Bagman (2024) Plot Summary Explained in Telugu

Bagman (2024) Plot Summary Explained in Telugu

చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే బూచోడి కథల్ని చిన్నప్పుడు మనం చాలానే వినుంటాం. ఇప్పుడు ఆ బూచోడి గురించి చెప్పి మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నావ్ అని అనుకుంటున్నారా? అదేం కాదులేండి! ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలో కూడా అచ్చం మనం చిన్నప్పుడు విన్న కథల్లానే ఒక భయంకరమైన బూచోడు ఉంటాడు. వీడు చిన్నపిల్లల్ని బ్యాగ్ లో ఎత్తుకెళ్లి కిరాతకంగా తినేస్తాడు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా!? ఇక కళ్ళతో సినిమానే చూస్తే ఎంత భయంగా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటెే, “Bagman”. ఇది 2024లో విడుదలైన ఒక సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ బూచోడు కేవలం చిన్నపిల్లల్ని మాత్రమే కాదు, అప్పుడప్పుడు పెద్ద వాళ్లని కూడా బ్యాగ్ లో పట్టుకెళ్తుంటాడు. మరి ఈ బూచోడి నుండి ప్యాట్ అనే వ్యక్తి తన కొడుకుని కాపాడుకునేందుకు ఏం చేశాడు అనే పాయింట్ సినిమాలో చాలా ఆసక్తిరేపిద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ బూచోడి కథేంటో తెలుసుకుందాం పదండి!

బ్యాగ్ మాన్ దాడి

ఒక వ్యక్తి తన కూతురితో మాట్లాడుతూ, “ఏంటి నీకు ఈ మధ్య పీడకలు వస్తున్నాయంట కదా! నాకు వాటి గురించి చెప్పు” అని అడుగుతాడు. అతని కూతురు పేరు ‘ఎమిలీ’. ఎమిలీ తనకి వస్తున్న పీడ కలల గురించి తన నాన్నకి వివరంగా చెప్పదు. ఎమిలీ ఎంతో ఇష్టంగా సేకరించుకున్న కొన్ని బొమ్మల్ని, వస్తువుల్ని వాళ్ళ అమ్మ పడేయమని చెప్తది. ఆ పని మీద ఎమిలీ తన నాన్నతో బయట ఉంటది. ఎమిలీకి ఒక ఎలుగుబంటి బొమ్మ అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని కూడా పడేయాల్సి వస్తది. కొంచెం సేపటి తర్వాత ఎమిలీకి తన నాన్న ఎక్కడా కనిపించడు.

అక్కడున్న వీధి లైట్లు వెలుగుతూ, ఆరిపోతూ ఉండడంతో ఎమిలీకి బాగా భయం వేస్తది. ఇక లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోతాయి. ఎమిలీ చిన్న పిల్ల కదా! కాబట్టి తనకి బాగా భయమేస్తది. తను భయం భయంగానే తన నాన్నని వెతుకుతుంటది. తన నాన్న ఒక గదిలో మత్తుగా పడుంటాడు. అతను ఎమిలీని పారిపోమ్మని చెప్తాడు. కానీ వెంటనే అక్కడికి ‘బ్యాగ్ మాన్’ వచ్చి ఎమిలీని మడత పెట్టి ఒక చిన్న బ్యాగులో కుక్కేస్తాడు. దాంతో పాపం ఎమిలీ చనిపోద్ది. మాట వినకపోయినా, అన్నం తినకపోయినా బూచోడు వచ్చి ఎత్తుకెళ్తాడు అని అమ్మ నాన్న అప్పుడప్పుడు చెప్తుంటారు కదా! నాకు ఈ సీన్ చూసినప్పుడు వీడే ఆ బూచోడేమో అనిపించింది.

కానీ వీడు మంచి పిల్లల్ని, అందంగా ఉండే పిల్లల్ని మాత్రమే బ్యాగులో పెట్టుకొని వెళ్తాడు. వీడు మామూలు మనిషి కాదు, వీడొక రాక్షషుడు అని అనుకోవచ్చు. వీడు చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఏం చేస్తాడనేగా మీ అనుమానం? వీడు పిల్లల్ని తీసుకెళ్లి తినేస్తాడనమాట. కట్ చేస్తే, కథ నాలుగు సంవత్సరాలు ముందుకెళ్తుంది. ‘ప్యాట్’ భార్య పేరు ‘కరీనా’. వీళ్లకొక కొడుకు ఉంటాడు, వాడి పేరు ‘జేక్’. ప్యాట్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. తను ఎన్నో రకరకాల ప్రోటోటైప్స్ కూడా డిజైన్ చేస్తాడు. కానీ తన ప్రోటోటైప్స్ కి ఫండింగ్స్ మాత్రం రావు. ప్యాట్ బ్రదర్ పేరు ‘లియాం’. ప్యాట్ తను ఈ మధ్యనే డిజైన్ చేసిన ఒక ప్రోటోటైప్ ని లియాంకి చూపిస్తాడు.

చిన్ననాటి సంఘటన

ప్రస్తుతం లియాం తమ వారసత్వ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. వీళ్ళ ఇళ్లు కూడా పూర్తిగా లోన్ లోనే ఉంటది. వీళ్ళకి కొన్ని అప్పులు కూడా ఉంటాయి. లియాం ప్యాట్ తో, “ఈ ప్రోటోటైప్స్ సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం మన వారసత్వ పనిని మంచిగా చేద్దాం. ఈ లోన్స్ అన్ని తీర్చేయాలి కదా!” అని అంటాడు. కానీ ప్యాట్ కి మాత్రం ఎలాగైనా తన ప్రోటోటైప్స్ కి ఫండింగ్ వస్తే బాగా అభివృద్ధి చెందాలని ఆశగా ఉంటది. ఇప్పుడు కథ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తది. ప్యాట్, లియాం తమ చిన్నతనంలో ఒక పాడుబడిన మైన్ దగ్గరికి వెళ్తారు. ప్రస్తుతం దాన్ని ముసేసుంటారు.

Bagman (2024) Plot Summary Explained in Telugu
Bagman (2024) Plot Summary Explained in Telugu

అక్కడే బ్యాగ్ మాన్ ఉంటాడని ఆ ఊరంతా పుకారనమాట. వీళ్ళ నాన్న కూడా, “మీరు అసలు అటు వెళ్లొద్దు” అని చెప్తాడు. కానీ వీళ్లు మాత్రం పెద్దల మాటలు పట్టించుకోకుండా మైన్ దగ్గరికి వెళ్తారు. అక్కడొక చెట్టు ఉంటది. దాని కలప చాలా మెత్తగా, బొమ్మలు చెక్కడానికి కూడా చాలా వీలుగా ఉంటది. ప్యాట్ కి చిన్నప్పటి నుంచి బొమ్మలు చెక్కడం అంటే చాలా ఇష్టం. అందుకని ప్యాట్ ఆ చెట్టు కొమ్మని కట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. “అరే వద్దురా, ఇక్కడినుంచి వెళ్ళిపోదాం” అని లియాం అంటున్నా కూడా ప్యాట్ తన మాట వినడు. ప్యాట్ ఆ చెట్టు కొమ్మని కట్ చేస్తుండగా, గని లోపల నుండి బ్యాగ్ మాన్ తన చేతిని చాచి ఒక కత్తెరతో ప్యాట్ జుట్టుని కత్తిరిస్తాడు.

దాంతో ప్యాట్ భయంతో కిందపడిపోతాడు. ఆ గని లోపల నుంచి భయంకరమైన శబ్దం వస్తుండడంతో ప్యాట్ భయంతో వణికిపోతాడు. ఇక కథ ప్రస్తుతానికి వస్తది. కరీనా తన పని తాను చేసుకుంటుండగా జేక్ ఊయల ఊగుతుంటాడు. అప్పుడు అక్కడున్న చెట్లలోంచి ఒక పిల్లాడు తనని పిలుస్తున్నట్టు జేక్ కి కనిపిస్తది. నిజానికి ఆ చెట్లలో ఉన్నది కేవలం బొమ్మ మాత్రమే. జేక్ ఆ బొమ్మకి బాగా ఆకర్షితుడయ్యి చెట్లలోకి వెళ్తాడు. నిజానికి ఆ బొమ్మని చూపిస్తూ తనని పిలుస్తున్నది బ్యాగ్ మాన్ అనమాట. తమ ఇంటి పక్కన అంతా అడవిలాగానే ఉంటది. జేక్ ఉయ్యాల్లో లేకపోవడంతో కరీనా తనని వెతుక్కుంటూ భయంతో అడవిలోకి పరిగెత్తిద్ది.

వేట మొదలెట్టిన బ్యాగ్ మాన్

ఈలోగా జేక్ కి ఆ బొమ్మ ఒక చెట్టు వెనక కనిపించడంతో, తను దాని దగ్గరికెళ్తాడు. ఇంకేముంది బ్యాగ్ మాన్ తనని పట్టుకెళ్ళిపోయాడని అనుకుంటున్నారా! అదేం కాదు లేండి. జేక్ ప్రశాంతంగా ఫ్లూట్ వాయిస్తుంటాడు. కరీనా ఆ శబ్దాన్ని విని వేగంగా జేక్ దగ్గరికి వచ్చేస్తది. కట్ చేస్తే, ఆ రోజు రాత్రి కరీనా కాస్త భయపడుతూ జరిగిన విషయమంతా ప్యాట్ కి చెప్తది. కొంచెంసేపటి తర్వాత ప్యాట్ కి ఒక మెయిల్ వస్తది. మేము మీ డిజైన్స్ కి లోన్ ఇవ్వడం లేదు. ఇంతకుముందు ఇచ్చిన లోన్స్ అన్నీ త్వరగా కట్టండి, లేకపోతే చట్ట పరంగా యాక్షన్ తీసుకుంటాం” అని మెయిల్ లో ఉంటది. “ఏంట్రా బాబు, ఈ దరిద్రం నన్ను వదలదా?” అని ప్యాట్ తన కత్తిని కోపంగా టేబుల్ కేసి గుద్దడంతో కత్తి విరిగిపోద్ది.

దాంతో ప్యాట్ ఆ కత్తిని చెత్త బుట్టలో వేసి తన ప్రోటోటైప్స్ అన్నింటినీ డిలీట్ చేస్తాడు. ఆ సమయంలో జేక్ నిద్ర లేచి ఎవరితోనో మాట్లాడుతుండడాన్ని ప్యాట్ మానిటర్ లో చూసి తెలుసుకుంటాడు. ప్యాట్ వెంటనే తన దగ్గరికి వెళ్లి, “ఏంటి జేక్, ఎవరితో మాట్లాడుతున్నావ్?!” అని అంటాడు. దానికి జేక్, “డాలీతో మాట్లాడుతున్నా నాన్న” అని అంటాడు. “డాలీ లేదు ఏం లేదులే. ప్రశాంతంగా నిద్రపో” అని ప్యాట్ తనని నిద్ర పుచ్చి బయటికొస్తాడు. అప్పుడు హఠాత్తుగా కరెంట్ పోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఏదో శబ్దం వస్తుండడంతో ప్యాట్ ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తాడు. కట్ చేస్తే, ప్యాట్ తన బెడ్ రూమ్ కిటికీగుండా బయటికి చూస్తుంటాడు. “ఏంటి అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నావ్?” అని కరీనా అని అడుగుద్ది.

దానికి ప్యాట్, “అక్కడ చెట్లలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి నువ్వు కూడా చూడు” అని అంటాడు. ఈలోగా జేక్ గట్టిగా ఏడుస్తాడు. దాంతో వారిద్దరు వెంటనే జేక్ దగ్గరికి పరిగెడతారు. ఎవడో ఇంట్లోకి చొరబడినట్లుందని ప్యాట్ కి అనుమానం వస్తది. ప్యాట్ కోపంతో వాడి కోసం వెతుకుతూ, “రేయ్ ఎవర్రా నువ్వు, బయటికి రారా” అని వార్నింగ్ ఇస్తుంటాడు. అప్పుడు చెట్లలో నుంచి ఏదో భయంకరమైన శబ్దం వస్తది. తను చిన్నప్పుడు మైన్ దగ్గర ఫీలయిన భయాన్ని ప్యాట్ ఇప్పుడు మళ్ళీ ఫీలవుతాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు ప్యాట్ ఇంటికి వస్తారు. పోలీస్ ఆఫీసర్ ప్యాట్ తో మాట్లాడుతూ, “మీ ఇంటి చుట్టూ అడవిలాగా ఉంది కదా! ఎవడైనా దొంగ వచ్చాడేమోలే. ఇంటి చుట్టూ సిసి కామెరాలు బిగించు” అని చెప్తాడు.

Bagman (2024) Plot Summary Explained in Telugu
Bagman (2024) Plot Summary Explained in Telugu
అప్రమత్తంగా ఉండాల్సిందే!

సాయంత్రానికి ప్యాట్ ఇంటి చుట్టూ సిసి కామెరాలు బిగిస్తాడు. చెత్తబుట్టలోని వస్తువుల్ని శుభ్రం చేస్తుండగా అందులో ఒక గుడ్లగూబ బొమ్మ ఉంటది. ప్యాట్ తన చిన్నతనంలో ఆ బొమ్మని మైన్ దగ్గర పోగొట్టుకుంటాడు. ప్యాట్ ఆ బొమ్మని చూసి, “ఇదేంటి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది?!” అని షాక్ అవుతాడు. వెంటనే తను కరీనా దగ్గరికెళ్లి, “నువ్వేమైనా ఈ బొమ్మని చెత్తబుట్టలో వేశావా?” అని అడుగుతాడు. అప్పుడు కరీనా, “అసలు నేను ఈ బొమ్మని చూడడం ఇదే మొదటిసారి” అని అంటది. కరీనా జేక్ ఫ్లూట్ ని ప్యాట్ కి చూపించి, “ఈ ఫ్లూట్ ని కూడా నువ్వు బయట పడేయొచ్చు కదా! జేక్ ఈ ఫ్లూట్ ఊదిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది. కావాలంటే మనం వాడికి ఇంకొక మంచి వస్తువు కొనిద్దాం” అని అంటది.

నిజానికి ఆ ఫ్లూట్ ని ప్యాట్ ఎంతో ప్రేమగా జేక్ కోసం తయారుచేస్తాడు. జేక్ కి కూడా ఆ ఫ్లూట్ అంటే చాలా ఇష్టం. ప్యాట్ కి అసలా ఫ్లూట్ ని పడేయడం ఇష్టం ఉండదు. కానీ కరీనాని భాదపెట్టకూడదన్న ఉద్దేశంతో, “సరే పడేస్తాలే” అని అంటాడు. కొంచెంసేపటి తర్వాత జేక్ బాత్ టబ్ లో ఆడుకుంటూ, “నాకు ఫ్లూట్ కావాలి, ఫ్లూట్ కావాలి” అని మారం చేస్తాడు. సరేలే కాసేపు ఆడుకుంటాడులే అని ప్యాట్ ఫ్లూట్ తీసుకొచ్చేందుకు కిందకి వెళ్తుంటాడు. అసలే ఇంట్లో ఏదేదో జరుగుతుంది కదా! అందుకని ప్యాట్ కాస్త జాగ్రత్తగానే ఉంటాడు. ప్యాట్ ఫ్లూట్ కోసం వెళ్ళగానే జేక్ దగ్గరికి బ్యాగ్ మాన్ వచ్చేస్తాడు. ప్యాట్ కి ఫ్లూట్ ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే తను జేక్ దగ్గరికొస్తాడు.

ప్యాట్ తన దగ్గరికి వచ్చేలోగా బ్యాగ్ మాన్ వెళ్ళిపోతాడు. అయినా ప్యాట్ రాగానే బ్యాగ్ మాన్ పారిపోవడమేంటో నాకసలేం అర్థంకావట్లేదు. చాలా సులభంగా ప్యాట్ ని చంపేసేంత శక్తి బ్యాగ్ మాన్ దగ్గర ఉంది. అయినా కూడా తను ఎందుకు పారిపోతాడో ఏమో! ఇంట్లో అనుమానస్పదంగా ఏదేదో జరుగుతుండడంతో ప్యాట్ ని ఒంటరిగా పడుకోబెట్టకుండా తమ దగ్గరే పడుకోబెట్టుకుంటారు. కొంచెంసేపటి తర్వాత ప్యాట్ ఫోన్ కి సెక్యూరిటీ అలర్ట్ వస్తది. తీరాచూస్తే గ్యారేజ్ తలుపుని ఎవరో తెరిచి ఉంటారు. ప్యాట్ అనుమానంతో గ్యారేజ్లోకి వెళ్తాడు. లోపలెవరో చిన్న పిల్లాడు కూర్చుని ఉన్నట్టుగా కనిపించడంతో ప్యాట్ తన దగ్గరికెళ్తాడు.

సైకాలజిస్ట్ వద్దకి వెళ్ళడం

తీరాచూస్తే అక్కడున్నది ఒక బొమ్మ మాత్రమే. దాని తలకి ఒక టోపీ ఉంటది. నిజానికి అది ప్యాట్ యెుక్క చిన్నప్పటి టోపీ అనమాట. ప్రస్తుతం ఆ టోపీ బొమ్మ దగ్గర ఎలా ఉందో ప్యాట్ కి అసలేం అర్థం కాదు. ఇక ప్యాట్ గ్యారేజ్ నుంచి బయటికొస్తాడు. తను ఇంట్లోకి వెళ్లేందుకు తలుపు తెరవాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ తలుపు ఎంతకీ తెరుచుకోదు. తలుపుకున్న పీప్ హోల్ గుండా లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్యాట్ ప్రయత్నిస్తాడు. అప్పుడు తనకొక భయంకరమైన దృశ్యం కనిపిస్తది. బ్యాగ్ మాన్ గబ్బిలంలా వేలాడుతూ జేక్ ఫ్లూట్ ని ఊదుతుంటాడు. అది చూసి ప్యాట్ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకొస్తాడు.

Bagman (2024) Plot Summary Explained in Telugu
Bagman (2024) Plot Summary Explained in Telugu

కానీ అప్పటికే బ్యాగ్ మాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారిన తర్వాత ప్యాట్ జరిగిన విషయమంతా పోలీసులకి చెప్తాడు. జేక్ ఫ్లూట్ కూడా బ్యాగ్ మాన్ దగ్గరే ఉందని అంటాడు. తర్వాత తను లియాం దగ్గరికి వెళ్లి తనకి కూడా జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అప్పుడు లియాం ప్యాట్ తో, “నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావ్. నీ చిన్నతనంలో కూడా ఇలాంటి ఆలోచనల వల్ల బాగా ఇబ్బందిపడ్డావు కదా! అప్పుడు నిన్ను ట్రీట్ చేసిన సైకాలజిస్ట్ ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలువు” అని చెప్తాడు. కొంచెంసేపటి తర్వాత కరీనా జేక్ ని పార్కుకి తీసుకెళ్తది. జేక్ అక్కడ సరదాగా ఆడుకుంటుండగా కరీనా ఏదో వర్క్ చేసుకుంటుంటది.

అప్పుడు జేక్ తన దగ్గరికొచ్చి, డాలీ ఇచ్చాడని చెప్పి రెండు పేపర్లు ఇస్తాడు. అందులో ఒక పేపర్లో, చిన్నప్పుడు ప్యాట్ మైన్ దగ్గర చెట్టుకొమ్మని కట్ చేస్తున్న డ్రాయింగ్, రెండో పేపర్లో ప్రస్తుతం కరీనా, జేక్ పార్కులో ఉన్న డ్రాయింగ్స్ ఉంటాయి. వాటిని చూసిన కరీనాకి చాలా భయం వేస్తది. అప్పటికే బ్యాగ్ మాన్ అక్కడికొచ్చి జేక్ ని బ్యాగ్ లో వేసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. కరీనా తనని కాపాడేందుకు గట్టిగట్టిగా అరుస్తుంటది. తీరాచుస్తే, ప్యాట్ కలలో నుండి మేల్కొంటాడు. అంటే పార్కులో జరిగిన సంఘటన అంతా కేవలం ఒక కల అనమాట. మరుసటి రోజు కరీనాని తోడుగా తీసుకుని ప్యాట్ సైకాలజిస్ట్ దగ్గరికెళ్తాడు. ఇక్కడే కరీనాకి ప్యాట్ గురించి ఒక పెద్ద నిజం తెలుస్తది.

ముగింపు

సైకాలజిస్ట్ కరీనాతో, “ప్యాట్ కి చిన్నప్పటి నుండి, అంటే మైన్ దగ్గర కిందపడినప్పటి నుండి పెర్సిస్టాఫోబియా ఏర్పడింది. దాని వల్ల ప్యాట్ కి ఒక బ్యాగ్ మాన్ కనిపిస్తుంటాడు” అని అంటది. అప్పుడు ప్యాట్, “వాడేం ఊహ కాదు. మొన్న రాత్రి కూడా వాడు మా ఇంటికొచ్చాడు” అని చెప్తాడు. సైకాలజిస్ట్ మాత్రం, “అవన్నీ నీ ఊహలు, పీడకలు మాత్రమే. నువ్వు నిజ జీవితంలోకి రావాలి” అని అంటది. ఈ విషయం గురించి నిశితంగా చర్చించుకోవాలని ప్యాట్, కరీనా నిర్ణయించుకుంటారు. ఆ రాత్రికి జేక్ ని ‘యానా’ కి అప్పగించి వాళ్ళిద్దరూ ఒక హోటల్ కి వెళ్తారు. ఇక తన చిన్నతనంలో ఏం జరిగిందనే విషయం గురించి, బ్యాగ్ మాన్ గురించి ప్యాట్ కరీనాకి చెప్పడం మొదలుపెడతాడు. ఇప్పుడు కథ గతంలోకి వెళ్తది.

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కొన్ని విషయాలు మాత్రమే, సినిమాలో ఇంకా మరెన్నో ట్విస్టులు ఉన్నాయి. ప్యాట్ యొక్క చిన్నతనంలో ఏం జరిగింది? బ్యాగ్ మాన్ ఎందుకని ప్యాట్ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు? ఇలా మరికొన్ని విషయాల్ని ఒకసారి మీరే కళ్ళారా సినిమా చూసి తెలుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. నాకైతే ఈ సినిమా ఒకింత పర్వాలేదు అనిపించింది. నటీనటుల ప్రదర్శన చాలా సహజంగా ఉంటుంది. ప్రేక్షకుడిని ఒకింత అసహనానికి గురి చేసే అంశమేంటంటే… కేవలం సినిమా ముగిసేటప్పుడు తప్పా, ఎక్కడా కూడా బ్యాగ్ మాన్ ముఖాన్ని సరిగ్గా చూపించారు. సినిమాలో కథ అంతా ప్యాట్ కుటుంబం చుట్టే తిరుగుతుంది. ప్యాట్ కుటుంబం గురించే కాకుండా, ఈ బ్యాగ్ మాన్ గురించి ఇంకొంత వివరంగా సినిమాలో చూపించి ఉండుంటెే బాగుండేది. మొత్తానికి ఈ సినిమాని ఒకసారి మాత్రం చూడొచ్చు. హార్రర్ థ్రిల్లర్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా బాగా నచ్చుద్ది.

Leave a Comment