Despicable Me 4 (2024) Plot Summary Explained in Telugu
మినియన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి! అవి చేసే అల్లరి, చిత్ర విచిత్రమైన పనులు మనందరికీ నవ్వు తెప్పిస్తాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మినియన్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజు మనం 2024లో విడుదలైన “Despicable Me 4” అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ‘గ్రూ’ అనే మాజీ సూపర్ విలన్ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ అతని గతం అంత సులువుగా తనని వదిలిపెట్టదు. కొత్త విలన్స్, కొత్త సమస్యలు, మరియు కొత్త మిషన్స్ అతని జీవితంలోకి ప్రవేశిస్తాయి.
ఒక శక్తివంతమైన విలన్ గ్రూ కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే కథ. అసలా విలన్ ఎవరు!? తను ఎందుకని గ్రూ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడో మనం ఇంకొన్ని క్షణాల్లో తెలుసుకుందాం. ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా మినియన్స్ చేసే పనులకి ఎవ్వరికైనా నవ్వు రావాల్సిందే. కానీ ఈ సినిమా కేవలం ఫన్నీ క్యారెక్టర్స్ గురించే కాదు. ఈసారి కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ మరింత బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలతో గ్రూ యొక్క బంధం చాలా హృదయ పూర్వకంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమా కథా విశేషాలను తెలుసుకుందాం రండి!
హీరో – విలన్ ఎదురెదురు
‘గ్రూ’ వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ‘స్కూల్ ఆఫ్ విలనీ’ వద్దకి చేరుకుంటాడు. తనతోపాటు మూడు మినియన్స్ కూడా ఒక చిన్న కార్లో స్కూల్ ఆఫ్ విలనీకి వస్తాయి. ‘మ్యాక్సిమ్ ల మాల్’ అనే నేరస్తుడిని పట్టుకోవడం కోసం గ్రూ ఆ స్కూల్ కి వస్తాడు. గ్రూ చిన్నప్పుడు చదువుకున్నది కూడా ఈ స్కూల్లోనే. కాబట్టి ఆ మూడు మినియన్స్ ని పనిపై శ్రద్ధగా దృష్టి పెట్టమని గ్రూ చెప్తాడు. నిజానికి మ్యాక్సిమ్ మరియు గ్రూకి మధ్య చిన్నప్పటి నుంచి కొన్ని గొడవలుంటాయి. ఆ గొడవలేంటి అనేవి మనకి పోను పోనూ తెలుస్తాయి.
స్కూల్లోకి రాగానే ఆ మూడు మినియన్స్ ఒక పెద్ద జెల్లీని చూసి, వచ్చిన పని మర్చిపోయి ఆ జెల్లి దగ్గరికెళ్లి దాన్ని తింటుంటాయి. కానీ గ్రూ మాత్రం మ్యాక్సిమ్ దగ్గరికెళ్తాడు. మ్యాక్సిమ్, గ్రూకి తన గర్ల్ ఫ్రెండ్ ‘వాలంటీనా’ ని పరిచయం చేసి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటు గ్రూని అందరిముందు అవమానిస్తుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా స్కూల్ ప్రిన్సిపల్ స్టేజ్ పైకి వచ్చి ఈ సంవత్సరం ‘అలమ్ నై’ అవార్డుని అందుకోబోతున్న వ్యక్తిని ప్రకటిస్తది. ఈ సంవత్సరం అలమ్ నై అవార్డుని గెలుచుకున్నది మ్యాక్సిమ్ అని ప్రిన్సిపల్ చెప్పగానే గ్రూ షాకైపోతాడు.
మ్యాక్సిమ్ కి బొద్దింకలంటే చాలా ఇష్టం, అసలు తనకి బొద్దింకలంటే ఎందుకిష్టమో, ఆ బొద్దింకల యొక్క పూర్తి శక్తి ఏంటో అందరికీ తన ప్రసంగంలో చెప్తూ మ్యాక్సిమ్ ఒక్కసారిగా తన బట్టల్ని చించేస్తాడు. తీరాచూస్తే తను కూడా ఒక బొద్దింకలాగా మ్యూటెంట్ గా మారిపోయి ఉంటాడు. అలా బొద్దింక రూపంలో మ్యూటెంట్ గా మారిన మ్యాక్సిమ్ ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక మ్యాక్సిమ్ గ్రూ వైపు చూస్తూ, “ఇప్పుడేమంటావు గ్రూ” అని అంటాడు. గ్రూ ఒక నవ్వు నవ్వి, తన ID బయటకి తీసి తనొక ‘యాంటి విలన్ ఏజెంట్’ అని బయటపెడతాడు. ఇక గ్రూ తన దగ్గరున్న గన్ తో మ్యాక్సిమ్ ని షూట్ చేస్తూ తనని పట్టుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మ్యాక్సిమ్ మాత్రం ఆ దాడి నుంచి తప్పించుకొని గ్రూపై తిరగబడతాడు.

కొత్త ఇంట్లోకి ప్రవేశం
సరిగ్గా అప్పుడే ఇంకొంత మంది యాంటీ విలన్ ఏజెంట్స్ స్కూల్ లోపలికి వచ్చి మ్యాక్సిమ్ ని బంధిస్తారు. అప్పుడు మ్యాక్సిమ్, “నేనిప్పుడు ఓడిపోయినప్పటికీ అతి త్వరలో నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటా” అని గ్రూని బెదిరిస్తాడు. ఇక యాంటీ విలన్ ఏజెంట్స్ మ్యాక్సిమ్ ని జైలుకి తీసుకెళ్తారు. మ్యాక్సిమ్ వార్నింగ్ విన్న గ్రూకి, మొదట కాస్త భయమేసినప్పటికీ తను దాన్ని అంతగా పట్టించుకోడు. కొంచెంసేపటి తర్వాత గ్రూ షాపింగ్ నుంచి ఇంటికొస్తాడు. గ్రూ భార్య పేరు ‘లూసీ’. వాళ్ళ కొడుకు పేరు ‘గ్రూ జూనియర్’. గ్రూ దగ్గర ముగ్గురు చిన్న పిల్లలు పెరుగుతుంటారు. వాళ్ల పేర్లు వచ్చేసి ‘మార్గో’, ‘ఎడిత్’ మరియు ‘అగ్నెస్’. వీళ్లు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు.
గ్రూకి తన కొడుకు అంటే చాలా ఇష్టం. వాడికి మాత్రం తన అమ్మ మీద ప్రేమ ఉంటది కానీ నాన్న మీద అంతగా ప్రేమ ఉండదు. కాబట్టి గ్రూ తన కొడుకు ప్రేమ పొందేందుకు ప్రతి నిమిషం ఆరాటపడుతుంటాడు మరియు తన కొడుకు తనని నాన్న అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తుంటాడు. గ్రూ తన కొడుకుని ఎత్తుకుని ఆడిపిస్తుండగా సరిగ్గా అదే సమయంలో యాంటీ విలన్ లీగ్ డైరెక్టర్ ‘సైలస్’ వస్తాడు. సైలస్ మాట్లాడుతూ, “మ్యాక్సిమ్ జైల్ నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి నువ్వు, నీ కుటుంబ సభ్యులు కాస్త జాగ్రత్తగా ఉండండి” అని హెచ్చరిస్తాడు. మ్యాక్సిమ్ చాలా శక్తివంతుడు. వాడు గ్రూని చంపేసిన చంపేస్తాడని సైలస్ భయపడతాడు. అందుకని గ్రూ ఫ్యామిలీని ‘మేఫ్లవర్’ అనే టౌన్ కి పంపించాలనుకుంటాడు.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రూ ఫ్యామిలీ మేఫ్లవర్ టౌన్ కి వచ్చేస్తారు. గ్రూతో పాటు మూడు మినియన్స్ కూడా మేఫ్లవర్ కి వస్తాయి. మిగతా మినియన్స్ అన్నింటిని సైలస్ AVL కి తీసుకెళ్తాడు. మేఫ్లవర్ లో ఉన్న ఇళ్లన్నీ చాలా పెద్దగా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉండబోతున్నందుకు గ్రూ ఫ్యామిలీ చాలా ఆనందిస్తారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉండబోతున్నది ఒక చిన్న ఇంట్లో అని. “పర్వాలేదులే ఏ ఇల్లు అయితే ఏమి!” అని అనుకొని వాళ్లిక ఇంట్లోకి అడుగుపెడతారు. ఈ టౌన్ లో నివసించే ప్రజలకి గ్రూ ఒకప్పుడు విలన్ అని, ప్రస్తుతం తను యాంటి విలన్ ఏజెంట్ అనిగాని ఎవరికీ తెలియదు.
మినియన్స్ – సూపర్ పవర్స్
తమ కొత్త ఇంట్లో ఒక క్యాండీ మిషన్ ఉండడంతో ఒంటి కన్ను మినియన్ ఆశగా క్యాండీస్ అందుకోడానికి ప్రయత్నించి మిషన్లో ఇరుక్కుపోయిద్ది. అప్పుడు మిగతా రెండు మినియన్స్ సరదాగా దాన్ని కొడుతూ జాలీగా నవ్వుతుంటాయి. కట్ చేస్తే, మ్యాక్సిమ్ తన గర్ల్ ఫ్రెండ్ వాలంటీనాతో కలిసి బొద్దింకలతో మీటింగ్ ఏర్పాటుచేసుకొని గ్రూని ఎలా పట్టుకోవాలో చర్చిస్తుంటాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా తను గ్రూ యొక్క కొడుకుని కిడ్నాప్ చేసి కక్ష సాధించాలని పథకం వేస్తాడు. ఇక తను గ్రూ ఎక్కడున్నాడో వెతకడం ప్రారంభిస్తాడు.

కట్ చేస్తే, గ్రూ ఫ్యామిలీ తమ కొత్త ఇంటికి అలవాటుపడటం మొదలుపెడతారు. మార్గోని స్కూల్లో వదిలిపెట్టేందుకు గ్రూ కార్ దగ్గరికి రాగా తనకి ‘పెర్రీ’ కనిపిస్తాడు. పొరుగింటి వాళ్ళతో స్నేహం చేసేందుకు ఇదే మంచి అవకాశమని, గ్రూ పెర్రీ దగ్గరికెళ్లి తనని తాను పరిచయం చేసుకుంటాడు. కానీ పెర్రీకి మాత్రం తనతో మాట్లాడడం అంతగా ఇష్టముండదు. అప్పుడక్కడికి పెర్రీ కూతురు ‘పాపి’ వస్తుంది. గ్రూ తనకి కూడా హలో చెప్తాడు, కానీ ఆ చిన్నపిల్ల కూడా గ్రూని అంతగా పట్టించుకోదు. ఇక గ్రూ, మార్గోని స్కూల్ దగ్గర వదిలిపెడతాడు. అక్కడ తనకి పాపి మళ్ళీ కనిపిస్తది. ఈసారి తను గ్రూ వైపు చూసి ఒక నవ్వు నవ్వి స్కూల్లోకి వెళ్తది.
తర్వాత సైలస్ మినియన్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. జైలు నుంచి తప్పించుకున్న మ్యాక్సిమ్ ని పట్టుకోడానికి సైలస్ మినియన్స్ ని మెగామినియన్స్ గా మార్చాలనుకుంటాడు. ఈ విషయాన్ని తను మినియన్స్ తో చెప్పి వాలంటీర్స్ గా కొంతమందిని ముందుకు రమ్మంటాడు. కానీ ఆ మినియన్స్ తెలివిగా కాస్త వెనక్కి వెళ్తాయి. ఈ విషయాన్ని గమనించని ఐదుగురు మినియన్స్ మాత్రం అక్కడే నిలబడి ఉంటారు. ఇక సైలస్ ఆ ఐదు మినియన్స్ ని మెగామినియన్స్ గా మారుస్తాడు.
అంతా గందరగోళమే!
కట్ చేస్తే అగ్నెస్, ఎడిత్ లను లూసీ కరాటే స్కూల్లో వదిలిపెట్టిద్ది. ఈ స్కూల్లోని కరాటే మాస్టర్ పిల్లలతో చాలా కఠినంగా ఉంటుంటాడు. కరాటే మాస్టర్ అగ్నేస్ ని “నీ పేరేంటో చెప్పి నిన్ను నువ్వు పరిచయం చేసుకో” అని చెప్తాడు. కానీ అగ్నెస్ మాత్రం అందరిముందు తనని తాను పరిచయం చేసుకునేందుకు కాస్త ఇబ్బందిపడిద్ది. దాంతో మాస్టర్ తనపై కోప్పడతాడు. ఎడిత్ కోపంతో, “నా చెల్లెలి పైనే కోప్పడతావా?” అని మాస్టర్ కాలుని గట్టిగా తొక్కగా ఆ మాస్టర్ చిటికెన వేలు విరిగిపోద్ది. అది చూసిన మిగతా పిల్లలందరూ ఎడిత్ దగ్గరికొచ్చి చాలా ఆనందపడతారు. అదే సమయంలో బ్యూటీ పార్లర్ లో పని చేసేందుకు లూసీ పార్లర్ కి వెళ్తది. కాకపోతే తనకసలు బ్యూటీ పార్లర్ లో ఎలా పని చేయాలో ఏమీ తెలియదు.
సరిగ్గా అప్పుడే ఒక ఆవిడ పార్లర్ లోపలికి వస్తది. తను లూసీకి ఒక ఫోటో చూపించి “నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలి” అని అంటది. లూసీకి ఇలాంటి పనుల్లో చాలా అనుభవం ఉందిలే అని మిగతా స్టాఫ్ అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా! అసలు లూసీకి ఎటువంటి అనుభవం లేదని. ఇక చేసేదేం లేక లూసీ ఏవేవో ప్రొడక్ట్స్ ని ఆ కస్టమర్ జుట్టుకి పోస్తది. ఆ ప్రొడక్ట్స్ తేడా కొట్టడంతో ఆవిడ జుట్టు కొంచెం కొంచెంగా కాలిపోవడం మొదలయిద్ది. ఆ మంటలు పక్కనే ఉన్న కరెంట్ వైర్స్ కి కూడా అంటుకోవడంతో అక్కడంతా గందరగోళం ఏర్పడిద్ది.
దాంతో పార్లర్ లోని వ్యక్తులందరూ భయంతో బయటికొచ్చేస్తారు. ఇదే సరైన సమయమని లూసీ కూడా పార్లర్ నుంచి తప్పించుకుని బయటికొచ్చేస్తుంది. అలా మొదటి రోజే లూసీ తన ఉద్యోగం పోగొట్టుకుంటది. కట్ చేస్తే, మ్యాక్సిమ్ మనుషుల్ని బొద్దింకలుగా మార్చేందుకు ఒక ఆయుధం సిద్ధం చేస్తాడు. మార్గోని స్కూల్ నుంచి ఇంటికి తెచ్చేందుకు గ్రూ తన కార్లో స్కూల్ దగ్గరికొస్తాడు. గ్రూ తన కొడుకుతో ప్రేమగా నడుచుకుంటూ తనని నాన్న అని పిలవమని అడుగుతుంటాడు. కానీ వాడు మాత్రం బాగా అల్లరి చేస్తూ గ్రూని ఇబ్బందిపెడుతుంటాడు. అదే సమయంలో మార్గో స్కూల్ నుంచి బయటికి రావడంతో, ఇక వాళ్ళు ముగ్గురు కారులో ఇంటికొచ్చేస్తారు. చెత్త పారేసెందుకు గ్రూ రాత్రిపూట ఇంట్లోంచి బయటకి రాగా తనకక్కడ పాపి కనిపిస్తది.

పగ పెంచుకోవడానికి కారణం
పాపి గ్రూతో, “నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు మాస్టర్ విలన్ అని ఇక్కడున్న అందరికీ చెప్పేస్తా దానివల్ల నీకే సమస్య వస్తది. అలా నీకు నీ కుటుంబానికి సమస్య రాకూడదనుకుంటే నువ్వు నాకు సహాయం చేయి. నాకు కూడా విలన్ గా మారాలని ఉంది. అందుకు నువ్వే నాకు సహాయం చేయాలి, లేదంటే నీ గురించిన నిజాన్ని అందరికీ చెప్పేస్తా” అని అంటది. తన మాటల్ని విన్న గ్రూ, “నా గురించి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది” అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తన కుటుంబానికి ఏ సమస్యా రాకూడదని, “సరే నేను నీకు సహాయం చేస్తా” అని ఒప్పుకుంటాడు
మరుసటి రోజు ఉదయం పెర్రీ భార్య ‘ప్యాట్సి’ కి, గ్రూ కుటుంబానికి పరిచయం ఏర్పడుతుంది. పెర్రీకి ఇరుగు పొరుగు వారితో మాట్లాడడం అంతగా ఆసక్తి ఉండదు. కానీ ప్యాట్సికి మాత్రం అందరితో సరదాగా ఉండడమంటే చాలా ఇష్టం. అలా ప్యాట్సి, గ్రూ మరియు లూసీలని టెన్నిస్ ఆటకి ఆహ్వానిస్తది. తమని ప్యాట్సి టెన్నిస్ ఆటకి ఆహ్వానించడంతో గ్రూ చాలా సంతోషపడతాడు. కొంచెంసేపటి తర్వాత తనని ట్రీ హౌస్ దగ్గర కలవమని పాపి గ్రూకి ఒక ఉత్తరం రాస్తది. అసలు మ్యాక్సిమ్, గ్రూకి మద్యున్న గొడవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు స్కూల్లో ఒక టాలెంట్ షో జరుగుతుంటది. ఆ షోలో మ్యాక్సిమ్ ఒక పాట పాడి అందర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటాడు.
కానీ తన కంటే ముందు గ్రూ స్టేజ్ మీదకొచ్చి మ్యాక్సిమ్ పాడాలనుకున్న పాటని గ్రూ పాడతాడు. దాంతో మ్యాక్సిమ్ చాలా నిరాశ చెందుతాడు. తను పాడాలనుకున్న పాటని గ్రూ కావాలనే కాపీ కొట్టి, తనని పాడనివ్వకుండా చేశాడని మ్యాక్సిమ్ అనుకుంటాడు. అలా మ్యాక్సిమ్ అప్పటినుంచి గ్రూపై పగని పెంచుకుంటాడు. “నువ్వు పాడాలనుకున్న పాటనే గ్రూ కూడా పాడడం ఒకవేళ అనుకోకుండా జరిగుండొచ్చు కదా!” అని వాలెంటీనా అంటది. దానికి మ్యాక్సిమ్, “లేదు లేదు, వాడు ఖచ్చితంగా కావాలనే నేను పాడాలనుకున్న పాటని కాపీ కొట్టాడు. కాబట్టి నేనిప్పుడు వాడి కొడుకుని దొంగతనం చేసి నా ప్రతీకారం తీర్చుకుంటా” అని అంటాడు.
ముగింపు
ఈ విధంగా ఒక పక్క సరదాగా, మరోపక్క చాలా రసవత్తరంగా కథ ముందుకెళ్తుంది. నాకైతే సినిమా చాలా మంచిగా అనిపించింది.
- మొత్తానికి ఇదొక మంచి అనుభూతినిచ్చే సినిమా. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఒకసారి ఈ సినిమాని చూసేయొచ్చనమాట.
- కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉంటాయి. మినియన్స్ చేసే కామెడీ ఎప్పటిలాగే ఈ సినిమాకి హైలైట్. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మనస్పూర్తిగా నవ్వుకోవచ్చు.
- గ్రూ ఒక విలన్ పాత్ర నుంచి బాధ్యత గల తండ్రిగా మారడాన్ని చాలా అందంగా చూపించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, మరియు నమ్మకం ఇలా ప్రతీది చాలా బాగా సమపాళ్లలో చూపించారు.
- యానిమేషన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. రంగులు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతీది కథకి మంచి బలాన్ని చేకూర్చాయి.
ఈ సినిమా చూస్తున్నపుడు ఎక్కడ కూడా విసుగు అనిపించదు. మినియన్స్ చేసే చిన్న చిన్న పనులు, వాళ్ల అల్లరి, మరియు గ్రూ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి.
