Oddity (2024) Plot Summary Explained in Telugu

Oddity (2024) Plot Summary Explained in Telugu

మీకు నచ్చిన హీరో ఏదైనా సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తే చాలా ఆసక్తిగా వీక్షిస్తారు కదా! ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లడుతున్నా అని అనుకుంటున్నారా!? ఎందుకంటే మనం ఈ రోజు మాట్లడుకోబోయే సినిమాలో కూడా ద్విపాత్రాభినయం ఉందనమాట. ఆ సినిమా ఏదో కాదు, 2024లో విడుదలైన “Oddity” అనే హాలీవుడ్ సినిమా. ఈ సినిమాలో “Carolyn Bracken” ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఇద్దరు కవల సోదరీమణులు ఉంటారు. ఒకరు డార్సీ, మరొకరు డ్యాని.

వీళ్లలో డ్యానీని ఎవరో గుర్తుతెలియని వ్యక్తి చంపేస్తారు. అసలా వ్యక్తి తనని ఎందుకు చంపాడు!? డ్యానీని చంపిన వ్యక్తిని డార్సీ ఎలా కనిపెట్టింది!? ఇలా చాలా ప్రశ్నలు సినిమాలో తలెత్తుతాయి. సినిమా చూస్తున్నప్పుడు హంతకుడు ఎవరు అని కనిపెట్టే ప్రయత్నంలో ప్రతీ పాత్ర మీద అనుమానం కలుగుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? అనే మిస్టరీ చివరి వరకు కొనసాగుతుంది. ఇక ఆలస్యమెందుకు, వెంటనే ఈ సినిమా కథేంటో, ఇందులోని వేశేషాలేంటో తెలుసుకుందాం పదండి!

ఇక మొదలుపెడదాం
1) మొదటిలోనే ట్విస్ట్

‘డ్యాని’ తన భర్తతో కలిసి ఒక కొత్త ఇంటికి వస్తుంది. డ్యాని భర్త పేరు ‘టెడ్’. టెడ్ ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ గా పని చేస్తుంటాడు. టెడ్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత, డ్యాని ఒక్కతే తమ కొత్త ఇంటిని సర్దుతుంటది. కార్లో ఉన్న కొన్ని వస్తువులని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు డ్యాని కార్ దగ్గరికెళ్ళి అందులోని వస్తువుల్ని తీసుకుంటుండగా, తనకి చీకట్లో కాస్త చప్పుడు వినిపిస్తది. కానీ తను లైట్ వేసి అక్కడంతా పరిశీలిస్తే తనకక్కడ ఎవరూ కనిపించరు. ఇక తను ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా కార్లో ఉన్న వస్తువులు తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తది. అయితే తను ఇంట్లోకి వచ్చిన కొద్దిసేపటికే, బయటనుంచి ఎవరో తలుపు తెరుస్తున్న్నట్టుగా శబ్ధం వినిపిస్తది.

డ్యాని కంగారుపడుతూ పీప్ హోల్ తెరిచి చూడగా అక్కడ ‘ఒలిన్ బూల్’ నిలబడి ఉంటాడు. బూల్ ని చూసిన డ్యాని ఒక్కసారిగా భయపడిపోద్ది. ఈ బూల్ కూడా డాక్టర్ టెడ్ యొక్క పేషెంట్. బూల్ మాట్లాడుతూ, “ఇందాక నువ్వు తలుపు తెరిచి కార్ దగ్గరికెళ్ళావ్ కదా. ఆ సమయంలో ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడ్డాడు. కాబట్టి తలుపు తెరువు. నేను లోపలికొచ్చి నీకు సహాయం చేస్తా” అని అంటాడు. కానీ డ్యాని మాత్రం బూల్ మాటల్ని నమ్మదు. “ఇక్కడ నేను తప్ప మరెవరూ లేరు. కాబట్టి మీరిక్కడి నుంచి వెళ్లిపోండి” అని డ్యాని అంటది. అప్పుడు బూల్, “వాళ్ళ మాటలు నాకు గోడ లోపల నుంచి వినిపించాయి. అందుకనే నేను నీకు సహాయం చేసేందుకు ఇక్కడికొచ్చా.

తీరాచూస్తే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడడం నాకు కనిపించింది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. దయచేసి తలుపు తెరవండి. నేను మీకు సహాయం చేస్తా” అని అంటాడు. కానీ డ్యానీకి మాత్రం బూల్ చెప్తున్న మాటలపై ఎంతకీ నమ్మకం రాదు. ఒకవేళ తలుపు తెరిస్తే, బూల్ వల్లనే తనకేదైనా ప్రమాదం కలిగిద్దేమో అని డ్యాని అనుకుంటది. అదే సమయంలో ఇంట్లో నుంచి ఏవో చప్పుల్లు వినిపించడంతో, నిజంగానే లోపలెవరో ఉన్నట్టుందని డ్యాని భయపడిపోయి, బూల్ చెప్పినట్టుగా తలుపు తెరిచేందుకు హ్యాండిల్ పట్టుకుంటది. ఆ తర్వాత డ్యానీకి ఏం జరిగింది? బూల్ తనని ఏం చేశాడు? నిజంగానే ఒక గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్లాల్సిందే!

Oddity (2024) Plot Summary Explained in Telugu
Oddity (2024) Plot Summary Explained in Telugu
2) డ్యాని – డార్సి కవలలు

డ్యాని ఇన్సిడెంట్ జరిగిన సంవత్సరం తరువాత కథ మొదలవుతుంది. ఒలిన్ బూల్ డ్యానీని చంపేశాడని టెడ్ కి తెలిసి, తనని హాస్పటల్ నుంచి డిస్చార్జ్ చేసి చాలా పెద్ద తప్పు చేశామని అనుకుంటాడు. దాంతో బూల్ ని మళ్ళీ మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఒకరోజు రాత్రి బూల్ తన గదిలో నిద్రపోతుండగా ఒక గుర్తుతెలియని వ్యక్తి హాస్పటల్లోకి వచ్చి, బూల్ తలని దారుణంగా బద్దలుకొడతాడు. దాంతో బూల్ అక్కడికక్కడే చనిపోతాడు. నిజానికి బూల్ యెుక్క కుడి కన్ను నిజమైంది కాదు. అదొక ఆర్టిఫీషియల్ ఐ. డ్యానికి ఒక సిస్టర్ ఉంటది. తన పేరు ‘డార్సి’. ఈ డ్యాని మరియు డార్సి కవల పిల్లలు.

అయితే డార్సీకి కళ్ళు కనిపించవు. కానీ ప్రస్తుతం తనొక యాంటీక్ షాపుని నడుపుతుంటది. డార్సీ సైకిక్ కూడా. ఎవరిదైనా పర్సనల్ వస్తువుని ముట్టుకుని, దాని ద్వారా ఆ వ్యక్తి యొక్క గతమంతటని డార్సి తెలుసుకోగలదు. ఒలిన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐ డార్సి అడగడంతో, టెడ్ అతని ఐ తీసుకొచ్చి డార్సికి ఇస్తాడు. “దీన్ని చూడగానే కోపంగా కాలితో గట్టిగా తొక్కేయాలనిపించింది, కానీ నువ్వు అడిగావు కాబట్టి నీ దగ్గరికి తీసుకొచ్చా. అయినా నువ్వు దీంతో ఏం చేస్తావ్” అని టెడ్ అంటాడు. అప్పుడు డార్సీ, “వాడు డ్యానీని చంపేశాడుగా. కనీసం వాడు చనిపోతున్నప్పుడైనా సరే, తను డ్యానీని చంపినందుకు కొంచెమైనా పశ్చాత్తాప పడ్డాడో లేదో తెలుసుకుంటా” అని అంటది.

అలా వాళ్ళ మాటల సందర్భంలో, ప్రస్తుతం టెడ్ ‘యాన’ అనే అమ్మాయితో చాలా రోజుల నుంచి కలిసి ఉంటున్నాడని డార్సికి తెలిసి, తను కాస్త బాధపడిద్ది. అంటే డ్యాని చనిపోయి సంవత్సరం కూడా కాకముందే టెడ్ తనని మర్చిపోయి, ఇంకో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని డార్సి అలా కొంచెం బాధపడిద్ది. డార్సి షాపులో ఒక గంట ఉంటది. అదేమీ మామూలు గంట కాదు. ఆ గంటని ఎవరైనా నొక్కారంటే ఒక దెయ్యం ప్రత్యక్షమైద్ది. దీని కథ ఏంటంటే, ‘జాక్’ అనే వ్యక్తి ఒక హోటల్లో బెల్ బాయ్ గా పని చేస్తుండేవాడు. అయితే ఆ హోటల్లోనే ‘జేసన్’ అనే వ్యక్తి నివస్తుంటాడు. ఒకసారి జేసన్ ఫుల్లుగా తాగి హోటల్ కి రావడంతో, తనని గదిలోకి తీసుకెళ్లేందుకు జాక్ సహాయం చేస్తుంటాడు.

3) డ్యానీకి తెలిసిన రహస్యం

అప్పుడు తాగిన మత్తులో ఉన్న జేసన్, పొరపాటున జాక్ ని మెట్ల పైనుంచి కిందకి తోసేయడంతో, జాక్ మెడవిరిగి చనిపోతాడు. అలా అప్పటి నుంచి ఆ గంటని ఎవరైనా నొక్కారంటే జాక్ వెంటనే ప్రత్యక్షమవుతాడు. ఈ విషయం తెలీక ఇద్దరు వ్యక్తులు పొరపాటున ఆ గంటని నొక్కుతారు. అలా వాళ్ళు దాన్ని నొక్కగానే జాక్ ప్రత్యక్షమై వాళ్ళిద్దర్ని చంపేస్తాడు. ఇప్పుడీ కథని డార్సి టెడ్ కి చెప్తది. కానీ టెడ్ తన మాటల్ని అంతగా నమ్మడు. నిజానికి ఈ గంట మాత్రమే కాదు. డార్సి షాపులో ఉన్న ప్రతీ వస్తువుకి ఏదో ఒక హర్రర్ స్టోరి ఉంటది.

కానీ ఎవరైనా డబ్బులిచ్చి ఆ వస్తువుల్ని కొనుక్కుంటే మాత్రం, ఆ వస్తువుకున్న శాపం అక్కడితో పూర్తయ్యి, ఆ వస్తువు మామూలుగా మారిపోద్ది. కట్ చేస్తే, డార్సి ఇంటికెళ్లి ఒలిన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐ మీద తన చేతిని ఉంచుద్ది. అప్పుడు తనకి డ్యాని యొక్క మరణం గురించి ఒక నిజం తెలుస్తది. దాంతో డార్సి చాలా ఏడుస్తది. యానా మాట్లాడుతూ, “నిన్న రాత్రి నాకు డ్యాని కనిపించి, వెంటనే మాయమైపోయింది” అని చెప్తది. అప్పుడు టెడ్, “అంటే తను దెయ్యంగా మారిందంటావా” అని అంటాడు. “అలా అని కాదు. నువ్వు రాత్రిళ్ళు కూడా హాస్పటల్లో పని చేస్తుండడం వల్ల, నాకు ఈ ఇంట్లో ఒక్కదానికి నిద్రపట్టట్లేదు.

Oddity (2024) Plot Summary Explained in Telugu
Oddity (2024) Plot Summary Explained in Telugu

అలా సరిగా నిద్ర లేకపోవడం వల్ల నాకు ఇలా విచిత్రంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నీ నైట్ డ్యూటీస్ పూర్తయ్యే వరకు, నేను సిటీలోని నా అపార్ట్మెంట్లోనే ఉంటా” అని యానా అడిగిద్ది. “సరే అలాగే చేయి” అని టెడ్ ఒప్పుకుంటాడు. అప్పుడే డార్సి ఒక బాక్స్ తీసుకుని టెడ్ ఇంటికొస్తది. తనని చూసి టెడ్, యాన కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. నిజానికి ఆరోజు డ్యాని యొక్క మొదటి డెత్ యానివర్సరీ. అందుకని డార్సీ అక్కడికొస్తది. అప్పుడు టెడ్, “ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది. హాస్పిటల్లో చాలా పని ఉంది. యానా కూడా ఈ రోజు రాత్రికి సిటీలోని తన అపార్ట్మెంట్ కి వెళ్తది” అని అంటాడు. ఒకరకంగా చెప్పాలంటే డార్సీని తమ ఇంట్లో ఉండొద్దని చెప్తాడనమాట.

4) విచిత్రమైన బొమ్మ

కానీ డార్సీ తన మాటల్ని పట్టించుకోకుండా, “పర్లేదు నేనొక్కదాన్నే ఇక్కడ ఉంటాలే” అని అంటది. తర్వాత డార్సి తన బాక్స్ తెరిచి, అందులో ఉన్న బొమ్మని బయటికి తీస్తది. డార్సి, టెడ్ తో, “ఇది నేను మీకిస్తున్న ఒక బహుమతి” అని చెప్తది. ఆ బొమ్మ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటది. కాబట్టి దాన్ని తమ ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయినా సరే, ముఖం మీదే వద్దు అని చెప్పలేక, డార్సీ బహుమతిని టెడ్ తీసుకుంటాడు. ఇక కొంచెం సేపటి తర్వాత టెడ్ రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. యానా కూడా సిటీకి బయల్దేరేందుకు సిద్ధమయిద్ది. కానీ తన కార్ తాళాలు ఎక్కడున్నాయో యానాకి కనిపించవు. తను చాలా చోట్ల తాళాల కోసం వెతికిద్ది. కానీ తనకవి ఎక్కడా కనిపించవు.

ఇక చేసేదేం లేక సిటీకి వెళ్లే ఆలోచనని యానా వద్దనుకుంటది. నిజానికి ఆ బొమ్మని కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంత్రగత్తె డార్సి అమ్మకి బహుమతిగా ఇస్తది. దాన్నిప్పుడు డార్సి టెడ్ కి ఇస్తదనమాట. కట్ చేస్తే, రాత్రి సమయంలో డార్సి, యానా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల సందర్భంలో డార్సి ఒక సైకిక్ అన్న విషయం యానాకి తెలుస్తది. ఇక్కడే డార్సి ఒక ట్విస్ట్ బయటపెట్టిద్ది. అదేంటంటే, డ్యానీని చంపింది ఒలిన్ బూల్ కాదు. తలుపు తెరిచేందుకు డ్యాని తలుపు వద్దకు వెళ్తది. కానీ తనకి బూల్ మాటలపై నమ్మకం కలగకపోవడంతో తలుపు తెరవదు.

అప్పుడు బూల్, “సరే నేను సిటీలోకి వెళ్లి పోలీసుల్ని సహాయానికి తీసుకొస్తా. నీకు మాత్రం ఇంట్లో ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే ఇంట్లోంచి బయటికి పరిగెత్తు” అని డ్యానీకి చెప్పి తను సిటీలోకి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత నిజంగానే ఇంట్లో నుంచి ఏవో చప్పుల్లు వినిపిస్తుండడంతో, డ్యాని బాగా భయపడిపోయి బూల్ ని గట్టిగా పిలుస్తది. కానీ తను సిటీలోకి వెళ్లిపోయి ఉంటాడు కదా. దాంతో డ్యాని ఒంటరిగా భయపడుతూ టెంట్ లోపల దాక్కునుండగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా అక్కడికొచ్చి తనని దారుణంగా చంపేస్తాడు. ఈ విషయాలన్నింటినీ డార్సి ఇప్పుడు యానాకి చెప్తది. ఆ గుర్తుతెలియని వ్యక్తి ఎవరో కాదు. టెడ్ తో పాటు హాస్పటల్లో పనిచేస్తున్న ‘ఇవాన్’. ఒలిన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐ మీద డార్సి తన చేతిని ఉంచడం వల్ల తనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయనమాట.

5) ముగింపు

ఇక్కడి వరకు సినిమా చాలా ఆసక్తిగా ఉంది కదా! ఇక్కడి నుంచి కూడా ఇంకా చాలా చాలా రసవత్తరంగా కథ సాగుతుంది. అసలా బొమ్మని డార్సీ ఎందుకని వాళ్ళకి బహుమతిగా ఇచ్చింది!? అది కేవలం ఒక బొమ్మ మాత్రమేనా? అసలు చివరికి డార్సీ తన సోదరిని చంపిన హంతకుడిపై ఎలా పగ తీర్చుకుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా అందుబాటుగ ఉంది.

  • మొత్తానికి ఇదొక వింత అనుభవాన్నిచ్చే హార్రర్ థ్రిల్లర్. నాకైతే సినిమా చాలా రసవత్తరంగా అనిపించింది.
  • కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ కాస్త నెమ్మదిగా అనిపించినప్పటికీ, అదే ఈ సినిమాలోని ప్రత్యేకత కూడా.
  • ఇంట్లో ఉన్న వింత వస్తువులు, చిన్న చిన్న సూచనలు, మరియు ప్రతి సీన్‌లో కనిపించే అసహజమైన వాతావరణం ప్రేక్షకుడిలో టెన్షన్ పెంచుతుంది.

సినిమా చివర్లో వచ్చే నిజం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. నటీనటుల విషయానికొస్తే ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. తమ నటన కూడా చాలా సహజంగా ఉంది. సినిమాలో ద్విపాత్రిభినయం చేసిన “Carolyn Bracken” నటన ప్రేక్షకుడిని ఆకట్టుకుంటది. మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకుడిని మంచిగా థ్రిల్ చేస్తది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Leave a Comment