Cobweb (2023) Plot Summary Explained in Telugu

Cobweb (2023) Plot Summary Explained in Telugu

మీకు మీ ఇంటి గోడల్లోంచి ఎప్పుడైనా విచిత్రమైన శబ్ధాలు వినిపించాయా!? గోడల్లోంచి శబ్ధాలు వినిపించడమేంటి అని అనుకుంటున్నారా!? మనం ఈ రోజు మాట్లాడుకోబోయే సినిమాలో ఒక పిల్లవాడికి తన ఇంటి గోడల్లోంచి విచిత్రమైన శబ్ధాలు వినిపిస్తుంటాయి. 2023లో విడుదలైన “Cobweb” అనే సినిమా గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇదొక సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథంతా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుంటది. తనకి ప్రతిరోజూ తన గదిలోని గోడల వెనుక నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. దానికి తోడు ఆ పిల్లాడి తల్లితండ్రులు కూడా చాలా అనుమానస్పదంగా, కఠినంగా ప్రవర్తిస్తుంటారు. తన తల్లితండ్రులు నిజంగా మంచి వాళ్లేనా? లేక ఏదైనా రహస్యాన్ని దాచిపెడుతున్నారా? అసలు ఆ శబ్దాలు చేస్తుంది మనిషా!? లేక దెయ్యమా!? ఆ శబ్దాలు కేవలం ఆ పిల్లాడికి మాత్రమే ఎందుకు వినిపిస్తున్నాయి!? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం రండి!

మొదలైన వింత శబ్దాలు

‘పీటర్’ అనే పిల్లాడు తన అమ్మానాన్నలతో ఒక పాత ఇంటిలో నివసిస్తుంటాడు. పీటర్ అమ్మ పేరు ‘కారోల్’, నాన్న పేరు ‘మార్క్’. తనకి పెద్దగా స్నేహితులు ఎవరూ ఉండరు. తను ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు మౌనంగా ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి తన గదిలో ఏదో శబ్ధం వస్తుండడంతో పీటర్ కి మెలకువ వస్తది. పీటర్ వెంటనే నిద్ర లేచి చుట్టూ పరిశీలిస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. సరేలే అని తను మళ్ళీ నిద్రపోతాడు. తన పక్కనున్న గోడలోంచి మళ్ళీ ఏదో శబ్ధం వస్తది. పీటర్ కి భయం వేసి వెంటనే లైట్ వేస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తను ఆ గోడ దగ్గరికి వెళ్లి తట్టి చూస్తాడు. అప్పుడు అవతలి వైపు నుంచి కూడా ఎవరో గోడను కొడతారు. పీటర్ కి భయం వేసి వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు.

The Strangers: Chapter 1 Plot Summary Explained in Telugu

తన అమ్మ వచ్చి గోడని పరిశీలిస్తది. కానీ ఈసారి మాత్రం ఎటువంటి శబ్ధం రాదు. ఇక ఆమె పీటర్ ని పడుకోబెట్టి, “మన ఇళ్లు పాతది కదా! అప్పుడప్పుడు అలా శబ్ధాలు వస్తుంటాయిలే. నువ్వేం భయపడొద్దు, నీకు ఊహా శక్తి చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు” అని అంటది. తెల్లవారిన తర్వాత పీటర్ స్కూల్ కి వెళ్తాడు. తనని మిగతా పిల్లలందరూ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. ‘డివైన్’ అనే ఆమె కొన్ని రోజులు పిల్లలకి పాఠాలు చెప్పేందుకు టీచర్ గా వస్తది. ఆ రోజు రాత్రి పీటర్ తన అమ్మానాన్నలతో మాట్లాడుతూ, “హాలోవీన్ పండగకి నేనేం కాస్ట్యూమ్ వేసుకునేను?” అని అడుగుతాడు. దానికి వాళ్ళు, “కొన్ని సంవత్సరాల క్రితం హాలోవీన్ సమయంలో ఒక అమ్మాయి తప్పిపోయింది.

తను ఇప్పటికీ తిరిగిరాలేదు. నీకు అలా జరగడం మాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు హాలోవీన్ రోజున ఇంట్లోనే ఉంటున్నావ్” అని చెప్తారు. ఇంక పీటర్ ఏం చేయలేక తన గదికి వెళ్లి పడుకుంటాడు. ఆ గోడ లోపల ఏముందో ఏమో గాని, అది గోడలో నుండి కాస్త ముందుకొస్తది. కొంచెంసేపటి తర్వాత, అది పీటర్ ని పేరు పెట్టి పిలుస్తది. పీటర్ కి భయం వేసి, “నాన్న” అని గట్టిగా పిలుస్తాడు. మార్క్ వెంటనే తన దగ్గారికొస్తాడు. కానీ అప్పుడు మాత్రం ఏ శబ్ధాలు రావు. అప్పుడు మార్క్, “ఒకవేళ అలా శబ్ధం చేస్తున్నది ఎలుకలేమో. నువ్వు ప్రశాంతంగా పడుకో” అని చెప్తాడు. మరుసటి రోజు ఆ ఎలుకల్ని చంపడానికి మార్క్, పీటర్ ఎలుకల మందు తెస్తారు. ఆ మందు సినమన్ వాసన వస్తుందని పీటర్ అంటాడు.

Cobweb (2023) Plot Summary Explained in Telugu
Cobweb (2023) Plot Summary Explained in Telugu
ఎవరా అమ్మాయి?

అప్పుడు మార్క్, “వాసన బాగుందని తినకు, తింటే చనిపోతావ్” అని చెప్తాడు. ఆ తరువాత ఇద్దరూ ఎలుకల మందు చల్లుతారు. కట్ చేస్తే హాలోవీన్ కోసమని పిల్లలందరి చేత స్కూల్లో బొమ్మలు వేపిస్తుంటారు. అప్పుడు పీటర్ కాస్త భయంకరంగా బొమ్మ వేస్తాడు. డివైన్ అది చూసి, “పీటర్ ఏంటి ఇలాంటి బొమ్మ వేశాడు. తనకి ఏమైనా అయిందా? ఇంట్లో తనని వాళ్ళ అమ్మ నాన్న బాగానే చూసుకుంటున్నారా లేదా?” అని అనుమానం చెందిద్ది. తను పీటర్ ఇంటికెళ్లి ఆ బొమ్మని కారోల్ కి చూపిస్తది. అప్పుడు కారోల్, “పీటర్ కి ఊహా శక్తి చాలా ఎక్కువ. అలా తను ఏవేవో ఊహించుకుని ఈ విధంగా బొమ్మ గీసుంటాడు” అని అంటది. కానీ డివైన్ కి మాత్రం కారోల్ ప్రవర్తన మీద అనుమానం కలిగిద్ది. ఇక డివైన్ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోద్ది. కారోల్ పీటర్ దగ్గరికి వెళ్లి, “ఏంటి నువ్వు ఈ విధంగా బొమ్మ గీశావ్.

నీకు సహాయం చేయమని బయటవాళ్ళని పిలుస్తున్నావా. మేము నిన్ను సరిగా చూసుకోవట్లేదా” అని కోప్పడిద్ది. నిజానికి పీటర్ ఆ బొమ్మ గీసింది తన గురించి కాదు. ఆ గోడ లోపల నుండి ఎవరో అమ్మాయి తనకి సహాయం చేయమని పీటర్ ని అడుగుతుంటది. పీటర్ దాన్ని బొమ్మగా వేస్తాడనమాట. కట్ చేస్తే, ఆరోజు రాత్రి కూడా గోడ లోపల నుండి ఆ అమ్మాయి పీటర్ ని పిలుస్తది. తను పీటర్ తో మాట్లాడుతూ, “నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నా. నీకు ఇష్టమయితే మనం స్నేహితులం అవుదాం, లేదంటే నేను వెళ్ళిపోతా” అని అంటది. పీటర్ కి కూడా ఎలాగు స్నేహితులెవరూ ఉండరు కదా! అందుకని తను ఆ అమ్మాయితో స్నేహం చేసేందుకు ఒప్పుకుంటాడు. మరుసటి రోజు స్కూల్లో పిల్లలందరూ గుమ్మడి కాయ మీద బొమ్మ వేస్తుంటారు. పీటర్ కూడా తన గుమ్మడి కాయ మీద బొమ్మ వేసి, దానికి ‘హెక్టర్’ అనే పేరు పెడతాడు.

డివైన్ పీటర్ దగ్గరికొచ్చి, “నువ్వు చేసిన బొమ్మ చాలా బాగుంది” అని అంటది. అయితే ఆ మాటలు ‘బ్రైన్’ అనే పిల్లాడు విని జలసీ చెందుతాడు. వాడు ఆ జలసీతో పీటర్ గుమ్మడి కాయని నాశనం చేస్తాడు. పీటర్ ఇంటికొచ్చి ఆ రోజు రాత్రికి బాగా ఏడుస్తుంటాడు. అప్పుడు గోడ లోపలున్న అమ్మాయి, “ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్” అని అడిగిద్ది. పీటర్ జరిగిన విషయమంతా చెప్పేస్తాడు. ఇక ఆ అమ్మాయి బ్రైన్ గాన్ని ఏదో ఒకటి చేయమన్నట్టు రెచ్చగొట్టిద్ది. మరుసటి రోజు బ్రైన్ ఒక గుమ్మడి కాయ తీసుకొచ్చి పీటర్ ని క్షమాపణ కోరతాడు. కానీ అప్పటికే పీటర్ బాగా కోపంతో ఉంటాడు. అలా తను కోపంతో బ్రైన్ ని మెట్ల మీద నుంచి తోసేస్తాడు. దాని వల్ల బ్రైన్ కాలు విరిగిపోద్ది. ఈ సంఘటన వల్ల పీటర్ ని స్కూల్ నుంచి తీసేస్తారు.

చీకట్లో పీటర్ ఒంటరిగా

అసలు ఎందుకు నువ్వు ఆ పిల్లాడికి హాని కలిగించావు అని మార్క్ పీటర్ మీద కోప్పడతాడు. అప్పుడు కారోల్ పీటర్ వేసిన బొమ్మ గురించి మార్క్ కి చెప్తది. “ఎందుకురా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు” అని మార్క్ విసుక్కుంటాడు. అప్పుడు పీటర్, “ఆ గోడ లోపలి నుంచి ఎవరివో అమ్మాయి మాటలు వినిపిస్తున్నాయి” అని చెప్తాడు. మార్క్ కోపంతో, “అదంతా నీ ఊహ మాత్రమే” అని అరుస్తాడు. ఎలాగైనా పీటర్ కి బుద్ధి చెప్పాలని వాళ్ళు తనని బేస్మెంట్లో ఒంటరిగా వదిలిపెడతారు. అక్కడంతా చీకటిగా ఉంటది. పీటర్ ఒక్కడే భయంతో ఏడుస్తుంటాడు. కొంచెంసేపటి తర్వాత డివైన్ పీటర్ గురించి ఆలోచిస్తూ, తన తల్లితండ్రులు తనని బాగానే చూసుకుంటున్నారా? లేదా? అని అనుమానిస్తది.

Cobweb (2023) Plot Summary Explained in Telugu
Cobweb (2023) Plot Summary Explained in Telugu

అందుకని తను పీటర్ పరీక్ష పత్రాల మీద తన ఫోన్ నెంబర్ రాసి, పీటర్ ని కలిసేందుకు తన ఇంటికెళ్తది. డివైన్ కారోల్ కి పీటర్ యెుక్క పరీక్ష పత్రాలు ఇచ్చి, “పీటర్ ప్రవర్తనకు సరిపడే వాతావరణం ఉండే స్కూల్లో తనని చేర్పిస్తే మంచిది” అని అంటది. అప్పుడు మార్క్, కారోల్, “మా పిల్లాడు ఏ స్కూల్ కి వెళ్ళడు. వాడు ఇంట్లోనే చదువుకుంటాడు” అని కోపగించుకుంటారు. ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు బేస్మెంట్ లో ఉన్న పీటర్ కి వినిపిస్తుంటాయి. డివైన్ వచ్చిందని పీటర్ కి అర్థమై, వాడు బేస్మెంట్ తలుపు దగ్గరికొచ్చి, “నన్ను కాపాడండి” అని తలుపు కొడుతుంటాడు. అదే సమయంలో వాషింగ్ మిషన్ తిరుగుతుండడంతో, ఆ మిషన్ శబ్దానికి పీటర్ తలుపు కొడుతున్న శబ్ధం డివైన్ కి వినిపించదు.

Oddity (2024) Plot Summary Explained in Telugu

డివైన్ వాళ్లతో మాట్లాడుతూ, “నేను ఒకసారి పీటర్ ఎలా ఉన్నాడో చూడొచ్చా? ఒకసారి తనతో మాట్లాడి వెళ్తా” అని అడిగిద్ది. కానీ వాళ్ళసలు అందుకు ఒప్పుకోరు. ఇక చేసేందేం లేక డివైన్ అక్కడ్నుంచి బయటకొస్తది. సరిగ్గా అదే సమయంలో వాషింగ్ మిషన్ ఆగిపోద్ది. అపుడు పీటర్ తలుపు కొడుతున్న శబ్దం డివైన్ కి వినిపిస్తది. తను వెంటనే వెనక్కి తిరిగి, “ఆ శబ్దం ఏంటి” అని అడిగిద్ది. అది కేవలం వాషింగ్ మిషన్ నుంచి వస్తున్న శబ్ధం మాత్రమే అని మార్క్ అంటాడు. మార్క్, కారోల్ ప్రవర్తన వల్ల డివైన్ చాలా భయపడిపోయిద్ది. తను కనీసం పీటర్ ని చూసేందుకు కూడా వాళ్ళు ఒప్పుకోరు కదా! కాబట్టి డివైన్ కి వాళ్ళ మీదున్న అనుమానం ఇంకా ఎక్కువైద్ది. కట్ చేస్తే, ఆరోజు సాయంత్రానికి వాళ్లు పీటర్ ని బేస్మెంట్ నుండి బయటికి వదిలిపెడతారు.

నిజంగా తను అక్కేనా?

ఆరోజు రాత్రి పీటర్ గోడ లోపలున్న అమ్మాయితో మళ్ళీ మాట్లాడుతాడు. అప్పుడు పీటర్, “నేను నిన్ను చూడాలనుకుంటున్నాను” అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, “నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ బంధించబడి ఉన్నాను. నన్ను చూస్తే నువ్వు భయపడతవ్” అని అంటది. నేనేం భయపడను ఒకసారి నిన్ను చూస్తానని పీటర్ అంటాడు. “అయితే కింద ఒక చిన్న రంధ్రం ఉంది. దాంట్లో నుంచి చూడు” అని చెప్తది. పీటర్ ఆ రంధ్రంగుండా చూస్తే తనకి ఆ అమ్మాయి కన్ను కనిపించి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. పీటర్ ఆ అమ్మాయిని, “అసలు నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు బంధించబడి ఉన్నావ్?” అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, “నేను మీ అక్కని. నా పేరు ‘శారా’. అమ్మానాన్న నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళే నన్ను ఇక్కడ బంధించారు.

మన ఇంట్లో ఒక గడియారం ఉంది కదా! దాని వెనక నేను బయటకు రావడానికి ఒక తలుపు ఉంటది. ఆ తలుపు తెరిచి నన్ను బయటికి తీసుకురా” అని చెప్తది. కొంచెంసేపటి తర్వాత పీటర్ నిద్రపోతుండగా, తన అమ్మానాన్న దెయ్యాలుగా మారి తన మీద దాడి చేసినట్టుగా పీటర్ కి పీడ కల వస్తది. దాంతో పీటర్ భయంతో గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే, శారా మాట్లాడుతూ, “అమ్మానాన్న నన్నిక్కడ బంధించడానికి ముందు ఒక అమ్మాయి హాలోవీన్ రోజున ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం మన ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి నన్ను చూడడంతో అమ్మ నాన్న తనని చంపేసి భూమిలో పాతిపెట్టారు. కావాలంటే ఇంటి బయట నేను చెప్పిన చోట తవ్వి చూడు” అని చెప్తది.

Cobweb (2023) Plot Summary Explained in Telugu
Cobweb (2023) Plot Summary Explained in Telugu

మరుసటి రోజు పీటర్ ఇంటి బయట ఒక చోట తవ్వగా అక్కకొక మనిషి పుర్రె కనిపిస్తది. అది చూసి పీటర్ షాకైపోతాడు. కారోల్ తన దగ్గరికి వస్తుండడంతో పీటర్ వెంటనే పుర్రెని మట్టిలో కప్పేసి ఒక గుమ్మడి కాయ తీసుకుంటాడు. “నేను ఎలాగూ హలోవీన్ రోజున బయటికి వెళ్ళడం లేదు కదా. కనీసం ఇంట్లో అయినా దీంతో ఆడుకుంటా” అని పీటర్ కారోల్ తో అంటాడు. తర్వాత పీటర్ శారాతో మాట్లాడుతూ, “నేను నిన్ను ఇక్కడ్నుంచి బయటకు తీసుకొస్తా. మనం దూరంగా పారిపోదాం” అని చెప్తాడు. ఆ తర్వాత తను డివైన్ కి కాల్ చేసి, “నాకు సాయం చేయండి” అని అంటాడు. అప్పుడు వెంటనే అక్కడికి కారోల్ రావడంతో తను ఫోన్ పెట్టేస్తాడు.

పీటర్ వేసిన పథకం

పీటర్ అలా ఫోన్ చేసినందుకు కారోల్ కి చాలా కోపమొస్తది. “అసలు అది నీతో ఏం చెప్పింది” అని కారోల్ శారా గురించి అడిగిద్ది. అప్పుడు పీటర్ శారా చెప్పిన ప్రతి విషయం చెప్పేస్తాడు. కారోల్ భయంతో వణుకుతూ, “ఇకపై ఏం జరిగినా అదంతా నీ తప్పే. మీ నాన్న వచ్చే వరకు నువ్వు గదిలోనే ఉండు” అని తను తలుపు వేస్తది. అవతలి వైపు ఉన్నది దయ్యమో లేక ఏదైనా విచిత్ర జీవో తెలీదు కానీ కారోల్ మాత్రం బాగా భయపడిపోద్ది. కొంత సమయం తర్వాత శారా మాట్లాడుతూ, “అమ్మానాన్న మాట్లాడుకునేది నేను విన్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి. లేకపోతే మనం ప్రాణాలతో ఉండలేము.

నేను నీతో మాట్లాడుతున్నట్టు కూడా వాళ్లకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్లు నిన్ను చంపడానికైనా వెనకాడరు” అని పీటర్ తో అంటది. ఆరోజు రాత్రికి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. మార్క్, క్యారోల్ ప్రశాంతంగా తింటుంటారు, కానీ పీటర్ మాత్రం తినడు. విషయమేంటంటే… ఆ ఆహారంలో పీటర్ ఎలుకల మందు కలుపుతాడు. తాము తింటున్న ఆహారం సినమన్ వాసన వస్తుండడంతో మార్క్ కి విషయం అర్థమయిద్ది. ఇక మార్క్ వెంటనే 911 కి కాల్ చేయమని కారోల్ కి చెప్తాడు. కానీ పీటర్ ఫోన్ వైర్ కూడా కట్ చేసి ఉంటాడు. ఏంట్రా ఇలా చేశావని మార్క్ పీటర్ మీద అరుస్తాడు. ఇంక ఇప్పుడు అరిచి ఏం ఉపయోగం! కొన్ని క్షణాల్లోనే మార్క్ రక్తం కక్కుకుని చనిపోతాడు. కారోల్ కోపంతో ఒక కత్తి తీసుకుంటది.

Bagman (2024) Plot Summary Explained in Telugu

పీటర్ భయంతో తన గదికి వెళ్తుండగా కారోల్ తనని గట్టిగా పట్టుకుంటది. ఆమె తనని కత్తితో పొడిచి చంపేస్తదేమో అని భయపడి, పీటర్ ఆమెని గట్టిగా తన్నడంతో ఆమె మెట్ల మీద నుంచి కిందపడిద్ది. ఆ సందర్భంలో కారోల్ కి కత్తి గుచ్చుకుంటది. “దయచేసి దాన్ని బయటికి తీసుకురాకు” అని చెప్పి కారోల్ చనిపోద్ది. కానీ పీటర్ మాత్రం గడియారం దగ్గరున్న తలుపుని తెరుస్తాడు. ఇంకేముంది శారా అక్కడ్నుంచి బయటకొస్తది. అయితే శారా పీటర్ అనుకున్నట్టు మనిషి రూపంలో ఉండదు. చాలా పొడవైన జుట్టుతోటి పదునైన గోళ్ళతో చూడ్డానికి చాలా వికారంగా ఉంటది. తనని చూసి పీటర్ భయంతో నిండిపోతాడు.

ముగింపు

ఇక ఇక్కడినుంచి సినిమా చాలా భయంగా ఉంటది. ఇంతకీ శారా మనిషా? లేక దెయ్యమా? చివరికి తను పీటర్ కి ఏదైనా హాని తలపెట్టిందా!? అసలు సినిమా ఎలా ముగుస్తుంది అనే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఆ అనుభవాన్ని మీరు కూడా ఒకసారి ఫీలవ్వాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటుగా ఉంది. నాకైతే సినిమా పర్వాలేదు అని అనిపించింది. కథ నెమ్మదిగా ముందుకు సాగినప్పటికీ, చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకి బలమైన ముగింపు ఇస్తుంది. సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుడి వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నటీనటుల విషయానికొస్తే ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఏదో తెలియని భయం ప్రేక్షకుడిలో కలుగుతుంటది. మీకు సైకాలజికల్ హారర్ మూవీస్ ఇష్టమైతే Cobweb (2023) తప్పకుండా ఒకసారి చూసేయండి.

Leave a Comment