Immaculate (2024) Plot Summary in Telugu
ఈ సినిమాలో ఒక అందమైన అమ్మాయి, దేవుని కోసం జీవించాలనుకుని ఒక ఆశ్రమానికి వెళ్తుంది. మొదట్లో అక్కడ ప్రశాంతంగా అంతా బాగానే ఉంటది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఆశ్రమంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. అసలా అమ్మాయి ఎవరు? ఆ ఆశ్రమంలో జరిగిన విచిత్రమైన సంఘటనలేంటో తెలుసుకోవాలంటే, మనం “Immaculate” అనే సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే! మార్చి 22, 2024లో విడుదలైన ఈ హార్రర్ మిస్టరీ సినిమా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. సుమారు తొమ్మిది మిలియన్ డాలర్స్ తో తెరకెక్కి, 35.3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. సిడ్నీ స్వీని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యెుక్క కథని, ముఖ్యమైన విషయాల్ని ఒకసారి చేసేద్దాం రండి!
ఇప్పుడు కథ చూద్దాం
1) సిసిలియాకి ఆహ్వానం
“మేరీ” సుపీరియర్స్ గదిలోకి వెళ్లి కాన్వెంట్ యొక్క ప్రధాన ద్వారపు తాళాలని దొంగతనం చేస్తుంది. మేరీ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆ తాళాలతో ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుంటది. కానీ ఎంతసేపటికి ద్వారం తెరుచుకోకపోవడంతో మేరీ తన శరీరాన్ని ద్వారానికున్న సందుల గుండా ముందుకు నెట్టుకుంటూ బయటపడాలని చూస్తుంది. కానీ అంతలోనే నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి మేరీ యొక్క కాలుని విరిచేస్తారు. కట్ చేస్తే, ఆ నలుగురు వ్యక్తులు మేరీని బ్రతిగుండగానే సమాధిలో పాతిపెట్టేస్తారు. కొంచెం సేపటి తర్వాత, “సిసిలియ” అనే అమ్మాయి కాన్వెంట్ లో చేరేందుకు మిషిగన్ నుంచి ఇటలీకి వస్తుంది. “రెవరెండ్ మదర్” సిసిలియాని ప్రేమగా ఆహ్వానించి “నీ రాక కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం” అని చెప్తది.
ఇక “ఇసబెల్” సిసిలియాని లోపలికి తీసుకెళ్ళి తనకి ఒక గదిని ఇస్తుంది. నిజానికి ఈ కాన్వెంట్లో మరణానికి దగ్గరగా ఉన్న నన్స్ అందరూ తమ చివరి రోజులని గడుపుతుంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే ఇక్కడ ముఖ్యమైన పని. సిసిలియా కాన్వెంట్ లో చేరడం ఇసబెల్ కి ఇష్టం లేదేమో. తను సిసిలియాతో మాట్లాడుతూ, “నీకు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపో. ఒక్కసారి నువ్వు ప్రమాణాలు చేసి నన్ గా మారితే ఇక ఇక్కడి నుంచి బయటపడలేవని” ఇసబెల్ అంటది. అప్పుడు సిసిలియా, “నేను అన్నింటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను” అని సమాధానమిస్తది. కొంచెంసేపటి తర్వాత సిసిలియాకి “గ్వెన్” అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది.
ఆ తర్వాత తను నన్ గా మారేందుకు సిద్దమవుతుంది. ఈ వేడుకకి “ఫాదర్ టెడేస్కి” కూడా వస్తాడు. ఈ కాన్వెంట్ ఉన్నది ఇటలీలో కదా! అందువల్ల అందరూ ఇటాలియన్ మాట్లాడుతుంటారు, సిసిలియాకి ఆ భాష కొంచెం మాత్రమే అర్థమవుతుంది. “కార్డినల్” ఇటాలియన్ భాషలో ప్రమాణాలని చెప్తుంటే, ఫాదర్ టెడేస్కి వాటిని ఆంగ్ల భాషలో సిసిలియాకి వివరిస్తాడు. అలా సిసిలియా తన ప్రమాణాలని చెప్పి నన్ గా మారుతుంది. వేడుక ముగిసిన తర్వాత ఫాదర్ టెడేస్కి మరియు సిసిలియా మాట్లాడుకుంటుంటారు. అసలు సిసిలియాని ఈ కాన్వెంట్ లో చేరమని చెప్పింది, నన్ గా మారమని సలహా ఇచ్చింది ఎవరో కాదు! అది ఫాదర్ టెడేస్కీనే.

2) సిసిలియ చిన్నతనం
గడ్డకట్టిన నీటి మీద నడవడమంటే చిన్నప్పుడు సిసిలియాకి చాలా ఇష్టం. ఒకసారి తను గడ్డకట్టి ఉన్న సరస్సు మీద నడుస్తుండగా పొరపాటున మంచు విరిగి, తను అతి చల్లటి నీటిలో మునిగిపోతుంది. ఆ ప్రమాదంలో సిసిలియా గుండే ఏడు నిమిషాల పాటు ఆగిపోతుంది. కానీ దేవుడి దయవల్ల ఏడు నిమిషాల తర్వాత తన గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెడుతుంది. దేవుడు తనని మళ్ళీ బ్రతికించడానికి ఏదో ఒక కారణముందని, అప్పటినుంచి సిసిలియా బలంగా నమ్ముతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు సిసిలియాకి 12 సంవత్సరాలు. తరువాత ఫాదర్ టెడేస్కీ తనని నన్ గా మారమని సలహా ఇవ్వడం, సిసిలియా ఇలా కాన్వెంట్ లో చేరడం జరుగుతాయి.
ఇక ప్రస్తుతం సిసిలియా తన ముఖం కడుక్కుంటుండగా ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్ధం వినిపిస్తుంది. సిసిలియా ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఒక విశాలమైన గదిలోకి చేరుకుంటది. తీరాచూస్తే అక్కడొక నన్ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంటది. ఆ నన్ యొక్క ముఖం ఎర్రగా చాలా విచిత్రంగా ఉంటది. తనని చూసి సిసిలియా ఒక్కసారిగా భయపడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రెవరెండ్ మదర్ కూడా వస్తుంది. రెవరెండ్ మదర్ సిసిలియాని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ గాజు పెట్టెలో ఉన్న ఒక పొడవైన ఇనుప చీలని బయటికి తీసి సిసిలియాకి చూపిస్తుంది. “ఇది యేసయ్యకి శిలువ వేసిన ఆ మూడు చీలలలో ఒకటి” అని రెవరెండ్ మదర్ సిసిలియాకి చెప్తుంది. తన మాటల్ని విన్న సిసిలియాకి అసలక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.
ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి సిసిలియాని చంపటానికి ప్రయత్నిస్తారు. దాంతో సిసిలియా వెంటనే నిద్రలోంచి మేలుకుంటది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి గదిలోకి వచ్చి సిసిలియాని అంతే చూస్తుంటుంది. సిసిలియా తనని గమనించి వెంటనే దీపాన్ని వెలిగించగా ఆ వ్యక్తి అక్కడినుంచి మాయమైపోద్ది. ఇలా ఆ కాన్వెంట్ లో అంతా వింత వింతగా జరుగుతుండడంతో సిసిలియాకి ఆ రాత్రి సరిగా నిద్రపట్టదు. రోజులు గడిచేకొద్దీ సిసిలియా మరియు గ్వెన్ బాగా దగ్గరవుతారు. ప్రతిరోజూ బట్టలు ఉతికేయడం, ముసలి నన్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం వంట పనుల్ని చేయడం, ఇలా ప్రతి పనిని వారిద్దరూ సంతోషంగా చేస్తుంటారు. ఒకరోజు సిసిలియా ప్రశాంతంగా నిద్రపోతుండగా ఒక ముసలి నన్ తన గదిలోకొచ్చి సిసిలియా యొక్క జుట్టుని కొంచెం కత్తిరిస్తుంది.
3) మొదలైన వింత
సిసిలియా వెంటనే మెలకువలోకి వచ్చి ఆమెని జాగ్రత్తగా తన మంచం దగ్గరికి తీసుకెళ్లి పడుకోపెడుతుంది. అంటే ముసలి నన్స్ అందరూ మరణానికి దగ్గరగా ఉన్నారు కదా! అందువల్ల వాళ్లకి మతిస్థిమితం సరిగా లేకనే, పొరపాటున తన జుట్టుని కత్తిరించి ఉండొచ్చని సిసిలియా అనుకుంటది. సిసిలియా తనకి దుప్పటి కప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తూ ఆమె కాళ్ళని పరిశీలించగా, ఆమె పాదాలపై శిలువ ఆకారంలో కాలిన గుర్తులుంటాయి. సిసిలియా ఆ గుర్తులని చూసి చాలా ఆశ్చర్యపోద్ది. మరుసటి రోజు సిస్టర్స్ అందరూ స్నానం చేస్తుంటారు. అప్పుడు గ్వెన్ అసలు తను ఈ కాన్వెంట్ లో ఎందుకు చేరిందో సిసిలియాకి చెప్తది. గ్వెన్ కి ఒక లవర్ ఉంటాడు. తన పేరుని మనం కాసేపు “జస్టిన్” అనుకుందాం.

జస్టిన్ ప్రతిరోజూ గ్వెన్ మీద అరుస్తూ తనని బాగా కొడుతూ హింసిస్తుంటాడు. అది భరించలేక తను వాడిపై బాగా దాడి చేసి వాడి దగ్గర్నుంచి దూరంగా వచ్చేస్తది. ఎక్కడికెళ్ళాలో తెలియక బాగా సతమతమవుతున్నప్పుడు తనకి నన్స్ కనిపిస్తారు. “ఈ సిస్టర్స్ కి తినడానికి ఆహారం, చేయడానికి పని, ఉండడానికి నివాసం కలిగిన ఒక సురక్షితమైన ప్రదేశం ఉంది. ఇంతకంటే మంచి ఆశ్రయం ఎక్కడా ఉండదు. కాబట్టి నేను కూడా ఒక నన్ గా మారిపోయి ఈ చెడు లోకానికి దూరంగా వెళ్ళిపోతా” అని నిర్ణయించుకొని గ్వెన్ ఈ కాన్వెంట్ లో చేరుతుంది. అంటే గ్వెన్ కి దేవునిపై నమ్మకం లేదని కాదు, తనకి దేవునిపై నమ్మకముంది.
కాకపోతే అంత ఎక్కువా కాదు, అంత తక్కువా కాదు. ఈ విషయాలన్నీ గ్వెన్ సిసిలియాకి చెప్పిన తరువాత సిసిలియా పొరపాటున వాంతి చేసుకుంటది. సిసిలియాని ఆరోగ్యాన్ని డాక్టర్ పరిశీలించి కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు. కొంచెంసేపటి తరువాత సిసిలియాకి కార్డినల్స్ దగ్గర్నుంచి పిలుపురావడంతో సిసిలియా తన దగ్గరికెళ్తుంది. అక్కడ కార్డినల్ తో పాటు డాక్టర్, ఫాదర్ టెడేస్కి మరియు రెవరెండ్ మదర్ కూడా ఉంటారు. “నువ్వు ఇంతకుముందు చేసిన ప్రమాణాలని అతిక్రమించి ప్రవర్తించావా?” అని కార్డినల్ కోపంగా సిసిలియాని అడుగుతాడు. అందుకు సిసిలియా, “లేదు, నేను నా ప్రమాణాలని ఎప్పుడూ అతిక్రమించి ప్రవర్తించలేదు” అని సమాధానమిస్తుంది. కానీ కార్డినల్ మాత్రం తన మాటల్ని అస్సలు నమ్మడు.
4) సిసిలియాకి గౌరవం
“నువ్వు ఈ కాన్వెంట్ లో చేరకముందు ఎవరితోనైనా శారీరకంగా కలిశావా?” అని కార్డినల్ సిసిలియాని మళ్లీ ప్రశ్నిస్తాడు. అందుకు సిసిలియా “నేను ఇప్పటివరకు ఎవరితోనూ అలా కలవలేదు, నేను ఇప్పటికీ కన్యకనే” అని ధైర్యంగా చెప్తది. అసలిప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో సిసిలియాకి ఏమీ అర్ధంకాక, “అసలిక్కడ ఏం జరుగుతుంది?” అని ఫాదర్ టెడేస్కిని సిసిలియా అడుగుతుంది. నిజానికి డాక్టర్ తన ఆరోగ్యాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం బయటపడిద్ది. ఆ విషయమేంటంటే, సిసిలియా ప్రస్తుతం కడుపుతో ఉందని. ఏ మగాడితో శారీరకంగా కలవకపోయిన సరే సిసిలియా గర్భం దాల్చడంతో, ఇది దేవుని యొక్క అద్భుతమని, సిసిలియా మరో కన్యకా మేరీ అని అనుకుంటారు.
ఈ అద్భుతాన్ని పండగ చేసుకునేందుకు అందరూ ఒక వేడుకని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ వేడుకలో ఇసబెల్ మరియు గ్వెన్ మాత్రం అస్సలు సంతోషంగా ఉండరు. అసలు వాళ్లిద్దరూ ఎందుకు సంతోషంగాలేరో మనకి కథలో పోను పోనూ తెలుస్తది. సిసిలియాని అందరూ గౌరవంగా, చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. ఉదయం ఆహారం తిన్న తర్వాత సిసిలియా బాత్ టబ్ లో సేద తీరుతుండగా, అక్కడికి ఇసబెల్ వచ్చి సిసిలియాపై దాడి చేసి చంపాలని చూస్తది. ఇసబెల్ సిసిలియాపై దాడి చేస్తూ “నీ స్థానంలో ఉండాల్సింది నేను” అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుల్ని విన్న మిగతా వారు వెంటనే అక్కడికొచ్చి ఇసబెల్ నుంచి సిసిలియాని కాపాడతారు. కొంచెం సేపటి తర్వాత ఇసబెల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటది.

గ్వెన్ కి కాన్వెంట్ లోని నన్స్ మీద, ఫాదర్స్ మీద మొదటినుంచే అనుమానం ఉంటది. గ్వెన్ ఈ విషయం గురించి సిసిలియాకి చెప్తుండగా ఫాదర్ టెడేస్కి మధ్యలో కలగజేసుకుంటాడు. ఇక గ్వెన్ ఓపిక పట్టలేక, “అసలు ఇసబెల్ ఎందుకు చనిపోయిందో మనకెవరికీ తెలియదు. సిసిలియా ఎలా గర్భం దాల్చిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ ఏదో జరుగుతుంది. వీళ్ళందరూ ఆ విషయాలు మనకి తెలియకుండా దాస్తున్నారు” అని నన్స్ తో గట్టిగా చెప్తుంది. అప్పుడు టెడేస్కి, టెడేస్కి మనుషులు గ్వెన్ నోరు మూసేసి తనని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. చీకటి పడిన తరువాత గ్వెన్ తో మాట్లాడాలని సిసిలియా తన గదిలోకెళ్తుంది. కానీ అక్కడ గ్వెన్ ఉండదు. తనని వెతుక్కుంటూ సిసిలియా కార్డినల్స్ గదిలోకెళ్లి అక్కడంతా పరిశీలించగా అక్కడ తనకి కొన్ని పత్రాలు కనిపిస్తాయి.
5) ముగింపు
వాటిలో సిసిలియాకి సంబందించిన సమాచారం, తన చిన్ననాటి ఫోటోలు చాలా ఉంటాయి. వాటిని చూసి సిసిలియా చాలా ఆశ్చర్యపోద్ది. సరిగ్గా అదే సమయంలో దూరంగా ఎవరో అరుస్తున్న శబ్ధం వినిపిస్తుండడంతో సిసిలియా ఆ ఆరుపుల్ని అనుసరిస్తూ వెళ్తది. తీరాచూస్తే కొందరు నన్స్, గ్వెన్ ని బంధించి తన నాలుకని కత్తితో కత్తిరించేస్తారు. అది చూసి సిసిలియా భయంతో గట్టిగా అరవపోతుండగా, వెంటనే అక్కడికొక ముసలి నన్ వచ్చి సిసిలియా నోటిని మూసేస్తుంది. ఈమె ఎవరో కాదు, ఇంతకుముందు ఒక ముసలావిడ సిసిలియా జుట్టుని కత్తిరించింది కదా! ఆవిడే ఈవిడ. సిసిలియా తనతో, “మనమిక్కడికి నుంచి వెంటనే పారిపోవాలి” అని కంగారుగా చెప్తది. కానీ ఆమె మాత్రం “ఇక్కడినుంచి ఎవరూ ఎప్పటికీ తప్పించుకోలేరు” అని అంటది.
మరుసటి రోజు ఉదయం సిసిలియా గదిలోంచి గట్టిగా అరుపులు వస్తుండడంతో అందరూ హడావిడిగా తన గదిలోకెవెళ్తారు. తీరాచూస్తే సిసిలియాకి రక్తశ్రావం జరుగుతుంటది. సమయానికి డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఫాదర్ టెడేస్కి సిసిలియాని కార్లోకి ఎక్కించి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుంటాడు. రెవరెండ్ మదర్ సిసిలియాకి ప్రాణాపాయం కలగకూడదని ఏడుస్తూ ప్రార్ధిస్తుంటది. అప్పుడు తనకి ఆ రక్తపు వాసన మనిషి రక్తంలా కాకుండా కాస్త విచిత్రంగా ఉందని తెలుస్తుంది. దాంతో రెవరెండ్ మదర్ కి అనుమానం వస్తది. ఆ అనుమానంతో తను గది మొత్తం పరిశీలించగా తనకి సిసిలియా మంచం కింద ఒక చచ్చిన కోడి కనిపిస్తది.
ఇక్కడితో మనం ఈ సినిమా కథ గురించి కొంత వరకు మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత ఏమి జరుగుతుంది అనేదే అసలైన టర్నింగ్ పాయింట్. అసలు సిసిలియా ఎలా గర్భవతి అయింది? సిసిలియా కాన్వెంట్ నుంచి బయటపడిందా, లేదా? అసలీ సినిమా ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది, ఒకసారి చూసేయండి. నాకైతే ఈ సినిమా బాగానే అనిపించింది. కథ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, కొన్ని సీన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇందులో హారర్ కంటే సస్పెన్స్ మరియు సైకాలజికల్ థ్రిల్ ఎక్కువగా ఉంది. సిడ్నీ స్వీని ఈ చిత్రంలో చాలా బాగా నటించింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రేమికుల్ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటది.
