Drive Back (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

Drive Back (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

సినీ ప్రపంచంలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని భయపెడతాయి, కొన్ని మనశ్శాంతి కలుగచేస్తాయి, కొన్ని గుండెలో ధైర్యం నింపుతాయి మరికొన్ని మెదడుకి పని చెప్తాయి. అలా ప్రేక్షకుల మెదడుకి పని చెప్పేందుకు టైమ్ లూప్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. టైమ్ లూప్ సినిమాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో మనకందరికీ తెలుసు. కానీ వాటిని అర్థం చేసుకోవాలంటే మాత్రం కాస్త మెదడుకి పని చెప్పాల్సిందే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇంతకీ సినిమా పేరు ఏంటంటే “Drive Back”. ఇది 2024లో విడుదలైంది. ఈ సినిమా ఒక పక్క ప్రేక్షకుల్ని భయపెడుతూనే, మరోపక్క వాళ్ళ మెదడుతో ఆట ఆడుకుంది. ఈ సినిమాలో ఒక జంట తమ నిశ్చితార్థపు వేడుక నుంచి సిటీకి వెళ్తూ మార్గమధ్యంలో పొరపాటున ఒక రోడ్డు మార్గంలో చిక్కుకుపోతారు. ఇది మామూలు రోడ్ కాదు. ఎవరైనా ఆ రోడ్డు మార్గంలోకి వెళ్ళారంటెే జీవితాంతం అక్కడే చిక్కుకుపోవాల్సిందే. అక్కడ ఎన్నో రకాల వింతలు జరుగుతుంటాయి. జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి, గతాన్ని మర్చిపోతారు, ఒకరినొకరు చంపుకునేందుకు కూడా వెనకాడరు. వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది కదా! ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమా యొక్క విశేషాల్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లుప్తంగా మాట్లాడుకుందాం రండి!

మొదలైన ప్రయాణం

‘రీడ్’, ‘ఒలీవియ’ అనే అమ్మాయిని నిశ్చితార్దం చేసుకుంటాడు. అప్పటికే ఒలీవియ కడుపుతో ఉంటుంది. నిశ్చితార్దం ముగిసిన తర్వాత వారిద్దరు సిటీకి బయల్దేరుతారు. వారిద్దరు తమ జీవితాల గురుంచి, తమకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడొక మలుపు వద్ద హఠాత్తుగా మరో కారు ఎదురురావడంతో ఒక పెద్ద యాక్సిడెంట్ జరగబోద్ది. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగదు. ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో వారిద్దరు భయంతో కారులోంచి బయటికొచ్చి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆ మలుపు వద్దనుంచి సిటీలోకి ఏ మార్గంలో వెళ్ళాలో వారిద్దరికి అర్ధమవ్వదు.

అప్పుడు ఒలీవియ, “పక్కనే గ్యాస్ స్టేషన్ ఉన్నట్టుంది. అక్కడికెళ్లి మనం సిటీకి వెళ్ళే మార్గం గురించి ఎవరినైనా అడుగుదాం” అని అంటది. అలా వారిద్దరు ఒక గ్యాస్ స్టేషన్ వద్దకి చేరుకుంటారు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఉలుకు పలుకు లేకుండా కుర్చీలో కూర్చొని ఉంటాడు. అతడు చనిపోయాడో లేదా ప్రాణాలతోనే ఉన్నాడో వీళ్ళకేం అర్ధం కాదు. అప్పుడు హఠాత్తుగా అతని భార్య వాళ్ళ దగ్గరికొచ్చి, “మీకేం కావాలో చెప్పండి” అని అంటది. ఆ ముసలావిడ చూసేందుకు కాస్త విచిత్రంగా ఉంటది. రీడ్ మాట్లాడుతూ, “సిటీకి వెళ్లేందుకు ఇక్కడి నుంచి రూట్ ఏమైనా ఉందా?” అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఒక మార్గాన్ని మ్యాప్ లో చూపిస్తది.

ఇక వారిద్దరు గ్యాస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి సిటీకి బయల్దేరతారు. వాళ్ళు తను చెప్పిన మార్గంలోనే వెళ్తున్నారని ఆ ముసలావిడ గట్టిగా నవ్వుద్ది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ‘షార్ట్ కట్’ అనే బోర్డ్ కనిపిస్తది. సిటీకి త్వరగా చేరుకునేందుకు వారు షార్ట్ కట్ మార్గంలోకి తమ కారుని తీసుకెళ్తారు. అలా వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగా రోడ్ మీద ఒక పాత బంపర్ అడ్డంగా ఉంటుంది. రీడ్ కార్లో నుంచి బయటికొచ్చి బంపర్ ని రోడ్డు మీద నుంచి పక్కకు లాగేస్తాడు. తీరాచూస్తే తమ కార్ మొత్తం రక్తంతో నిండిపోద్ది. ఒక భయంకరమైన దెయ్యం హఠాత్తుగా రీడ్ దగ్గరికొస్తది. దాంతో తను ఒక్కసారిగా భయపడిపోతాడు. కానీ ఇదంతా నిజం కాదు. రీడ్ పట్టపగలే అలా ఒక భయంకరమైన ఇల్యూజన్ ఫీల్ అవుతాడు.

Azrael (2024) Plot Summary Explained in Telugu

ఆ వ్యక్తి ఎవరు?

చాలా సేపటి నుంచి కార్ నడుపుతుండడం వల్ల తనకి ఇలా భ్రమ కలిగిందేమో అని రీడ్ అనుకుంటాడు. రీడ్ ఒలీవియాతో, “మనం ఈ రోడ్లో చాలా సేపటి నుంచి వెళ్తున్నాం. ఇంకా మెయిన్ రోడ్ రాదేంటి” అని అంటాడు. అప్పుడు ఒలీవియా, “మనం షార్ట్ కట్ రోడ్లోకి వచ్చి కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే అయింది. మనం ఇంకాసేపటి మెయిన్ రోడ్ చేరుకోవచ్చేమో” అని చెప్తది. నిజానికి వాళ్ళు ఆ రూట్లోకి వచ్చి చాలా సేపు అయుంటది. కానీ ఆ విషయం వాళ్ళకి అంతగా అర్థం కాదు. అలా వాళ్ళు కార్లో వెళ్తుండగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తుంటాడు. ఇలాంటి అడవిలో ఈ వ్యక్తి ఏంటి ఒంటరిగా వెళ్తున్నాడని వాళ్ళకి కాస్త అనుమానం వస్తది.

రీడ్ అతని దగ్గరికెళ్లి నువు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడా వ్యక్తి ఒక కర్ర తీసుకుని, “ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి” అని గట్టిగా అరుస్తాడు. వాళ్లిద్దరు కాస్త భయంతో ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒలీవియా టాయిలెట్ కి వెళ్ళాలనడంతో రీడ్ ఒక చోట కారు ఆపుతాడు. ఒలీవియా టాయిలెట్ కి వెళ్ళగానే ఎవరో చెట్ల మధ్య పరుగెత్తినట్టుగా రీడ్ కి అనిపిస్తది. ఆ తర్వాత ఒక ఫ్రూట్ లాంటిది రోడ్డు మీద పడుతుంది. అదేంటని రీడ్ దాని దగ్గరికెళ్లి చూస్తుండగా హఠాత్తుగా కార్ డోర్ తెరుచుకుంటది. వెంటనే రీడ్ కార్ దగ్గరికొస్తాడు. ఈలోగా ఒలీవియ దగ్గరికి ఏదో మాన్స్టర్ వస్తుండడంతో తను గట్టిగా అరుస్తుంది.

Drive Back (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Drive Back (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

ఇక ఇద్దరు భయంతో అక్కడి నుంచి వెంటనే బయల్దేరతారు. తన మీద ఏదో దాడి చేయడానికి వచ్చిందని ఒలీవియా భయపడుతూ చెప్తది. అసలు మనం గ్యాస్ స్టేషన్ దగ్గరున్న ముసలావిడ మాట విని ఈ షార్ట్ కట్ రోడ్లోకి వచ్చుండాల్సింది కాదు అని ఒలీవియ అంటది. అప్పుడు రీడ్, “ఎవరి గురించి మాట్లాడుతున్నావ్?’ అని అంటాడు. దానికి ఒలీవియ, “అదేంటి అలా మాట్లాడతావ్. మనం గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక ముసలావిడని సిటీకి వెళ్ళే రూట్ అడిగాం కదా! తను చెప్పడం వల్లేగా మనం ఈ షార్ట్ కట్ రూట్లోకి వచ్చాం” అని అంటది. కాని రీడ్ కి అవేం గుర్తుండవు, తను మొత్తం మర్చిపోయింటాడు. నువ్వు బాగా అలసి పోయినట్టున్నావ్ కాసేపు పడుకో అని ఒలీవియ చెప్పడంతో రీడ్ నిద్రపోతాడు.

దాడికి పాల్పడ్డ దెయ్యం

కాసేపటి తర్వాత రీడ్ మేల్కొని, “మనం ఇంకా ఇదే రూట్లో ఉన్నామేంటి?” అని చిరాకుపడతాడు. నిజానికి రీడ్ నిద్రపోయిన తర్వాత ఒలీవియ కూడా ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయింటది. ఇక్కడ ఏదో విచిత్రంగా జరుగుతుందని రీడ్ కి అనుమానం వస్తది. ఇంత చిన్న రూట్లో మనం ఇంతసేపు ప్రయాణం చేయడం ఏంటి? ఇప్పటివరకు జరిగిన విషయాలన్ని మనం మర్చిపోవడం ఏంటని రీడ్ అంటాడు. దాంతో ఒలీవియాకి కూడా అనుమానం వస్తది. అప్పుడు హఠాత్తుగా తమ కార్ ముందు ఏదో నీడ కనిపించడంతో ఒలీవియ వెంటనే కార్ ఆపుద్ది. అసలు అదేంటో తెలుసుకోవాలని వారిద్దరు కార్లో నుండి బయటకు దిగుతారు.

కార్లో ఉన్నప్పుడు అంతా పగటి పూటలాగే ఉంటది. కాని వాళ్ళు కార్ దిగినవెంటనే చీకటి పడిపోద్ది. ఏంటి ఉన్నట్టుండి చీకటి పడిందని ఒలీవియ అంటది. అప్పుడు రీడ్, “చాలా సేపటి నుంచి చీకటిగానే ఉంది కదా!” అని అంటాడు. ఇక వాళ్ళు టార్చ్ వేసుకుని అసలు రోడ్డు మీద ఏముందా అని చూస్తారు. తీరా చూస్తే అక్కడొక బంపర్ రోడ్డుకి అడ్డంగా ఉంటది. “ఇదేంటి మళ్ళీ మనం మొదటికి వచ్చాం” అని వాళ్ళు షాక్ అవుతారు. ఆ సమయంలో వాళ్ళకి రోడ్డు పక్కనే ఒక పాడైపోయిన కార్ కనిపిస్తుంది. అది చూసేందుకు అచ్చం వీళ్ళ కార్ లాగే ఉంటది. కానీ వాళ్ళు ఆ విషయాన్ని అంతగా గమనించరు.

ఆ కార్ మీద పై నుండి రక్తం పడుతుండడంతో వీళ్లు తలెత్తి పైకి చూస్తారు. తీరాచూస్తే అక్కడొక శవం రక్తంతో తడిసిపోయింటది. అదే సమయంలో ఒక దెయ్యం వాళ్ళద్దరి మీద దాడి చేస్తుంది. వాళ్ళు భయంతో వెంటనే కార్లోకి వెళ్ళి ఆ దెయ్యాన్ని కారుతో గుద్దిస్తారు. అయినా సరే ఆ దెయ్యం వాళ్లపై దాడి చేసేందుకు ముందుకొస్తది. అప్పుడు రీడ్ తమ కారుని రివర్స్ లో డ్రైవ్ చేస్తాడు. అప్పుడే తమ కార్ బంపర్ ఊడిపోద్ది. అలాగే కార్లో ఫ్యూయల్ కూడా అయిపోద్ది. అదే సమయంలో మరొక కార్ అక్కడికి రావడంతో దెయ్యం తన చూపు మరల్చుకుంటది. ఇక ఇదే సరైన సమయమని వారిద్దరు అడవిలోకి పరుగు తీసి చెట్ల మధ్యలో దాక్కుంటారు.

మోసం బయటపెట్టిన ఒలీవియ

కొంచెం సేపటి తర్వాత దెయ్యం అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో వారిద్దరు రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఒలివియాకి ఒక కార్ కనిపించడంతో చాలా ఆనందపడిద్ది. నిజానికి ఆ కార్ తమదే అన్న విషయాన్ని ఒలీవియ మర్చిపోద్ది. కాసేపటి వరకు తమ మైండ్ వాళ్ల ఆధీనంలో ఉండదు. తమ గతాన్ని మర్చిపోతారు, తల్లితండ్రులను మర్చిపోతారు, అలాగే స్నేహితులని కూడా మర్చిపోతారు. ఇద్దరూ కాసేపు బాగా గొడవపడతారు, పిచ్చోళ్లాగ కింద పడి నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత ఆ మాయ నుంచి బయటికొచ్చి, ఈ రోడ్డు వల్లనే ఇలా విచిత్రంగా ప్రవర్తించామని అర్థం చేసుకుంటారు. ఆ సమయంలో దెయ్యం వచ్చి వాళ్ళపై దాడి చేయడంతో వెంటనే స్పృహకోల్పోతారు.

ఇక అది వాళ్లని తన స్థావరంకి తీసుకెళ్లి తాళ్ళతో బంధిస్తది. కాసేపటికి రీడ్ స్పృహలోకి వస్తాడు. ఇంతకుముందు మనం కార్ వద్ద ఒక శవం వేలాడదీయబడి ఉండడం చూశాం కదా! ఇప్పుడు ఆ శవాన్నే దెయ్యం తింటుంటది. తనని కూడా అది తింటదేమో అని ఒలీవియ చాలా భయపడిపోద్ది. ఒలీవియ మాట్లాడుతూ, “నేను నిన్ను మూడు సంవత్సరాల క్రితం మోసం చేశా కదా! అందుకు నన్ను క్షమించు” అని అంటది. అప్పుడు రీడ్, “అదంతా జరిగిపోయిన విషయం. దాని గురించి మర్చిపో” అని అంటాడు. అప్పుడు ఒలీవియా, “నేను నిన్ను ఒక్కసారి మోసం చేయలేదు. చాలాసార్లు మోసం చేశా” అని అంటది.

Drive Back (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Drive Back (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

ఇక్కడ మోసం చేయడమంటే వేరే మగవాళ్ళతో ఒలీవియ లైంగికంగా కలిసిందనమాట. ఒలీవియ తనని చాలాసార్లు చేసిందని తెలిసి రీడ్ చాలా బాధపడతాడు. “అసలు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనేనా లేక వేరేవాడా” అని రీడ్ కోపంతో అంటాడు. రీడ్ అలా అనడంతో ఒలీవియాకి బాధేసి, “ఈ బిడ్డకి నువ్వే తండ్రివి” అని అంటది. కానీ ఆ తర్వాత తనకు కూడా డౌట్ వచ్చి, “ఏమో నాకు తెలియదు” అన్నట్టు మాట్లాడిద్ది. ఒలీవియ ఏంటి ఇలా చేసిందని రీడ్ చాలా బాధపడి కోపం తెచ్చుకుంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, దయచేసి నన్ను వదిలేయొద్దని ఒలీవియ రీడ్ ని బతిమిలాడుతుంటది.

బయటపడిన నిజం

ఆ సమయంలో దెయ్యం మాట్లాడుతూ, “అసలు తను నిన్ను నిజంగా ప్రేమించడం లేదు. తనొక మోసగత్తె” అని ఒలీవియాని చంపబోతుంది. అప్పుడు హఠాత్తుగా ఎవరో దెయ్యాన్ని కొట్టడంతో అది వెంటనే కిందపడిపోద్ది. నిజానికి అది దెయ్యం కాదు, అది కూడా ఒక మామూలు మనిషే అని వాళ్ళిద్దరికి అప్పుడు అర్థమయిద్ది. దాన్ని కొట్టింది ఎవరో కాదు! “ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి” అని వీళ్ళ మీద వ్యక్తి అరుస్తాడు కదా! ఆ వ్యక్తే ఇప్పుడు దెయ్యం ముసుగులో ఉన్న మనిషిని కొడతాడు. ఇక వారిద్దరు అతన్ని అనుసరిస్తు తన వెనకే వెళ్తారు.

ఆ వ్యక్తి మాట్లాడుతూ, “ఇది సామాన్యమైన రోడ్ కాదు. ఇక్కడ చాలా మాయలు జరుగుతుంటాయి. ఈ రోడ్ వేరే డైమెన్షన్ లో ఉంది. దీని నుంచి బయటపడడం చాలా కష్టమైన పని” అని అంటాడు. వాళ్ళు అతన్ని, “అసలు మీరు ఎవరు? మీ పేరు ఏంటి?” అని అడుగుతారు. “నేనెవరో నాకు గుర్తులేదు. నా పేరు కూడా నాకు తెలీదు. ఈ రోడ్డు వల్లే నేను నా గతం మర్చిపోయా” అని అతడు చెప్తాడు. ఇక వాళ్ళు నడుచుకుంటూ కార్ దగ్గరికొస్తారు. కానీ అప్పటికే ఆ కార్ పాతదైపోద్ది. “అదేంటి మేమిక్కడికొచ్చి కొంచెంసేపే కదా అయింది. ఈలోపే మా కార్ ఇలా పాతదై పోయిందేంటి” అని రీడ్, ఒలీవియ షాక్ అవుతారు.

The Inheritance (2024) Plot Summary Explained in Telugu

అప్పుడా వ్యక్తి వాళ్లిద్దరితో, “ఈ రోడ్ ఒక మల్టీవర్స్ లాంటిది. ఒక్కసారి ఈ రోడ్లోకి అడుగుపెడితే దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ఇక్కడ మీ గతం, ప్రస్తుతం, భవిష్యత్తు జరుగుతుంటాయి. మీలాంటి మనుషులే ఈ రోడ్లో తిరుగుతుంటారు. ఇక్కడున్నది మీ కార్ కాదు. వేరే డైమెన్షన్ నుంచి ఈ రోడ్లోకి వచ్చిన మీలాంటి వాళ్ళ కార్” అని చెప్తాడు. అప్పుడతనికి రోడ్డు పక్కనే ఒక బోర్డు కనిపిస్తది. తను ఆ బోర్డును చూడడం ఇదే మొదటిసారి.

“నేనిక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చిక్కుకుని ఉన్నా. ఇక్కడ్నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలే చేశా. కానీ ఈ ప్రయత్నం సఫలమవ్వలేదు. ఈ రోడ్డు మన జ్ఞాపకాలన్నిటిని మెదడులోంచి తుడిచేస్తది. మీరేదో కొత్తగా చేశారు. అందువల్లే ఈ బోర్డ్ ఇక్కడికొచ్చింది. ఈ రోడ్డులో మీలాంటి వాళ్ళే ఇంకా తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గర్నుంచి కార్ దొంగతనం చేసి, ఎలాగైనా ఇక్కడినుంచి బయటపడండి” అని ఆ వ్యక్తి అంటాడు.

పథకం వేసిన రీడ్, ఒలీవియ

ఆ వ్యక్తి వాళ్ళకి ఇంకేదో చెప్పబోతూ, ఆ రోడ్డు వల్ల ఇప్పటివరకు మాట్లాడిన విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళ మీద అరవడం మొదలుపెడతాడు. ఇక వాళ్లిద్దరు భయంతో తన దగ్గర్నుంచి పారిపోతారు. ఒలీవియ తనని మోసం చేసిందని రీడ్ తన మీద చాలా కోపంగా ఉంటాడు. కానీ తనని ఒంటరిగా వదిలేయలేక, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తనని కూడా బయటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఒలీవియాని రీడ్ చాలా ప్రేమిస్తుంటాడు. మనమేదో కొత్తగా చేశామని అతను చెప్పాడు కదా! ఇంతకీ అది ఏంటని వారిద్దరు ఆలోచిస్తారు. దెయ్యం వీళ్లపై దాడి చేసేందుకు వచ్చినప్పుడు, వీళ్లు తమ కారుని రివర్స్ లో డ్రైవ్ చేస్తారు కదా! అదే బయటపడేందుకు మార్గం.

రోడ్డు మీదున్న బంపర్ దగ్గరగాని లేదా టాయిలెట్ కి వెళ్ళే దగ్గరగాని తమలాంటి వ్యక్తులు కార్ ఆపుతారు. ఆ సమయంలో వాళ్ళ కార్లో ఉన్న ఫ్యూయల్ క్యాన్ కొట్టేసి, తమ కార్లో ఆ పెట్రోల్ నింపుకుని, రివర్స్ లో కార్ నడుపుతూ అక్కడ్నుంచి బయటపడాలని రీడ్, ఒలీవియ పథకం వేస్తారు. అలా వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక శబ్దం వినిపిస్తది. తీరాచూస్తే అక్కడ ఒలీవియా టాయిలెట్ కి వెళ్తుంటది. ఈ ఒలీవియాని మనం గతంలో ఉన్న ఒలీవియాలాగా తీసుకోవచ్చు లేదా వీళ్ళ యెుక్క ఇంకొక వర్షన్ అని కూడా అనుకోవచ్చు. ఇంతకుముందు ఒలీవియ ఒక చోట టాయిలెట్ కి వెళ్తది కదా! అప్పుడు ఎవరో చెట్లలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఒలీవియ మీద ఏదో మాన్స్టర్ దాడి చేయడానికి రావడం జరుగుద్ది కదా! ఆ సీన్ ఇప్పుడు మళ్ళీ జరిగిద్ది.

Drive Back (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Drive Back (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

ప్రస్తుతం ఇద్దరు రీడ్, ఇద్దరు ఒలీవియాలు ఉంటారు. కథ అర్థమవ్వడం కోసం, కొత్తగా వచ్చిన రీడ్ ని ‘రీడ్ 2’, కొత్తగా వచ్చిన ఒలీవియాని ‘ఒలీవియ 2’ అని మాట్లాడుకుందాం. వాళ్ళ కార్లో ఉన్న ఫ్యూయల్ కొట్టేయాలని రీడ్ నిర్ణయించుకుంటాడు. అలా తనొక ఫ్రూట్ లాంటి దాన్ని రోడ్డు మీదకి విసిరేస్తాడు. అదేంటో చూద్దామని రీడ్ 2 దాని దగ్గరికెళ్తాడు. ఆ సమయంలో కార్లో ఉన్న ఫ్యూయల్ క్యాన్ రీడ్ దొంగతనం చేస్తాడు. ఒలీవియ దాక్కొని ఉన్న వైపుకి పొరపాటున ఒలీవియ 2 వెళ్తుండడంతో తనని భయపెట్టేందుకు రీడ్ చెట్లను కదిలిస్తాడు. తనపై మాన్స్టర్ దాడి చేసేందుకు వస్తుందేమో అని భయపడి ఒలీవియ 2 కార్ వైపు పరుగుతీస్తది. ఇది ఇంతకుముందు జరిగిన సన్నివేశం యొక్క మరో కోణం అనమాట.

మొదలైన అనుమానం

ఇక రీడ్, ఒలీవియ తమ కార్లో ఫ్యూయల్ నింపుకుంటారు. అక్కడ్నుంచి బయటపడేందుకు వీళ్ళకున్న ఆఖరి అవకాశం ఇది ఒక్కటే అనుకోవచ్చు. రీడ్ మాట్లాడుతూ, “సరే జరిగిందంతా ఇద్దరం మర్చిపోదాం. ఇప్పటినుంచి మన జీవితాన్ని ఫ్రెష్ గా మొదలుపెడదాం” అని ఒలీవియాని కౌగిలించుకుంటాడు. దాంతో ఒలీవియ కూడా చాలా సంతోషపడిద్ది. ఇంతకుముందు రీడ్ తల మీద దెయ్యం కొట్టడం వల్ల తనకి గాయం ఏర్పడిద్ది. ఆ గాయానికి కట్టు కట్టడానికి ఏదైనా బ్యాండేజ్ ఉందేమో అని ఒలీవియ కార్ వెనక సీట్లో వెతుకుతుంటది. అప్పుడు తనకి ఒక ప్లాస్టిక్ పట్ట, ఒక కత్తి కనిపిస్థాయి. ఈ ప్లాస్టిక్ పట్టని కప్పుకునే ఒక మనిషి దెయ్యంలాగా వేషం వేసుకుంటాడు.

తను మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు రీడ్ యెుక్క వర్షన్ దెయ్యంలాగా వేషం వేసుకుని తనని చంపేందుకు చూశాడని ఒలీవియ అనుకుంటది. దాంతో ఒలీవియ ఆ కత్తిని అందుకుని రీడ్ ని బెదిరించి కార్లో నుంచి కిందకి దిగమంటది. ఒలీవియ ఎలా ఎందుకు బెదిరిస్తుందో రీడ్ కి ఏమీ అర్థం కాదు. అయినా సరే తను కార్లోంచి కిందకి దిగుతాడు. ఆ సమయంలో దెయ్యం అక్కడికొచ్చి రీడ్ మీద దాడి చేయాలని చూడడంతో, రీడ్ భయంతో అడవిలోకి పారిపోతాడు. దెయ్యం కూడా తన వెనకే పరుగుతీస్తది. దెయ్యం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రీడ్ దగ్గరన్న కార్ కీస్ కిందపడిపోతాయి. దెయ్యం ఆ కీస్ తీసుకుని తిరిగి కార్ దగ్గరికొస్తది.

Bagman (2024) Plot Summary Explained in Telugu

కార్లో ఉన్న ఒలీవియాకి భయంకరమైన ఇల్యూజన్స్ కనిపిస్తుంటాయి. తన శరీరం రక్తంతో తడిసిపోయిన్నట్టు కనిపిస్తుండడంతో, ఒలీవియా భయంతో కార్లో నుండి కిందకి దిగిద్ది. అప్పుడు దెయ్యం ఒలీవియాని కత్తితో పొడిచి, తన ముఖానికున్న మాస్క్ తీసేస్తది. నిజానికి దెయ్యంలాగా వేషం వేసుకున్నది రీడ్ యొక్క వర్షన్ కాదు. దెయ్యంలాగా వేశం వేసుకున్నది ఒలీవియా యొక్క వర్షన్. ఇక ఒలీవియ వర్షన్ ఒలీవియాని చంపాలని చూస్తుండగా రీడ్ అక్కడికొచ్చి ఒలీవియ వర్షన్ మీద దాడి చేసి చంపేస్తాడు. తీరాచూస్తే వాళ్ళ దగ్గరికి రీడ్ యొక్క వర్షన్ వస్తాడు. రీడ్ వర్షన్ వాళ్ళిద్దరిపై దాడి చేసి ఒలీవియాని ఒక కార్ దగ్గరికి లాక్కెళ్లి చంపేందుకు ప్రయత్నిస్తాడు.

పాపని కలుసుకున్న రీడ్

ఇంతకుముందు ఆ పాత కారు వద్ద ఒక శవం చెట్టుకి వేలాడదీయబడి ఉంటది కదా! ఆ విషయం ఇప్పుడు ఒలీవియాకి గుర్తొస్తది. “అంటే ఈ రీడ్ వర్షన్ నన్ను చంపేసి ఇక్కడ వేలాడదీశాడా!?” అని భయపడిపోయి ఒలీవియ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తది. కానీ రీడ్ వర్షన్ ఒలీవియాని అస్సలు వదిలిపెట్టడు. రీడ్ వర్షన్ ఒలీవియాని చంపేయబోతుండగా రీడ్ అక్కడికొచ్చి తన గొంతుకోసి చంపేస్తాడు. ఆ తర్వాత తన దగ్గరున్న లైటర్ ఉపయోగించి తన వర్షన్ ని మంటల్లో తగలబెట్టేస్తాడు. ఆ మంటల వల్ల మిగతా వర్షన్స్ చనిపోతారు. ఇక రీడ్, ఒలీవియ కార్లోకి ఎక్కేస్తారు. రీడ్ తమ కారుని వేగంగా రివర్స్ లో డ్రైవ్ చేయడంతో, వాళ్ళు విజయవంతంగా ఆ రోడ్ నుంచి బయటపడతారు. అలా వాళ్ళు టైమ్ లూప్ నుంచి తప్పించుకున్నందుకు రీడ్ చాలా ఆనందపడతాడు.

కానీ అలా రోడ్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ఒలీవియ చనిపోద్ది. బయట ప్రపంచంలో ఒలీవియ జ్ఞాపకాలతో ఒంటరిగా బతకలేక రీడ్ ఒక కర్ర తీసుకుని మళ్ళీ అదే రోడ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంతకుముందు వీళ్ళతో మాట్లాడిన ఆ వ్యక్తి కూడా రీడ్ యొక్క వర్షన్ అనమాట. రీడ్ ఆ రోడ్లోకి వెళ్ళగానే ఒలీవియాకి ప్రాణం వస్తది. కాసేపటి తర్వాత రీడ్ కి ఒక పాప కనిపిస్తది. ఆ పాప చేతిలో రీడ్, ఒలీవియాల ఫోటో ఉంటుంది. అంటే ఒలీవియ బతికిందని, ఒలివియా తనకోసం ఈ రోడ్లోకి వచ్చి ఒక పాపకి జన్మనిచ్చిందని రీడ్ కి అర్థమవుద్ది. ఆ పాప కళ్ళు అచ్చం రీడ్ కళ్ళలాగే నీలం రంగులో ఉంటాయి. అంటే ఈ పాప ఖచ్చితంగా తన పాపే అని రీడ్ అర్థం చేసుకుని, పాపని ప్రేమగా కౌగిలించుకున్నాడు.

ముగింపు

చూశారు కదా ఈ సినిమాలో ఎన్ని రకాల ట్విస్టులు ఉన్నాయో! మీకు అర్థంకాని ప్రతీ సన్నివేశాన్ని మరియు ఎండింగ్ అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఇప్పటివరకు వివరించడం జరిగింది. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది.

  • కథ మొత్తం రెండు పాత్రల చుట్టే నడిచినప్పటికీ ఎక్కడా కూడా ప్రేక్షకులు విసుగుచెందరు. ఎందుకంటే ప్రతీ సన్నివేశం కూడా చాలా రసవత్తరంగా, ఆసక్తికరంగా ఉంటాయి.
  • ప్రేక్షకుల్ని భయపెట్టడంలో మరియు వాళ్ళ మెదడుకి పదును పెద్దడంలో ఈ సినిమా విజయం సాధించింది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరాయి.
  • మొత్తానికి Drive Back (2024) ప్రేక్షకుల చూపుని తన వైపుకి మళ్ళించుకోవడంలో కూడా విజయం సాధించింది. కేవలం ఒక్కసారి చూసి వదిలేసే సినిమా ఐతే ఇది కాదు.
  • సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా ప్రతి సన్నివేశం మన కళ్లముందే కదిలాడుతుంటది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ సినిమాని ఒక్కసారి కంటే ఎక్కువగానే చూసేయొచ్చు. కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమాని చూడొచ్చా అని అడిగితే, ఖచ్చితంగా మీరు మీ కుటుంబసభ్యులతో కలిసి చూడొచ్చు అని సమాధానమిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కూడా చూసేయండి!

Leave a Comment