10 Cloverfield Lane (2016) Plot Summary Explained in Telugu
హఠాత్తుగా మీరొక బంకర్‌లో నిద్రలేచి, మీ కాలికి గొలుసులు బంధించబడి ఉన్నాయనుకోండి. ఆ సందర్భంలో మీరు ఏం చేస్తారు. మిమ్మల్ని ఆ బంకర్‌లో ఎవరు బంధించారో మీకు తెలియదు. అసలు మీరు ఆ బంకర్‌లోకి ఎలా వచ్చారో కూడా మీకు తెలియదు. అలాంటి పరిస్థితిలో మీరు ఏం చేస్తారు? వింటుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా! ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలో ఇలాంటి కథే ఉంటదనమాట. సినిమా పేరు ఏంటంటే “10 Cloverfield Lane”. ఇది 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదొక హార్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ.
ఈ సినిమా మొదటి నిమిషం నుంచే ప్రేక్షకుల్ని ఆసక్తిగా కట్టిపడేస్తుంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక అమ్మాయి హఠాత్తుగా ఒక భూగర్భ బంకర్‌లో మేల్కొంటుంది. తనని అక్కడ ఎవరో బంధించి ఉంటారు. ఆమెతో పాటు అక్కడ ఇద్దరు మగవాళ్ళు కూడా ఉంటారు. ఇంతకీ తనని బంకర్‌లో బంధించింది ఎవరు? అనే సందేహం ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. బయటి ప్రపంచమంతా ప్రమాదంలో ఉంది… గాలి కూడా విషపూరితంగా మారిందని ఆ మగవాళ్ళు తనతో చెప్తారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? నిజంగానే గాలి కలుషితమయిందా? లేక ఆ మగవాళ్ళు అబద్ధం చెప్తున్నారా? ఇంతకీ ఆమెని బంకర్‌లో బంధించింది ఎవరు!? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం రండి.
మొదటినుంచే సస్పెన్స్
‘మిషెల్’ అనే అమ్మాయి తనకి కాబోయే భర్తతో గొడవపడి, తన వస్తువులు తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చేస్తుంది. తనకి కాబోయే భర్త పేరు ‘బెన్’. బెన్ ఎన్ని సార్లు కాల్ చేస్తున్నా కూడా మిషెల్ తన కాల్స్ పట్టించుకోకుండ కార్ నడుపుతుంటది. ఆ సమయంలో పొరపాటున కార్ అదుపుతప్పి పొరపాటున ఒక ట్రక్ ని ఢీ కొట్టిద్ది. ఆ ప్రమాదంలో తనకి బాగా గాయాలవడంతో తను సృహ తప్పి కిందపడిపోద్ది. కట్ చేస్తే, మిషెల్ మెలకువలోకి వచ్చేసరికి తనొక గదిలో గొలుసులతో బంధించబడి ఉంటది. అలాగే తన చేతికి ఒక సెలైన్ బాటిల్ కూడా ఉంటది. అసలు తనకి ఏం జరిగింది, తనని ఎవరు ఇలా బంధించి ఉంచారో మనమిప్పుడు తెలుసుకుందాం!
మిషెల్ తన కాలుని గొలుసుల నుండి విడుపించుకోడానికి చాలా ప్రయత్నిస్తది. కానీ ఆ గొలుసుల నుండి మిషెల్ ఎంతకీ బయటపడలేదు. అలాగే ఆ కార్ ప్రమాదంలో తన కుడి కాలికి బాగా దెబ్బ తగిలిద్ది. మిషెల్ కి ఆ గదిలో తన బ్యాగ్ కనిపించడంతో తను వెంటనే సెలైన్ బాటిల్ స్టాండ్ అందుకుని, దాని సహాయంతో బ్యాగ్ దగ్గరున్న మొబైల్ ని నెమ్మదిగా తన దగ్గరికి లాక్కుంటది. కానీ ఆ గదిలో తనకి సిగ్నల్ అందదు. అసలు తను ఎక్కడుందో, తననిలా ఎవరు బందించారో తెలీక చాలా భయపడిపోతుంటుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి పెద్దగా అడుగులు వేసుకుంటూ వచ్చి మిషెల్ కి ఆహారాన్ని ఇస్తాడు.
అతని పేరు ‘హవర్డ్’. హవర్డ్ దగ్గర ఒక గన్ ఉండడంతో మిషెల్ కి తన భయం ఇంకా పెరిగిపోద్ది. మిషెల్ మాట్లాడుతూ, “దయచేసి నన్నేం చేయొద్దు, నన్ను వదిలిపెట్టు” అని హవర్డ్ ని బ్రతిమిలాడిద్ది. అప్పుడు హవర్డ్, “నీకు హాని చేసే ఉద్దేశం నాకస్సలు లేదు. నేను కేవలం నిన్ను రక్షిస్తున్నా” అని చెప్తాడు. నాకు కాబోయే భర్త నా కోసం వెతుకుతుంటాడు. తను నన్ను కనిపెట్టి పోలీసుల్ని తీసుకుని ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు” అని మిషెల్ అంటది. అప్పుడు హవర్డ్, “నిన్ను వెతకడానికి బయట ఎవరు ప్రాణాలతోలేరు” అని చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ కి అసలేమీ అర్ధంకాదు.

హవర్డ్ చెప్పేది నిజమేనా?!
ఇక హవర్డ్ తను నడిచేందుకు సపోర్ట్ కోసం రెండు చేతి కర్రల్ని, ఒక తాళాన్ని ఇచ్చి తలుపుకి తాళం వేస్తాడు. హవర్డ్ గదిలోంచి బయటికెళ్లిపోయిన వెంటనే మిషెల్ ఆ తాళం ఉపయోగించి తన కాలికి ఉన్న గొలుసుల్ని విడిపించుకుంటది. ఆ గదిలోంచి బయటపడాలని చూస్తెనేమో తలుపుకి తాళం వేసి ఉంటది. హవర్డ్ తనకిచ్చిన తాళం కేవలం గొలుసులు విడిపించుకునేందుకు మాత్రమే ఉపాయోగపడిద్ది. కాబట్టి అక్కడ్నుంచి ఎలా బయటపడాలో తెలియక మిషెల్ కి మెంటల్ లేస్తుంటుంది. సరిగ్గా అప్పుడే తనకొక ఆలోచన వస్తది. తను వెంటనే ఆ తాళాన్ని ఉపయోగించి ఒక చేతి కర్ర కొనని పదునుగా చేస్తది.
హవర్డ్ తలుపు తెరిచి లోపలికి వచ్చే సమయంలో, ఆ కర్రతో హవర్డ్ పై దాడి చేసి అక్కడ్నుంచి తప్పించుకోవాలని మిషెల్ పథకం వేస్తది. కానీ ఎంతసేపటికీ హవర్డ్ గదిలోకి రాడు. అందుకని మిషెల్ తన బ్యాగ్ లో ఉన్న ఒక డ్రెస్స్ ని కాల్చి ఫైర్ అలారమ్ మోగేలా చేస్తది. దాంతో హవర్డ్ కంగారుపడుతూ గదిలోకి వస్తాడు. మిషెల్ వెంటనే తను సిద్ధం చేసుకున్న పదునైన చేతి కర్రలతో హవర్డ్ పై దాడి చేస్తది. కానీ ఆ దాడిలో హవర్డ్ కి పెద్దగా దెబ్బలేమి తగలవు. మిషెల్ అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా హవర్డ్ తనకి మత్తుమందు గుచ్చుతాడు.
కట్ చేస్తే కొంచెంసేపటి తర్వాత మిషెల్ మెలకువలోకి వస్తది. ఆ సమయంలో హవర్డ్ గదిలోనే ఉంటాడు. “దయచేసి నన్ను వదిలిపెట్టు” అని మిషెల్ తనని బతిమిలాడుతుంది. అప్పుడు హవర్డ్, “నేను నిన్ను వదిలిపెట్టినా సరే నువ్వసలు ఎక్కడికి వెళ్తావ్? బయటంతా గందరగోళంగా ఉంది. బయట న్యూక్లియర్ దాడి జరిగినట్టుంది. మనం పీల్చే గాలి కూడా పూర్తిగా కలుషితమయింది. నువ్వు బయటికి వెళ్లి ఆ గాలిని పీల్చినా సరే వెంటనే చనిపోతావు. అసలు బయట ఎవరూ ప్రాణాలతో లేరు. నువ్వు కార్ ప్రమాదంలో గాయపడి సృహాకోల్పేతే, నేనే నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చా. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పకపోగా నాపై దాడి చేస్తున్నావ్.
బంకర్‌లో మరో వ్యక్తి
ఈ బంకర్లో ఉంటే మనం ప్రాణాలతో ఉండొచ్చు. బయట జరుగుతున్న దాడి పూర్తవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పట్టొచ్చు” అని అంటాడు. కానీ హవర్డ్ చెప్పిన ఈ మాటల్ని మిషెల్ అసలు నమ్మదు. అదే సమయంలో బయటనుంచి ఎదో శబ్ధం రావడంతో హవర్డ్ అక్కడ్నుంచి హాల్లోకి వస్తాడు. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత మిషెల్ నిద్ర నుంచి మేల్కొంటది. అప్పుడు తలుపు తెరిచే ఉండటంతో తను వెంటనే గదిలోంచి బయటికొస్తది. తీరాచూస్తే అక్కడ ఇంకో వ్యక్తి విరిగిన చేతితో, మరికొన్ని గాయాలతో కూర్చొని ఉంటాడు. అతని పేరు ‘ఎమెట్’.

తనలాగే ఎమెట్ ని కూడా హవర్డ్ కిడ్నాప్ చేసి ఇలా బంకర్లో బంధించిచాడని మిషెల్ అనుకుంటది. “నువ్వు నాతో కలువు, మనిద్దరం ఇక్కడినుంచి బయటపడదాం” అని మిషెల్ అంటది. అప్పుడు ఎమెట్, “మనం బయటికి వెళ్ళకూడదు. బయటంతా గందరగోళంగా ఉంది, గాలి కూడా కలుషితమయింది. మనమిక్కడ ఉంటేనే ప్రాణాలతో ఉంటాం” అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి హవర్డ్ వస్తాడు. నిజానికి హవర్డ్ ఆ బంకర్ని ఒక అందమైన ఇంటిలాగా తయారు చేస్తాడు. చదవడానికి చాలా రకాల పుస్తకాలు, ఆడుకోవడానికి ఆట వస్తువులు, పజిల్స్ మరియు చాలా రకాల ఆహారం ఆ బంకర్లో ఉంటాయి. మిషెల్ ఆ అందమైన ఇళ్లులాంటి బంకర్ని చూసి చాలా ఆశ్చర్యపోద్ది.
అసలు హవర్డ్ ఈ బంకర్ని ఎందుకు ఒక అందమైన ఇంటిలాగా మార్చాడో మనకి కథలో పోను పోను తెలుస్తది. ఈ బంకర్లో కేవలం ఒకే ఒక బాత్రూమ్ మాత్రమే ఉంటది. అది కూడా హవర్డ్ పడక గదిలో ఉంటుంది. అంటే మిషెల్ ఎప్పుడు బాత్రూంలోకి వెళ్ళాలన్నా సరే తను హవర్డ్ పడక గదిలోకి రావాల్సిందే. కట్ చేస్తే, వాళ్లున్న బంకర్ మీదనుంచి ఒక కార్ వెళ్తున్నట్టుగా మిషెల్ కి శబ్ధం వినిపిస్తది. ఈ విషయాన్ని తను హవర్డ్ కి చెప్పి, “మనుషులు బయట ప్రాణాలతో ఉన్నట్టుంది” అని అంటది. కానీ హవర్డ్ మాత్రం, “బయట ఎవరూ ప్రాణాలతో లేరు” అని గట్టిగా చెప్తాడు. కానీ ఎంతకీ తన మాటల్ని మిషెల్ నమ్మకపోతుండడంతో హవర్డ్ గ్లాస్ డోర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ డోర్ గుండా బయట ఏం జరుగుతుందో హవర్డ్ మిషెల్ కి స్పష్టంగా చూపిస్తాడు.
హవర్డ్ గురించి ఎమెట్ మాటల్లో
హవర్డ్ తనకి చనిపోయిన రెండు పందుల్ని చూపించి, “అవి నా పెంపుడు పందులు. బయట కలుషితమైన గాలిని పీల్చడం వల్లనే అవి చనిపోయాయి” అని అంటాడు. వాటిని చూసిన మిషెల్ ఇక హవర్డ్ మాటల్ని నమ్మడం మొదలుపెడుతుంది. తనకి ఆ పందుల పక్కనే రక్తపు మరకలున్న ఒక ట్రక్ కనిపిస్తది. అప్పుడే తనకొక విషయం గుర్తొస్తది. “అసలు ఇంతకుముందు నా కార్ వెళ్లి ట్రక్ ని ఢీ కొట్టలేదు. ఒక ట్రక్ వచ్చి నా కారుని ఢీ కొట్టింది. ఆ ట్రక్ ఏదో కాదు, అది ఇదే. అంటే హవర్డ్ నా కారుని కావాలనే ఢీ కొట్టి నన్నిక్కడికి తీసుకొచ్చాడు, కానీ ఎందుకు?” అని మిషెల్ ఆలోచనలో పడిద్ది.
కొంచెంసేపటి తరువాత మిషెల్, ఎమెట్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఎమెట్ మాట్లాడుతూ, “హవర్డ్ ఇంతకుముందు మిలిటరీ కోసం శాటిలైట్ ఫీల్డ్ లో పని చేశాడు. అప్పటినుంచి తనకి టెక్నాలజీ మీద బాగా పట్టు ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటి న్యూక్లియర్ దాడులు జరగొచ్చు అన్న అనుమానంతోనే హవర్డ్ ఈ బంకర్ని ఇంటిలాగా మార్చాడు. అందుకు నేను కూడా తనకి సహాయం చేశాను. హవర్డ్ ఊహించినట్టుగానే ఆకాశంలో పెద్దగా కాంతి వెలిగి దాడి జరగడం మొదలయింది. నేను భయంతో ప్రాణాలకోసం పరిగెడుతూ ఈ బంకర్లోకి చేరుకున్నాను. అప్పుడే నా చెయ్యి విరిగి నాకు దెబ్బలు తగిలాయి” అని మిషెల్ తో చెప్తాడు.
ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేయడం మొదలుపెడతారు. హవర్డ్ గురించి ఎమెట్ మంచిగా చెప్పినా కూడా మిషెల్ కి ఎందుకో హవర్డ్ మీద కాస్త అనుమానంగానే ఉంటది. కాబట్టి తను ఎలాగైనా సరే ఆ బంకర్లోంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటది. సరిగ్గా అప్పుడే హవర్డ్ బెల్ట్ కి తాళాలు ఉండటం కనిపించడం, బంకర్ మీదనుంచి ఏదో కార్ వెళ్తునట్టుగా శబ్ధం రావడం జరుగుతాయి. ఇక మిషెల్ ఆలస్యం చేయకుండా తెలివిగా హవర్డ్ దగ్గరున్న తాళాల్ని తీసుకుంటది. అలాగే తనొక బాటిల్ తో హవర్డ్ మీద దాడి చేసి వెంటనే గ్లాస్ డోర్ దగ్గరికి పరుగుతీస్తది.

నిజం తెలుసుకున్న మిషెల్
మిషెల్ దాన్ని కూడా తెరిచి బయటపడాలని చూస్తుంటది. కానీ ఆ డోర్ ఎంతకీ తెరుచుకోదు. సరిగ్గా అప్పుడే ఒక మహిళ కార్లోంచి బయటికొచ్చి మిషెల్ దగ్గరికి చేరుకుంటది. ఆవిడ ముఖమంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయింటది. ఆవిడ మాట్లాడుతూ, “అది నన్ను కొంచమే ముట్టుకుంది. నాకేం కాలేదు, దయచేసి నన్ను లోపలికి రానివ్వు” అని ఏడుస్తూ అడిగిద్ది. అప్పుడే హవర్డ్ అక్కడికొచ్చి, “ఎట్టి పరిస్థితుల్లో నువ్వా తలుపుని తెరవద్దు” అని మిషెల్ కి గట్టిగా చెప్తాడు. అసలు మిషెల్ కి ఏం చేయాలో ఏమి అర్ధంకాదు. మిషెల్ ఎంతకీ తలుపు తెరవకపోతుండడంతో ఆవిడ మిషెల్ ని బూతు మాటలు తిట్టీ తలుపుని బలంగా గుద్దుతుంది. ఇక మిషెల్ భయంతో మళ్ళీ బంకర్లోకి వచ్చేస్తది.
కొంచెంసేపటి తర్వాత హవర్డ్ మిషెల్ దగ్గరికొచ్చి కార్ ప్రమాదం గురించి నిజం ఒప్పుకుంటాడు. “నీ కారుని ఢీ కొట్టింది నేనే, కానీ నేను కావాలని చేయలేదు. ఆకాశం నుంచి దాడి జరగడం మొదలవ్వగానే నేను భయంతో ట్రక్ ని వేగంగా నడుపుతూ ఈ బంకర్ దగ్గరికి వస్తున్నాను. అప్పుడే పొరపాటున నేను నీ కారుని ఢీ కొట్టాను. గాయాలతో సృహాకోల్పోయిన నిన్ను అక్కడే వదిలెయ్యలేక ఇలా ఇక్కడికి తీసుకొచ్చా” అని హవర్డ్ చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ ఇక నిజం తెలుసుకుని ప్రశాంతంగా ఉంటది. మిషెల్ వేసుకునేందుకు హవర్డ్ ‘మేగన్’ బట్టల్ని ఇస్తాడు.
తను మేగన్ ఫోటోని మిషెల్ కి చూపించి, “ఈ అమ్మాయి నా కూతురు. తను చాలా తెలివైన అమ్మాయి. కానీ నా భార్య నాతో గొడవపడి నా కూతుర్ని చికాగోకి తీసుకెళ్ళింది” అని హవర్డ్ బాధపడతాడు. తన మాటల్ని విన్న మిషెల్ కూడా కాస్త బాధపడిద్ది. కట్ చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసిపోసి అనందంగా జీవించడం మొదలుపెడతారు. ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవడం, ఆటలు ఆడుకోవడం, వంట చేయడం వంటి పనుల్ని ఆనందంగా చేస్తుంటారు. అయితే ఒకరోజు ఒక హెలికాప్టర్ బంకర్ మీదనుంచి వెళ్ళడాన్ని వాళ్ళు ముగ్గురు గమనిస్తారు. అప్పుడు మిషెల్, “మనకి సహాయం అందింది. ఇక మనం ఇక్కడ్నుంచి మనుషులుండే ప్రదేశానికి జాగ్రత్తగా వెళ్లొచ్చు” అని ఆనందపడిద్ది.
ముగింపు
చూశారా కథ ఎంత రసవత్తరంగా ముందుకెళ్తుందో! ఇక్కడినుంచి కథ ఇంకెన్ని మలుపులు తిరబోతుందో ఒకసారి మీరే తనని తీరా వీక్షించాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.
- నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. అసలు మొదటి నుంచే నన్ను ఈ చిత్రం తన కథలో లీనమయ్యేలా చేసింది. ప్రతీ సన్నివేశం కూడా చాలా రసవత్తరంగా సాగింది.
- నటీనటులు ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ చాలా సహజంగా నటించడం జరిగింది.
- సినిమా చాలా వరకు బంకర్‌లోనే జరిగిద్ది. అయినా కూడా ఎక్కడా బోర్ అనిపించదు. ఎందుకంటే ప్రతి సంభాషణలో, ఇప్పుడేదో జరగబోతుంది అన్నటువంటి ఆసక్తి ప్రేక్షకుడి మెదడులో కలుగుతుంది. ఒక చిన్న స్థలంలో కూడా ఎంత పెద్ద టెన్షన్ సృష్టించవచ్చో ఈ సినిమా చూపిస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సౌండ్ డిజైన్ కూడా చాలా బాగా కుదిరాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు ప్రేక్షకుడిని అలా కట్టిపడేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటది. ఇక ఆలస్యమెందుకు మీరు కూడా ఒకసారి ఈ చిత్రాన్ని చూసేయండి!
