందుకొచ్చావ్?” అని అంటది. అంటే హెల్గాకి డమెన్షియా అనే డిసార్డర్ ఉంటది. అందువల్ల తను కొన్ని క్షణాల క్రితం జరిగిన విషయాల్ని కూడా వెంటనే మర్చిపోద్ది. “మీ గోడలోంచి విచిత్రంగా శబ్ధాలు వస్తున్నాయని ఫోన్ చేసి పిలిచింది నువ్వేగా” అని ఫ్రాంక్ గుర్తుచేస్తాడు.
అదే సమయంలో లోపలినుంచి మరోసారి విచిత్రంగా శబ్దాలు రావడంతో, అవును మా గోడల్లోంచి శబ్దాలు వస్తున్నాయని హెల్గా అంటది. “సరిపోయింది రా బాబు” అని అనుకుని ఫ్రాంక్ లోపలికెళ్లి అక్కడంతా ఎలుకల కోసం వెతుకుతాడు. అప్పుడు తనకి ఎలుకలు కాదు, కొణప్రానంతో రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న బగ్ బ్రదర్స్ యొక్క ఏజెంట్ కనిపిస్తాడు. ఏంట్రా వీడికేమైందని అనుకుంటూ ఫ్రాంక్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ సమయంలో ఒక విచిత్రమైన క్రియేచర్ ఫ్రాంక్ పై దాడి చేసి తనని వెంట్స్ లోకి లాక్కెళ్లిపోద్ది. ఆ సీన్ చూసిన హెల్గా ఒక్కసారిగా భయపడిపోద్ది. కానీ తను ఆ విషయాన్ని కొన్ని క్షణాల్లోనే మర్చిపోయి ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని టీవీ చూస్తది.
అంతరిక్షం – భూమి
అసలా క్రియేచర్ ఏంటి, అది మనుషుల్ని ఎందుకు తింటుందో తెలుసుకోవాలంటే మనం నాలుగు రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. నాలుగు రోజుల క్రితం అంతరిక్షం నుంచి ఒక విచిత్రమైన గుడ్డు భూమిపై పడిద్ది. అది ఏ అడవిలోనో ఎడారిలోనో పడకుండా, సరిగ్గా హెల్గా నివషిస్తున్న అపార్ట్మెంట్ లోనే పడిద్ది. ఆ గుడ్డు యెుక్క తాకిడికి కిటికీ అద్దాలు కూడా పగిలిపోతాయి. ఆ గుడ్డులోంచి ఒక విచిత్రమైన సాలే పురుగు బయటికొస్తది. హెల్గా నివసిస్తున్న అపార్ట్మెంట్ కి ‘గంటర్’ అనే ఆవిడ ఓనర్. హెల్గా, గంటర్ అక్కాచెల్లెల్లు. గంటర్ దగ్గర చాలా రకాల బొమ్మలుంటయ్.

తన బొమ్మల్ని దొంగతనం చేసేందుకు ‘చార్లెట్’ అనే అమ్మాయి రహస్యంగా వెంట్స్ లో పాక్కుంటూ గంటర్ యెుక్క స్టోర్ రూంలోకి చేరుకుంటది. అక్కడ టేబుల్ పై ఉన్న బొమ్మని చార్లెట్ దొంగతనం చేయబోతుండగా చార్లెట్ చేతి మీద అంతరిక్షం నుంచొచ్చిన సాలె పురుగు వాలిద్ది. చార్లెట్ కి ఇలాంటి విచిత్రమైన జంతువుల మీద కాస్త ఆసక్తి ఉంటది. అలా తను ఆ సాలె పురుగుని చూస్తుండగా, “ఎవరు లోపలా?” అని అరుస్తూ గంటర్ స్టోర్ రూంలోకి వస్తుంటది. గంటర్ వస్తుండడంతో చార్లెట్ అక్కడున్న బొమ్మని, అలాగే సాలె పురుగుని కూడా తీసుకుని వెంట్స్ లో పాక్కుంటూ వేగంగా తన గదిలోకెళ్ళిపోద్ది.
చార్లెట్ ఆ సాలె పురుగుని ఒక గ్లాస్ జార్ లో వేసి దానికి ‘స్టింగ్’ అనే పేరు పెట్టిద్ది. చార్లెట్ తన బొమ్మల్ని దొంగతనం చేసిందని గంటర్ కి అర్ధమై తను కోపంతో ‘ఈతన్’ దగ్గరికెళ్తది. “మీ అమ్మాయి నా బొమ్మలన్నింటిని దొంగతనం చేస్తుంది. ఈరోజు తను మా కిటికీ అద్దాల్ని కూడా పగలగొట్టింది. నువ్వా కిటికీని సరి చేస్తావా లేదా!?” అని అంటూ గంటర్ ఈతన్ పై గొడవపడిద్ది. “మీ కిటికీ అద్దాల్ని పగలకొట్టాల్సిన అవసరం చార్లెట్ కి ఏముంది. తను ఆ పని చేసుండదు” అని ఈతవ్ అంటాడు. కానీ గంటర్ మాత్రం తన మాటల్ని పట్టించుకోదు. ఈతన్ చార్లెట్ యొక్క సవతి తండ్రి.
చార్లెట్ కుటుంబం
ఈతన్ చార్లెట్ దగ్గరికెళ్లి, “ఎవరో గంటర్ వాళ్ల స్టోర్ రూమ్ కిటికీని పగలగొట్టారు. తన బొమ్మ కూడా ఒకటి కనిపించడం లేదంటా. ఆ పని చేసింది నువ్వేనా” అని అడుగుతాడు. “నేనసలు నా గదిలోంచి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ పని చేసింది నేను కాదు, అయినా నాకు బొమ్మలంటే ఇష్టం కూడా లేదు” అని చార్లెట్ అంటది. “సరే నువ్వు గంటర్ కి కాస్త దూరంగా ఉండు” అని చెప్పి ఈతన్ తన దగ్గర్నుంచి వెళ్ళిపోతాడు. ఈతన్ కి పెద్ద కామిక్ రైటర్ అవ్వాలనే కోరిక ఉంటది. కానీ కుటుంబాన్ని పోషించేందుకు పగటి పూట బిల్డింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తూ, కేవలం రాత్రి పూట మాత్రమే కామిక్స్ గీస్తుంటాడు.
కొంచెం సేపటి తర్వాత ‘హీతర్’ చార్లెట్ ని పిలిచి, “నాకు కాస్త ముఖ్యమైన పని ఉంది. నా పని పూర్తయ్యే వరకు నువ్వు ‘లియమ్’ ని జాగ్రత్తగా చూసుకో” అని చెప్తది. లియంని చూసుకోవడం చార్లెట్ కి ఇష్టం ఉండదు. కానీ చేసేదేం లేక “సరే చూసుకుంటాలే” అని అంటది. ఇక హీతర్ లియంని చార్లెట్ కి అప్పగించి ఆఫీస్ రూంలోకి వెళ్తది. కట్ చేస్తే స్టింగ్ ఆకలితో ఉందేమో అని చార్లెట్ రెండు బొద్దింకల్ని జార్ లో వేస్తది. పాపం అది ఎప్పటినుంచి ఆకలితో ఉందో, బొద్దింకల్ని జార్ లోకి వేయడమే ఆలస్యం, స్టింగ్ వాటిని క్షణాల్లోనే తినేస్తది. అది చూసి చా ర్లెట్ “Wow” అని ఆశ్చర్యపోద్ది.
ఈతన్ తన పగటి పూట పనిని పూర్తి చేసేసి అలసటగా ఇంటికొస్తాడు. అప్పుడు హీతర్ లియంని ఈతన్ కి అప్పజెప్పి, “నేను వెళ్లి మా అమ్మని పడుకోబెట్టొస్తా” అని హెల్గా దగ్గరికెళ్తది. ఆ సమయంలో హెల్గా, గంటర్ టీవీ చూస్తుంటారు. హీతర్ గంటర్ ని పలకరించి, హెల్గాని తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టిద్ది. హెల్గా మాట్లాడుతూ, “నేను మీ పాప కోసం ఒక స్వెటర్ సిద్ధం చేశా. అది టేబుల్ డ్రాయర్ లో ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు” అని అంటది. “సరే నేను తీసుకెళ్తా నువ్వు ప్రశాంతంగా పడుకో” అని చెప్పి హీతర్ అక్కడున్న స్వెటర్ తీసుకుని హెల్గా దగ్గర్నుంచి ఇంటికొచ్చేస్తది.

వేట మొదలెట్టిన సాలీడు
తను ఆ స్వెటర్ చార్లెట్ కి ఇస్తది. కానీ ఆ స్వెటర్ నుంచి మాత్ బాల్స్ యొక్క వాసన వస్తుండడంతో చార్లెట్ దాన్ని తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించదు. సరే తీసుకుందాంలే అన్నట్టుగా ఏదో అలా తీసుకుంటదంతే! కొంచెం సేపటి తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా, జార్ మూతని ఓపెన్ చేసుకుని స్టింగ్ బయటికొస్తది. అది ఆహారం కోసం వెతుక్కుంటూ వెంట్స్ లోకి వెళ్తది. అప్పుడు దానికి గంటర్ పెంచుకుంటున్న ఒక చిలుక కంటపడిద్ది. ఇంకేముంది సాలీడు వెంటనే చిలుక దగ్గరికెళ్లి దాని అవయవాలన్నింటిని తినేస్తది.
మరుసటి రోజు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉండగా గంటర్ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తది. ఏంట్రా బాబు ఏమైందని అనుకుంటూ ఈతన్ వెంటనే గంటర్ దగ్గరికెళ్తాడు. తీరాచూస్తే గంటర్ పెంచుకుంటున్న చిలుక దారుణంగా చనిపోయి ఉంటది. ఇది ఎలా జరిగిందని ఈతన్ అడగ్గా, ‘దీనికి కారణం ఎలుకలై ఉండొచ్చు, నువ్వు వెంటనే ఫ్రాంక్ కి
ఫోన్” అని గంటర్ అంటది. కట్ చేస్తే ఫ్రాంక్ వాళ్ళ దగ్గరికొచ్చి చిలుక యెుక్క మృతదేహాన్ని చూసి షాకైపోతాడు. “దీన్ని చంపింది ఎలుకలేనంటావా?” అని గంటర్ ఫ్రాంక్ ని అడిగిద్ది. “ఎలుకలు తమ ఆహారాన్ని ఈ విధంగా తినవు.
దీన్ని చంపింది ఏదో కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి” అని ఫ్రాంక్ అంటాడు. వెంట్స్ దగ్గర రక్తపు మరకలు ఉండడంతో ఒకవేళ చిలుకని చంపింది లోపల ఉందేమో అని అనుకుని ఫ్రాంక్ వెంట్స్ ని తెరుస్తాడు. తీరాచూస్తే లోపల కూడా రక్తపు మరకలుంటయ్. కాబట్టి పురులేమైనా ఉంటే చనిపోతాయన్న ఉద్దేశంతో ఫ్రాంక్ ఒక రకమైన పొగని వెంట్స్ లోకి వదులుతాడు. అలాగే బిల్డింగ్ అంతటికి ఒకసారి మందు కొడితే మీకే మంచిదని ఫ్రాంక్ అనడంతో, “సరే అలాగే చెయ్” అని గంటర్ అంటది. చార్లెట్ తన మొబైల్లో పిల్లి వీడియోలు చూస్తుండగా, పిల్లులు ఏ విధంగా అయితే శబ్ధం చేస్తాయో అచ్చం అలాగే స్టింగ్ కూడా శబ్ధం చేస్తది.
ముగింపు
అప్పుడే చార్లెట్ కి అర్థమయిద్ది, తన దగ్గరున్న సాలెపురుగు కొన్ని రకాల శబ్దాల్ని కూడా మిమిక్ చేయగలదని. నిన్న రాత్రి కేవలం ఒక చిలుకని తిన్నందుకే స్టింగ్ కాస్త పెద్దగా అయిద్ది. చార్లెట్ కొన్ని బొద్దింకల్ని ఆహారంగా వెయ్యబోతుండగా తన స్వెటర్ లోని మాత్ బాల్ ఒకటి పొరపాటున స్టింగ్ దగ్గరపడిద్ది. నిజానికి ఈ విచిత్రమైన సాలీడుకి మాత్ బాల్స్ అంటే చాలా భయం. అంటే దాని బలహీనత మాత్ బాల్స్ అనమాట. స్టింగ్ భయంకరంగా శబ్దం చేస్తూ మాత్ బాల్ నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తది. అందుకని చార్లెట్ ఆ మాత్ బాల్ ని స్టింగ్ దగ్గర్నుంచి వెంటనే తీసేస్తది.
ఇంతవరకు మనం చూసింది కేవలం ఆరంభం మాత్రమే! ఆ భయంకర సాలీడు ఇంకెంత మంది ప్రాణాలు తీసిందో, చివరికి అది ఎంత పెద్దగా రూపాంతరం చెందిందో అనే మిగతా విషయాలు ఒకసారి మూవీని వీక్షించి తెలుసుకుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. ఏదేమైనా సినిమా మాత్రం చాలా ఆసక్తిగా ఉంటది.
- నటీనటుల విషయానికొస్తే ఎవరి పాత్రలో వాళ్ళు చాలా బాగా నటించడం జరిగింది.
- చార్లెట్ పాత్రలో నటించిన ‘అలైలా బ్రౌన్’ నటన ఆకట్టుకునే విధంగా ఉంది.
- నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మధ్య మధ్యలో హఠాత్తుగా వచ్చే బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకింత వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటది.
- ఈ సినిమా మొత్తంగా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఒక మంచి అనుభూతిని మాత్రం ఇస్తది.
ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా అంతగా లాభాలేమి రాబట్టలేకపోయింది. హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రియులు ఒకసారి ఈ మూవీని చూసేయండి!
