In A Violent Nature Movie Explained in Telugu – Summary & Ending Explained
ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సాధారణమైంది కాదు. ఈ సినిమాలో ప్రతీ సీన్ చాలా భయంకరంగా ఉంటది. తన నెక్లెస్ దొంగతనం చేశారని ఒక భయంకరమైన వ్యక్తి భూమిలోంచి బయటికొస్తే ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. ఎటు చూసినా చెట్లు, కొండలు తప్పా మనుషులు కనిపించని అడవిలో ఈ వ్యక్తి చేతికి దొరికితే ఎలా ఉంటదో తెలుసా!? అసలా భయంకరమైన వ్యక్తి ఎవరు!? ఆ నెక్లెస్ తనకి ఎవరిచ్చారు!? అసలా నెక్లెస్ దొంగతనం చేసింది ఎవరో తెలుసుకోవాలంటే మనం ‘In A Violent Nature’ అనే సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. 2024 లో విడుదలైన ఈ హార్రర్ స్లాషర్ సినిమా 5.5/10 IMDb రేటింగ్ సాధించింది. ఈ సినిమాకి “క్రిస్ నాష్” దర్శకత్వం వహించారు. గంట ముప్పై నాలుగు నిమిషాల నిడివితో విడుదలై స్లాషర్ ప్రేమికులకు మంచి అనుభూతినిచ్చిన ఈ సినిమా గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం.
కథ ఏంటంటే!
ప్రారంభం
కథ ప్రారంభంలో కొంతమంది స్నేహితులు పాత ఫైర్ టవర్ దగ్గరికెళ్తారు. అక్కడ వాళ్లకి ఒక బంగారు నెక్లెస్ కనిపిస్తది. ‘ట్రాయ్’ దాన్ని తీసుకోబోతుండగా ‘ఎరెన్’ తన స్నేహితులతో, “పొరపాటున కూడా ఎవరూ ఆ నెక్లెస్ తీసుకోవద్దు. దాన్ని ముట్టుకుంటే ఒక భయంకరమైన కిల్లర్ మనల్ని చంపేదాకా వదిలిపెట్టడు. ఆ కిల్లర్ పేరు జాని” అని అంటాడు. అప్పుడు వాళ్ళు, “నువ్వు చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పొద్దు, మేము దాన్ని వినలేము” అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ట్రాయ్ ఎవరికీ తెలియకుండా ఆ నెక్లెస్ ని దొంగతనం చేస్తాడు. వాళ్ళు అక్కడ్నుంచి వెళ్లిపోయిన కాసేపటికి, జాని యెుక్క శవం భూమిలో నుంచి బయటికి లేస్తుంది. ఇక జాని తన నెక్లెస్ కోసం వేట ప్రారంభిస్తాడు. తను అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఉచ్చులో చిక్కుకుని చనిపోయిన కొన్ని నక్కల శవాలు కనిపిస్తాయి.
అదే సమయంలో దూరంగా ఎవరో ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్న శబ్దం వినిపించడంతో జాని అటువైపుగా వెళ్తాడు. అక్కడొక ఇళ్లు ఉంటది. ఆ ఇంటి దగ్గర ‘ఫారెస్ట్ రేంజర్’ ఇంటి యజమానితో గొడవపడుతూ, “అసలు నువ్వు అడవిలో ఉచ్చులు పెట్టి జంతువుల్ని ఎందుకు చంపుతున్నావు” అని గట్టి గట్టి మాట్లాడుతుంటాడు. కానీ ఆ వ్యక్తి రేంజర్ మాటల్ని పట్టించుకోడు. ఇంకోసారి ఇలా ఉచ్చులు పెట్టి జంతువుల్ని చంపొద్దని చెప్పి రేంజర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోపక్క జాని నెమ్మదిగా నడుకుచుకుంటూ ఇంట్లోకెళ్తాడు. తీరాచూస్తే అక్కడొక నెక్లెస్ ఉంటది. అప్పుడు జానీకి కొన్ని క్షణాలు తన అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎందుకంటే జానీకి నెక్లెస్ ఇచ్చింది తన అమ్మగారే అనమాట. అందువల్ల జానీకి ఆ నెక్లెస్ అంటే చాలా ఇష్టం. ఎవరు దాన్ని దొంగిలించినా సరే భూమిలోంచి లేచొచ్చి మరీ చంపేస్తాడు.
జాని ఆ నెక్లెస్ దగ్గరికెళ్తుండగా ఇంటి యజమాని లోపలికొస్తాడు. ఇంట్లో నిలబడి ఉన్న జానీని చూసి తను ఫారెస్ట్ రేంజరేమో అని అనుకొని, “నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటావా!” అని ఇంటి యజమాని జానీని షూట్ చేస్తాడు. దాంతో జానీకి పిచ్చ కోపం వస్తది. ఇంటి యజమాని జానీని చూసి భయపడి, వెంటనే అడవిలోకి పారిపోతాడు. అప్పుడు పొరపాటున ఆ వ్యక్తి కాలు ఒక ఉచ్చులో ఇరుక్కునిపోద్ది. ఇక జాని అక్కడికొచ్చి అతన్ని దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత తను మళ్ళీ ఆ ఇంటికెళ్లి నెక్లెస్ ని తీసుకుంటాడు. తీరాచూస్తే అది జానీ యెుక్క నెక్లెస్ కాదు. అది తన నెక్లెస్ ఏమో అని అనుకొని పొరపాటున జాని ఆ ఇంటి యజమాన్ని చంపేస్తాడు.

జాని యొక్క గతం
ఇక జాని తన నెక్లెస్ కోసం వెతుకుతూ అడవి మొత్తం గాలిస్తుంటాడు. అప్పుడు కొంతమంది స్నేహితులు ఒక కారులో ఎక్కడికో వెళ్తుంటారు. జాని వాళ్లని గమనించి వాళ్లని అనుసరిస్తుండగా మధ్యలో ఒకచోట తుపాకి పేలిన శబ్ధం వినిపిస్తది. జాని ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడే ఆ స్నేహితులందరూ ఉంటారు. జాని ఒక చోట చీకట్లో నిలబడి వాళ్ళ వైపే చూస్తుంటాడు. ఆ సమయంలో ఎరెన్ తన స్నేహితులకి జాని కథని చెప్తాడు. అసలు జాని యెుక్క కథ ఏంటంటే! 70 సంవత్సరాల క్రితం లాగింగ్ అనే సంస్థ కొన్ని దుకాణాల్ని పెడుతుంది. వాటన్నింటినీ జాని యెుక్క నాన్నే చూసుకుంటుంటాడు.
కానీ ఆ సంస్థ వాళ్ళు ఎక్కువ ధరలకి వస్తువుల్ని అమ్మేవారు. ఏంటి ఇంత ఎక్కువ ధరలకి వస్తువుల్ని అమ్ముతున్నారని జనాలందరూ జానీ నాన్న మీద అసహ్యం పెంచుకుంటారు. కానీ వాళ్ళు ఆ కోపాన్ని అతని మీద చూపించలేక, చిన్నపిల్లాడైన జాని మీద చూపించేవాళ్ళు. ఒక రోజు ఒక లాగర్ బాగా మద్యం సేవించి జాని యెుక్క బొమ్మల మీద పడడం వల్ల ఆ బొమ్మలన్నీ పగిలిపోతాయి. అందువల్ల జాని నాన్న ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని, “నీకు సంచి నిండా బొమ్మలిస్తా. రాత్రి పూట ఎవరికి తెలియకుండా ఫైర్ టవర్ దగ్గరికి రా” అని అతను జానీతో అంటాడు. సరే అని జాని ఆ రాత్రికి ఫైర్ టవర్ దగ్గరికెళ్తాడు.
కానీ వాళ్ళు జానీకి బొమ్మలివ్వకుండా భయపెట్టాలని చూడడంతో, జాని ఫైర్ టవర్ మీద నుండి కింద పడి మెడ విరిగి చనిపోతాడు. మరుసటి రోజు ఆ విషయం జాని నాన్నకి తెలిసి తను ఆ మనుషుల్తో గొడవపడతాడు. ఆ గొడవలో వాళ్ళు జాని నాన్నని కూడా చంపేస్తారు. వీళ్ల చావుల వల్ల చిక్కుల్లో పడడం ఇష్టంలేక లాగింగ్ సంస్థ వాళ్ళ చావుల్ని అంతగా పట్టించుకోదు. ఒక వారం తర్వాత సంస్థకి చెందిన కొంతమంది ఉద్యోగులు క్యాంప్ ని చూసేందుకొస్తారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా బ్రతకరు, మొత్తం చనిపోతారు. ఊరిలో ఉండే ప్రజలందరూ జానీనే దయ్యంగా మారి వాళ్ళందర్ని చంపేశాడని పుకార్లు పుట్టిస్తారు. కానీ ఒక పోలీస్ అధికారి మాత్రం, “ఎవరో ఒక వ్యక్తి ఫైర్ ఫైటర్ మాస్క్ పెట్టుకుని చెట్లలో నుండి చూస్తున్నాడు” అని అందరితో చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
వేట మొదలుపెట్టిన జానీ
కానీ అతని మాటల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇది… జాని యొక్క గతమనమాట. ఇదంతా విన్న తర్వాత, ఇదేదో కట్టు కథలా ఉంది అని స్నేహితులంతా నవ్వుతారు. ఎరెన్ మాత్రం, “ఇదేమీ కట్టు కథ కాదు, ఇది నిజం” అని అంటాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుని ఒక సెల్ఫీ తీసుకుంటారు. ఆ సెల్ఫీలో చెట్లలో దాక్కుని ఉన్న జాని కూడా పడతాడు. కానీ ఆ స్నేహితులు జానీని గమనించరు. ఇక వాళ్ళందరూ ఇంట్లోకెళ్లిపోతారు. కాసేపయిన తర్వాత ఎరెన్ బయటికొచ్చి పాటలు వింటూ సిగరెట్ తాగుతుంటాడు. అప్పుడు జాని తన దగ్గరికెళ్లి కత్తితో తన తలని సగానికి నరికేస్తాడు. ఆ తర్వాత తను ఆ శవాన్ని లాక్కుంటూ రేంజర్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆ ఆఫీస్ లోనే జాని యొక్క ఆయుధాల్ని ఆఫీసర్స్ భద్రంగా తమ పర్యవేక్షణలో ఉంచుతారు.
జాని ఆఫీస్ లోపలికెళ్ళి తన గొడ్డలి, చైన్ మరియు ఫైర్ ఫైటర్ మాస్క్ తీసుకుని స్నేహితులున్న ఇంటి వద్దకి బయల్దేరతాడు. మరుసటి రోజు ఉదయం, “యోగ చేద్దాం పదా!” అని బ్రాడి అరోరాని ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్తది. కానీ బ్రాడి యోగ చేయకుండా ఈత చేసేందుకు నీళ్ళలోకి దూకుద్ది. అది చూసి జాని కూడా మెల్లగా నీటిలోకి వెళ్తాడు. అరోరాకి ఈత కొట్టడం ఇష్టం లేక, “నేను పక్కకెళ్ళి యోగ చేసుకుంటా. నువ్వు ఈత కొట్టు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇంకేముంది ఒంటరిగా ఉన్న బ్రాడీని జాని తేలిగ్గా చంపేస్తాడు. ఆ తరువాత తను యోగ చేసుకుంటున్న అరోరా దగ్గరికెళ్తాడు.

అరోరా జానీని చూసి చాలా భయపడిపోద్ది. తను జాని నుంచి పారిపోతూ ఒక పెద్ద లోయ వద్దకి చేరుకుంటది. అక్కడ్నుంచి ముందుకు వెళ్లేందుకు వీలుండదు. ఈలోపు జాని తన దగ్గరికొచ్చి తనని దారుణంగా చంపేసి లోయలోకి విసిరేస్తాడు. ఇక జాని అక్కడ్నుంచి స్నేహితులుండే ఇంటి దగ్గరికి బయల్దేరుతాడు. ఎరెన్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటి దగ్గర స్నేహితులందరు బాగా కంగారుపడుతుంటారు. ట్రాయ్, క్రిస్ ప్రేమలో ఉంటారు. కానీ క్రిస్ కోల్ట్ తో ఎఫైర్ పెట్టుకుందేమో అని ట్రాయ్ కి చిన్న అనుమానం ఉంటది. అందుకని ట్రాయ్ వాళ్ళ మీద కోపంతో కార్ తాళాల్ని చెట్లలోకి విసిరేస్తాడు.
విషయం తెలుసుకున్న స్నేహితులు
అవి జాని కాళ్ళ దగ్గరపడతాయి. ఆ తాళాలకి కారు బొమ్మ ఉండడంతో జాని తన గొడ్డల్ని పక్కన పెట్టి ఒక చెట్టు దగ్గరికెళ్లి తన మాస్క్ తీసేసి చిన్న పిల్లోడిలాగా ఆ బొమ్మతో ఆడుకుంటుంటాడు. ఈలోగా కోల్ట్ తాళాల కోసం చెట్లలోకొస్తాడు. అక్కడ తనకి జాని యెుక్క గొడ్డలి కనిపించడంతో తను వెంటనే స్నేహితుల దగ్గరికెళ్లి, “ఇదేదో తేడాగా ఉంది. ఎవడో మనల్ని చంపుతున్నాడు. వెళ్లి వెంటనే పోలీసులకి సమాచారమిద్దాం” అని అంటాడు. కానీ ట్రాయ్ కోల్ట్ మాటల్ని పట్టించుకోడు. క్రిస్, కోల్ట్ మాత్రం పోలీసులకి విషయం చెప్పేందుకు ATV వేసుకుని బయల్దేరుతారు. ఈలోగా జాని ఆ ఇంటి దగ్గరికొచ్చి కార్ హారన్ మోగిస్తాడు.
ఆ శబ్దానికి ట్రాయ్ ఇంటి నుంచి బయటికొస్తాడు. ఇక జాని వాన్ని చంపేందుకు దాడి చేయటం మొదలుపెడతాడు. జాని ట్రాయ్ ని చంపబోతుండగా ఇవాన్ వెంటనే జానీని ఛాతి దగ్గర షూట్ చేస్తాడు. దాని వల్ల జాని కింద పడిపోతాడు. ఇక ఇవాన్ వెంటనే ట్రాయ్ ని తీసుకుని అక్కడ్నుంచి పారిపోతుంటాడు. కానీ ఒక్క నిమిషంలోనే జాని పైకి లేచి తన గొడ్డల్ని విసిరి ఇవాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ట్రాయ్ తల మీద ఒక పెద్ద బండరాయిని వేసి జాని తనని కూడా చంపేస్తాడు. అదే సమయంలో క్రిస్, కోల్ట్, ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్లి రేంజర్ ని కలుస్తారు. అప్పుడే వాళ్లకి తెలుస్తుంది, ఎరెన్ కూడా చనిపోయాడని. ఇక వాళ్ళిద్దరూ భయంతో గట్టిగా అరుస్తూ వెంటనే అడవిలోంచి పారిపోవాలని ఇంటికి పరుగుతీస్తారు.
నెక్లెస్ ఇచ్చేదాక వదిలిపెట్టడు
అప్పుడు క్రిస్ కి నేలమీద రక్తం కనిపించడంతో ఆమె దాన్ని చూస్తుంటది. ఆ సమయంలో జానీకి క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ కనిపిస్తది. ఇక వాడు తన నెక్లెస్ తీసుకునేందుకు క్రిస్ వైపు గొడ్డల్ని విసురుతాడు. కానీ క్రిస్ తన గొడ్డలి నుంచి తప్పించుకుంటది. ఇక వాళ్ళిద్దరూ వెంటనే ATV ఎక్కి అక్కడ్నుంచి పారిపోతారు. జాని కూడా వాళ్లని అనుసరిస్తూ వెళ్తాడు. చివరికి కోల్ట్, క్రిస్ రేంజర్ ఆఫీస్ వద్దకి చేరుకుంటారు. రేంజర్ క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ చూసి, “అసలు ఈ నెక్లెస్ ఎందుకు తీసుకున్నారు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఇది జాని యొక్క నెక్లెస్. వాడి ఆత్మకు శాంతి కలిగించేది ఈ నెక్లెసే. ఇక మనం ఏం చేయలేం. వాడిప్పటికే నిద్ర లేచుంటాడు. వాడు మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు” అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి జాని వస్తాడు.

రేంజర్ జానీని గుండె మీద షూట్ చేయడంతో తను వెంటనే కిందపడిపోతాడు. తుపాకీ గుండ్లు జానీని కాసేపు మాత్రమే ఆపగలుగుతాయి, అంతేగానీ తనని పూర్తిగా అంతం చేయలేవు. పది సంవత్సరాల క్రితం జాని ఇలానే భూమిలోంచి బయటికొస్తాడు. అప్పుడు రేంజర్ యెుక్క నాన్న జానీని ఓడించి తనని భూమిలో పాతిపెట్టి, ఆ నెక్లెస్ మళ్ళీ అక్కడే పెడతాడు. ప్రస్తుతం రేంజర్ కూడా అదే పని చేయాలనుకుంటాడు. రేంజర్ కోల్ట్ తో “ఈ ఇనుప గొలుసులతో వీడి కాళ్లు చేతులు కట్టేయి” అని అంటాడు. కానీ కోల్ట్ భయంతో రేంజర్ చెప్పిన పనిని చేయడు.
ముగింపు
అప్పుడు రేంజర్, “నేను నీకు తుపాకీ ఇస్తా. వెంటనే తుపాకీని జానీకి గురి పెట్టు. నేనే వీణ్ణి కట్టేస్తా” అని అంటాడు. అలా వీళ్లు తుపాకి మార్చుకునే సమయంలో జాని పైకి లేచి వాళ్ళ మీద దాడి చేస్తాడు. అప్పుడు కోల్ట్, క్రిస్ భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. జాని రేంజర్ మీద దాడి చేసి తనని బాగా కొడతాడు. ఆ తర్వాత తను రేంజర్ని షెడ్ లోకి తీసుకెళ్ళి దారుణంగా చంపేస్తాడు. ఇక జాని తన నెక్లెస్ కోసం కోల్ట్, క్రిస్ వద్దకి బయల్దేరతాడు. వాళ్లిద్దరు జానీని చంపేందుకు ఒక పథకం వేస్తారు. కానీ అదేం పెద్ద పథకం కాదు, దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇక జాని కోల్ట్ దగ్గరికొచ్చి తన తలని నరికేస్తాడు. అయినప్పటికీ జానీకి కోపం చల్లారక కోల్ట్ శవాన్ని అదే పనిగా నరుకుతాడు.
అది చూసి క్రిస్ భయంతో వణికిపోద్ది. “వీడితో పెట్టుకుంటే నేను కూడా చచ్చిపోయేలా ఉన్నా” అని అనుకుని క్రిస్ ఆ నెక్లెస్ అక్కడే పెట్టేసి భయంతో పరుగుతీస్తది. తెల్లవారే సమయానికి తనొక రోడ్డుకి చేరుకుంటది. అదృష్టం బాగుండి అదే సమయంలో ఒక కార్ వస్తుండడంతో క్రిస్ ఆ కార్ ఆపి వెంటనే లోపలికెక్కిద్ది. కార్ నడుపుతున్న వ్యక్తి తనతో మాట్లాడుతూ, “నువ్వేం భయపడొద్దు. నేను నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తా” అని అంటది. అలా వాళ్ళిద్దరూ వెళ్తుండగా క్రిస్ కాలి నుంచి రక్తం కారుతుండటంతో ఆమె కార్ ఆపి క్రిస్ కాలికి కట్టు కట్టిద్ది. జాని వచ్చి చంపేస్తాడేమో అని భయపడుతూ, “వెంటనే కార్ స్టార్ట్ చేయండి, మనం ఆగకుండా ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం” అని క్రిస్ తనని బ్రతిమాలిద్ది. కానీ నిజానికి జాని అక్కడికి రాడు. క్రిస్ తన నెక్లెస్ వదిలేయడంతో జాని దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు.
మొత్తానికి ఇదొక డిఫరెంట్ హారర్ సినిమా. ఇందులో పెద్దగా డైలాగ్స్ ఏమీ ఉండవు. సినిమా అంతా నిశ్శబ్దంగా చాలా నెమ్మదిగా సాగిపోద్ది. కాబట్టి ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. కానీ సినిమా మాత్రం చాలా భయంకరంగా, ఆసక్తికరంగా ఉంటది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే పెద్దగా హడావిడి లేకుండా మాములుగా ముగించేశారు. హార్రర్ స్లాషర్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ చిత్రం మంచి అనుభవాన్ని ఇస్తది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మీరు కూడా ఒకసారి ఈ హార్రర్ సినిమాని చూసి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.
