Hidden (2015) Movie Explained in Telugu – Summary & Ending Explained
ఒక సంవత్సర కాలం పాటు మానవ సమాజానికి దూరంగా ఒక నిర్మానుష్యమైన బంకర్‌లో నివశించాల్సి వస్తే మీరు నివసించగల్గుతారా!? తినడానికి తిండి కూడా కూడా చాలా తక్కువ మోతాదులోనే ఉంటది. అయినా సరే మీరు బయటికి అడుగుపెట్టకుండా బంకర్‌లోనే ఉండగలరా!? ఈ రోజు మనం తెలుసుకోబోయే సినిమాలో ఇలాంటి కథే ఉంటదనమాట. ఒక చిన్న పాప తన తల్లిదండ్రులతో కలిసి మానవ సమాజానికి దూరంగా ఒక బంకర్‌లో నివసిస్తుంటది. దానికి గల కారణమేంటో మనం ఇంకొన్ని క్షణాల్లోనే తెలుసుకుందాం! ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ‘Hidden’.
వార్నర్ బ్రోస్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథంతా ఒక చిన్న కుటుంబం చుట్టూ సాగుతుంటది. అసలు వీళ్లు ఎందుకని బంకర్‌లో నివశిస్తున్నారు!? ఇంతకీ భూమి మీద ఏదైనా ఘోరమైన ప్రమాదం జరిగిందా? అసలు భూమి మీద మనుషులు ప్రాణాలతో ఉన్నారా, లేదా? సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మెదడులో తలెత్తుతాయి. ఇక ఆలస్యమెందుకు, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథను అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్‌గా సమ్మరీగా చెబుతూ, ముఖ్యమైన ట్విస్ట్స్ మరియు ఎండింగ్ అర్థాన్ని కూడా క్లుప్తంగా వివరించబోతున్నాను.
జనాల పరుగులు
ఓపెన్ చేస్తే ‘కింగ్స్ విల్’ అనే ఊరిలో కథ మొదలవుతుంది. “రే” మరియు “క్లేర్” తమ పాపతోటి గత మూడు వందల ఒక్క రోజులుగా ఒక బంకర్ లో దాక్కొని ఉంటారు. వీళ్ళ పాప పేరు “జోయి”. బయటి ప్రపంచమంతా ఒక భయంకరమైన వైరస్ వల్ల నాశనమైపోయి ఉంటది. మనుషులందరూ ఆ వైరస్ వల్ల Vampires గా మారుంటారు. బంకర్ నుంచి బయటికెళ్తే వాళ్ళ చేతిలో చావు తప్పదని, వీళ్ళు ముగ్గురు ప్రాణభయంతో లోపలే ఉండిపోతారు. వీళ్ళకి ముఖ్యంగా రెండు నిబంధనలుంటాయి. ఒకటి, ఎప్పుడూ తమ ఎమోషన్స్ మీద నియంత్రణ కోల్పోకుండా ప్రశాంతంగా ఉండాలి. రెండు, బంకర్ ని దాటి బయటకి మాత్రం వెళ్ళకూడదు.
అసలు కొన్ని రోజుల క్రితం ఏం జరుగుతుందంటే…. రే తన కుటుంబంతో ఇంట్లో సంతోషంగా సమయం గడుపుతుండగా తమ పక్కింటివాళ్ళు బట్టలు సర్దుకొని హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. రే వాళ్ళని చూసి, “వీళ్ళేంటి ఇలా కంగారుగా వెళ్ళిపోతున్నారు” అని అనుకుని అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వాళ్ళ దగ్గరికెళ్తాడు. కానీ వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్లే కాదు, ఆ ఊరిలో నివసించే చాలా కుటుంబాలు హడావిడిగా కార్లలోకి ఎక్కి ఎక్కడికో పారిపోతుంటారు. నిజానికి ఒక భయంకరమైన వైరస్ ఊరిలోకి ప్రవేశించి, గాలి ద్వారా వ్యాపిస్తూ మనుషులని ఇన్ఫెక్ట్ చేస్తుంటది.
అందుకనే జనాలందరూ ఊరిలోంచి పారిపోతుంటారు. కొంచెంసేపటి తర్వాత రేకి కూడా వైరస్ గురించి విషయం తెలియడంతో తను కూడా తన కుటుంబాన్ని తీసుకుని ఊరి నుండి పారిపోతుంటాడు. కొంతదూరం వెళ్ళిన తర్వాత CDC వాళ్ళు జనాలందర్ని ఆపేసి ఊరు మొత్తానికి లాక్డౌన్ విధిస్తారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో జనాలందరూ అక్కడే ఆగిపోతారు. అప్పుడు ఒక విమానం బాంబుల వర్షం కురిపించి ఊరు మొత్తాన్ని క్షణాల్లోనే నాశనం చేస్తుంది. అది చూసిన జనాలందరూ బాగా భయపడిపోయి, తమ మీద కూడా ఆ విమానం దాడి చేస్తదేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతారు.
బంకర్‌లో తల దాచుకోవడం
ఆ సమయంలోనే రే తన కుటుంబాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా ఈ బంకర్ లోకి వచ్చేస్తాడు. వీళ్ళు బంకర్ లోపలికి వచ్చే సమయంలో కొన్ని విమానాలు జనాల మీద బాంబ్స్ వేసి చంపేస్తాయి. ఆ ఊరి జనాలందరూ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారేమో అన్న అనుమానంతో ఇలా బాంబ్స్ వేసి చంపేస్తారు. కట్ చేస్తే, జోయి నిద్ర నుండి మేల్కొంటది. తను క్లేర్ తో మాట్లాడుతూ, “బ్రీథర్స్ మన బంకర్ లోకి వచ్చి మన మీద దాడి చేసినట్టుగా పీడ కల వచ్చింది” అని భయపడుతూ చెప్తది. వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన మనుషులని బ్రీథర్స్ అని పిలుస్తారు.

అప్పుడు క్లేర్ జోయితో, “నువ్వేం భయపడకు. మనమిక్కడ భద్రంగా ఉన్నాం. ఇక్కడ మనకి ఎటువంటి అపాయం జరగదు” అని జోయికి కాస్త ధైర్యం చెప్పి రే దగ్గరికి తీసుకెళ్తుంది. రే జోయి మనసుని కుదుటపరిచేందుకు, “ఒకసారి మన బంకర్ తలుపు ఎంత బలంగా ఉందో నువ్వే చూడు. అప్పుడే మనం ఎంత భద్రంగా ఉన్నామో నీకు వివరంగా తెలుస్తుంది” అని అంటాడు. ఇక జోయి నిచ్చెన ఎక్కి బంకర్ తలుపుని చేరుకుంటది. ఆ తలుపుకి కొన్ని బలమైన ఇనుప చైన్స్ ఉంటాయి. వాటి వల్ల అది చాలా ధృడంగా బిగించబడి ఉంటుంది. కాబట్టి ఈ తలుపుని దాటి బ్రీథర్స్ లోపలికి రావడం అసాధ్యమని జోయి ధైర్యంగా నిచ్చెన దిగి రే దగ్గరికొస్తది.
ఇక భోజనం చేసే సమయమవడంతో క్లేర్ జోయికి ఒక ఫుడ్ క్యాన్ ఇస్తది. తీరాచూస్తే అందులో ఫుడ్ ఉండదు. ఒక ఎలుక క్యాన్ కి రంధ్రం చేసి అందులోని ఫుడ్ అంతటినీ తినేసుంటది. ఇక్కడ ఎలుక తమ ఆహారాన్ని తినడం మాత్రమే సమస్య కాదు. ఇంకొక సమస్య ఏంటంటే… అసలు బంకర్ లోకి ఎలుక ఎలా వచ్చిందన్నదే ఇక్కడ ముఖ్యమైన సమస్య. ఎందుకంటే ఎలుక బంకర్ లోకి రావడానికి మార్గం ఉన్నట్లయితే, బ్రీథర్స్ కూడా ఆ మార్గం ద్వారా లోపలికి రాగలరు కదా! అందుకని ఎలుక ఏ మార్గం గుండా లోపలికి వచ్చిందో కనిపెట్టేందుకు రే బంకర్ మొత్తం పరిశీలిస్తుండగా తనకొక ఎయిర్ డక్ట్ కనిపిస్తది.
ఎలుక – మంటలు
అక్కడి నుండి బ్రీథర్స్ లోపలికి వస్తారేమో అని జోయి భయపడుతుంటే, “బ్రీథర్స్ ఈ మార్గం గుండా లోపలికి రాలేరు” అని రే తనకి ధైర్యం చెప్తాడు. క్యాన్స్ లో ఉన్న ఆహారాన్ని ఎలుక తినేసింది కదా! ఇక వీళ్ళకి తినడానికి బీన్స్ తప్పా ఏం మిగలవు. కానీ జోయి బీన్స్ తినేందుకు ఇష్టపడదు. “మనం ఎన్నో రోజులుగా ఈ బంకర్లోనే బతుకుతున్నాం. నాకిక్కడ ఏం నచ్చట్లేదు. ఇలా ఎన్నాళ్ళు మనం ఇక్కడే బతకాలి” అని జోయి భాదపడిద్ది. అప్పుడు రే, “మనం మన ప్రాణాల్ని కాపాడుకునేందుకే ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడి నుంచి బయటికెళ్తే బ్రీథర్స్ మన మీద దాడి చేసి చంపేస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండడమే మంచిది” అని అంటాడు.
కాసేపయిన తర్వాత రే తన గదిలోకెళ్ళి నిద్రపోతాడు. జోయి, క్లేర్ సరదాగా ఒక ఆట ఆడుతూ మేలుకుని ఉంటారు. జోయికి ఆ ఆట మీద బొత్తిగా ఆసక్తి ఉండదు. అందుకని క్లేర్ తనకొక పెరిస్కోప్ ఇచ్చి, “నీకు ఎలాగూ ఈ ఆట మీద ఆసక్తి లేదుగా. కాబట్టి ఈ పెరిస్కోప్ తీసుకుని ఒకసారి బయటి ప్రపంచం ఎలా ఉందో చూడు” అని చెప్తది. తీరాచూస్తే బయటి ప్రపంచమంతా నాశనమైపోయి భయంకరంగా ఉంటది. జోయి కాస్త భయపడి, “బయటి ప్రపంచాన్ని చూడడం కన్నా ఆట కొనసాగించడం మంచిది” అని అనుకుని క్లేర్ దగ్గరికొస్తుంది. ఆ సమయంలో ఎలుక మళ్ళీ క్యాన్స్ దగ్గరికొస్తది.
జోయి దాన్ని గమనించి క్లేర్ కి విషయం చెప్తది. ఈరోజు ఎలాగైనా దాని పని ముగించాలని క్లేర్ నిర్ణయించుకుని వెంటనే రేని నిద్రలేపుతుంది. వీళ్ళు దాన్ని చంపే ప్రయత్నంలో పెద్ద పెద్ద శబ్దాలేమైనా వస్తే బ్రీథర్స్ కి వీళ్ళున్న ప్రదేశం గురించి తెలిసిపోద్ది. కాబట్టి తెలివిగా ఎటువంటి శబ్ధం చేయకుండా ఎలుకను చంపాలనమాట. అలా క్లేర్ చాలా చాకచక్యంగా ఎలుకని చంపేస్తుంది. కానీ ఆ సందర్భంలో ఎలుక ఒక లాంతర్ ని పొరపాటున కిందపడేయడంతో అక్కడంతా మంటలు అంటుకుంటాయి. క్లేర్ వెంటనే ఒక గుడ్డతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తది. రే కుళాయిని తిప్పి నీళ్ళుపోయాలని చూస్తాడు. కానీ కుళాయి పాడవడంతో అందులోంచి నీళ్ళు రావు.

జింకల మంద
క్లేర్ గుడ్డతో మంటల్ని ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ఏ ఉపయోగం ఉండదు. చివరికి రే ఎలాగోలా కుళాయి నుంచి నీళ్ళు రప్పించి వెంటనే మంటల్ని ఆర్పేస్తాడు. దురదృష్టమేంటంటే… ఎయిర్ డక్ట్ గుండా పొగ బయటికెళ్తుంది. బ్రీథర్స్ ఆ పొగని చూసి లోపలికి వస్తారేమో అని అనుకుని రే, క్లేర్ బంకర్ బయటికెళ్లి బూడిదని తొలగించాలనుకుంటారు. “పైన మాకు ఏం జరిగినా సరే, నువ్వు మాత్రం బంకర్ లోంచి బయటికి రావద్దు” అని జోయికి చెప్పి వాళ్లిద్దరు బయటికొస్తారు. జోయి బంకర్ లోంచి పెరిస్కోప్ తో వాళ్ళని గమనిస్తుంటది. ఆ సమయంలో వాళ్ళ వెనకాల కొంత దూరంలో ఒక బ్రీథర్ ఉన్నట్టుగా జోయికి కనిపించడంతో తను వెంటనే గట్టిగా కేకలు వేస్తది. కానీ తన అరుపులు వాళ్ళకి వినిపించవు.
ఇక జోయి ధైర్యం చేసి బంకర్ నుండి బయటకొస్తది. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో తను భయంతో గట్టిగట్టిగా కేకలు వేసి పిలుస్తుంటది. అప్పుడు క్లేర్ వెంటనే తన దగ్గరికొచ్చి తన నోటిని మూసేస్తుంది. జోయి భయపడుతూ తను చూసిన బ్రీథర్స్ గురించి క్లేర్ కి చెప్తుండగా కొన్ని జింకలు వీళ్ళ పక్క నుండే వెళ్తాయి. నిజానికి జోయి చూసింది కూడా ఈ జింకల్నే. తను ఈ జింకల్ని చూసి బ్రీథర్స్ అనుకుంటది. బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని ఇక ముగ్గురు వెంటనే లోపలికెళ్తారు. వీళ్ళు లోపలికెళ్ళగానే బంకర్ మీద బ్రీథర్స్ నడుస్తున్నట్టుగా శబ్ధాలు వినిపించడంతో వీళ్లు బాగా కంగారుపడి మౌనంగా ఉండిపోతారు.
కొంతసేపటికి బ్రీథర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జోయి దగ్గర ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మ పొరపాటున ఒక పైప్ కి తగులుకోవడం వల్ల అది శబ్ధం చేయడం మొదలుపెట్టిద్ది. ఆ శబ్ధం బ్రీథర్స్ విన్నారంటే ప్రమాదమని రే వెంటనే ఆ బొమ్మని జోయి నుంచి లాక్కొని దాన్ని నాశనంచేసేస్తాడు. తనకి ఇష్టమైన బొమ్మని అలా నాశనంచేయడంతో జోయి చాలా బాధపడిద్ది. అప్పటికే బ్రీథర్స్, బొమ్మ చేసిన శబ్దం విని బంకర్ దగ్గరికొచ్చి తలుపుని బలంగా పగలగొడుతుంటారు. బ్రీథర్స్ లోపలికొచ్చారంటే వీళ్ళ పని అయిపోయినట్టే. అందుకని రే, క్లేర్ వెంటనే తలుపు దగ్గరికెళ్లి దాన్ని దృఢంగా బిగించేస్తారు.
ట్విస్ట్ మామూలుగుండదు!
తలుపు ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఇక బ్రీథర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హమ్మయ్యా! ఎలాగోలా తప్పించుకున్నాంరా బాబు అని
వీళ్లు ముగ్గురు కాస్త ప్రశాంతంగా ఉంటారు. కానీ వీళ్ళకి ఆ ప్రశాంతత కొంచెంసేపు మాత్రమే ఉంటది. ఎందుకంటే క్షణాల్లోనే బంకర్ దగ్గరికి చాలా బ్రీథర్స్ వచ్చేస్తారు. బ్రీథర్స్ చేసే శబ్దానికి వీళ్ళకి ఒళ్లంతా వణుకుపుడుతుంటది. ఈసారి బ్రీథర్స్ తలుపుని బద్దలుకొట్టుకుని బంకర్లోకి దూకుతారు. వీళ్ళు ముగ్గురు భయంతో ఒక గదిలోకెళ్లి దాక్కుంటారు. బ్రీథర్స్ తమని వెంబడించకుండా ఉండేందుకు క్లేర్ ఒక ల్యాంప్ పగలగొట్టి మంటలు ఏర్పడేలా చేస్తుంది. బ్రీథర్స్ వాటిని దాటుకొని వచ్చేలోగా వీళ్ళు ఎయిర్ డక్ట్ గుండా బంకర్ నుండి బయటపడాలనుకుంటారు.
ఆ విధంగానే రే క్లేర్ ని బంకర్ లోంచి బయటికి పంపిస్తాడు. బయట బ్రీథర్స్ ఎక్కడా కనిపించకపోవడంతో రే జోయిని కూడా బయటికి పంపిస్తాడు. ఇక రే కూడా బయటికెళ్ళెందుకు ప్రయత్నిస్తుండగా పొరపాటున తన భుజానికి గాయమవుతుంది. సరిగ్గా అప్పుడే బ్రీథర్స్ అక్కడికొచ్చి రే ని బంకర్ లోకి లాగేస్తారు. ఇక రే కి, బ్రీథర్స్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. కొంచెంసేపటి తర్వాత రక్తపు మరకలు కనిపించడంతో బ్రీథర్స్ రేని చంపేశారేమో అని అనుకుని జోయి, క్లేర్ చాలా బాధపడతారు. ఇంకా అక్కడే ఉంటే ప్రమాదమని వెంటనే వాళ్లిద్దరూ పరుగుతీస్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత హైవే వద్దకి చేరుకుంటారు.

అప్పుడు కొంత మంది అమెరికన్ సోల్జర్స్ ఒక హెలికాప్టర్ లో అక్కడికొచ్చి క్లేర్, జోయిని చుట్టుముడతారు. వాళ్ళు ఈ అమెరికన్ సోల్జర్స్ ని బ్రీథర్స్ అనుకుని భయంతో కేకలేస్తారు. ఒక సోల్జర్ క్లేర్, జోయిని టెస్ట్ చేయగా వాళ్లిద్దరు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారని తెలుస్తది. అసలు విషయమేంటంటే… ఊరికి లాక్డౌన్ విధించి ఆ ఊరి జనాలందర్ని విమానంలోంచి బాంబ్స్ వేసి చంపేస్తున్నపుడు… రే, జోయి, క్లేర్ బంకర్లోకొచ్చి దాక్కుంటారు కదా! ఆ సమయంలో క్లేర్ చేతికి దెబ్బ తగలడంతో తన శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తది. ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది కదా! ఆ విధంగా క్లేర్ వల్ల రే, జోయి కూడా వైరస్ బారినపడతారు. తాము వైరస్ బారిన పడిన విషయం క్లేర్ మరియు రేకి కూడా తెలుసు.
మరికొంత మంది మనుషులు
ఈ వైరస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే! వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు తమ ఎమోషన్స్ మీద నియంత్రణ కోల్పోనంత వరకు వాంపైర్స్ గా మారరు. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని రే, క్లేర్ జోయికి చెప్తుంటారు. వీళ్ళు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి సోల్జర్స్ ని బ్రీథర్స్ అని పిలుస్తుంటారు. అదే ఇక్కడ పెద్ద కామెడి. వాళ్ళు వైరస్ బారినపడడంతో సోల్జర్స్ క్లేర్, జోయిని షూట్ చేయాలని చూస్తుండగా రే హఠాత్తుగా అక్కడికొచ్చి కొంతమంది సోల్జర్స్ ని చంపేస్తాడు. అప్పటికే రే తన ఎమోషన్స్ మీద నియంత్రణ కోల్పోయి వాంపైర్ గా మారిపోయుంటాడు. కాబట్టి మిగితా సోల్జర్స్ రేని షూట్ చేసి చంపేస్తారు. ఈలోగా క్లేర్, జోయి అక్కడి నుండి పారిపోతారు.
జోయి ఒక కార్లో దాక్కొని ఉండగా సోల్జర్స్ అందరూ తన దగ్గరికొచ్చేస్తారు. అప్పటికే క్లేర్ తన ఎమోషన్స్ మీద నియంత్రణ కోల్పోయి వాంపైర్ గా మారిపోతుంది. తను సోల్జర్స్ మీద దాడి చేసి ముగ్గుర్ని చంపేస్తది. ఇక ఒక్క సోల్జర్ మాత్రమే ప్రాణాలతో ఉంటాడు. అతడు క్లేర్ ని షూట్ చేయడంతో తను నొప్పితో కిందపడిపోద్ది. అతను క్లేర్ ని చంపాలని చూస్తుండగా జోయి కూడా వాంపైర్ గా మారి అతని మీద దాడి చేస్తది. దాంతో అతను కూడా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతాడు. అప్పటికే క్లేర్ తన ఎమోషన్స్ మీద నియంత్రణ తెచ్చుకొని వాంపైర్ నుంచి మనిషిగా మారుతుంది. జోయి అతన్ని చంపాలని అనుకుంటుండగా క్లేర్ జోయిని ఆపాలని చూస్తది. కానీ వాంపైర్ గా మారిన జోయి, క్లేర్ మీద కూడా దాడి చేస్తది.
అప్పుడు క్లేర్ తెలివిగా జోయిని కూల్ చేయడంతో తను కూడా మనిషిగా మారిపోద్ది. ఇక వాళ్లిద్దరు రే దగ్గరికెళ్లి తనని కోల్పోయినందుకు చాలా బాధపడతారు. మరి కొంతమంది సోల్జర్స్ హెలికాప్టర్లో అక్కడికి వస్తుండడంతో వాళ్లిద్దరు పక్కనే ఉన్న ఒక సొరంగంలోకెళ్ళి దాక్కుంటారు. అక్కడ వాళ్ళకి “డాని” అనే పిల్లాడు కనిపిస్తాడు. ఈ పిల్లాడు ఒకప్పుడు క్లేర్ ఇంటి పక్కనే నివసించేవాడు. ఈ పిల్లాడు కూడా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు. తను క్లేర్, జోయిని సొరంగం లోపలికి తీసుకెళ్లి ఒక తలుపుని తెరుస్తాడు. తీరాచూస్తే అక్కడ వీళ్ళలానే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన చాలా మంది మనుష్యులు రహస్యంగా జీవిస్తుంటారు. తమలాంటి ఇతర మనుషుల్ని చూసిన క్లేర్, జోయికి బాగా ధైర్యం కలుగుతుంది.
ముగింపు
ఇప్పటివరకు మీకు అర్థంకాని ప్రతీ సన్నివేశాన్ని మరియు ఎండింగ్ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. మీకు ఈ వివరణ సినిమాని అర్థం చేసుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.
- ఈ సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ కాస్త విసుగుపుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కథ మొత్తం బంకర్‌లోనే సాగుతుండడం వల్ల సినిమా అంతా చాలా వరకు చీకటిగానే ఉంటది.
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏమీ ఉండదు. నాకైతే ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. చివరిలో వచ్చే ట్విస్టుని ఎవరూ ఊహించలేరు.
- నిజానికి ఈ సినిమాకి బలాన్ని పెంచింది చివర్లో రివీల్ అయ్యే ట్విస్ట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
- ఇక వసూళ్ల విషయానికొస్తే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల పది వేల డాలర్లు వసూలు చేసింది.
సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే సినిమా అభిమానులు తప్పకుండా ఒకసారి ఈ మూవీని వీక్షించండి. ఇందులో ఎటువంటి అభ్యంతకరమైన సన్నివేశాలు లేవు. కాబట్టి మీరీ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చూసేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.
