Blood Star Movie Explained in Telugu – Summary & Ending Explained
ఒక ఎడారి ప్రాంతంలో మీరు ఒంటరిగా కారులో వెళ్తున్నారనుకోండి. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరైన ఫాలో అవ్వడం మొదలుపెడితే!? మిమ్మల్ని టార్గెట్ చేసి మీ వెనకే వస్తున్నది షరీష్ అయితే!? వింటుంటెే కాస్త భయంగా అనిపిస్తుంది కదా. ఎవరైన వ్యక్తులు మనకి ఆపద కలిగించాలని చూస్తే మనం పోలీసులకి ఫోన్ చేసి సహాయం అడుగుతాం. ఒకవేళ పోలీస్ వ్యవస్థలోని వ్యక్తులే మనకి ఆపద కలిగించాలని చూస్తే!? ఇప్పుడు ఈ విషయాలన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే! ఇలాంటి కాన్సెప్ట్ తోనే 2024లో “బ్లడ్ స్టార్” (Blood Star) అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమాలో ఒక షరీఫ్ ఒంటరిగా కనిపించిన అమ్మాయిల్ని అస్సలు వదిలిపెట్టడు. వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి మరీ చంపేస్తుంటాడు. అలాంటి వాడి కంటికి ఒక ఒంటరి అమ్మాయి కనిపిస్తది. మరి షరీఫ్ ఆ అమ్మాయిని ఎన్ని చిత్రహింసలకు గురిచేశాడు? ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడిందా, లేదా? అసలు ఆ షరీఫ్ ఎందుకని ఇలా అమ్మాయిల్ని చంపేస్తున్నాడు!? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన కథను సింపుల్‌గా సమ్మరీగా చెబుతూ, ఎండింగ్ యొక్క అర్థం కూడా వివరించబోతున్నాను.
తనని చంపింది ఎవరు?
ఒక అమ్మాయి నోటి నిండా రక్తంతో ఎడారిలో నడవలేక నడుస్తుంటది. తన నాలుకని ఎవరో కోసేసి చిత్రహింసలు పెడతారు. ఆ అమ్మాయి వెనకే ఎవరో కారులో వస్తుంటారు. ఆ కారులోని వ్యక్తే ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టింది. ఇక తను నడవలేక ఒకచోట కిందపడిపోద్ది. ఆ వ్యక్తి కారులోంచి దిగి ఆమెకి కొన్ని కొన్ని నీళ్ళు ఇస్తాడు. తర్వాత ఒక గన్, ఒక బుల్లెట్ తన దగ్గరపడేసి, “నీకు ఒకే ఒక అవకాశం ఉంది. నిన్ను నువ్వే షూట్ చేసుకో, ఒకవేళ ఈ బుల్లెట్ నుండి నువ్వు బయటపడగలిగితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా” అని అంటాడు. ఇక ఆ అమ్మాయి కోపంతో కార్లో వచ్చిన వ్యక్తిని షూట్ చేస్తది. కానీ ఆ బుల్లెట్ అతనికి తగలదు.
ఇక అతను ఆ అమ్మాయిని కారుతో గుద్ది చంపేస్తాడు. కట్ చేస్తే, మనకి ‘బాబీ’ అనే అమ్మాయిని చూపిస్తారు. తను తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటది. బాబీ సిస్టర్ ఫోన్ చేసి, “నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావ్? వాడు ఒకసారి నిన్ను కొట్టాడు కదా. వాడు మంచోడు కాదు, నిన్ను చంపనైనా చంపేస్తాడు. వాడి దగ్గరికి వెళ్లొద్దు” అని అంటది. కానీ బాబీ మాత్రం, “తను మళ్ళీ అలా ఏం కొట్టడు. తను మంచిగా మారిపోయాడులే” అని చెప్పి కాల్ పెట్టేస్తది. తర్వాత బాబీ గ్యాస్ స్టేషన్ కి వెళ్తది. ఆ టౌన్ షరీఫ్ బాబీని పలకరించి తనకి బీర్ ఇవ్వబోతాడు.
బాబీ మాత్రం ఆ బీర్ తీసుకోదు. ఆ సమయంలో బాబీ సిస్టర్ మళ్ళీ ఫోన్ చేసి, “నువ్వు వాడి దగ్గరికి వెళ్లడం నాకసలు ఇష్టం లేదు. మన నాన్న ఎంత చెడ్డవాడో నీకు తెలుసు కదా. నీ బాయ్ఫ్రెండ్ కూడా అలాంటి చెడ్డోడే” అని అంటది. ఆ మాటలకి బాబీకి కోపం వచ్చి కారుని చాలా వేగంగా నడిపిద్ది. అలా తను స్పీడ్ లిమిట్ కూడా దాటడంతో షరీఫ్ తనని ఫాలో చేస్తాడు. తన వెనక షరీఫ్ రావడాన్ని బాబీ గమనించి వెంటనే కార్ ఆపిద్ది. షరీఫ్ తన దగ్గరికి వచ్చి, “నువ్వు స్పీడ్ లిమిట్ దాటినందుకు ఫైన్ కట్టాలి.
అమ్మాయికి ఎర
ఇప్పటికిప్పుడు మూడు వందల డాలర్స్ ఇస్తే నిన్ను వదిలేస్తా” అని అంటాడు. కానీ ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బులు ఉండవు. కాబట్టి షరీఫ్ తన ఫోన్ తీసుకుని, “గ్యాస్ స్టేషన్లో ఏటీఎం ఉంది. అక్కడికి వెళ్లి డబ్బులు తీసుకురా. డబ్బులిచ్చిన తర్వాతనే నీ ఫోన్ నీకు తిరిగిస్తా” అని అంటాడు. ఇక బాబీ గ్యాస్ స్టేషన్ కి వెళ్తది. క్యాషియర్ బాబీతో మాట్లాడుతూ, “ఏటీఎం చాలా రోజులుగా పనిచేయట్లేదు. ఆ షరీఫ్ అంత మంచివాడు కాదు, అతని వల్ల చాలా మంది అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి నువ్వు వాడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే మంచిది” అని చెప్తాడు. దాంతో బాబీకి కొంచెం భయమేసి చాలా వేగంగా కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటది.

కానీ ఆ షరీఫ్ చాలా తెలివైనవాడు. ఇలా జరగొచ్చని ముందే ఆలోచించి అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు. బాబి కార్లో వెళ్తుండగా షరీఫ్ తన కార్ యెుక్క సిగ్నల్ లైట్ షూట్ చేస్తాడు. ఆ తర్వాత తను వేగంగా బాబీని చేరుకుంటాడు. షరీఫ్ బాబీతో, “ఏంటి తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నావా? నీ కార్ సిగ్నల్ లైట్ కూడా పగిలిపోయింది. దీనికి కూడా నువ్వు ఫైన్ కట్టాలి” అని అంటాడు. “సిగ్నల్ లైట్ పగలగొట్టింది వీడే. ఎలాగోలా ఇక్కడ్నుంచి బయటపడాలి” అని బాబి అనుకుంటుంది.
ఇక షరీఫ్ బాబీని కార్ దగ్గర నిలబడమని చెప్పి, తనని చెక్ చేస్తున్నట్టుగా ఎలా అంటే అలా తాకుతుంటాడు. దాంతో బాబీకి చాలా ఇబ్బందిగా అనిపిస్తది. షరీఫ్ బాబీతో, “నువ్వు నా నుంచి తప్పించుకుని వెళ్లాలంటే నాకు డబ్బులివ్వడం తప్పా వేరే మార్గం లేదు. దగ్గర్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయి. నేనొచ్చి డబ్బులు తీసుకుంటా” అని అంటాడు. ఇక వేరే మార్గం లేక అందుకు బాబీ ఒప్పుకుంటది. బాబీ కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా షరీఫ్ తన కార్ టైర్ షూట్ చేస్తాడు. దాంతో బాబీ కారుకి ప్రమాదం జరిగిద్ది. షరీష్ తనని చంపేస్తాడేమో అని భయపడి బాబీ వెంటనే కార్ దిగి ఒక చోట దాక్కుంటది.
ఎడారిలో ఒంటరి ప్రయాణం
కాసేపటికి షరీఫ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కారులో ఉన్న తన వస్తువుల్ని తీసుకుని అక్కడ్నుంచి పరుగుతీస్తది. ఎడారిలో చాలాసేపు నడుచుకుంటూ వెళ్లిన తర్వాత తనకొక రెస్టారెంట్ కనిపిస్తది. అప్పటికే బాబీ పూర్తిగా అలసిపోయింటది. ఒక వ్యక్తి టేబుల్ మీద డబ్బులు మర్చిపోయి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుల్ని బాబీ కొట్టేస్తుంది. తర్వాత తను తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, “నన్నొక షరీఫ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు” అని చెప్తది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్, “ఆ షెరీఫ్ తో నువ్వు ఎఫైర్ పెట్టుకున్నావేమో? ఎవరికి తెలుసు” అని బ్రేకప్ చెప్పేస్తాడు.
డబ్బులు మర్చిపోయిన వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి, “ఇక్కడ ఉండాల్సిన నా డబ్బులు ఏవి?” అని ఓనర్ మీద గొడవకి దిగుతాడు. అదే సమయంలో షరీఫ్ రెస్టారెంట్ వద్దకి వస్తాడు. బాబీ వాన్ని గమనించి భయంతో వెంటనే బాత్రూంలోకి వెళ్లి కిటికీ ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తది. కానీ ఆ పథకం ఫలించక పోవడంతో తను బాత్రూమ్ నుంచి బయటికొస్తది. బాబీ తెలివిగా 911 కి కాల్ చేసి తను ప్రమాదంలో ఉన్నానని వేరే అడ్రస్ చెప్తది. పోలీస్ రేడియోలో ఆ విషయం షరీఫ్ కి చేరడంతో షరీఫ్ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్ళిపోతాడు. ఇక బాబీ రెస్టారెంట్ నుంచి బయటికి రాగా, తన కార్ రెస్టారెంట్ బయటనే ఉంటది. పగిలిపోయిన తన సిగ్నల్ లైట్స్ స్థానంలో కొత్తవి ఉంటాయి.
షరీఫ్ తన కారుని బాగు చేసి తీసుకొచ్చాడేమో అని బాబీ అనుకుంటది. టేబుల్ మీద ఉండాల్సిన డబ్బుల్ని, అక్కడ పనిచేసే ‘ఏమీ’ అనే వెయిట్రెస్ దొంగతనం చేసిందని అనుమానించి ఓనర్ తనని పనిలో నుంచి తీసేస్తాడు. బాబీ ఏమీతో మాట్లాడుతూ, “నువ్వు ఎక్కడ నివసిస్తుంటావ్?” అని అడుగుతుంది. దానికి ఏమీ, “నేను దగ్గర్లోని టౌన్ లో నివసిస్తుంటా” అని చెప్తది. “సరే నాతో పాటు కార్లో పదా. నేను నిన్ను మీ ఇంటిదగ్గర వదిలిపెడతా” అని బాబీ తనని తన కార్లో ఎక్కించుకుంటది. వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ హైవేలో వెళ్తుంటారు. అప్పుడు ఏమీ మాట్లాడుతూ, “ఇక్కడ పనిచేసే షరీఫ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. చాలామంది అమ్మాయిల్ని వాడు హింసించాడు” అని చెప్తది. సరిగ్గా అప్పుడే షరీఫ్ దూరం నుంచి షూట్ చేయడంతో ఏమీ అక్కడికక్కడే చనిపోద్ది.

సహాయం కోసం పాకులాట
ఒక్క క్షణం బాబీకి అసలేం అర్థమవ్వదు. భయంతో కార్ దిగి గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తుంటది. అప్పుడు తనకి కొంచెం దూరంలో దుమ్ము పైకి లేస్తుండడం కనిపిస్తది. అంటే ఆ షరీఫ్ కారు వేసుకొని తన దగ్గరికి వస్తున్నాడని బాబీకి అర్థమవుతుంది. తను భయంతో వెంటనే కార్లోకి ఎక్కి వేగంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అయినాసరే షరీఫ్ తనని అస్సలు వదిలిపెట్టడు. వాడు బాబీ కారుని తన కారుతో వెనకనుంచి గుద్దిస్తుంటాడు. అప్పుడు బాబీకి ఒక ట్రక్ కనిపిస్తది. బాబీ వేగంగా ఆ ట్రక్ డైవర్ దగ్గరకి వెళ్లి తన పరిస్థితిని వివరిస్తది. దాంతో ట్రక్ డ్రైవర్ వెంటనే ఒక షాట్ గన్ చేత పట్టుకుంటాడు.
అప్పుడు షరీఫ్ మాట్లాడుతూ, “నేను పోలీస్. ఆ అమ్మాయి తన స్నేహితురాలిని హత్య చేసి పారిపోతుంది. కావాలంటే ఆమె కారులో శవం ఉంటది చూడు” అని అంటాడు. “షరీఫ్ మొత్తం అబద్ధాలు చెప్తున్నాడు. అతనే నన్ను చంపాలని చూస్తున్నాడు. నువ్వు కనికరం చూపకుండా అతన్ని షూట్ చెయ్” అని అంటది. అసలు ఎవరు నిజం చెప్తున్నారో ట్రక్ డ్రైవర్ కి ఏమి అర్థంకాదు. ఆ సమయంలో షరీఫ్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. బాబీకి భయమేసి వెంటనే కార్లో అక్కడ్నుంచి పారిపోద్ది. షరీఫ్ తనని వెంబడించడం మొదలుపెడతాడు.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాబీకి ఒక పాత గరాజ్ కనిపిస్తది. అక్కడ తనకి ఎవరైనా సహాయం చేస్తారేమో అన్న ఆశతో బాబీ గరాజ్ లోకి వెళ్తది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండదు. అదే సమయంలో అక్కడికి ఎవరో వస్తుండడంతో, ఒకవేళ అది షరీఫ్ ఏమో అని పొరబడి బాబి ఒక చెక్కతో అతన్ని కొడుతుంది. కానీ వచ్చింది షరీఫ్ కాదు. అక్కడికి వచ్చింది గరాజ్ లో పనిచేసే మెకానిక్ ‘ఎడ్’. బాబీ ఎడ్ కి క్షమాపణ చెప్పి తన పరిస్థితిని వివరిస్తది. ఎడ్ తనని అర్థం చేసుకొని, “నువ్వేం భయపడొద్దు. మా యజమాని చాలా మంచివాడు. మేము నీకు సహాయం చేస్తాం” అని అంటాడు. వాళ్ళలా మాట్లాడుకుంటుండగా అక్కడికి ఒక కార్ వస్తది.
అంతా ఒకే బ్యాచ్
“మా యజమాని వచ్చినట్టుంది, నువ్వు ఇక్కడే ఉండు” అని ఎడ్ కార్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో బాబీకి ఒక గది కనిపిస్తది. ఆ గది నిండా మనుషుల్ని చంపడానికి ఉపయోగించే వస్తువులు, రకరకాల అమ్మాయిల ఫోటోలు, ఐడి కార్డ్స్, లైసెన్సులు ఉంటాయి. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎడ్ యజమాని ఎవరో కాదు, షరీఫ్. ఆ గదిలోని వస్తువుల్ని చూసి బాబీ కంగారుపడుతుండగా షరీఫ్ తన దగ్గరికొస్తాడు. బాబీ వాళ్ళ దగ్గర్నుంచి తప్పించుకోవాలని చూడగా ఎడ్ తనని కొట్టడంతో తను సృహ తప్పి కిందపడిపోద్ది.
కాసేపయిన తర్వాత బాబీ మెలకువలోకొస్తది. అప్పటికే తనని తాళ్ళతో బంధించుంటారు. ఎడ్ బాబీని ముట్టుకునేందుకు చూస్తుండడంతో షరీఫ్ వాన్ని అరిచి పక్కకు జరగమంటాడు. అప్పుడు బాబీ, “అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు?” అని అడిగిద్ది. “నీలాంటి సిటీ అమ్మాయిలకి పొగరు బాగా ఎక్కువ. అసలు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అని చాలా పొగరుగా తిరుగుతుంటారు. కాబట్టి నీలాంటి అమ్మాయిలందరికీ మగాడు ఎప్పుడూ మీ కన్నా పైనే ఉంటాడని ఒక పాఠం నేర్పించడానికి ఇలా చేస్తున్నా” అని షరీఫ్ అంటాడు. షరీఫ్ ఇంకో పని కూడా చేస్తాడు.

అదేంటంటే, తను ఎవరినైతే ట్రాప్ చేస్తాడో ఆ అమ్మాయి తన నుంచి ఎన్ని కిలోమీటర్లు తప్పించుకుని వెళ్లగలుగుతుందా అని గమనిస్తాడు. అలా చనిపోయిన ప్రతి అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆ అమ్మాయి ఎన్ని కిలోమీటర్లు తన నుంచి తప్పించుకుని పారిపోయిందో రాస్తాడు. కొంచెంసేపటి తర్వాత షరీఫ్ ఒక కత్తి తీసుకుని బాబీ నాలుకను కోసి పక్కన పడేస్తాడు. బాబీ ఆ నొప్పిని భరించలేక బాధతో చాలా ఏడుస్తది. కాసేపయిన తర్వాత తను సృహకోల్పోయిద్ది. తను మెలకువలోకి వచ్చే సరికి తన కాళ్లు, చేతులకున్న తాళ్ళన్నీ విప్పేసుంటాయి. అప్పటికి బాబీ శరీరంలో నీరసం తప్ప శక్తి ఉండదు.
పగ తీర్చుకున్న బాబీ
ఆ సమయంలో ఎడ్, షరీఫ్ టీవీలో కార్టూన్స్ చూస్తుంటారు. ఇక ఇదే సరైన సమయమని బాబీ అక్కడ్నుంచి పారిపోతుంది. షరీఫ్ తనని చూసేసి వెంటనే కార్లో తనని వెంబడిస్తాడు. మూవీ మొదట్లో ఒక అమ్మాయిని ఇదే ఎడారిలో ఒకడు చంపేశాడు కదా! ఆ అమ్మాయిని చంపేసింది కూడా ఈ షరీఫే అనమాట. ఆ అమ్మాయి ఏ ప్రదేశంలో అయితే చనిపోయిందో ఆ ప్రదేశంలోనే ఇప్పుడు బాబీ నడుస్తుంటది. ఇంక నడవలేక బాబీ ఒకచోట పడిపోవడంతో షరీఫ్ తన దగ్గరికెళ్లి నీళ్ళు ఇస్తాడు. కానీ తను ఆ నీళ్ళు తాగకుండా కిందపడేస్తది.
షరీఫ్ తన ముందు ఒక గన్, బుల్లెట్ పడేసి, “నిన్ను నువ్వే షూట్ చేసుకో. ఒకవేళ నువ్వుగాని బతికితే నేను నిన్ను వదిలేస్తా” అని చెప్పి షరీఫ్ కార్లోకి వెళ్తాడు. ఇక బాబీ తనని తానే షూట్ చేసుకుని కిందపడిపోద్ది. షరీఫ్ ఆనందంగా బాబీ దగ్గరికొస్తాడు. కానీ నిజానికి బాబీ తనని తాను షూట్ చేసుకోకుండా తెలివిగా గాల్లోకి షూట్ చేస్తది. ఇక బాబీ వెంటనే ఒక కత్తితో షరీఫ్ ని పొడుస్తది. అయినా సరే వాడు ప్రాణాలతోనే ఉంటాడు. బాబీ వెంటనే తన దగ్గర్నుంచి పారిపోవాలని చూస్తది. కానీ షరీఫ్ ఆమెను పట్టుకుని గొంతు పిసికి చంపేయబోతాడు.
అప్పుడు బాబి ఒక రాయితో షరీఫ్ ని కొట్టడంతో తను హఠాత్తుగా కిందపడిపోతాడు. ఇక బాబి కార్లోకి ఎక్కుతుంది. షరీఫ్ తనని చిత్రవదకి గురిచేసినందుకు బాబీ కోపంతో తనని కారుతో గుద్ది చంపేస్తది. తర్వాత తను గ్యారేజ్ దగ్గరికి వెళ్తది. ఫ్రీజర్ లోని ఐస్ ముక్కల్ని ఒక కంటైనర్ వేసుకొని దానిమీద తన నాలుకని పెట్టిద్ది. త్వరగా హాస్పిటల్ కి వెళ్తే తిరిగి తన నాలుకని అతికించుకోవచ్చని బాబీ అలా చేస్తుంది. అదే సమయంలో ఎడ్ అక్కడికి రావడంతో బాబీ వాడిని కూడా చంపేస్తది. షరీఫ్ చేసిన హత్యాలన్నీ బయటపెట్టాలని, గదిలో ఉన్న అమ్మాయిల యొక్క లైసెన్స్ అన్నింటినీ బాబీ తీసుకుంటది. ఇక తను అక్కడ్నుంచి సిటీలోకి వెళ్ళిపోతుంది.
ముగింపు
చూశారు కదా ఈ విధంగా ‘బ్లడ్ స్టార్’ సినిమా కథ రసవత్తరంగా సాగుతుంది. సినిమాలో అర్థంకాని ప్రతీ సన్నివేశాన్ని మరియు ఎండింగ్ ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఇప్పటివరకు చాల క్లుప్తంగా వివరించడం జరిగింది. అసలు షరీఫ్ ఎందుకని అమ్మాయిల్ని హింసించి చంపుతున్నాడు అనే ట్విస్టుని మధ్యలో ఎక్కడా రివీల్ చేయకుండా ప్రేక్షకుల్ని తమ ఊహాగానాలకు వదిలేశారు. ఆ ట్విస్టుని సినిమా చివర్లో రివీల్ చేసిన విధానాన్ని చాలా బాగా చూపించారు. నాకైతే సినిమా పర్వాలేదు అనిపించింది.
ప్రేక్షకుడికి ఈ సినిమాలో గుర్తుండిపోయే సన్నివేశాలు అంతగా ఉండవు. కథలో ఉన్నది కేవలం ఒక్క ట్విస్ట్ అయినప్పటికీ, ప్రేక్షకులు కథలో లీనమయ్యే విధంగా సినిమాని చాలా తెలివిగా తెరకెక్కించారు. ఈ సినిమాని కుటుంబ సభ్యులతో కలసి చూడొచ్చా? అని అడిగితే మాత్రం, తప్పకుండా ఇది కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే సినిమా అని చెప్తాను. ఇందులో ఎటువంటి రొమాంటిక్ సన్నివేశాలుగాని, అసభ్యకరమైన సీన్లుగాని ఉండవు. కాబట్టి మీరు ఈ సినిమాని ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ థ్రిల్లర్ మూవీని చూసేయండి.
