Left Behind Movie Explained in Telugu – Summary & Ending Explained
ఒక రోజు అకస్మాత్తుగా భూమి మీదున్న లక్షలాది మంది మనుషులు కనిపించకుండా మాయమైపోతే ఏమవుతుంది? వాళ్లు ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా! ఈ రోజు మనం మట్లాడుకోబోయే సినిమాలో ఇలానే కోట్లాది మంది మనుషులు హఠాత్తుగా మాయమైపోతారు. వాళ్ళు ఎలా మాయమైయ్యారో, ఎక్కడికి మాయమైయ్యారో ఎవరికీ తెలియదు. ఒకవేళ దెయ్యాలేమైన వాళ్లని తినేశాయా? లేక ఏలియన్స్ వాళ్లని తమ గ్రహాలకి ఎత్తుకెళ్లారా? లేదంటే దీనంతటికి కారణం సృష్టికి మూలమైన దేవుడా?!
ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు ఈ సినిమా చూస్తున్నప్పుడు తలెత్తుతాయి. ఇంతకీ ఈ సినిమా పేరు ఇంకా చెప్పలేదు కదా! మనం ఈ రోజు మాట్లాడుకోబోయే సినిమా పేరు “Left Behind”. ఇది 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి చాలా సంవత్సరాలైనప్పటికీ ఇందులోని కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంటది. మరి ఇక ఆలస్యమెందుకు ఈ సినిమా విశేషాలేంటో, అసలు మనుషులు మాయమవడానికి కారణమేంటో తెలుసుకుందాం!
ఇంటికి చేరుకున్న క్లోయి
‘క్లోయి’ తన నాన్నగారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొనేందుకు న్యూయార్క్ వస్తుంది. క్లోయి అమ్మ పేరు ‘ఐరిన్’, నాన్న పేరు ‘రేఫర్డ్’. రేఫర్డ్ పైలట్ అనమాట. క్లోయి తన అమ్మకి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్తది. అప్పుడు ఐరిన్, “మీ నాన్నకి అనుకోకుండా డ్యూటీ వేశారు. కాబట్టి పుట్టిన రోజు వేడుకలు జరపడం లేదు” అని చెప్తది. ఎలాగు తన నాన్న ఎయిర్పోర్ట్ కి వస్తాడు కదా! కాబట్టి తనని కలిసేందుకు క్లోయి ఎయిర్పోర్ట్ లోనే ఉంటది. ఆ సమయంలో ‘కామెరూన్’ అనే జర్నలిస్ట్ కి ఒకావిడ దేవుడి గురించి క్లాస్ పీకుతుంటది. దానివల్ల కామెరూన్ కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఇక క్లోయి వాళ్ళ దగ్గరికెళ్ళి ఆమె నుండి కామెరూన్ ని పక్కకు తీసుకొస్తది. కామెరూన్ క్లోయితో, “ఆమె పెట్టే నసనుండి నన్ను తప్పించినందుకు థాంక్స్” అని చెప్తాడు.
అప్పుడు క్లోయి, “మా అమ్మకి కూడా దేవుడి పిచ్చి బాగా ఎక్కువ. అందుకే నువ్వు అలా ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోయా” అని అంటది. ఆ సమయంలో రేఫర్డ్, ఎయిర్ హోస్టెస్ ‘హాటీ’ తో పులిహోర కలుపుతూ అటు వస్తాడు. రేఫర్డ్ క్లోయిని చూసి వెంటనే తన దగ్గరికొచ్చి కౌగలించుకుంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా రేఫర్డ్, ఐరిన్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో రేఫర్డ్ వేరే అమ్మాయితో ఇలా చనువుగా ఉండటం క్లోయికి నచ్చదు. పుట్టిన రోజున ఇంటిదగ్గర ఉండకుండా, హాటీతో సమయం గడిపేందుకే రేఫర్డ్ డ్యూటీకి వచ్చాడని క్లోయికి అర్థమవుద్ది.
Apocalypse Z: The Beginning of the End Plot Summary Explained in Telugu
రేఫర్డ్ మాట్లాడుతూ, “నాకూ, మీ అమ్మకి చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. చాలా సంవత్సరాలు మేము కలిసే ఉన్నాం. ఇన్ని సంవత్సరాల కాలంలో మనుషులు చాలా రకాలుగా మారిపోతారు. మీ అమ్మకి దేవుడి మీద పిచ్చి ఎక్కువైనప్పటి నుంచి అసలు తనతో మాట్లాడడమే చాలా కష్టమైపోతుంది” అని క్లోయితో చెప్తాడు. ఆ తర్వాత తను కార్ కీస్ క్లోయికి ఇచ్చి డ్యూటీకి వెళ్తాడు. క్లోయి కామెరూన్ కి టాటా చెప్పి ఇంటికెళ్తది. క్లోయి తన అమ్మని కలిసి కాసేపు తనతో సమయం గడిపిద్ది. కట్ చేస్తే క్లోయి తన తమ్ముణ్ణి తీసుకుని ఒక మాల్ కి వెళ్తది. మాల్లో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు. అప్పుడు హఠాత్తుగా రేమి మాయం అవుతాడు.

మనుషులు మాయం
ఇప్పటిదాకా నాతోనే ఉన్న నా తమ్ముడు హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయాడని క్లోయి బాగా కంగారుపడుద్ది. తీరాచూస్తే రేమీ ఒక్కడే కాదు, చాలామంది మనుషులు మాయమైపోయుంటారు. వాళ్ళ వస్తువులు బట్టలు మాత్రమే నేలపై ఉంటాయి. అదే సమయంలో ఒక కార్ అదుపుతప్పి మాల్లోకి వస్తది. తీరాచూస్తే ఆ కార్ డ్రైవర్ కూడా మాయమై పోయింటాడు. ఒక పక్క ఇంత గందరగోళం జరుగుతుంటే కొంతమంది మాత్రం ఆ మాయమైపోయిన వ్యక్తుల యొక్క వస్తువులు, డబ్బులు అలాగే మాల్లో ఉన్న వస్తువులు కొట్టేస్తుంటారు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక అందరూ భయంతో రోడ్లమీద పరుగులు తీస్తారు. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతాయి.
మరోవైపు రేఫర్డ్ విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తాడు. కొంచెంసేపటి తర్వాత తను హాటీని కలిసి, “మనం జాలీగా ట్రిప్ కి వెళ్దాం” అని టికెట్స్ చూపిస్తాడు. కట్ చేస్తే విమానం అదుపుతప్పి కిందికి వెళ్తుంటది. ఆ విమానంలోని చాలా మంది ప్రయాణికులు కూడా మాయమైపోయింటారు. విమానాన్ని అదుపుచేసేందుకు రేఫర్డ్ వెంటనే కాక్ఫిట్ లోకి వెళ్తాడు. తీరాచూస్తే తన కో పైలట్ కూడా మాయమైపోయింటాడు. ఇక రేఫర్డ్ తెలివిగా విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అసలక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థంకాక ప్రయాణికులందరూ గొడవ చేస్తుంటారు. హాటీ, కామెరూన్ వాళ్ళని ఆపేందుకు ప్రయత్నిస్తారు. అయినా కూడా వాళ్లు కంట్రోల్ అవ్వకపోవడంతో రేఫర్డ్ క్యాబిన్లో ప్రెజర్ పెంచుతాడు.
దానివల్ల ప్రయాణికులు ఊరిపి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. రేఫర్డ్ రేడియో ద్వారా ఎయిర్పోర్ట్స్ ని కాంటాక్ట్ అయ్యి సహాయం కోరాలని చూస్తాడు. కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎవరూ సమాధానం ఇవ్వరు. కొంచెంసేపటి తర్వాత రేఫర్డ్ ప్రయాణికుల దగ్గరికెళ్ళి, “ఇలాంటి సమయంలోనే మనం కంగారుపడకుండా ధైర్యంగా ఉండాలి. మనకి పూర్తి సమాహారం వచ్చేవరకు అందరూ ప్రశాంతంగా ఉండండి” అని అంటాడు. హాటీతో పాటు పనిచేసే కో ఎయిర్ హోస్టెస్ కూడా మాయమైపోద్ది. హాటీ బాధతో రేఫర్డ్ దగ్గరికెళ్లి విషయం చెప్పడంతో తను ఆమెని ఓదారుస్తాడు.
మాయమవడానికి కారణమేంటి!?
అందరూ భయంతో నిండిపోయుండగా కామెరూన్ తన కెమెరాలో అంతా చిత్రీకరిస్తుంటాడు. వింతగా మ్యాజిక్ ఏమీ జరగలేదు, కానీ ఉన్నట్టుండి జనాలందరూ మాయమైపోయారు. కేవలం వాళ్ళ బట్టలు మాత్రమే మిగిలిపోయాయని వాళ్ళకి అర్థమవుతుంది. పరిస్థితులు ఇంకా దారుణంగా మారడం ఇష్టం లేక రేఫర్డ్ విమానాన్ని తిరిగి న్యూయార్క్ వైపు మళ్ళీస్తాడు. క్లోయి మాల్ నుంచి వేగంగా బయటికొస్తది. తను కార్లోకి ఎక్కేందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఒక చిన్న విమానం అదుపుతప్పి తన కారుని ఢీ కొట్టిద్ది. ఇక చేసేదేం లేక క్లోయి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరిద్ది.
అప్పుడొక స్కూల్ బస్ వంతెన మీద నుంచి నదిలో పడిద్ది. పిల్లల్ని కాపాడేందుకు క్లోయి వెంటనే బస్సు దగ్గరికెళ్తది. తేరాచూస్తే బస్సులోని పిల్లలందరూ కూడా మాయమైపోయింటారు. కొంచెం సేపటికి క్లోయి ఒక హాస్పిటల్ వద్దకి చేరుకుంటది. హాస్పిటల్ బయట బోర్డు మీద “THE END IS HERE” అని రాసి ఉంటది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మాయమైపోతున్నారని టీవీలో చెప్తుండడాన్ని క్లోయి చూస్తది. హాస్పిటల్లోని వ్యక్తులు కూడా మాయమైపోయింటారు. డెలివరీ వార్డులో ఒక్క పిల్లోడు కూడా ఉండడు. అది చూసి క్లోయి షాక్ అవుద్ది.

మరోవైపు రేఫర్డ్ న్యూయార్క్ వైపు వస్తుండగా అతని విమానం ప్రయాణిస్తున్న మార్గంలోనే ఎదురుగా మరొక విమానం వస్తుంటది. రెఫర్డ్ ఆ విమానంలోని పైలెట్స్ ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ ఆ విమానంలోని పైలట్స్ మాయమైపోయింటారు. ఏదో ఒకటి చేసి తమ విమానాన్ని దారి మళ్ళించకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగిద్ది. అందుకని రేఫర్డ్ వెంటనే తమ విమానాన్ని కొంచెం పైకి వెళ్లేలా చేస్తాడు. కానీ విమానం యొక్క ఒక రెక్క ఎదురుగా వస్తున్న విమానానికి తగిలిద్ది. దాంతో ఆ రెండో విమానం పేలిపోద్ది. ఇలా మనుషులు హఠాత్తుగా మాయమైపోతున్నారంటే అది ఖచ్చితంగా మానవులకి సంబంధించిన టెక్నాలజీ కాదు. ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పని” అని ప్రయాణికులు అనుకుంటారు.
దెబ్బతిన్న విమానం
ఒక ప్యాసింజర్ హాటీని పిలిచి విమానం రెక్క పాడై ఉండడాన్ని చూపిస్తాడు. కామెరూన్ ఆ రెక్కని ఫోటోలు తీసి రేఫర్డ్ కి చూపిస్తాడు. రెక్క బాగా దెబ్బ తిని ఉండడంతో విమానాన్ని నేలపై ల్యాండ్ చేయడం కొంచెం కష్టమేనని రేఫర్డ్ కి అర్థమవుద్ది. రేఫర్డ్ కామెరూన్ తో, “రెక్క నుండి ఏదైనా లీక్ అవుతుందేమో వెళ్లి చూడు” అని చెప్తాడు. తీరాచూస్తే రెక్క నుండి ఫ్యూయల్ అంతా లీక్ అవుతుంటది. కొద్దిసేపటికి అక్కడ మంటలు చెలరేగుతాయి. దానివల్ల ప్రయాణికులందరూ భయంతో గందరగోళం చేస్తుంటారు. “మీరేమీ కంగారుపడొద్దు. ఇలాంటి సమయంలోనే ప్రశాంతంగా ఉండాలి” అని హాటీ, కామెరూన్ అందర్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు.
రేఫర్డ్ కామెరూన్ తో మాట్లాడుతూ, “ఇక నేను చేసేదేం లేదు. ఎలాగోలా న్యూయార్క్ కి త్వరగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తా” అని అంటాడు. తీరాచూస్తే ఫ్యూయల్ మొత్తం అయిపోవడంతో మంటలు వాటంతట అవి ఆరిపోతాయి. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇప్పుడు విమానాన్ని నేల మీద ల్యాండ్ చేయాలి, లేదంటే ప్రయాణికులందరూ చనిపోతారు. మరోవైపు క్లోయి ఇంటికి చేరుకుంటది. తీరాచూస్తే ఐరిన్ కూడా మాయమైపోయింటది. అసలక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్ధంకాక క్లోయి కోపంతో బైబిల్ విసిరేస్తది. ఆ తర్వాత తను చర్చిలోకి వెళ్తది. అప్పుడు పాస్టర్ తనతో మాట్లాడుతూ, “చిన్నపిల్లలు, దేవుణ్ణి నమ్మిన మనుషులందరూ స్వర్గానికి మాయమైపోయారు.
నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని గురించి ప్రసంగం చేస్తున్నప్పటికీ నేనెప్పుడూ దేవున్ని నిజంగా నమ్మలేదు. అందుకే నేను స్వర్గానికి మాయమవ్వలేదు. రాబోయే చీకటి కాలం నుండి దేవుడు చిన్న పిల్లల్ని, తనని నమ్మిన వాళ్లని కాపాడి తన దగ్గరికి తీసుకెళ్లాడు” అని చెప్తాడు. ఆ మాటలు విన్న క్లోయికి బాగా కోపం వచ్చి పాస్టర్ మీద అరిచి అక్కడ్నుంచి వెళ్ళిపోద్ది. రేఫర్డ్ తన కో పైలట్ యొక్క వాచ్ చెక్ చేస్తే అందులో ‘John 3:16’ అని ఉంటది. అది బైబిల్ లో ఉన్న ఒక వచనానికి సంబంధించినది. దేవుణ్ణి ఎవరైతే నిజంగా నమ్ముతారో, దేవుడు తిరిగి భూమి మీదకి వచ్చే సమయంలో వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్లిపోతాడు అని దాని అర్థం. హాటీ తన కో ఎయిర్ హోస్టెస్ యొక్క పుస్తకాన్ని తెరవగా అందులో బైబిల్ స్టడీకి సంబంధించిన కొన్ని వచనాలుంటాయి.
దేవుడే అన్నిటికీ మూలం
అప్పుడు రేఫర్డ్ కి ఇది రాప్చర్ అని అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని తన భార్యకి ముందే తెలుసని, తను కూడా ఖచ్చిత్తంగా మాయమైపోయి ఉండొచ్చని బాధపడతాడు. విమానంలోని ఒక మహిళ గన్ బయటికితీసి, “మీరందరూ నా భర్త పంపించిన వాళ్లే కదా. నా కూతుర్ని మీరే కదా మాయం చేసింది” అని బెదిరిస్తది . ఆ గన్ చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. “ఇది మనుషులు చేసిన పని కాదు. ఇది బైబిల్ కి సంబంధించినది. ఇది దేవుడి పునరాగమనం. ఆయనే తనని నమ్మిన వాళ్లని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు” అని మరో ప్రయాణికురాలు చెప్తది. నా కూతురు లేకుండా నేనుండలేనని ఆమె తనని తానే షూట్ చేసుకోవాలని అనుకుంటది. కానీ కామెరూన్ తన మాటలతో ఆమె మనసు మార్చి గన్ తీసేసుకుంటాడు.

కాసేపయిన తర్వాత రేఫర్డ్ కి రేడియోలో కనెక్షన్ దొరికిద్ది. అప్పుడు రేఫర్డ్ కి ప్రపంచమంతా ఇలానే మనుషులు మాయమైపోతున్నారని తెలుస్తది. ఎయిర్పోర్ట్ లోని ల్యాండింగ్ ప్రదేశమంతా విమానాలు చెల్లాచెదురుగా ఉన్నాయని కూడా తెలుస్తది. ఏదేమైనా సరే తమ విమానాన్ని ల్యాండ్ చేయాలని రేఫర్డ్ నిర్ణయించుకుంటాడు. తను కామెరూన్ దగ్గరున్న శాటిలైట్ ఫోన్ తో క్లోయికి ఫోన్ చేయమని అడుగుతాడు. అప్పుడు కామెరూన్, “నేను ఎప్పటినుంచో తనకి ఫోన్ చేస్తున్నాను, కానీ ఫోన్ కలవట్లేదు” అని చెప్తాడు.
“ఐరిన్ ప్రతిసారి దేవుని గురించి మాట్లాడినప్పుడు నేనే తన మాటలు పట్టించుకోలేదు. నేను మీ అమ్మని సరిగా అట్మెదంచేసుకోలేక పోయా” అని రేఫర్డ్ క్లోయికి చెప్పాలనుకుంటాడు. తన తమ్ముడు, అమ్మ మాయమైపోవడంతో తన నాన్న కూడా మయమైపోయాడేమో అని అనుకుని, చుట్టూ జరుగుతున్న గందరగోళాన్ని భరించలేక క్లోయి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది. అప్పుడు క్లోయి, “నేను నీతో సరిగా నడుచుకోనందుకు నన్ను క్షమించు” అని తన అమ్మకి క్షమాపణ చెప్తది. ఇక తను అక్కడ్నుంచి దూకబోతుండగా తనకి కామెరూన్ దగ్గర్నుంచి కాల్ వస్తది. ఇక రేఫర్డ్, క్లోయి ఒకరితోనొకరు మనసువిప్పి మాట్లాడుకుంటారు.
ముగింపు
విమానం ల్యాండ్ చేసేందుకు మంచి ప్రదేశం కావాలని రేఫర్ట్ క్లోయితో చెప్తాడు. తను ఇంకేదో చెప్పబోతుండగా సిగ్నల్ పోవడంతో కాల్ కట్ అవుతుంది. తన నాన్న బతికే ఉండటంతో క్లోయి ఆత్మహత్య చేసుకోకుండా బ్రిడ్జ్ మీద నుంచి కిందకి వస్తది. విమానం ల్యాండ్ చేసేందుకు ఒక మంచి ప్రదేశం వెతికేందుకు క్లోయి బైక్ మీద బయల్దేరిద్ది. మరోవైపు విమానం అదుపుతప్పి కిందికి రావడం మొదలయిద్ది. ఈలోగా క్లోయి ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోకి వెళ్లి రోడ్డు మీదున్న వాటన్నింటినీ పక్కకి జరిపేస్తది. ఇక వెంటనే తను కామెరూన్ ని కాంటాక్ట్ అయ్యి, విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక మంచి ప్రదేశం సిద్ధం చేశానని చెప్తది. కానీ కామెరూన్ కి ఆ ప్రదేశం ఎక్కడుందో ఏమి అర్థంకాదు.
Year 10 (2024) Plot Summary Explained in Telugu
అందుకని క్లోయిని ఏదైనా సిగ్నల్ ఇవ్వమని అడుగుతాడు. క్లోయి ఫ్యూయల్ కింద పోసి దానికి నిప్పు అంటించడంతో పెద్ద పేలుడు సంభవిస్తది. రేఫర్డ్ ఆ మంటలను చూసి విమానాన్ని అటువైపుగా తీసుకెళ్తాడు. రేఫర్డ్ చాలా కష్టపడి విమానాన్ని ల్యాండ్ చేస్తాడు. ఆ ల్యాండింగ్ మాత్రం చాలా దారుణంగా జరిగిద్ది. చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ నాశనమవుతాయి. కానీ ప్రయాణికులు మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా బయటపడతారు. క్లోయి పరిగెత్తుకుంటూ వెళ్లి తన నాన్నని, కామెరూన్ ని కౌగిలించుకుంది. కామెరూన్ మంటల్లో కాలిపోతున్న సిటీని చూసి, “ఒకవేళ ఇదే ప్రపంచానికి అంతమేమో!” అని అంటాడు. అప్పుడు క్లోయి, “అంతం కాదు, ఇదే ఆరంభమై ఉండొచ్చు” అని అంటది.
ఈ విధంగా సినిమా ముగుస్తుంది. నిజానికి కథ ఇక్కడితో ముగిసింది అని చెప్పలేం. క్లోయి మాటల్ని బట్టి చూస్తే ఈ కథ ఇంకా సమాప్తం అవ్వలేదు అని క్షుణ్ణంగా తెలుస్తుంది. అంటే తన మాటలకి అర్ధం సగటు ప్రేక్షకుడిగా మనమే ఊహించుకోవాలన్నమాట.
- కొంత మంది ప్రేక్షకులకి ఇలాంటి ముగింపు బాగా నచ్చిద్ది, మరికొంత మంది ప్రేక్షకులకి ఇలాంటి ముగింపు అంత సంతృప్తి ఇవ్వదు. మొత్తానికి సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆస్తికరంగా ఉంటది.
- నాకైతే సినిమా పర్వాలేదు అనిపించింది. ఆ మనుషులందరూ ఎలా మాయమయ్యారు అని నేను కూడా ఒకింత ఆలోచనలో పడ్డాను.
- ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్ళకి ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా మొత్తం ఒక టెన్షన్ వాతావరణంలో నడుస్తుంది.
ఇది కేవలం ఆసక్తి కలిగించే సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా కూడా. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.
