Companion (2025) Plot Summary Explained in Telugu

Companion (2025) Plot Summary Explained in Telugu

ఈ రోజుల్లో థ్రిల్లర్, మిస్టరీ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగిపోయింది. అలాంటి వాటిలోనే 2025లో విడుదలైన “Companion” అనే సినిమా కూడా ఒకటి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మొదట ఇదొక సాధారణ కథలా అనిపించినా… కథ ముందుకు సాగే కొద్దీ ట్విస్టులు, సస్పెన్స్, ఎమోషనల్ టెన్షన్ అన్నీ కలిసి సినిమా చాలా రసవత్తరంగా మారుతుంది. ఈ సినిమాలోని రోబో కేవలం ఇంటి పనులు మాత్రమే కాదు, ఒంటి పనులు కూడా చేయగలదు. అసలు ఇందులో నిజమైన మనిషి ఎవరో, మనిషి రూపంలో ఉన్న రోబోట్ ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. నిజానికి తాము రోబోట్స్ అన్న విషయం కూడా రోబోలకి తెలియదు. వింటుంటే కథ చాలా రసవత్తరంగా, ఆసక్తిగా ఉంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం… ఈ సినిమా యొక్క కథేంటో, దీని విశేషాలేంటో చూసేద్దాం పదండి!

కథ ఎలా ఉందో చూద్దాం!
సరదాగా స్నేహితులతో షికారు

ఓపెన్ చేస్తే “జాష్” తన గర్ల్ ఫ్రెండ్ “ఐరిస్” ని తీసుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక లేక్ హౌస్ వద్దకి బయల్దేరతాడు. మరోపక్క జాష్ స్నేహితులందరూ ముందుగానే లేక్ హౌస్ వద్దకి చేరుకుంటారు. జాష్, ఐరిస్ సరదాగా మాట్లాడుకుంటూ కొంచెం సేపటి తర్వాత లేక్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. “క్యాట్” వారిద్దరిని పలకరించి లోపలికి ఆహ్వానిస్తది. వీరంతా ఒక వెకేషన్ లో భాగంగా సరదాగా ఇలా లేక్ హౌస్ వద్దకొస్తారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావడంతో ఐరిస్ స్నానం చేసి రిలాక్స్ అయిద్ది. ఈ లేక్ హౌస్ మరియు లేక్ హౌస్ చుట్టూ ఉన్న ప్రాంతమంతటికీ “సెర్గే” అనే వ్యక్తి యజమాని. క్యాట్, సెర్గే రిలేషన్లో ఉంటారు. రిలేషన్ అంటే పెద్ద రిలేషనేం కాదు. సెర్గే తనని ఉంచుకున్నాడనమాట.

అందుకనే క్యాట్ స్నేహితులు తన లేక్ హౌస్ కి వచ్చేందుకు సెర్గే ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటారు. “ఇలై”, “ప్యాట్రిక్” అనే ఇద్దరు అబ్బాయిలు కూడా రిలేషన్లో ఉంటారు. వీరిద్దరిదీ అదో రకమైన రిలేషన్, దాన్ని మనం తప్పు పట్టలేం. ప్యాట్రిక్, ఇలైని మొదటిసారి ఎక్కడ కలిశాడో, ఏ విధంగా కలిశాడో చెప్తూ, తమ మధుర జ్ఞాపకాల్ని అందరితో పంచుకుంటాడు. డిన్నర్ ముగిసిన తర్వాత ఒక మంచి పాట పెట్టుకుని అందరూ అనందంగా డాన్స్ చేస్తారు. ఆ సమయంలో జాష్, క్యాట్ రహస్యంగా చెవిలో ఏదో మాట్లాడుకుంటారు. డాన్స్ చేయడం ముగిసిన తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయి జాలీగా రొమాన్స్ చేసుకుని నిద్రపోతారు.

మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా అందంగా ఉండడంతో లేక్ దగ్గరికెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దామని జాష్ ఐరిస్ తో అంటాడు. అందుకు ఐరిస్ ఒప్పుకుని నీట్ గా రెడీ అయిద్ది. కానీ జాష్, ఐరిస్తో, “నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నాక్కొంచెం విశ్రాంతి కావాలి. కాబట్టి నువ్వొక్కదానివే లేక్ దగ్గరికెళ్లి ప్రశాంతంగా గడిపిరా” అని అంటాడు. “అదేంటి లేక్ దగ్గరికెళ్దామని నువ్వే కదా ప్లాన్ చేసింది. అలాంటిది నువ్వే రాకపోతే ఎలా” అని ఐరిస్ అంటది. “తలనొప్పి లేకపోయుంటే నేను కూడా వచ్చేవాన్ని. నువ్వు ఎలాగు రెడీ అయ్యావు కదా. నా వల్ల ప్లాన్ పాడవడం ఎందుకు. నువ్వు ప్రశాంతంగా గడిపిరా” అని జాష్ అంటాడు. అలాగైతే సరే అని ఐరిస్ తనకొక ముద్దిచ్చి లేక్ దగ్గరికి బయల్దేరిద్ది.

సెర్గే – ముద్దు – ఐరిస్

తను లేక్ దగ్గరికెళ్ళగానే జాష్ ఒక పెన్ డ్రైవ్ ని తన మొబైల్ కి కనెక్ట్ చేస్తాడు. ఐరిస్ ప్రశాంతంగా ప్రకృతిని ఆష్వాదిస్తూ తన జేబులో చెయ్ పెట్టిద్ది. తీరాచూస్తే తన జేబులో ఒక చిన్న కత్తి ఉంటది. అసలీ కత్తి నా పాకెట్ లోకి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఐరిస్ ఆ కత్తి వైపు అలాగే చూస్తుంటది. సరిగ్గా అదే సమయంలో సెర్గే కూడా లేక్ దగ్గరికొస్తాడు. సెర్గే ఐరిస్ కి గుడ్ మార్నింగ్ చెప్పి ప్రశాంతంగా బెంచ్ మీద పడుకుంటాడు. సెర్గేతో ఐరిస్ కి అంతగా పరిచయముండదు. కాబట్టి తను కాస్త ఇబ్బందిగా ఫీలయ్యి అక్కడ్నుంచి జాష్ దగ్గరికెళ్ళేందుకు సిద్ధమయిద్ది. సెర్గే ఐరిస్ ని ఆపి, “ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నవ్. నాతో కాసేపు మాట్లాడొచ్చు కదా” అని అంటాడు. సరే అలాగే అని ఐరిస్ అక్కడే కూర్చుంటది.

Companion (2025) Plot Summary Explained in Telugu
Companion (2025) Plot Summary Explained in Telugu

తను ఐరిస్ కి లోషన్ ఇచ్చి, “నా చేతులు వెనకదాకా అందడం లేదు. నువ్వు నా వీపు మీద లోషన్ రాయి” అని ఐరిస్ తో అంటాడు. వీడేంట్రా ఇలా చెప్తున్నాడని ఐరిస్ మళ్ళీ ఇబ్బందిగా ఫీలయిద్ది. కానీ తను తప్పనిసరి పరిస్థితిలో సెర్గే వీపుపై లోషన్ రాయడం మొదలుపెట్టిద్ది. ఇక ఇదే సరైన సమయమని సెర్గే ఐరిస్ చేతిని పట్టుకుని తనతో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. “నువ్వు ఇందుకే కదా తయారయింది. నువ్వు లేక్ దగ్గర ఉన్నావని చెప్పి నన్నిక్కడికి పంపించింది ఎవరో కాదు, తను క్యాట్” అని అంటూ సెర్గే తన భుజం మీద ముద్దు పెడతాడు. అలా చేయొద్దు అని అంటున్నా కూడా సెర్గే తన మాటల్ని పట్టించుకోకుండా తనని అలాగే కిస్ చేస్తుంటాడు.

ఇక ఐరిస్ కోపంతో పక్కనున్న వైన్ బాటిల్ తీసుకుని సెర్గే తలపై బలంగా కొట్టిద్ది. “ఏంటే నన్నే కొడతావా” అని అంటూ అతని ఐరిస్ ని కిందపడేసి గొంతు నులిమేస్తుంటాడు. అప్పుడు ఐరిస్ తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు తన జేబులో ఉన్న చిన్నపాటి కత్తిని బయటికి తీసి సెర్గే గొంతుకి గుచ్చిద్ది. దాంతో తను రక్తం కారుకుని చనిపోతాడు. కట్ చేస్తే స్నేహితులందరూ సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటుండగా, రక్తంతో నిండిన దేహంతో ఐరిస్ ఇంట్లోకి అడుగుపెట్టిద్ది. ఐరిస్ అవతారాన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అసలేం జరిగింది, నువ్వెందుకిలా రక్తంతో ఉన్నావని జాష్ ఐరిస్ ని అడుగుతాడు.

ఐరిస్ రోబోట్ అనమాట

ఐరిస్ జరిగిన విషయమంతా వివరంగా చెప్పి, “వాడు నా మీద పడి నా గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. ఒకవేళ నేను చనిపోతే నేన్నిన్ను ఎప్పటికీ చూడలేను కదా. అందుకని నేనే వాన్ని చంపేశా” అని అంటూ బాగా కంగారు పడిపోతుంటది. జాష్ తన కంగారుపడడం చూడలేక, “ఐరిస్ నిద్రపో” అని అంటాడు. దాంతో ఐరిస్ వెంటనే నిద్రలోకెళ్ళిపోద్ది. కట్ చేస్తే తనని కుర్చీలో కూర్చోపెట్టి తన కాళ్లు చేతుల్ని తాళ్లతో కట్టేస్తారు. “అసలిది ఎలా జరిగింది? ఈ రోబోట్స్ మనుషులకి ఎటువంటి హానీ కలిగించవు కదా” అని ఇలై, జాష్ తో అంటాడు. “ఒకవేళ తన సిస్టంలో గ్లిచ్ వచ్చుంటది.

అందుకే తను సెర్గే పై దాడి చేసింది” అని జాష్ అంటాడు. అంటే నిజానికి ఐరిస్ మనిషి కాదు, తనొక రోబోట్ అనమాట. ప్రస్తుతం ఐరిస్ యెుక్క సిస్టంలో గ్లిచ్ రావడంతో, జరిగిన హత్య గురించి పోలీసులకి విషయం చెప్పాలని అందరూ నిర్ణయించుకుంటారు. “నువ్వు బయటికెళ్లి పోలీసులకి ఫోన్ చెయ్, అంతలోపు నేను ఐరిస్ తో చివరిసారిగా మాట్లాడతానని జాష్ ఇలైతో అంటాడు. ఇక ఇలై బయటికెళ్ళిన తర్వాత, “ఐరిస్ మేలుకో” అని అనగానే ఐరిస్ మెలకువలోకొస్తది. “నన్నెందుకిలా తాళ్లతో బంధించారు. నేను నిజంగా తనని కావాలని చంపలేదు, అదంతా నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో అలా జరిగిపోయింది” అని అంటూ ఐరిస్ బాగా కంగారుపడిపోతుంటది.

అప్పుడు జాష్, “నువ్వు చెప్పేది నిజమేలే. నువ్వు ఎలాగు అబద్ధాలు కూడా చెప్పలేవు, ఎందుకంటే నువ్వు మనిషి కాదు, రోబోట్” అని అంటాడు. “నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్!? నేను రోబోట్ ఏంటి!?” అని ఐరిస్ షాకైపోద్ది. అంటే నిజానికి తనొక రోబోట్ అన్న విషయం ఐరిస్ కి అస్సలు తెలియదు. “నేను మనిషినేగా, మనమిద్దరం మొదటిసారి ఒక దుకాణంలో కలుసుకున్నాం. నేను రెండు సార్లు జపాన్ కి కూడా వెళ్లొచ్చా. నాకు చాలా జ్ఞాపకాలు గుర్తున్నయ్” అని ఐరిస్ అంటది. అప్పుడు జాష్, “నీ మెదడులో ఉన్న జ్ఞాపకాలన్నీ కేవలం కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే, అవేవీ నిజంగా జరగలేదు. అసలు మనమిద్దరం మొదటిసారి ఎలా కలుసుకున్నామో చెప్పేనా” అని అంటాడు. ఇప్పుడు కథ కాస్త వెనక్కి వెళ్తది.

Companion (2025) Plot Summary Explained in Telugu
Companion (2025) Plot Summary Explained in Telugu
నిజం తెలుసుకున్న ఐరిస్

ఎంపతిక్స్ అనే రోబోటిక్ కంపెనీ మనుషులకి తోడుగా ఉండేందుకు రోబోట్స్ తయారుచేస్తుంటది. వాళ్ల దగ్గర్నుంచే ఐరిస్ అనే రోబోని జాష్ కొంటాడు. ఈ రోబోట్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే… ఇవి మనిషి ఫీలయ్యే ప్రతి ఒక్క ఎమోషన్ ఫీలవ్వగలవు. భాదా, దుఃఖం, సంతోషం, కోపం మొదలైనవి., ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ రోబోట్స్ కి తాము రోబోట్స్ అన్న విషయం అస్సలు తెలియదు. ఎంపతిక్స్ ఏజెంట్ జాష్ ఫోన్ ని ఐరిస్ కి సింక్ చేస్తాడు. దాని ద్వారా జాష్ ఐరిస్ ని కంట్రోల్ చేయగలడు. నిజానికి ఈ రోబోట్స్ చాలా తెలివైనవి. కానీ గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల ప్రకారం, రోబోట్స్ కి ఎక్కువ తెలివి ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపతిక్స్ తమ రోబోట్స్ యొక్క తెలివిని చాలా వరకు తగ్గించేస్తుంది.

కానీ యూజర్స్ ఎవరైనా వాటి తెలివిని పెంచాలన్నా లేక తగ్గించాలాన్నా సరే తమ రోబోటిక్ యాప్ ద్వారా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. కేవలం తెలివిని మాత్రమే కాదు, రోబోట్ యెుక్క కోపాన్ని, అది మాట్లాడే భాషని, అలాగే దాని స్వరాన్ని… ఇలా చాలా రకాల సెట్టింగ్స్ అనేవి యూజర్ తన మొబైల్ ద్వారా మార్చుకోవచ్చు. “రోబో కళ్ళు తెరిచిన తర్వాత అది ఎలా అయితే చెప్తదో నువ్వు అలాగే తను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అవ్వు, దాంతో మీ ఇద్దరిమధ్య లవ్ లింక్ ఏర్పడిద్ది” అని చెప్పి ఎంపతిక్స్ ఏజెంట్స్ జాష్ దగ్గర్నుంచి వెళ్ళిపోతారు. కొంచెం సేపటి తర్వాత ఐరిస్ కళ్ళు తెరుస్తది. అప్పుడది జాష్ తో, “నా ముందుకొచ్చి నీ పేరు చెప్పు” అని అంటది.

జాష్ ఐరిస్ వైపు చూస్తూ తన పేరు చెప్తాడు. ఇక వారిద్దరు మొదటిసారి ఒక దుకాణంలో కలుసుకున్నట్టు, అప్పటినుంచి వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ఐరిస్ మెదడులో ఒక మెమరీ ఏర్పడిద్ది. అలా వారిద్దరి మధ్య లవ్ లింక్ ఏర్పడిద్ది. లవ్ లింక్ ఏర్పడ్డమే ఆలస్యం, జాష్ తనని గదిలోకి తీసుకెళ్ళి తనతో రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే కథ ముందుకొస్తుంది. “అంటే నేను నిజంగానే ఒక రోబోనా” అని ఐరిస్ షాకైపోద్ది. “సరే నేను రోబోట్ అయినా పర్లేదు. మనమిద్దరం ఎప్పటికీ ఇలానే కలిసుందాం” అని ఐరిస్ అంటది. ఆ సమయంలో క్యాట్ అక్కడికొచ్చి, “ఏంటి దాన్నింకా షట్ డౌన్ చేయలేదా?” అని జాష్ తో అంటది. నన్ను షట్ డౌన్ చేయడమేంటని ఐరిస్ కాస్త కంగారుపడిద్ది.

ముగింపు

ఈ విధంగా తనొక రోబోట్ అన్న విషయం ఐరిస్ తెలుసుకుంటది. మరి ఆ తర్వాత ఐరిస్, జాష్ మళ్లీ కలుసుకున్నారా!? లేదా స్నేహితులందరు కలిసి ఐరిస్ ని నాశనం చేశారా!? ఇలా మిగతా విషయాలన్నీ ఒకసారి సినిమా చూసి అనుభూతి చెందితే చాలా బాగుంటది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు కేవలం కొన్ని మాత్రమే! ఇంకా చాలా ట్విస్టులు, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు, ఆశ్చర్యపరిచే సంఘటనలు సినిమాలో ఇంకా ఉన్నాయి. నాకైతే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. నటీనటుల విషయానికొస్తే ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేయడం జరిగింది. ఐరిస్ అనే రోబోట్ పాత్రలో “Sophie Thatcher” చాలా బాగా నటించింది. కేవలం పది మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర 36.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసి మంచి హిట్ అయింది.

Leave a Comment