Azrael (2024) Plot Summary Explained in Telugu
ఎప్పుడూ ఒకేరకమైన సినిమాలు చూసి విసుగుపుడుతుందా!? అన్నీ సినిమాల్లా కాకుండా ఏదైనా కొత్తగా ఉండే సినిమాని చూడాలనుకుంటున్నారా!? అయితే 2024లో విడుదలైన “అజ్రాయెల్” (Azrael) అనే సినిమా ఒకసారి చూసేయండి. మిగతా సినిమాలకి, ఈ సినిమాకి తేడా ఏంటని అనుకుంటున్నారా!? ఈ సినిమాలో ఏ ఒక్కరు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇందులో కథ మొత్తం అపోకలిప్టిక్ ప్రపంచంలో జరుగుతుంది. అసలు జనాలు ఎందుకని నోరు తెరిచి మాట్లాడడం మానేశారు? దాని వెనకున్న కారణమేంటి అనే పాయింట్ చాలా ఆసక్తిగా ఉంటది.
ఈ సినిమాలో మాటలు లేనప్పటికీ, పాత్రల హావభావాలు, విజువల్స్, వాతావరణం, మరియు నిశ్శబ్దం ప్రేక్షకుల్ని కట్టిపడేలా చేస్తాయి. ప్రపంచం నాశనమయిన తర్వాత, కొంత మంది మనుషులు ఒక బృందంగా ఏర్పడి అడవిలో నివసిస్తుంటారు. వాళ్ళు ఒక అమ్మాయిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరి ఆ అమ్మాయిని చేసిన తప్పు ఏమిటి? ఎందుకు తనని బలి ఇవ్వాలనుకున్నారు? తనని ఎవరికి బలి ఇవ్వాలనుకున్నారు!? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. మరి ఇక ఆలస్యమెందుకు, ఈ సినిమా కథేంటో, దీని వేశేషాలేంటో చూసేద్దాం రండి!
కథ తెలుసుకుందామా!
1) అడవిలో జీవనం
ఒక భయంకరమైన విపత్తు జరగడం వల్ల భూమి మీదున్న మనుషులందరూ తమ ప్రాణాల్ని కోల్పోతారు. కేవలం కొద్ది మంది మాత్రమే విపత్తు నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకుంటారు. వీరిలో కొంతమంది అడవుల్లో, మరికొంత మంది అడవికి దూరంగా నివసిస్తుంటారు. అడవిలో నివసించే మనుషులందరూ ఒక చిన్నపాటి ఊరిని నిర్మించుకుని దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. వీరిని ‘కల్ట్స్’ అని పిలుస్తారు. తమ ఆరాధనలో భాగంగా నోరు తెరిచి మాట్లాడడం పాపమని, కాబట్టి ఎప్పటికీ మాట్లాడకూడదని నిర్ణయించుకుని వీరంతా తమ స్వర పేటికల్ని తొలగించుకుంటారు. అలా ఇక వీరెవ్వరూ మాట్లాడరు, మాట్లాడలేరు. ‘మిరియమ్’ అనే ఆవిడ దేవునికి ప్రార్ధన చేసి, చర్చి యొక్క గోడ మీద ఒక అమ్మాయి బొమ్మని గీస్తది.
కట్ చేస్తే ‘అజ్రయెల్’ దగ్గర సీన్ ఓపెనయిద్ది. అజ్రాయెల్ మరియు ‘కేనన్’ ప్రేమలో ఉంటారు. వీరిద్దరూ తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు కల్ట్ బృందం నుంచి తప్పించుకుని తమ గ్రామం నుంచి దూరంగా వచ్చేస్తారు. అడవిలో ఉన్న చిన్నపాటి మొక్కలతోటి అజ్రాయెల్ ఒక బ్రేస్లెట్ ని తయారు చేస్తుండగా, కేనన్ మాత్రం చలి కాచుకునేందుకు మంట వెలిగిస్తాడు. అజ్రాయెల్ వెంటనే తన దగ్గరికొచ్చి మంటని ఆర్పేసి కేనన్ పై కోప్పడిద్ది. అంటే మంట నుంచి వచ్చే పొగని కల్ట్ సభ్యులు చూశారంటే, ఆ పొగని అనుసరిస్తూ వాళ్ళు తమ దగ్గరికొచ్చే అవకాశం ఉంది కదా. అందుకనే తను మంటని ఆర్పేసి కేనన్ మీద కొప్పడిద్ది.
అజ్రాయెల్ తను తయారుచేసిన బ్రేస్లెట్ ని కేనన్ కి ప్రేమగా తొడిగిద్ది. అలా వారిద్దరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దూరం నుంచి ఎవరో ఈల వేస్తున్నట్టుగా శబ్ధం వినిపిస్తది. ఒకవేళ తమని పట్టుకునేందుకు కల్ట్ సభ్యులు వచ్చినట్లుందని అనుకుని అజ్రాయెల్, కేనన్ వెంటనే పరుగుతీస్తారు. కానీ కొన్ని క్షణాల్లోనే కల్ట్ సభ్యులు అక్కడికి చేరుకుని వాళ్ళిద్దర్ని పట్టుకుంటారు. వాళ్ళు వారిద్దరిపై బాగా దాడి చేసి, అజ్రాయెల్ ని ఒక కార్ లో అలాగే కేనన్ ని మరో కార్లోకి ఎక్కించి ఇద్దర్ని వేరు వేరు ప్రదేశాలకి తీసుకెళ్ళిపోతారు. కల్ట్ సభ్యులు అజ్రాయెల్ ని బలి అర్పించే ప్రదేశం దగ్గరికి తీసుకెళ్లి తనని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధిస్తారు.
2) రాక్షషులు – బలి – అజ్రాయెల్
అక్కడే ‘జోసెఫిన్’ కూడా ఉంటది. ఈ జోసెఫిన్ కల్ట్ సభ్యులకి నాయకురాలు. జోసెఫిన్ ఒక కత్తిని తీసుకుని అజ్రాయెల్ కాలికి చిన్నపాటి గాయం చేసి, తన కాలిలోంచి రక్తం బయటకు వచ్చేలాగా చేస్తది. అజ్రాయెల్ ని బలి తీసుకునేందుకు తన కాలి నుంచి కారుతున్న రక్తపు వాసనని అనుసరిస్తూ అక్కడికి కొన్ని క్షణాల్లోనే భయంకరమైన రాక్షషులు రాబోతాయి. కాబట్టి సభ్యులందరూ చిన్నపాటి గుట్టపైకి చేరుకుని గట్టిగా గసపెడుతుంటారు. ఆ సమయంలో ఓ రాక్షషి భయంకరంగా శబ్ధం చేస్తూ అజ్రాయెల్ దగ్గరికొస్తుంటది. ఆ రాక్షషిని చూసి అజ్రాయెల్ ఒక్కసారిగా భయపడిపోద్ది.

ఎలాగైనా సరే రాక్షషి నుంచి తప్పించుకోవాలని అజ్రాయెల్ తన చేతుల్ని తాళ్ల నుంచి విడిపించుకునేందుకు బలంగా ప్రయత్నిస్తది. ఆ ప్రయత్నంలో తన కుడిచేతికి ఉన్న తాళ్ళు ఊడిపోతాయి. ఈ విషయాన్ని గమనించిన ఒక కల్ట్ సభ్యుడు ఆజ్రాయెల్ ని సరిగా కుర్చీలో కూర్చోబెట్టేందుకు గుట్టపై నుంచి కిందకొస్తాడు. తన చేతిని తాళ్ళతో కట్టేసేందుకు అతను ప్రయత్నిస్తుంటాడు. కానీ అజ్రాయెల్ మాత్రం అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటది. అలా వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి తోపులాటలో అజ్రాయెల్ చేతిలోని పదునైన చెక్క ముక్క పొరపాటున అతని గొంతుకి గుచ్చుకుంటది. ఆతని గొంతు నుంచి కారుతున్న రక్తపు వాసనని అనుసరిస్తూ ఆ రాక్షశి అతని దగ్గరికొచ్చేస్తది.
ఇంకేముంది, అది అతన్ని ఒక చెట్టు దగ్గరికి లాక్కెళ్లి బ్రతికుండగానే పీక్క తినేస్తది. ఆ సమయంలో అజ్రాయెల్ తన ఎడమ చేతిని కూడా తాళ్ళ నుంచి విడిపించుకుని వెంటనే అక్కడినుంచి దూరంగా పారిపోద్ది. గుట్టపై ఉన్న కల్ట్ సభ్యులేమో అజ్రాయెల్ వైపు కాకుండా వేరే వైపు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అజ్రాయెల్ పారిపోయిందన్న విషయం అస్సలు తెలియదు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు గుట్టపై నుంచి కిందికొస్తారు. తీరాచూస్తే ఆ రాక్షసి అజ్రాయెల్ ని కాకుండా తమ వ్యక్తిని తింటుండడంతో, అజ్రాయెల్ పారిపోయిందన్న విషయం వాళ్ళకి అర్ధమైపోద్ది. ఇక్కడ రాక్షషులు అంటే మంటల్లో కాలిన మనుషులని అర్థం.
3) అజ్రాయెల్ ధైర్య సాహసాలు
అజ్రాయెల్ ఒక చిన్న నది వద్దకి చేరుకుని తన గాయానికి కట్టు కట్టుకుంటది. అప్పటికే తన రక్తపు వాసనని అనుసరిస్తూ మరో రాక్షసి కూడా నది వద్దకి చేరుకుంటది. రాక్షసి నుంచి తప్పించుకునేందుకు అజ్రాయెల్ వెంటనే తన పక్కనున్న గదిలోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటది. ఆ రాక్షషికి రక్తపు వాసన తెలియకుండా ఉండేందుకు అజ్రాయెల్ తన గాయాన్ని గట్టిగా చేతులతో మూసేస్తది. తనని తినేందుకు రాక్షసి గది దగ్గరికొస్తది, కానీ లోపలి నుంచి ఎటువంటి రక్తపు వాసన రాకపోతుండడంతో లోపలెవరూ లేరనుకుని అది అక్కడ్నుంచి వెళ్ళిపోద్ది. కొంచెం సేపటి తర్వాత అజ్రాయెల్ గదిలోంచి బయటకొస్తది. ప్రస్తుతం కేనన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అని అనుకుంటూ తను బాగా కంగారుపడిపోద్ది.
ఎలాగైనా సరే కేనన్ ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, కార్ టైర్స్ యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ కల్ట్ సభ్యులు నివసించే గ్రామానికి అజ్రాయెల్ చేరుకుంటది. రాక్షషులు తమ గ్రామలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు కల్ట్ సభ్యులు తమ గ్రామం చుట్టూ ఫెన్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఫెన్స్ కి రకరకాల వస్తువులు తగిలించబడి ఉంటాయి. అంటే ఎవరైనా ఫెన్స్ దాటేందుకు ప్రయత్నించారంటే ఆ వస్తువుల నుంచి శబ్ధం వస్తది. ఇక గ్రామంలోని వ్యక్తులకి అర్థమైద్దనమాట, ఎవరో అక్రమంగా తమ గ్రామంలోకి చొరబడుతున్నారని. ఈ విషయాలన్నీ అజ్రాయెల్ కి తెలుసు. అయినా సరే ఎలాగైనా గ్రామంలోకెళ్లి కేనన్ ని కాపాడుకోవాలని తను నిర్ణయించుకుంటది.
కాబట్టి ఎటువంటి శబ్దం చేయకుండా చాలా జాగ్రత్తగా ఫెన్స్ ని దాటి లోపలికెళ్తది. కేనన్ ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు తను గ్రామమంతా పరిశీలిస్తది. అప్పుడు తను కేనన్ కి ఇచ్చిన బ్రేస్లెట్ ఒక చోట కనిపిస్తది. అంటే కేనన్ కి ఏదో అపాయం జరిగినట్టుందని ఆజ్రాయెల్ కి అర్థమైపోద్ది. అదే సమయంలో బలినర్పించే ప్రదేశం నుంచి జోసెఫిన్ కూడా గ్రామానికి చేరుకుంటది. అజ్రాయెల్ వెంటనే ఒక గుడిసె వెనక్కి వెళ్లి తనకి కనిపించకుండా దాక్కుంటది. మిరియంని కలిసేందుకు జోసెఫిన్ చర్చిలోకెళ్తది. కానీ ఆ సమయంలో చర్చ్ లోపల ప్రార్థన జరుగుతుంటది. చర్చ్ గోడకి ఉన్న చిన్నపాటి రంధ్రం గుండా బయటనుంచి లోపలికి గాలి వస్తుంటది. ఆ రంధ్రం నుంచి వచ్చే గాలి ద్వారా దేవుడు తమతో మాట్లాడుతున్నాడనేది వారి యొక్క నమ్మకం.

4) కొత్త పరిచయం
కొంచెం సేపటి తర్వాత ప్రార్థన ముగియడంతో ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అజ్రాయెల్ బలి నుంచి తప్పించుకుందని తెలిసి, “ఒక్క పని కూడా సరిగ్గా చేయవా!” అన్నట్టు మిరియం జోసెఫిన్ మీద చేయి చేసుకుంటది. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఏదో శబ్దం రావడంతో, అదేంటో తెలుసుకునేందుకు జోసెఫిన్ వెంటనే చర్చిలోంచి బయటకొస్తది. తీరాచూస్తే అజ్రాయెల్ చర్చ్ కిందనే దాక్కునుంటది. “చివరికి దొరికింది రా ఇది” అని అనుకుంటూ జోసెఫిన్ తనని పట్టేసుకుంటది. కానీ తను జోసెఫిన్ పై దాడి చేసి పరుగుతీస్తది. విషయం తెలుసుకున్న కల్ట్ సభ్యులు ఆయుధాలు చేత పట్టుకుని అజ్రాయెల్ ని వెంబడిస్తారు. కానీ తను వాళ్లకి చిక్కకుండా విజయవంతంగా ఫెన్స్ దాటి అడవిలోకి పారిపోద్ది.
అయినా సరే వాళ్ళు తనని అస్సలు వదిలిపెట్టరు. ఫెన్స్ దాటే క్రమంలో అజ్రాయెల్ చేతికి పొరపాటున గాయమయిద్ది. ఇంకేముంది, తన గాయం నుంచి రక్తం కారుతుండడంతో ఆ రక్తపు వాసనని అనుసరిస్తూ రాక్షషులు కూడా తనని వెంబడిస్తాయి. ప్రాణ భయంతో వారందరి నుంచి దూరంగా పారిపోతున్న అజ్రాయెల్ కి లక్కీగా ఒక కార్ కనిపిస్తది. అజ్రాయెల్ వెంటనే కార్లోకి ఎక్కి, “మనం వెంటనే ఇక్కడినుంచి పోవాలి’ అన్నట్టుగా డ్రైవర్ కి సైగ చేస్తది. తను అలా ఎందుకు సైగ చేస్తుందో డ్రైవర్ కి ఏమి అర్ధం కాదు. డ్రైవర్ తనతో మాట్లాడుతూ, “విపత్తు నుంచి తప్పించుకున్న మనుషుల్లో నువ్వు కూడా ఒకరివా?” అని అడుగుతాడు.
కానీ తను మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. “ఏంటి ఈ అమ్మాయి అసలు మాట్లాడడం లేదు!” అని డ్రైవర్ అనుకుంటాడు. అప్పుడు అజ్రాయెల్ తన గొంతు మీదున్న శిలువ గుర్తుని డ్రైవర్ కి చూపిస్తది. అయినా సరే దాని అర్ధమేంటో అతనికి ఏమీ అర్థంకాదు. ఎందుకంటే తను నివసించేది అడవికి చాలా చాలా దూరంగా అనమాట. కాబట్టి తనకి అసలీ కల్ట్ బృందం గురించి ఏ విషయాలు తెలియవు. అలా వారిద్దరూ కార్లో వెళ్తుండగా హఠాత్తుగా అక్కడికొక కల్ట్ సభ్యుడు వచ్చి డ్రైవర్ ని గన్ తో కాల్చేస్తాడు. దాంతో అతను చనిపోవడంతో, ఆ కార్ అదుపుతప్పి ప్రమాదానికి గురైద్ది. అజ్రాయెల్ పై దాడి చేసేందుకు కల్ట్ సభ్యుడు ప్రయత్నిస్తాడు. అలా వారి మధ్య జరిగిన గొడవలో అజ్రాయెల్ కల్ట్ సభ్యుడుని షూట్ చేసి చంపేస్తది.
5) ముగింపు
ఈ విధంగా చాలా ఆసక్తికరంగా అజ్రయెల్ సినిమా సాగుతుంటది. ఇలాంటి సైలెంట్ సర్వైవల్ సినిమాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇలాంటి సైలెంట్ సినిమాలు చాలా అరుదుగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ సినిమాని చూసేయండి. నాకైతే సినిమా చాలా కొత్తగా అనిపించింది. సినిమాలో మాటలు లేకపోవడం వల్ల, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని మరింతగా కథలోకి లాగుతుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు నటీనటుల హావభావాలు ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. మామూలు సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సైలెంట్ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ కొత్తదనం కోరుకునే సినీ ప్రియులకి ఈ సినిమా ఒక విందులాంటిది. ఈ సినిమాలోని క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద ట్విస్టుతో ముగుస్తది. మరి ఆ ట్విస్టుని కళ్ళారా చూడాలంటే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటుగా ఉంది.
