The Inheritance (2024) Plot Summary Explained in Telugu
సినీ ప్రియులకి ఏదైనా సినిమా నచ్చిందంటే ఆ సినిమాని ఎన్నిసార్లు అయిన చూసేస్తారు. అదే ఏదైనా సినిమా నచ్చకపోతే అసలు చూడను కూడా చూడరు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒక్కసారైనా సరే చూడగలిగేలా మంచి కథతో, కథనంతో ఉంటాయి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా సినిమా మళ్ళీ మళ్ళీ చూడగలిగేదా? ఒక్కసారి చూడగలిగే సినిమానా!? లేదా ఒక్కసారి కూడా చూడాలనిపించని సినిమానా అనే విషయం మరికొన్ని క్షణాల్లో తెలుసుకుందాం. 2024లో విడుదలైన “The Inheritance” అనే సినిమా సస్పెన్స్ మరియు మిస్టరీతో నిండిన థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా చాలా ఆసక్తిగా ఉంటది.
ఒక కుటుంబంలో జరిగే అనూహ్యమైన సంఘటనలతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమాలో బాగా డబ్బున్న ఒక ముసలి వ్యక్తి ఉంటాడు. తనని చంపేందుకు ఎవరో పథకం వేశారని, తన కొడుకుల్ని, కూతుర్లని ప్యాలెస్ కి పిలిపించి ప్యాలెస్ కి తాళం వేసేస్తాడు. ఒకవేళ ఆ ముసలాయన చనిపోతే తమ ఆస్తి మొత్తం చారిటీకి వెళ్ళిపోద్ది. అసలు తనని చంపాలనుకుంటుంది ఎవరు!? తనని చంపాలనుకుంటున్నది మనిషా!? లేక దెయ్యమా?! తమ నాన్నని చావు నుంచి రక్షించి, వాళ్ళు ఆస్తిని కాపాడుకోగలరా!? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి!
కథ ఏంటంటే!
1) మొదటి నుంచే సస్పెన్స్
‘చార్లెస్ అబర్నతి’ అనే ప్రఖ్యాతి చెందిన బిలియనియర్, తన పిల్లల్ని ఇంటికి రమ్మని పిలుస్తూ ఒక్కొక్కరికి ఒక్కో ఉత్తరం పంపిస్తాడు. చార్లెస్ కి నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. వీళ్ళ పేర్లు ఏంటంటే, ‘మ్యాడి’, ‘CJ’, ‘డ్రూ’ మరియు ‘కమి’. చార్లెస్ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మరణిస్తది. ప్రస్తుతం చార్లెస్ పిల్లలు వేరే వేరే పట్టణాల్లో నివసిస్తూ, తమ వారసత్వ వ్యాపారాలని చూసుకుంటుంటారు. అలా కేవలం చార్లెస్ మాత్రమే ప్యాలెస్ లో నివసిస్తుంటాడు. తనని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్యాలెస్ నిండా సెక్యూరిటీ మరియు అసిస్టెంట్స్ చాలా మందే ఉంటారు. కట్ చేస్తే, చార్లెస్ పిల్లలు ప్యాలెస్ కి చేరుకుంటారు.
డ్రూ తనతోపాటు తన భార్యను కూడా ప్యాలెస్ కి తీసుకొస్తాడు. డ్రూ భార్య పేరు ‘హ్యాన్నః’. నిజానికి కేవలం తన నలుగురు పిల్లల్ని మాత్రమే చార్లెస్ ప్యాలెస్ కి రమ్మంటాడు. కానీ డ్రూ మాత్రం తన భార్యని కూడా తీసుకురావడంతో, “ఏంటి నువ్వు నీ ఉత్తరాన్ని సరిగ్గా చదవలేదా! నాన్న రమ్మన్నది మన నలుగుర్ని మాత్రమే” అని మ్యాడి అంటది. “మేమిద్దరం నాన్నకొక బహుమతిని ఇవ్వబోతున్నాం, అందుకని నేనే తనని నాతో పాటు తీసుకొచ్చా” అని డ్రూ అంటాడు. నిజానికి డ్రూ, హ్యాన్నః ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు.
అయితే హ్యాన్నః యెుక్క స్టేటస్ తమ స్టేటస్ కంటే చాలా చాలా తక్కువగా ఉండడంతో వారిద్దరి పెళ్లికి చార్లెస్ ఒప్పుకోడు. కానీ డ్రూ మాత్రం చార్లెస్ ని ఎదిరించి మరీ హ్యాన్నఃని పెళ్లి చేసుకుంటాడు. ఇక అందరూ ప్యాలెస్ లోకి అడుగుపెడతారు. కమి, ‘మైల్స్’ తో మాట్లాడుతూ, ఏంటి ఇళ్ళంతా నిశ్శబ్ధంగా ఉంది! పని మనుషులందరూ ఎక్కడికెళ్ళారని?” అంటది. “వాళ్ళందర్నీ చార్లెస్ తమ ఇళ్ళకు పంపించేశాడు. వారంతా రేపు ఉదయమే ప్యాలెస్ కి తిరిగొస్తారు” అని మైల్స్ అంటాడు. ఈ మైల్స్ చార్లెస్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ అనమాట. “ముప్పై నిమిషాల్లో మీరు గ్రేట్ రూంలోకి రండి. అక్కడ చార్లెస్ మీతో మాట్లాడతాడు” అని మైల్స్ అంటాడు. ఇక వారంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయి, అర గంట తర్వాత గ్రేట్ రూంలోకి అడుగుపెడతారు.

2) ప్యాలెస్ కి తాళం
చార్లెస్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి, “మీరు ఈ ప్యాలెస్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి సరిగ్గా రెండు సంవత్సరాలయింది. అందరూ ఎలా ఉన్నారు” అని అడుగుతూ, “నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా!?” అని అంటాడు. “ఈరోజు మీ పుట్టినరోజు, అందుకే కదా మమ్మల్ని పిలిచావని కమి అంటది. “నేనీ రాత్రికి చనిపోబోతున్నా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచా” అని చార్లెస్ అంటాడు. “ఒకవేళ తనకి ఆరోగ్యం సరిగా లేదేమో” అని అందరూ అనుకుంటారు. కానీ విషయం అది కాదు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ, “ఈ రాత్రికి నన్ను ఎలాగైనా చంపేయాలని ఎవరో పథకం వేశారు. నేను గనక వాడి చేతిలో చనిపోయానంటే, ఆస్తి మొత్తాన్ని చారిటీకి ఇచ్చేయమని మైల్స్ తో చెప్పా.
కాబట్టి మీకు మన ఆస్తి దక్కాలంటే మీరు నన్ను చావు నుంచి రక్షించండి. కేవలం ఈ ఒక్క రాత్రికి మరణం నుంచి తప్పించుకుంటే చాలు, ఇక నన్ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించరు” అని చార్లెస్ అంటాడు. అప్పుడు హ్యాన్నః, “మీ ప్రాణానికి ఆపద ఉన్నప్పుడు మీరెందుకు సెక్యూరిటీని ఇళ్ళకి పంపించారు” అని అంటది. “ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నా పిల్లల్ని తప్పా ఇంకెవరిని నమ్మలేను. ఒకవేళ సెక్యూరిటీలోని వ్యక్తులే నన్ను చంపేందుకు పథకం వేశారేమో? అందుకే ఎవర్నీ నమ్మలేక అందర్నీ ఇళ్ళకి పంపించా” అని చార్లెస్ అంటాడు. ప్యాలెస్ కి ఉన్న ప్రతీ ఒక్క తలుపుని, కిటికీని మూసేసి, ఫోన్ కనెక్షన్ కూడా తీసేసి ప్యాలెస్ మొత్తాన్ని మైల్స్ లాక్ చేసేస్తాడు.
ఇక బయటి నుంచి ఏ ఒక్కరూ లోపలికి అడుగుపెట్టలేరు. చార్లెస్ హ్యాన్నఃతో, “కేవలం నా పిల్లలు మాత్రం నాకు రక్షణగా ఉంటే చాలు. నువ్వు మైల్స్ తో పాటు ఇక్కడినుంచి బయటికి వెళ్లొచ్చు” అని అంటాడు. కానీ తను మాత్రం, “నేను కూడా మీ కుటుంబ సభ్యురాలినే. కాబట్టి వీళ్ళతో పాటు నేను కూడా మీ ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తా” అని అంటది. “సరే నీ ఇష్టం” అని చార్లెస్ ఒప్పుకుంటాడు. ఇక తను మైల్స్ కి గుడ్ బై చెప్పగా మైల్స్ అక్కడినుంచి ఇంటికెళ్ళిపోతాడు. ఏదైనా అవసరమైతే పిలవండి, నేను లైబ్రరీలో ఉంటానని చెప్పి చార్లెస్ లైబ్రరీకి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటారు.
3) దాడి చేసింది ఎవరు?!
“అసలు నాన్న ఏం మాట్లాడుతున్నాడు? ఎవరో తనని చంపేందుకు పథకం వేయడమేంటి? సెక్యూరిటీని ఇళ్ళకి పంపించేసాడు. ప్యాలెస్ మొత్తాన్ని లాక్ చేపించాడు. కొంపతీసి నాన్నకేమైనా మతి పోయిందా!?” అని అనుకుంటూ వీళ్ళెవ్వరు చార్లెస్ చెప్పిన మాటల్ని అంతగా పట్టించుకోరు. కానీ డ్రూ, హ్యాన్నః మాత్రం, ” ఒకవేళ తనని చంపేందుకు నిజంగానే ఎవరైనా ప్లాన్ చేశారేమో” అని అంటారు. మ్యాడి, కమి మరియు CJ మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోకుండా, “అలాగేం జరగదులే” అని అంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోతారు. కట్ చేస్తే, కమి బేస్మెంట్ లోకెళ్తది. అక్కడంతా రకరకాల ఆల్కహాల్ బాటిల్స్ ఉంటయ్.
వాటిలోంచి తను రెండు బాటిల్స్ తీసుకుంటుండగా, తన వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టుగా కాస్త విచిత్రంగా శబ్ధం వస్తది. కమి భయపడుతూ, “ఇక్కడెవరైనా ఉన్నారా?” అని అంటది. కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి సమాధానం రాదు. కమి భయంతో వణికిపోతుంటది. తీరాచూస్తే తనని చంపేందుకు ఒక విచిత్రమైన నీడ వేగంగా వస్తుండడంతో, కమి వెంటనే బేస్మెంట్ లోంచి బయటకొచ్చేస్తది. అసలు విషయమేంటో క్లారిటీగా తెలుసుకునేందుకు డ్రూ, హ్యాన్నః చార్లెస్ దగ్గరికెళ్లి, “అసలు మిమ్మల్ని ఎవరు చంపబోతున్నారో కాస్త క్లారిటీగా చెప్పండి” అని అంటారు. “బిజినెస్ పేరుతో నేను ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశా. వాటి ప్రతిఫలమే ఇదంతా” అని చార్లెస్ అంటాడు.

మరో పక్క కమి జాలీగా మందేస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోన్ చూస్తుంటది. అప్పుడు ఎవరో తనని దారుణంగా చంపేసి స్విమ్మింగ్ పూల్లో పడేస్తారు. కమి ఎక్కడా కనిపించకపోవడంతో, ఏదో తేడాగా ఉందని డ్రూ, హ్యాన్నఃకి అనుమానమోస్తది. వారిద్దరూ కంగారుపడుతూ CJ, మ్యాడిల దగ్గరికెళ్లి, “చాలా సేపటి నుంచి కమి ఎక్కడా కనిపించట్లేదు” అని అంటారు. ఇక వారందరూ ప్యాలెస్ అంతా పరిశీలించి చేసి స్విమ్మింగ్ పూల్లో తేలాడుతున్న కమి మృతదేహాన్ని కనిపెడతారు. తన నుదుటి మీద గాయం ఉండడంతో, “ఒకవేళ తను తాగిన మత్తులో కాలు జారి నీళ్ళలో పడిపోయిందేమో” అని CJ అంటాడు. కానీ హ్యాన్నః మాత్రం, “ఒకవేళ తనని ఎవరైనా చంపేశారేమో” అని అంటది.
4) మొదలైన భయం
ఇంత భద్రంగా లాక్ చేసిన ప్యాలెస్ లోకి బయట నుంచి ఎవరు అడుగుపెట్టగలరని CJ అరుస్తాడు. “ఒకవేళ ప్యాలెస్ కి తాళం వేయకముందే ఎవరైనా లోపలికొచ్చి దాక్కుని ఉన్నారేమో” అని డ్రూ అంటాడు. ఏదైతేనేం, తమ సిస్టర్ చనిపోయినందుకు వారందరూ చాలా బాధపడతారు. కమి చనిపోయిన విషయాన్ని వారు చార్లెస్ కి చెప్పడంతో చార్లెస్ కూడా బాగా బాధపడతాడు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ, “నాకొక కల వచ్చింది. ఈరోజు రాత్రి నన్ను చంపడానికి రాబోతున్నది మనిషి కాదు, నన్ను చంపేందుకు రాబోతున్నది ఒక ఆత్మ” అని చెప్తాడు.
అసలు ఆత్మ వచ్చి చంపడమేంటని వారంతా షాకైపోతారు. చార్లెస్ హ్యాన్నఃతో, “నా చిన్న కూతురు చనిపోయింది. మైల్స్ తో పాటు నిన్ను కూడా ఇక్కడ్నుంచి వెళ్ళమని చెప్పా, కానీ నువ్వు వెళ్లకుండా నా ప్రాణాల్ని కాపాడుకునేందుకు ధైర్యం చూపించావ్. ఇక నుంచి నువ్వు కూడా మా కుటుంబంలోని వ్యక్తివే. కాబట్టి కమి ఆస్తిని నువ్వే తీసుకో” అని అంటాడు. ఇక్కడ ఒక్కొక్కరి వాటా రెండు బిలియన్ డాలర్స్. ఇక వాళ్ళందరూ చార్లెస్ ని ఎలాగైనా కాపాడాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అతను చనిపోతే వీళ్లకి ఒక్క రూపాయి కూడా దక్కదు కదా. ప్యాలెస్ లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక రైఫిల్, రెండు బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. “ఏమీ లేని దాని కంటే ఇది మంచిదేలే” అని అనుకుని CJ ఆ రైఫిల్ తీసుకుంటాడు.
కట్ చేస్తే, చార్లెస్ ని గ్రేట్ రూంలో జాగ్రత్తగా ఉంచి వీరంతా తనకి బయట కాపలా కాస్తుంటారు. హ్యాన్నఃని తమ కుటుంబ సభ్యురాలిగా చార్లెస్ అంగీకరించినప్పటికీ, CJ, మ్యాడి మాత్రం తనని పరాయి వ్యక్తిగానే చూస్తుంటారు. అసలింత సెక్యూరిటీ ఉన్న ప్యాలెస్ లోకి బయట నుంచి ఏ ఒక్కరు అడుగు పెట్టలేరు. అంటే దాని అర్థం, ఆస్తి కోసం డ్రూ, హ్యాన్నఃలే కమిని చంపేశారేమో అని CJ వారిద్దరిపై అనుమానపడతాడు. కానీ డ్రూ మాత్రం, “అసలు మాకు, కమి చావుకి ఎటువంటి సంబంధం లేదు” అని అంటాడు. ఇక వాళ్ళు ఇద్దరిద్దరుగా విడిపోయి చార్లెస్ కి కాపలా కాస్తుంటారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కమి మృతదేహం లేకపోవడంతో, “ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా! ఇంతలోనే తన శవం ఎలా మాయమైపోయింది” అని డ్రూ, హ్యాన్నః ఒక్కసారిగా షాకైపోతారు.
5) ముగింపు
సినిమాలోని ట్విస్టులన్నీ ఇక్కడే తెలుసుకుంటే ఎలా… అసలైన ట్విస్టుల్ని ఒకసారి కళ్ళారా చూస్తే ఆ మజానే వేరు. ఇప్పటివరకు మనం చూసింది కేవలం కొన్ని విషయాలు మాత్రమే. అసలైన ట్విస్ట్ సినిమాలో దాగుంది. మరి ఆ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది, ఒకసారి చూసేయండి!
- నాకైతే ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే విధంగా అనిపించింది. కాకపోతే ఇందులో చాలా సీన్లు చీకట్లో తీసినట్లు ఉంటాయి. కొంత మంది ప్రేక్షకులకి ఇలాంటి స్క్రీన్ ప్లే నచ్చదు. కానీ తరచుగా ఇలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులకు అదేం పెద్ద సమస్య కాదులేండి.
- ఈ సినిమాని మొదటిసారి చూసేటప్పుడు కలిగే ఆ ఆసక్తి రెండోసారి చూస్తున్నప్పుడు కలగదు. ఎందుకంటే మొదటిసారి చూసినప్పుడే మనకు మూవీలోని ప్రతీ ట్విస్ట్ తెలిసిపోయిద్ది కదా!
ఏదేమైనా ఈ సినిమా మాత్రం మంచి ఆసక్తికరంగా ట్విస్టులతో నిండుకుని ఉంటది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకుంటది. ఇక ఆలస్యమెందుకు వెంటనే ఒకసారి మీరు కూడా ఈ సినిమాని చూసేయండి!
